“20 ఏళ్ల క్రితం దాకా కాలువలు శుభ్రంగా ఉన్నప్పుడు ఈ నీరు, గాజులా తేటగా, స్పష్టంగా ఉండేది. ఒక నాణెం వేసి అది అడుగుకి పోయినా పై నుంచి కనిపించేది. మేము యమునా నది నీళ్లు కూడా నేరుగా తాగేవాళ్ళం, ”అన్నాడు మత్స్యకారుడు రామన్ హల్దార్. ఈ  విషయాన్ని నొక్కిచెప్పడానికి దోసిళ్ళలో బురద నీటిని పట్టి దానిని తన నోటి దగ్గరకు తీసుకొచ్చాడు. మా మొహాలలో బెదురు చూసి వేళ్ళ మధ్య నుంచి నీళ్లు జారవిడుస్తూ నవ్వాడు.

నేటి యమునాలో, ప్లాస్టిక్‌లు, రేకు కాగితాలు, చెత్తాచెదారం, వార్తాపత్రికలు, చనిపోయిన మొక్కలు, కాంక్రీటు వ్యర్థాలు, గుడ్డ ముక్కలు, బురద, కుళ్లిన ఆహారం, తేలుతున్న కొబ్బరికాయలు, రసాయనిక నురుగు, గుఱ్ఱపు డెక్క రాజధాని నగర పదార్థ వినియోగపు చీకటి కోణాన్ని ప్రతిబింబిస్తాయి.

యమునాలో కేవలం 22 కిలోమీటర్లు (లేదా కేవలం 1.6 శాతం) జాతీయ రాజధాని ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. కానీ మొత్తం 1,376 కిలోమీటర్ల నదిలో దాదాపు 80 శాతం వరకు ని కాలుష్యం, ఆ చిన్న విస్తీర్ణంలో వేస్తున్న వ్యర్థాలు, విషపూరిత పదార్థాల వల్లే జరుగుతుంది. 2018లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) పర్యవేక్షణ కమిటీ దీన్ని అంగీకరిస్తూ తన నివేదికలో ఢిల్లీలోని ఈ నదిని 'మురుగు కాలువ'గా పేర్కొంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా క్షీణించడం వల్ల చేపలు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నాయి.

గత సంవత్సరం ఢిల్లీలోని ఈ నది యొక్క దక్షిణ భాగంలో ఉన్న కాళింది కుంజ్ ఘాట్ వద్ద వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఇతర జలచరాలు కూడా ఢిల్లీ విస్తరణలో ఉన్న నదిలో అరుదుగా కనిపిస్తాయి.

"ఒక నదిలో జీవావరణ వ్యవస్థ సజీవంగా ఉండాలంటే నీటిలో ఆక్సిజన్ స్థాయి 6 లేదా ఇంకా ఎక్కువ ఉండాలి. చేపలు బతికి ఉండడానికి డిసాల్వ్డ్ ఆక్సిజన్(DO) స్థాయి కనీసం 4-5 ఉండాలి. ఢిల్లీ భాగంలో ఉన్న యమున నీటిలో ఆక్సిజన్ స్థాయి కేవలం 0 నుంచి 0.4 మధ్య ఉంది," అని యూనివర్సిటీ అఫ్ చికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ వాళ్ళ వాటర్-టు-క్లౌడ్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ అయిన ప్రియాంక హిరానీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ నదుల్లోని కాలుష్య వివరాలను నమోదు చేస్తుంది.

PHOTO • People's Archive of Rural India

‘అక్కడ చేపలు లేవు [కాళింది కుంజ్ ఘాట్] , అంతకుముందు పుష్కలంగా ఉండేవి. ఇప్పుడు కొన్ని క్యాట్ ఫిష్ మాత్రమే మిగిలి ఉన్నాయి ' అని రామన్ హల్దార్ (మధ్యలో ఉన్న వ్యక్తి) చెప్పారు

ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని రామ్ ఘాట్ ఒడ్డున ఉన్న గడ్డిపై చేపలు పట్టే వలల పక్కన కూర్చుని, 52 ఏళ్ల హల్దార్, అతని ఇద్దరు స్నేహితులు సిగరెట్లను ఆస్వాదిస్తున్నారు. "నేను మూడేళ్ళ క్రితం కాళింది గంజ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ చేపలు లేవు, ముందు పుష్కలంగా ఉండేవి. కొన్ని వాలుగా చేపలు మాత్రమే ఉన్నాయి. ఇందులో చాలా వరకు మురికిగా ఉంటాయి, వీటి వలన ఎలర్జీ, దద్దుర్లు, జ్వరం, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి," అని దూరం నుంచి చేతితో చేసిన, తెల్లటి మబ్బు వంటి వలకు ఉన్న చిక్కులు విప్పుతూ చెప్పాడు.

నీటి లోతుల్లో ఉండే ఇతర జాతులలా కాక, వాలుగ చేపలు ఉపరితలం వరకు తేలి ఊపిరి పీల్చుకోగలవు - అందువల్ల అవి మిగతా వాటి కన్నా మెరుగ్గా బతకగలవు. ఆహార గొలుసులో దిగువన ఉండి విషానికి గురైన చేపలను తినే జీవులు, మళ్లీ అవే  విషపదార్థాలను  తమ శరీరంలో కేంద్రీకరించుకుంటాయని ఢిల్లీకి చెందిన మెరైన్ కంజర్వేషనిస్ట్ దివ్య కర్నాడ్ వివరించారు. "కాబట్టి స్కావెంజర్-మాంసాహారి అయిన క్యాట్ఫిష్ ని తినే వాళ్ళు రియాక్షన్లతో బాధ పడటాన్ని అర్ధం చేస్కోవచ్చు".

****

భారతదేశంలో చేపలు దొరికే అవకాశాలు దాదాపు 87 శాతం 100 మీటర్ల లోతు నీటిలోనే లభ్యమవుతున్నాయని ఈ సమస్యలపై క్రియాశీలకంగా పనిచేస్తున్న లాభాపేక్షలేని గ్రూప్ ఢిల్లీకి చెందిన రీసెర్చ్ కలెక్టివ్ యొక్క ప్రచురణ, ఆక్యుపేషన్ ఆఫ్ ది కోస్ట్: ది బ్లూ ఎకానమీ ఇన్ ఇండియా పేర్కొంది. అందులో చాలా మటుకు దేశంలోని మత్స్యకార సంఘాలకు అందుబాటులో ఉంది. ఇది ఆహారాన్ని మాత్రమే కాకుండా, రోజువారీ జీవితాలను, సంస్కృతులను కూడా పెంపొందిస్తుంది.

"ఇప్పుడు మీరు మత్స్యకారుల చిన్న తరహా ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారు" అని చిన్న తరహా మత్స్య కార్మికుల జాతీయ వేదిక అధిపతి ప్రదీప్ ఛటర్జీ అన్నారు. "వాళ్ళు స్థానిక మార్కెట్‌లకు స్థానికంగా దొరికే చేపలను సరఫరా చేస్తారు, అవి దొరకకపోతే, దూర ప్రాంతాల నుండి చేపలను తీసుకొస్తారు, మళ్ళీ రవాణాను ఉపయోగించి సంక్షోభాన్ని ఇంకా తీవ్రతరం చేస్తారు." భూగర్భ జలాలకు మారడం అంటే "ఎక్కువ శక్తిని వినియోగించడం, అది నీటి చక్ర క్రమంలో  జోక్యం చేసుకుంటుంది."

అతను చెప్పాడు, దానర్థం, “నీటి వనరులు ప్రభావితమవుతాయి, నదులు ఉత్తేజితమవవు. దీన్ని పరిష్కరించడానికి, ఇంకా నది నుంచి స్వచ్ఛమైన, త్రాగునీటిని పొందడానికి సంప్రదాయ వనరుల నుండి మామూలుగా అవసరపడే శక్తి కన్నా మరింత ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఆ విధంగా, మనం ప్రకృతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలను బలవంతంగా విచ్ఛిన్నం చేస్తున్నాం, ఇంకా శక్తి, మూలధనం అధికంగా ఉండే కార్పోరేట్ చక్రంలో శ్రమ, ఆహారం, ఉత్పత్తిని ఉంచుతున్నాము... అదే సమయంలో, వ్యర్థాలను కుమ్మరించడానికి నదులు ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి."

