“హుర్‌ర్‌ర్...
హేహేహేహే... హో... హేహేహేహే... హో”
ఉన్నట్టుండి ఆ పండ్లతోట పైన ఉన్న ఆకాశం లెక్కలేనన్ని పక్షులతో నిండిపోయింది. ఆ రెక్కల జీవులు, వాటిని తరిమివేయడానికి సూరజ్ చేస్తున్న శబ్దాలకు భయపడి ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిపోయాయి. ఈ బేరీ(Pear) పండ్లతోట సంరక్షకుడిగా, ఆకలిగొన్న పక్షులను పండిన పండ్లపై వాలకుండా దూరంగా తరిమేయడం అతని పని. వాటిని భయపెట్టడానికి అతను బిగ్గరగా అరుస్తాడు, లేదంటే రోడా (మట్టి గడ్డ)లను కమాన్ లేదా గులేల్ (ఒడిసెల లేదా ఉండేలు)తో విసిరి భయపెడతాడు.
వాయువ్య పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా అంచున ఉన్న పట్టీ పట్టణం పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందింది. బేరీ, అత్తి (peach) వంటి పండ్లచెట్ల సంరక్షణ కోసం ఏటా వలస కార్మికులు ఇక్కడికి వస్తుంటారు. ఏ వేళలోనైనా కిందికి వాలి పండిన పండ్లను ముక్కుతో పొడిచి తినే పక్షులను దూరంగా తరిమేయడం వారి పని. ఈ పండ్ల తోటలకు కాపలా కాసే సూరజ్ వంటి కార్మికులను రాఖేలు అంటారు
సూరజ్ బహర్‌దార్ కాపలా ఉన్న దాదాపు రెండు ఎకరాలున్న తోటలో దగ్గరదగ్గర 144 బేరీ చెట్లు ఉన్నాయి. ఏప్రిల్ నుండి మొదలై ఆగస్టులో ముగిసే పండ్ల కాలంలో, ఈ చెట్లన్నిటికీ 15 ఏళ్ల వయస్సున్న సూరజ్ ఏకైక సంరక్షకుడు. అతనికి నెలకు రూ. 8,000 జీతంగా యజమానులు చెల్లిస్తారు.
“చెట్లు పూతవేయడం ప్రారంభించిన వెంటనే, భూస్వాములు తమ తోటలను గుత్తకు ఇస్తారు. వాటిని గుత్తకు తీసుకున్న టేకేదార్లు రాఖే లను పెట్టుకుంటారు,” అని సూరజ్ మాతో చెప్పాడు. వీరిలో అనేకమంది రాఖేలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలు
బీహార్‌కు చెందిన సూరజ్, ఈ తోటలలో పని కోసం దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాడు. ఇక్కడికి రావాలనే అతని ప్రయాణం బీహార్‌లోని అరారియా జిల్లాలోని తన గ్రామమైన భాగ్‌పర్వాహా నుండి సహర్సా అనే ఒక పెద్ద పట్టణానికి చేరుకోవడానికి చేసే ప్రయాణంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1,732 కిలోమీటర్లు రైలులో ప్రయాణించి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్నాడు. అక్కడినుంచి ఒక గంట దూరంలో ఉండే పట్టీకి కార్మికులను తీసుకువచ్చేందుకు టేకేదార్లు బస్సు ఏర్పాటు చేశారు.
*****
సూరజ్, బీహార్‌లో అత్యంత వెనుకబడిన తరగతి (ఇబిసి)గా జాబితా చేయబడిన బహర్‌దార్ సముదాయానికి చెందినవాడు. అతను 8వ తరగతి చదువుతున్నప్పుడు అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో బడి మానుకోవాల్సివచ్చింది. “నాకు ఇంకో అవకాశం లేదు. కానీ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత, నేను సంపాదించినదానితో తిరిగి బడికి వెళ్తాను," అంటాడు సూరజ్.
పంజాబ్‌లోని మాఝా క్షేత్ర ప్రాంతంలో ఉన్న పట్టీ పట్టణం తరన్ తారన్ నగరానికి దాదాపు 22 కిమీ దూరంలో ఉంది; పాకిస్తాన్‌లోని లాహోర్‌కు గంట దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోని తోటలలో ఎక్కువభాగం జట్టా (జాట్) వంటి ఆధిపత్య కుల సముదాయాల యాజమాన్యంలో ఉన్నాయి. వీరికి పండ్ల తోటల పక్కనే ఆహార పంటలు పండించే భూమి కూడా ఉంది.
బేరి, అత్తి తోటల వలె కాకుండా, జామ తోటలకు సంవత్సరంలో రెండుసార్లు రాఖేల ను నియమించుకోవాలి. కొన్నిసార్లు స్థానికులను కూడా చెట్లకు కాపలాగా నియమించుకుంటారు, లేదా టేకేదార్లు ఆ ప్రాంతంలో స్థిరపడిన వలస కార్మికులను కాపలాకు నియమించుకుంటారు.
ఈ పని కోసం బీహార్ నుండి వలస వచ్చిన చాలా మంది కార్మికులు సూరజ్ కంటే వయసులో పెద్దవారు. అంత చిన్నవయసు పిల్లవాడు పండ్ల తోటల్లో రాఖే గా పని చేయడం అసాధారణంగా కనిపిస్తుంది. ఈ బాలుడు పక్షులను భయపెట్టడంతో పాటు ఇతర సమయాల్లో వంట చేయడం, బట్టలు ఆరబెట్టడం, ఇతర ఇంటి పనులను చక్కబెట్టడం వంటివి చేస్తూ కనిపిస్తాడు. యజమానులు తమ ఇళ్లను కూడా శుభ్రపరచమని చెప్తారని, కిరాణా సామాగ్రి, ఇతర గృహోపకరణాలను కొనే పనిమీద తనని పంపేవారని సూరజ్ చెప్పాడు. "తోట సంరక్షణ పేరుతో నన్ను ఇన్ని పనులు చేయమని అడుగుతారని నాకు తెలిస్తే, నేను ఎప్పటికీ వెళ్ళేవాడ్ని కాను," అని బీహార్‌కు తిరిగి వచ్చిన తర్వాత సూరజ్ ఫోన్‌లో చెప్పాడు.
పట్టీ తోటలలో కూలీలు ఏప్రిల్ నెలలో పూత మొదలయినప్పుడు తమ పనులను ప్రారంభిస్తారు. ఆగస్టు నెలలో పండ్ల కోత వరకూ ఉంటారు. పక్కా పైకప్పు ఏమీ లేకుండానే ఐదు నెలల పాటు పండ్లతోటలోనే గడుపుతారు. చెట్ల మధ్య టార్పాలిన్ పట్టాలను పైకప్పుగా వేసి వెదురుతో తాత్కాలికంగా గుడిసెలను కట్టుకుంటారు. వేసవి వేడి, రుతుపవన సమయాల్లోని తేమ వలన పాములు - వాటిలో కొన్ని విషపూరితమైనవి - ఇతర జీవులు తోటలలోకి వస్తుంటాయి
"సంపాదించాల్సిన అవసరం ముందు అంత ప్రమాదకరమైన విషపురుగుల భయం కూడా నిలబడదు." అంటాడు సూరజ్. పని నిలిపేసి, ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావడం అనే అవకాశమే ఉండదు
*****
పట్టీకి చెందిన శింగారా సింగ్ మూడు ఎకరాల జామ తోటను గుత్తకు తీసుకున్నారు. అతను, అతని భార్య పరమ్‌జిత్ కౌర్‌లిద్దరూ రాఖేలు గా పనిచేస్తున్నారు. శింగారా(49), పంజాబ్‌లో వెనుకబడిన తరగతి (బిసి) జాబితాలో నమోదై ఉన్న మెహ్రా సిక్కు సముదాయానికి చెందినవారు. వారు ఆ తోటను 2 సంవత్సరాలకుగాను రూ. 1.1 లక్షలు చెల్లించి గుత్తకు తీసుకున్నారు. "మొత్తం తోట విస్తీర్ణం లెక్కతో కాకుండా చెట్ల సంఖ్య ఆధారంగా యజమాని గుత్త సొమ్మును నిర్ణయించటం వలన నేను ఈ తోటను తక్కువ ధరకు పొందాను." అన్నారు శింగారా సింగ్.
చాలా మంది ఎకరాకు 55 నుంచి 56 జామ చెట్లను నాటతారని, అయితే ఇక్కడ మొత్తం తోటలో 60 చెట్లు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక మండీ లో పండ్లను అమ్మడం ద్వారా ఈయనకు రూ. 50,000 నుండి 55,000 వరకు వస్తాయి. రాబడి చాలా తక్కువగా ఉండటం వలన తాను రాఖే గా మరెవరినీ నియమించుకోలేనని ఆయన చెప్పారు.
"రాబోయే రెండేళ్ల వరకూ ఈ భూమి మా కిందే ఉంటుంది. చలికాలంలో జామతో పాటు చెట్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించి మండీ లో అమ్ముకుంటాం," అని శింగారా చెప్పారు. "వేసవిలో, మా సంపాదన పూర్తిగా మా తోటల్లోని పండ్లపైనే ఆధారపడి ఉంటుంది."
పండ్ల తోటల్ని కాపాడుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తూ, “పక్షులలో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది చిలుక. జామపండ్లు వాటికి ఇష్టమైన పండ్లు!. అవి మొత్తం పండునంతా తినేస్తే మేం అస్సలు పట్టించుకోం. కానీ వాటికి పండులోని గింజలు మాత్రమే కావాలి. దాంతో మిగిలిన జామపండ్లను ముక్కలుగా కొరికిపడేస్తాయి," అన్నారాయన.
కానీ చిలుకల్లో కూడా దుష్టులు ఉంటాయని సింగ్ పేర్కొన్నారు, “చిలుకలలో అలెగ్జాండ్రిన్ రకం చాలా ఎక్కువ నష్టం చేస్తుంది. ఒక చిలుక గుంపు మొత్తం పండ్ల తోటలోకి దిగితే, ఇక ఆ తోటను వదిలేసుకోవటమే.” అటువంటి సందర్భాలలో, తోటల కాపలాదార్లు పక్షుల్ని భయపెట్టడానికి సూరజ్ చేసినట్టు భయపెట్టే కూతలు కూయటం, గులేళ్ళ (ఒడిసెలలు)పై ఆధారపడవలసి వస్తుంది.
సూరజ్ వంటి వలస కూలీలకు స్థానిక కూలీలకు చెల్లించే దానికంటే కూడా తక్కువ జీతం లభిస్తుంది. "యుపి, బీహార్‌ల నుండి వచ్చే కూలీలు చాలా తక్కువ జీతాలకు పని చేయడానికి ఒప్పుకుంటారు. ఆపైన కాంట్రాక్టర్లు కూడా వారిని నమోదు చేయాల్సిన అవసరం నుండి తప్పించుకుంటారు," అని శింగారా పేర్కొన్నారు
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పని వెతుక్కుంటూ వలస వెళ్ళారు. వారిలో ఎక్కువ మంది చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న వర్గాలకు చెందినవారు. వారు కర్మాగారాలు, పొలాలు, ఇటుక బట్టీలు, తోటలలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారి గురించి ఏ రాష్ట్రంలోనూ అధికారిక నమోదు లేదు. కార్మిక సంఘాలకు, వారికి సంబంధించిన ఇతర సంస్థలకు ఒక వివరణాత్మక నమోదును నిర్వహించడానికి అవసరమైన వనరులను ఉండవు.
“వలస కూలీలు రెట్టింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అంతర్-రాష్ట్ర వలస కార్మికుల చట్టం ఈ కార్మికులను వారి యజమానులతో పాటు నమోదు చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది. కానీ ఈ చట్టాన్ని ఎవరూ పాటించరు," అని కన్వల్‌జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త అన్నారు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు. “ఫలితంగా, ఇక్కడ పని చేయడానికి వచ్చిన వలస కూలీల గురించి ఎటువంటి భోగట్టా అందుబాటులో ఉండదు. అందువలన వారు తరచుగా వారి కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు,” అని ఆయన చెప్పారు
*****
ఈ రెండు ఎకరాల తోటలో దాదాపు 144 బేరీ చెట్లు ఉన్నాయి. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు సాగే పండ్ల కాలమంతా వాటి ఏకైక సంరక్షకుడు, 15 ఏళ్ల సూరజ్. ఆ తోట యజమానులు అతనికి నెలకు రూ. 8,000 జీతంగా ఇస్తారు
అరారియా జిల్లా భాగ్‌పర్వాహా గ్రామంలోని సూరజ్ ఇంటిలో, అతని తండ్రి అనిరుద్ధ బహర్‌దార్ పట్వారీ (గ్రామ ముఖ్యుడు)కి సహాయంగా ఉంటారు. అందుకు ఆయనకు నెలకు రూ. 12,000 జీతం వస్తుంది. భూమి లేని ఈ కుటుంబానికి స్థిరమైన ఆదాయ వనరు ఇదొక్కటే. సూరజ్ చెప్పినదాని ప్రకారం, అతను పని కోసం అంత దూరం వెళ్లాలని అతని తండ్రి ఎన్నడూ కోరుకోలేదు కాని, ఆ కుటుంబానికి ఇంక వేరే దారి లేదు. "ఇక్కడ చాలా డబ్బు దొరుకుతుందని నా బంధువులలో ఒకరు చెప్పగా విన్నాను," అని సూరజ్ చెప్పాడు. ఆ విధంగా సూరజ్ పంజాబ్‌కు వచ్చాడు.
ఆరుగురితో కూడిన ఈ కుటుంబం ఖపరేల్ (మట్టి పలకలు) పైకప్పుగా ఉన్న ఒక కచ్చా ఇంట్లో నివసిస్తుంది. “వర్షాకాలంలో వర్షపు నీరు లోపలికి వస్తుంది. మా గ్రామంలోని గుడిసెలన్నీ మట్టి గోడలతో కట్టినవే, కొన్నింటికి మాత్రమే తగరపు కప్పులు ఉన్నాయి," అన్నారు సూరజ్ తల్లి సుర్తీ దేవి. పంజాబ్‌లో సూరజ్ సంపాదించిన డబ్బును అతను కోరుకున్నట్టుగా చదువుకు కాక, ఇంటి మరమ్మతుల కోసం ఖర్చు చేశారు. "నాకు ఇష్టం లేకపోయినా పంజాబ్‌కు తిరిగి రావాల్సిన అవసరం ఉందనిపిస్తోంది." ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పాడు సూరజ్.
35 ఏళ్ల సుర్తీ దేవి ఇంటి పనులు చూసుకుంటూ, అవసరమైనప్పుడు కూలీపనులు కూడా చేస్తుంటారు. సూరజ్ ముగ్గురు తమ్ముళ్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు - నీరజ్ (13), 6వ తరగతిలో, బిపిన్ (11) 4వ తరగతిలో, చిన్నవాడు ఆశిష్ (6) కిండర్ గార్టెన్‌లో ఉన్నారు. ఆ కుటుంబానికి భూమి లేదు. వ్యవసాయం చేయడానికి సుమారు 2.5 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. అందులో 1.5 ఎకరాల్లో చేపల పెంపకం కోసం చెరువును తవ్వారు. మిగిలిన ఎకరంలో వరి, కూరగాయల సాగు చేస్తున్నారు. సూరజ్ ఇంట్లో ఉన్నప్పుడల్లా, కొన్ని కూరగాయలు తీసుకుని మండీ లో అమ్మడానికి వెళ్తుంటాడు. కుటుంబానికి ఈ విధంగా సంవత్సరానికి దాదాపు రూ. 20,000 ఆదాయం వస్తుంది కానీ అది నికరంగా ఉండదు
ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చిన సూరజ్‌కి భవిష్యత్తు ఏమి తెస్తుందో తెలియదు. మళ్లీ సంపాదన కోసం పంజాబ్‌కు తిరిగి వెళ్ళాల్సి రావచ్చు. అయినప్పటికీ, అతని మనసంతా చదువుపైనే ఉంటుంది: "ఇతర పిల్లలు బళ్ళోకి వెళ్లడాన్ని చూసినప్పుడల్లా, నాక్కూడా బడికి వెళ్లాలని చాలా అనిపిస్తుంది."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి