దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకా లోని కొండవాలు ప్రాంతాలలో ఆవుల మెడలోని గంటల టైణ్ - టైణ్ - టైణ్ శబ్దం ఇప్పుడు చాలా తక్కువగా వినబడుతోంది. "ఇప్పుడెవరూ ఈ గంటలను తయారుచేయటంలేదు," అని హుక్రప్ప చెప్పారు. అయితే, ఆయన మాట్లాడుతున్నది మామూలుగా పశువుల మెడలో కట్టే లోహపు గంట గురించి కాదు. ఆయన స్వగ్రామమైన శిబాజీలో, పశువుల మెడలో కట్టే గంటను లోహంతో తయారుచేయరు. దాన్ని వెదురుతో, చేతితో తయారుచేస్తారు. 60ల చివరి వయసులో ఉన్న పోకచెక్కలు పండించే రైతు హుక్రప్ప కొన్ని సంవత్సరాలుగా అపురూపమైన ఈ వస్తువును రూపొందిస్తున్నారు.
"నేనింతకు ముందు పశువులను మేపుకుంటుండేవాడిని" అని హుక్రుప్ప చెప్పారు. "మేం కొన్నిసార్లు ఆవుల జాడను తెలుసుకోలేకపోయేవాళ్ళం. దాంతో, వెదురుతో వాటి మెడలో కట్టే గంటను తయారుచేయాలనే ఆలోచన వచ్చింది." కొండలలోకో, లేదా ఇతరుల పొలాల్లోకో వెళ్లిన ఆవులను గుర్తించడంలో ఈ గంటల శబ్దం వారికి సహాయం చేస్తుంది. గ్రామంలోని ఒక వృద్ధుడు అతనికి వీటిని తయారుచేయడం నేర్పిస్తానని చెప్పడంతో, అతను ముందు కొద్ది సంఖ్యలో గంటలను తయారు చేయడం ప్రారంభించారు. కాలక్రమేణా, వివిధ పరిమాణాలలో గంటలను తయారుచేయడంలో నైపుణ్యం సాధించారు. ఆయన ఉండే ప్రాంతంలో వెదురు సులభంగా దొరకడం ఇందుకు సహాయపడింది. బెల్తంగడిలోని అయన గ్రామం కర్నాటక, పశ్చిమ కనుమలలోని కుద్రేముఖ్ నేషనల్ పార్క్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉంది. ఇది మూడు రకాల గడ్డి మొక్కలకు నిలయం.
హుకరప్ప మాట్లాడే తుళు భాషలో ' బొమ్కా ' అని పిలిచే ఈ వెదురు గంటను కన్నడలో ' మోంటే ' అని పిలుస్తారు. శిబాజీ గ్రామ సాంస్కృతిక జీవితంలో దీనికొక ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఇక్కడి దుర్గా పరమేశ్వరి ఆలయం, దేవతకు మోంటే లను సమర్పించే సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఆలయ ఆవరణను కూడా'మోంటేతడ్క' అని పిలుస్తారు. తమ పశువులకు రక్షణ కల్పించాలనీ, తమ కోరికలు నెరవేరాలనీ భక్తులు ప్రార్థిస్తారు. వారిలో కొందరు హుక్రప్ప ద్వారా తయారుచేయించిన వెదురు గంటలను కొంటారు. “ప్రజలు దీనిని హర్కే (మొక్కుబడుల) కోసం కొనుగోలు చేస్తారు. ఒక ఆవుకు దూడలు పుట్టకపోతే(ఉదాహరణకు), వారు ఈ గంటను దేవతకు సమర్పిస్తారు,” అని అతను చెప్పారు. “ఒక గంటకు 50 రూపాయల వరకు చెల్లిస్తారు. పెద్ద గంటలైతే 70 రూపాయల వరకు అమ్ముడవుతాయి."
హుక్రప్ప వ్యవసాయానికీ, చేతిపనుల తయారీ వైపుకూ మళ్లడానికి ముందు, ఆయన జీవనోపాధికి పశుపోషణే మార్గం. ఆయనా, ఆయన అన్నయ్య గ్రామంలోని మరొకరికి చెందిన ఆవులను మేపేవారు. “మాకు ఎలాంటి స్వంత భూమి లేదు. మేం ఇంట్లో 10 మందిమి ఉన్నాం, కాబట్టి ఎప్పుడూ ఆహారానికి కొరతగానే ఉండేది. మా నాన్న కూలి పని చేసేవాడు, మా అక్కలు కూడా పనికి వెళ్లేవాళ్ళు” అని ఆయన చెప్పారు. తరువాత, స్థానిక భూస్వామి ఒకరు ఈ కుటుంబానికి కౌలుకు సాగు చేసుకునేందుకు ఖాళీ భూమిని ఇచ్చాడు. వారు అందులో పోకచెక్కలను పండించడం ప్రారంభించారు. “పండినదాంట్లో ఒక వాటా అతనికి కౌలు కింద ఇచ్చేవాళ్ళం. ఈ రకంగా 10 సంవత్సరాలు చెల్లించాం. ఇందిరాగాంధీ (1970లలో) భూసంస్కరణలను అమలు చేసినప్పుడు, ఆ భూమి మా సొంతమయింది.” అని ఆయన చెప్పారు.
వెదురుగంటల ద్వారా వచ్చే ఆదాయం పెద్దగా ఉండదు. “ఈ ప్రాంతాలలో మరొకరెవరూ వీటిని తయారుచేయరు. నా పిల్లలెవరూ ఈ పనిని నేర్చుకోలేదు,” అని హుక్రప్ప చెప్పారు. ఒకప్పుడు సులభంగా అందుబాటులో ఉండే అటవీ సంపద అయిన వెదురు ఇప్పుడు చనిపోతోంది. “మేమిప్పుడు వెదురు కోసం 7-8 మైళ్ళు (11-13 కిలోమీటర్లు) నడవాల్సివస్తోంది. అక్కడ కూడా అదింకా కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగలదు.” అని ఆయన చెప్పారు.
కానీ ఆ గట్టి గడ్డిని కత్తిరించి, కావలసిన ఆకారంలో చెక్కే వెదురు గంట తయారీ కళ, నైపుణ్యం కలిగిన హుక్రప్ప చేతుల్లో, ఇప్పటికీ శిబాజీలో సజీవంగానే ఉంది - దాని ధ్వని ఇప్పటికీ బెల్తంగడి అడవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి