జలియన్ వాలా బాగ్ సంఘటన అందరి ఆలోచనలను ఒక మలుపు తిప్పి దేశ స్వాతంత్ర భావనను మేల్కొలిపింది. మనలో చాలామందిమి, వీరుడైన భగత్ సింగ్ కార్యాచరణకు అక్కడే బీజం పడిందని విన్నాము. అతనికి పదేళ్ళ వయసున్నప్పుడు అక్కడికి వెళ్లి ఒక చిన్న సీసాలో రక్తంతో తడిచిన మట్టిని తన ఊరుకు పట్టుకెళ్లాడు. అతను తన చెల్లితో కలిసి తన తాతగారింట్లోని తోటలో ఒక ప్రదేశంలో ఆ మట్టిని చల్లాడు. ప్రతి సంవత్సరం ఆ ప్రదేశంలో వారు మొక్కల్ని నాటి, పూలు పూయించేవారు.
1919 ఏప్రిల్ 13 న అమృత్‌సర్‌లో వేయిమంది పౌరులను ఊచకోత కోయడం(బ్రిటిష్ వారు 379 మంది అని చెప్పారు) నేరస్థుల లేదా వారి వారసుల ప్రభుత్వాల మనస్సాక్షిని తాకలేదు. బ్రిటిష్ ప్రధాన మంత్రి థెరిసా మే, ఈ వారం తన పార్లమెంటులో ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు - కానీ భయంకరమైన ఈ దారుణానికి క్షమాపణ చెప్పలేదు.
మీరు జాలియన్ వాలా బాగ్ ని సందర్శించాక మీ మనసు చలించకుండా ఉందంటే ఏదో అద్భుతమైన మహిమ మీ వద్ద ఉంది ఉండాలి. వందేళ్ల తరవాత కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిన వధలో, వందలకొద్దీ మనుషుల కేకలు మీకు వినిపిస్తూనే ఉంటాయి. ముప్ఫయ్యిదేళ్ళ క్రితం నేను అక్కడికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న గోడ మీద ఇది రాయకుండా ఉండలేకపోయాను.
వారు నిరాయుధులైన మా పై దాడి చేశారు
అక్కడి గుంపులు చెల్లాచెదురైనై
వారు వారి లాఠీలు, కర్రలతో ముందుకొచ్చారు
మా ఎముకలు విరిగినై
వారు తుపాకులు ఎక్కుపెట్టారు
ఎన్నో ప్రాణాలు అంతమయ్యాయి
మా ఆత్మలు చావలేదు
వారి రాజ్యం చని పోయింది
అనువాదం: అపర్ణ తోట