పరిశ్రమలు నదిలోకి వ్యర్ధాలను వదులుతున్నప్పుడు, మత్స్యకారులకే ముందుగా తెలుస్తుంది. “చేపలు చనిపోవడం వలన దుర్వాసన మొదలవుతుంది, అలా మేము చెప్పగలము,” అని హర్యానా-ఢిల్లీ సరిహద్దులోని పల్లాలో నివసించే 45 ఏళ్ల మంగళ్ సాహ్ని వ్యాఖ్యానించారు. పల్లా నుండే యమునా రాజధానిలోకి ప్రవేశిస్తుంది. బీహార్‌లోని షెవ్హర్ జిల్లాలో తన 15 మంది సభ్యుల కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలో అని సాహ్ని ఆందోళన పడుతున్నాడు. "అందరు మా గురించి రాస్తున్నారు, కానీ మా జీవితాలు బాగుపడలేదు, అధ్వాన్నంగా మారాయి," అని అతను మమ్మల్ని పంపించేస్తూ చెప్పాడు.

When industries release effluents into the river, fisherfolk are the first to know. 'We can tell from the stench, and when the fish start dying', remarks 45-year-old Mangal Sahni, who lives at Palla, on the Haryana-Delhi border, where the Yamuna enters the capital
PHOTO • Shalini Singh
Palla, on the Haryana-Delhi border, where the Yamuna enters the capital
PHOTO • Shalini Singh

పరిశ్రమలు నదిలోకి వ్యర్థాలను వదులుతున్నప్పుడు, మత్స్యకారులకే ముందుగా తెలుస్తుంది. ‘చేపలు చనిపోవడం వలన దుర్వాసన మొదలవుతుంది, అలా మేము చెప్పగలం,’ అని యమునా రాజధానిలోకి (కుడి) ప్రవేశించే ప్రదేశమైన, హర్యానా-ఢిల్లీ సరిహద్దులోని పల్లాలో నివసించే 45 ఏళ్ల మంగళ్ సాహ్ని (ఎడమ) వ్యాఖ్యానించారు

సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, సుమారు 8.4 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 4 మిలియన్ల మంది సంప్రదాయ సముద్ర మత్స్యకార సంఘాలు భారతదేశ తీరప్రాంతాల చుట్టూతా ఉన్నాయి. కానీ ఫిషింగ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధిత లేదా ఆధారపడిన సంఖ్య బహుశా 7-8 రెట్లు ఎక్కువే ఉండచ్చు. వాళ్లలో 4 మిలియన్లు లోతట్టు మత్స్య కార్మికులు కావచ్చు అని NPSSFWI యొక్క ఛటర్జీ చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా లక్షలాది మంది చేపలు పట్టడం ఒక జీవనోపాధిగా లేదా వ్యవస్థీకృత క్రియాకలాపంగా చేయడం మానేస్తున్నారు. "ఈ కమ్యూనిటీ క్షీణిస్తున్నందు వల్ల దాదాపు 60-70 శాతం మత్స్యకారులు ఇతర పనుల వైపు మళ్లారు" అని ఛటర్జీ చెప్పారు.

కానీ బహుశా రాజధానిలో మత్స్యకారులు ఉండడం అనే ఆలోచన చాలా అసాధారణమైనది కాబట్టి, ఢిల్లీలోని యమునా ప్రాంతంలో ఎంత మంది మత్స్యకారులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది  ఉన్నారనే దానిపై ఎటువంటి రికార్డులు గానీ ప్రచురించిన డేటా గానీ ఉన్నట్టు లేదు. అంతేగాక సాహ్ని వంటి ఎందరో వలసదారుల వలన, గణన మరింత కష్టమవుతుంది. ప్రస్తుతం ఉన్న మత్స్యకారులు వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందని ఏకీభవిస్తున్నారు. స్వాతంత్య్రనికి ముందు వేల మంది నుండి ఇప్పుడు వంద మంది కంటే తక్కువ ఉన్నారని లాంగ్ లివ్ యమునా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విశ్రాంత ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ మనోజ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

“యమునా నుండి మత్స్యకారులు లేకపోవడం అనేది నది చనిపోయిందనో లేదా చనిపోబోతుంది అనో సూచిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసే సూచికలు వాళ్ళే" అని రీసెర్చ్ కలెక్టివ్  కు చెందిన సిద్ధార్థ్ చక్రవర్తి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నదంతా “మానవ కార్యకలాపాల వల్ల జరిగే వాతావరణ సంక్షోభానికి జతవడమో లేక ప్రేరేపించబడటమో జరుగుతుంది. పర్యావరణాన్ని పునరుజ్జీవింపజేసే జీవవైవిధ్యం జరగదని కూడా దీని అర్థం” అని చక్రవర్తి చెప్పారు. "ఇది జీవన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలలో 40 శాతం వరకు సముద్రాలే గ్రహిస్తాయి."

****

40 శాతం ఢిల్లీకి మురుగునీటి కనెక్షన్ లేని కారణంగా, సెప్టిక్ ట్యాంక్‌లు, ఇతర దారుల నుంచి లెక్కలేనన్ని టన్నుల మలమూత్రాలు, వ్యర్థ పదార్థాలు నీటిలో వదిలివేయబడుతున్నాయి. 1,797 (అనధికారిక) కాలనీల్లో 20 శాతం కంటే తక్కువ వాటికి మురుగునీటి పైపులైన్‌లు ఉండగా, "51,837 పరిశ్రమలు నివాస ప్రాంతాల్లో అక్రమంగా పనిచేస్తున్నాయి, వీటి వ్యర్థాలు నేరుగా కాలువల్లోకి, చివరికి నదిలోకి వెళుతున్నాయి" అని NGT పేర్కొంది.

ఒక నది చనిపోతున్న సందర్భంలో, మానవ కార్యకలాపాల స్థాయి, ఆర్థిక శాస్త్రంతో దాని సంబంధాల దృష్ట్యా ప్రస్తుత సంక్షోభాన్ని చూడచ్చు.

పడుతున్న చేపల సంఖ్య బాగా తగ్గిపోవడంతో మత్స్యకారుల ఆదాయం బాగా క్షీణించింది. ఇంతకు ముందు చేపల వేట వారికి సరిపడా సంపాదన ఇచ్చేది. నైపుణ్యం కలిగిన మత్స్యకారులు కొన్నిసార్లు అన్నీ బాగున్న నెలలో రూ.50,000 కూడా సంపాదించేవాళ్ళు.

రామ్ ఘాట్‌లో నివసించే ఆనంద్ సాహ్ని (42) యుక్తవయసులో బీహార్‌లోని మోతీహరి జిల్లా నుంచి ఢిల్లీకి వచ్చాడు. ‘‘20 ఏళ్లలో నా సంపాదన సగానికి పడిపోయింది. నాకు ఇప్పుడు రోజుకు 100-200 వస్తున్నాయి. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను వేరే మార్గాలు వెతకాలి – మచ్లీ కా కామ్ [చేపల పని] ఇంక శాశ్వతం కాదు, ”అని అతను గంభీరంగా చెప్పాడు.

మల్లాహ్ కు చెందిన దాదాపు 30-40 కుటుంబాలు - లేదా మత్స్యకారులు, పదవకారుల సంఘం -  యమునా నదిపై తక్కువ కలుషిత ప్రదేశం అయిన రామ్ ఘాట్‌లో నివసిస్తున్నారు. కొన్ని చేపలను తమ వినియోగం కోసం ఉంచుకుని, మిగిలిన వాటిని సోనియా విహార్, గోపాల్‌పూర్ హనుమాన్ చౌక్ వంటి దగ్గర్లో ఉన్న మార్కెట్‌లలో, రకాన్ని బట్టి కిలో రూ.50-200 వరకు అమ్ముతారు.

PHOTO • People's Archive of Rural India

" నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను వేరే మార్గాలు వెతకాలి మచ్లీ కా కామ్ [చేపల పని] ఇంక శాశ్వతం కాదు" , రామ్ ఘాట్ నివాసి ఆనంద్ సాహ్ని అన్నారు

****

వర్షపాతం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులతో కూడిన వాతావరణ సంక్షోభం యమునకు ఇంకా సమస్యలను తెస్తుందని తిరువనంతపురంలోని సీనియర్ పర్యావరణ సలహాదారు డాక్టర్ రాధా గోపాలన్ చెప్పారు. తగ్గిపోయిన నీటి పరిమాణం, నాణ్యత, వాతావరణ మార్పుల అనిశ్చితి వల్ల, వలలో పడే చేపల నాణ్యత, పరిమాణంలో భారీ తగ్గింపుకు దారితీసే సమస్యను మరింత ఉధృతంగా మారుస్తుంది.

"కలుషితమైన నీళ్ల వల్ల చేపలు చనిపోతాయి" అని 35 ఏళ్ల సునీతా దేవి చెప్పింది; మత్స్యకారుడైన ఆమె భర్త నరేష్ సాహ్ని రోజువారీ కూలీగా పని కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. "జనాలు వచ్చి అన్ని రకాల చెత్తను, ముఖ్యంగా ఈ మధ్య ప్లాస్టిక్‌ వేస్తున్నారు." మతపరమైన కార్యక్రమాల సమయంలో, పూరీ, జిలేబీ లడ్డూ వంటి వండిన వస్తువులను కూడా నదిలో పడేస్తుంటారని ఆమె చెప్పింది.

2019 అక్టోబర్‌లో 100 సంవత్సరాలలో తొలిసారిగా ఢిల్లీలో దుర్గాపూజ సమయంలో విగ్రహాల నిమజ్జనం నిషేధించబడింది, అటువంటి పనులు నదికి పెద్ద ఎత్తున హాని కలిగిస్తున్నాయని NGT నివేదిక పేర్కొంది.

16, 17వ శతాబ్దాలలో మొఘల్లు 'దరియా, బాదల్, బాద్షా (నది, మేఘాలు, చక్రవర్తి)' అనే మూడు విషయాల గురించి పాత నానుడి ప్రకారం ఢిల్లీలో తమ రాజ్యాన్ని నిర్మించారు. దాదాపు ఒక కళారూపంగా పరిగణించబడే  వాళ్ళ నీటి వ్యవస్థ, నేడు చారిత్రక శిధిలాలుగా మిగిలిపోయుంది. 18వ శతాబ్దంలో బ్రిటీష్ వాళ్ళు నీటిని కేవలం వనరుగా భావించారు, యమునా నదికి దూరంగా ఉండేలా న్యూ ఢిల్లీని కూడా నిర్మించారు. కాలక్రమేణా, జనాభా విస్ఫోటనం చెంది పట్టణీకరణ జరిగింది.

నేరేటివ్స్ ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్ ఆఫ్ ఢిల్లీ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ద్వారా ప్రచురించబడింది) అనే పుస్తకంలో, పాత తరం వాళ్ళు 1940ల నుంచి 1970ల మధ్య ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో చేపలు పట్టడం, పడవలో షికార్లు, ఈత, పిక్నిక్‌లు జీవితంలో ఎలా భాగంగా ఉండేవో గుర్తు చేసుకున్నారు. గంగానది డాల్ఫిన్‌లు కూడా ఓఖ్లా బ్యారేజీ దిగువన కనిపించేవి, నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు నదిలోని ద్వీపాలలో తాబేళ్లు ఎండలో సేదతీరేవి.

"యమునా నది ప్రమాదకరంగా పతనమయ్యింది" అని ఆగ్రాకు చెందిన పర్యావరణవేత్త బ్రిజ్ ఖండేల్వాల్ చెప్పారు. 2017లో ఉత్తరాఖండ్ హైకోర్టు గంగా, యమునా నదులను సజీవ అస్తిత్వం కల నదులుగా  ప్రకటించిన వెంటనే, ఖండేల్వాల్ తన నగరంలోని ప్రభుత్వ అధికారులపై 'హత్య ప్రయత్నం' కేసులను నమోదు చేయాలని కోరాడు. అతని ఆరోపణ: వాళ్ళు యమునా నదిలో విషాన్ని నింపి నదిని చంపుతున్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న నీటిమార్గాలను ఓడరేవులకు అనుసంధానం చేసే సరాగమాలా ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం  రూపొందిస్తోంది. కానీ "పెద్ద కార్గోలను లోతట్టు ప్రాంతాలకు తీసుకెళితే, అది మళ్లీ నదులను కలుషితం చేస్తుంది" అని NPSSFWI యొక్క ఛటర్జీ హెచ్చరించాడు.

Pradip Chatterjee, head of the National Platform for Small Scale Fish Workers
PHOTO • Aikantik Bag
Siddharth Chakravarty, from the Delhi-based Research Collective, a non-profit group active on these issues
PHOTO • Aikantik Bag

ఎడమ: ప్రదీప్ ఛటర్జీ, స్మాల్ స్కేల్ ఫిష్ వర్కర్స్ (లోతట్టు ప్రాంతాల) జాతీయ వేదిక అధిపతి. కుడి: ఈ సమస్యలపై క్రియాశీలకంగా పనిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ ఢిల్లీకి చెందిన రీసెర్చ్ కలెక్టివ్ నుంచి సిద్ధార్థ్ చక్రవర్తి

Last year, thousands of fish were found dead at the Kalindi Kunj Ghat on the southern stretch of the Yamuna in Delhi
PHOTO • Shalini Singh

పోయినేడాది ఢిల్లీలోని యమునా నది దక్షిణ ప్రాంతంలోని కాళింది కుంజ్ ఘాట్ వద్ద వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి

****

హల్దార్ తన కుటుంబంలోని జాలర్లలో చివరి తరం. అతను పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాకు చెందినవాడు, రామ్ ఘాట్‌లో నెలకు 15-20 రోజులు ఉంటాడు, మిగిలిన సమయం 25 మరియు 27 సంవత్సరాల వయస్సు గల తన ఇద్దరుకొడుకులతో నోయిడాలో ఉంటాడు. ఒకతను మొబైల్‌లను రిపేర్ చేస్తాడు, ఇంకో అతను ఎగ్‌రోల్స్, మోమోలు అమ్ముతాడు. “నాది కాలం చెల్లిన వృత్తి అని నా పిల్లలు అంటారు. మా తమ్ముడు కూడా మత్స్యకారుడు. ఇది ఒక సంప్రదాయం - ఏది ఏమైనా నాకు ఈ పని మాత్రమే తెలుసు. వేరేలా ఎలా బతుకుతగలనో నాకు తెలియదు .. "

"ఇప్పుడు చేపలు దొరికే మూలం ఎండిపోయింది, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు?" అని డాక్టర్ గోపాలన్ అడుగుతారు. “ముఖ్యంగా, చేపలు వాళ్ళకి పోషకాహారానికి మూలం. మనం వాళ్ళని ఆర్ధిక కోణంతో ముడిపెట్టి సామాజిక-పర్యావరణ దృష్టితో గుర్తించాలి. వాతావరణ మార్పులో ఇవి వేర్వేరు విషయాలు కావు: ఆదాయంలో, పర్యావరణ వ్యవస్థలో వైవిధ్యం అవసరం."

మరోవైపు, ప్రభుత్వం వాతావరణ సంక్షోభాన్ని, ఎగుమతి కోసం చేపల పెంపకం వైపు దృష్టి సారించే ప్రాపంచిక ఫ్రేమ్‌వర్క్‌లో చూస్తుందని  రీసెర్చ్ కలెక్టివ్ కు చెందిన చక్రవర్తి చెప్పారు.

భారతదేశం 2017-18లో 4.8 బిలియన్  డాలర్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసింది. ఇందులో అధికంగా వేరే దేశానికి చెందిన రకం-మెక్సికన్ జలాల నుండి వచ్చిన పసిఫిక్ వైట్ రొయ్య ఉంది, అని చక్రవర్తి చెప్పారు-. "మెక్సికన్ రొయ్యలకు US లో విపరీతమైన డిమాండ్ ఉంది" కాబట్టి భారతదేశం ఇలా ఒకే రకాన్ని పెంచే సంస్కృతిలో ఉంది. మన రొయ్యల ఎగుమతిలో కేవలం 10 శాతం మాత్రమే భారతీయ జలాల్లో దొరికే బ్లాక్ టైగర్ రొయ్యలు ఉంటాయి. భారతదేశం జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న జీవవైవిధ్య నష్టాన్ని అంగీకరిస్తుంది. "పాలసీ ఎగుమతి ఆధారితంగా ఉంటే, అది ఖరీదు ఎక్కువ ఉంటుంది గాని స్థానిక పోషకాహార అవసరాలకు అనుగుణంగా ఉండదు."

అస్పష్టమైన భవిష్యత్తును ఎదుర్కొంటున్న హల్దార్ ఇప్పటికీ తన నైపుణ్యం పట్ల గర్వపడుతున్నాడు. జాలర్ల  పడవ ధర రూ.10,000, వల ధర రూ.3,000-5,000 కాగా, అతను ఫోమ్, మట్టి, తాడు ఉపయోగించి వాళ్ళు చేసిన చేపవలను చూపించాడు. ఒక వల అతనికి రోజుకు రూ. 50-100 విలువైన చేపల దిగుబడిని ఇస్తుంది.

45 ఏళ్ల రామ్ పర్వేష్ ఈ మధ్య 1-2 కిలోగ్రాముల చేపలను పట్టుకోగల వెదురు, దారంతో కూడిన పంజరం లాంటి నిర్మాణాన్ని ఉపయోగిస్తున్నాడు. “మేము దీన్ని మా ఊర్లో తయారు చేయడం నేర్చుకున్నాము. ఆటే కా చారా [గోధుమ ఎర] రెండు వైపులా ఉంచి పంజరం నీటిలోకి దించుతాము. కొన్ని గంటల్లోనే పుతి లాంటి చిన్న రకం చేపలు పట్టుబడతాయి, ”అని అతను వివరించాడు. పుతి ఇక్కడ సాధారణంగా దొరికే  చేప అని ఆనకట్టలు, నదులు, ప్రజలపై దక్షిణాసియా నెట్‌వర్క్‌తో పనిచేసే స్థానిక కార్యకర్త భీమ్ సింగ్ రావత్ చెప్పారు. " చిల్వా , బచువా ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి, బామ్ , మల్లి దాదాపు అంతరించిపోయాయి. మాగుర్ [క్యాట్ ఫిష్] కలుషిత ప్రాంతాలలో కనిపిస్తుంది.”

'We are the protectors of Yamuna', declares Arun Sahni
PHOTO • Shalini Singh
Ram Parvesh with his wife and daughter at Ram Ghat, speaks of the many nearly extinct fish varieties
PHOTO • Shalini Singh

మేము యమునా రక్షకులం ' అని అరుణ్ సాహ్ని (ఎడమ) ప్రకటించారు. రామ్ ఘాట్ వద్ద తన భార్య, కుమార్తెతో (కుడివైపు) ఉన్న రామ్ పర్వేష్ , దాదాపు అంతరించిపోయిన అనేక రకాల చేపల గురించి మాట్లాడుతున్నారు

"మేము యమునా రక్షకులం" అని నాలుగు దశాబ్దాల క్రితం బీహార్‌లోని వైశాలి జిల్లా నుంచి తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఢిల్లీకి వచ్చిన అరుణ్ సాహ్ని (75) నవ్వుతూ ప్రకటించారు. 1980-90లలో, అతను రోహు , చింగ్రీ , సాల్ , మల్లి వంటి రకాలతో సహా ఒక్క రోజులో 50 కిలోల చేపలను పొందగలిగేవాడని ప్రస్తావించాడు. ఇప్పుడు అన్ని బాగున్న రోజున కేవలం 10, గరిష్టంగా 20 కిలోలు దొరుకుతాయి.

యాదృచ్ఛికంగా, యమునా నదిపై మైలురాయి అయిన సిగ్నేచర్ బ్రిడ్జ్ సుమారు రూ.1,518 కోట్ల ఖర్చుతో నిర్మించబడింది. ఇది కుతుబ్ మినార్ కంటే రెండింతలు ఎత్తుగా ఉండి రామ్ ఘాట్ నుంచి కనిపిస్తుంది. 1993 నుండి యమునా నదిని 'శుభ్రం' చేయడానికి విఫలయత్నానికి చేసిన ఖర్చు మొత్తం? రూ. 1,514 కోట్ల పైగానే.

"అధికారుల వైఫల్యం పౌరుల జీవితంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది, నది ఉనికికి కూడా ముప్పు కలిగిస్తోంది, అలాగే గంగా నదిపై కూడా ప్రభావం చూపుతోంది" అని NGT హెచ్చరించింది.

"విధాన స్థాయిలో సమస్య ఏంటంటే 1993లో వచ్చిన యమునా కార్యాచరణ ప్రణాళిక నదిని ఒక అస్తిత్వంగా లేదా పర్యావరణ వ్యవస్థగా పరిగణించకుండా కేవలం సాంకేతిక కోణం నుండి మాత్రమే చూస్తుంది" అని డాక్టర్ గోపాలన్ చెప్పారు. “ఒక నది అంటే దాని పరీవాహక చర్య అని మరో అర్థం. ఢిల్లీ యమునాకి పరివాహక ప్రాంతం. పరీవాహక ప్రాంతాలను శుభ్రం చేయకుండా నదిని శుభ్రం చేయలేరు.”

బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ ని కనిపెట్టే కానరీలలాగా, మత్స్యకారులు కూడా  సముద్ర పరిరక్షకులు అని దివ్య కర్నాడ్ అభిప్రాయపడ్డారు. "భారీ లోహాలు కేంద్ర నాడీ వ్యవస్థ విచ్ఛిన్నానికి కారణమవుతాయని చూడకుండా ఎలా ఉంటాము? అత్యంత కలుషితమైన నదుల సమీపంలోని ప్రాంతాల నుండి భూగర్భజలాన్ని త్రాగునీటిగా వాడితే అది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలియదా? దగ్గరగా ఉన్న మత్స్యకారులు వీటి మధ్య సంబంధాలను, వాటి వల్ల కలిగే అత్యంత తక్షణ ప్రభావాలను చూస్తారు.”

"నాకు చివరిగా మిగిలిన ప్రశాంతత ఇదే," అని సూర్యాస్తమయం తర్వాత వల వేయడానికి సిద్ధంగా ఉన్న హల్దార్  నవ్వుతూ అన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆఖరి వలను విసిరి సూర్యోదయం సమయంలో అందులో పడ్డ చేపలను లాగడం ఉత్తమం అని అతను చెప్పాడు. అలా చేయడం వలన  “చనిపోయిన చేప తాజాగా ఉంటుంది”, అని చెబుతాడు.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: దీప్తి సిర్ల

Reporter : Shalini Singh

ஷாலினி சிங், பாரி கட்டுரைகளை பதிப்பிக்கும் CounterMedia Trust-ன் நிறுவன அறங்காவலர் ஆவார். தில்லியை சேர்ந்த பத்திரிகையாளரான அவர் சூழலியல், பாலினம் மற்றும் பண்பாடு ஆகியவற்றை பற்றி எழுதுகிறார். ஹார்வர்டு பல்கலைக்கழகத்தின் 2017-18ம் ஆண்டுக்கான Niemen இதழியல் மானியப்பணியில் இருந்தவர்.

Other stories by Shalini Singh

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

ஷர்மிளா ஜோஷி, PARI-ன் முன்னாள் நிர்வாக ஆசிரியர் மற்றும் எழுத்தாளர். அவ்வப்போது கற்பிக்கும் பணியும் செய்கிறார்.

Other stories by Sharmila Joshi
Translator : Deepti

Deepti is a Social Activist. She likes to question.

Other stories by Deepti