"ఇప్పుడు మాకు దొరికే చిన్నచిన్న పనులు కూడా ఈ వ్యవసాయ చట్టాలు ఆమోదించబడిన తర్వాత దొరకవు" అని తారావంతి కౌర్ ఆందోళనగా చెప్పింది.
ఆమె పంజాబ్ లోని కిల్లియన్వాలి గ్రామం నుండి పశ్చిమ ఢిల్లీ లోని తిక్రీ నిరసన స్థలానికి వచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలైన బతిండా, ఫరీద్కోట్, జలంధర్, మోగా, ముక్త్సర్, పాటియాలా, సంగ్రూర్ నుండి జనవరి 7 రాత్రి ఇక్కడకు వచ్చిన 1,500 మంది వ్యవసాయ కార్మికులలో తారావంతి తో పాటు ఇంచుమించుగా 300 మంది మహిళలు ఉన్నారు. వీరంతా పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్ సభ్యులే, ఈ యూనియన్ దళితుల జీవనోపాధి, భూ హక్కులు, కుల వివక్షకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తుంది.
జీవనోపాధి కోసం వ్యవసాయ భూములపై ఆధారపడే భారతదేశంలోని మిలియన్ల మంది మహిళలలో ఆమె ఒకరు. (మన దేశంలోని 144.3 మిలియన్ల వ్యవసాయ కార్మికులలో, కనీసం 42 శాతం మహిళలు.)
70 ఏళ్లు నిండిన తారావంతి ముక్త్సర్ జిల్లాలోని మాలౌట్ తహసీల్‌లోని ఆమె గ్రామంలో గోధుమలు, వరి, పత్తి పొలాల్లో కూలిపని చేసి రోజుకు రూ. 250-300 రూపాయలు సంపాదిస్తుంది. “అయితే అంతకుముందు ఉన్నట్లు వ్యవసాయ కూలీలకు ఎక్కువ పని అందుబాటులో లేదు. హరి క్రాంతి [హరిత విప్లవం] జరిగినప్పటి నుంచి కూలీలు బాధపడుతున్నారు.” అని ఆమె 1960 ల కాలాన్ని ప్రస్తావిస్తూ అన్నది. ఇతర వ్యవసాయ మార్పులతో పాటు, వ్యవసాయం యొక్క యాంత్రీకరణ కూడా పంజాబ్‌లో విస్తృతంగా జరిగింది.
“నేను పెద్దదానిని అయ్యాను కాని బలహీనంగా ఏమి లేను. పని దొరికితే నేను ఇంకా కష్టపడగలను, ”అని ఆమె చెప్పింది. “కానీ యంత్రాలు వచ్చేసాయి. మా వ్యవసాయ కూలీలకు ఇక [ఎక్కువ] పని దొరకదు. మా పిల్లలు తిండి లేకుండా ఉంటారు. మేము రోజుకు ఒకసారి మాత్రమే సరైన భోజనం తింటాం. ప్రభుత్వం పరిమితులు పెట్టకుండా మాకు దొరికే పనిని మా నుండి తీసుకొని జీవితాన్ని సజీవ నరకంగా మార్చింది. ”
పొలాలలో ఇప్పుడు తక్కువ రోజులు పని అందుబాటులో ఉండటంతో, వ్యవసాయకూలీలు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ సైట్‌ల వైపు మొగ్గు చూపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ భారతదేశంలోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పనికి హామీతో రోజుకు రూ.258(పంజాబ్ లో) ఇస్తుంది. "కానీ ఎంతకాలం?" అని ఆమె అడుగుతుంది. "మేము స్థిర ఉపాధిని, రోజువారీ పనిని కోరుతున్నాము. "
తారావంతి దళిత వర్గానికి చెందినది. "మా పరిస్థితి ఎప్పుడు ఇతరులకంటే వేరుగానే ఉంటుంది. పైగా మేము పేదవాళ్ళం, ”ఆమె చెప్పింది. “వారు [ఉన్నత కులాలు] మమ్మల్ని సమానంగా అనుకోరు. మమ్మల్ని ఇతరులు మనుషులుగా చూడరు, కీటకాలు, తెగుళ్ళు లాగా చూస్తారు. ”
కానీ ప్రస్తుతం జరిగే నిరసనలో, రోజురోజుకీ అన్ని వర్గాలు, కులాలు, జెండర్లూ పాల్గొనడం బాగా పెరుగుతోందని ఆమె చెప్పింది. “ఈసారి ఈ నిరసనలో మేమంతా కలిసి వచ్చాం. మేము ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నాము. ఈ వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేవరకు మేము నిరసన ఆపము. అందరు ఐక్యమై న్యాయం కోరే సమయం ఇది. ”
వ్యవసాయ చట్టాలు మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి. ఆ నెల 20 నాటికి చట్టాలలోకి వచ్చాయి. మూడు చట్టాలు ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం , రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, వాజ్యం వేసే చట్టబద్దమైన హక్కును పౌరులందరికీ నిలిపివేస్తున్నందున ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించబడ్డాయి.
పెద్ద కార్పొరేట్‌లకు భూమి, వ్యవసాయాలపై పై అధికారాన్ని అందించడం వలన రైతులందరూ ఈ మూడు చట్టాలను తమ జీవనోపాధికి జరిగే పెద్ద హానిగా చూస్తున్నారు. పైగా ఈ చట్టాలు సాగుదారునికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసిలు), రాష్ట్ర సేకరణ వంటి ఎన్నో అతిముఖ్యమైన విషయాలను కూడా బలహీనపరుస్తాయి.
"ఈ చట్టాలలో మార్పులు [సవరణలు] చేస్తామని ప్రభుత్వం చెబుతోంది" అని తారావంతి చెప్పింది. “అయితే చట్టాలు సరిగ్గా ఉంటే అప్పుడు వారు ఇక మార్పుల గురించి ఎందుకు మాట్లాడాలి? దీని బట్టి ప్రభుత్వం ఆమోదించిన చట్టాలు మంచివి కావని అర్ధమవుతోంది.”
అనువాదం - అపర్ణ తోట