నొసుముద్దీన్ ఏడుస్తున్నాడు. అతను మొదటిసారిగా అతని స్వంత ఇంటి నుంచి 10-12 కిలోమీటర్లు దూరంగా, తల్లితండ్రులని వదిలి వెళ్తున్నాడు. ఏడేళ్ళ పిల్లాడికి ఇలా ఇంటిని వదిలి దూరంగా వెళ్లపోవడమంటే కష్టమే. “నాకు చాలా బాధ అనిపించి నేను ఏడ్చాను. ఇల్లు వదలడం, కుటుంబాన్ని వదిలి వెళ్లడం అంటే కన్నీళ్ళొచ్చేశాయి నాకు”, అని గుర్తుచేసుకున్నాడు.
అతనిని రాఖాల్ గా (గొడ్లుకాయడానికి) పంపిస్తున్నారు. “మా కుటుంబం చాలా పెద్దది, మా తల్లితండ్రులకి మరి అంతకన్నా దిక్కుతోచలేదు.” అంటాడు 41 ఏళ్ళ నొసుముద్దీన్ షేక్. “మాకు సరిపడా తిండి ఉండేది కాదు. చాలాసార్లు మేము రోజుకు ఒక్క పూటే తినేవాళ్ళము, అది కూడా పొలంలో పిచ్చిగా ఎదిగినది ఏదైనా ఉంటే అదే దిక్కు. ఆ రోజుల్లో ఊర్లో కొందరికి మాత్రమే రోజుకు రెండు పూటలా తిండి దొరికేది.” చదువు అయితే అతని ఊహకు కూడా అందే విషయం కాదు. “అసలు బడి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. మా కుటుంబ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇక బడి గురించి ఎవరు ఆలోచిస్తారు?”
అందుకని అతను తన గుడిసెని వదిలేసి అప్పటి అస్సాంలో ధుబ్రీ జిల్లాలోని మానుల్లాపరా గ్రామానికి, బస్సులో మూడు రూపాయిల టికెట్టుకు, తన ఊరు ఉరర్భుయిని వదిలి, ఏడు ఆవులు, 12 భీఘాల (దగ్గరగా నాలుగు ఎకరాలు) యజమాని వద్ద పనికి చేరాడు. “నేను ఆ వయసులో చాలా గంటలు పని చేయవలసి వచ్చేది. కొన్నిసార్లు నాకు సరిపడా భోజనం కూడా పెట్టేవారు కాదు. పాచిపోయిన తిండి పెట్టేవారు. నేను ఆకలితో ఏడ్చేవాడిని.” అని నొసుముద్దీన్ గుర్తుచేసుకున్నాడు. “మొదట్లో నాకు ఏమి జీతం ఉండేది కాదు. భోజనం పెట్టి, నిద్రపోవడానికి చోటిచ్చారు అంతే. నా యజమాని మార్చ్ నుండి నవంబర్ వరకు- అంటే ఆ వ్యవసాయ కాలం చివరలో సంవత్సరానికి, 100-120 మోన్ బియ్యం ఇచ్చేవాడు. ఆ తరవాత నాలుగేళ్లకు రెండు మోన్లు ఇచ్చేవారు - అంటే దగ్గరగా 80 కిలోల బియ్యం.”
కొన్ని దశాబ్దాల క్రితం వరకు అస్సాం, మేఘాలయలో ఇలా పిల్లలను రఖాలుగా మార్చి పంపడం, ఒక రివాజుగా నడిచేది. పేదకుటుంబాల నుంచి వారి తల్లితండ్రులు ధనిక రైతులకు ఇలా పిల్లలను “ఇవ్వడం”, తద్వారా వారిని గొడ్లను కాయడానికి “పనికి పెట్టుకోవడం” రివాజు. ఈ పద్ధతిని పేఠ్భట్టి(అంటే అన్నం పెట్టి కడుపు నింపడం అని అర్థం) అనేవారు.
నొసుముద్దీన్ ఇద్దరు సోదరులు కూడా వారి గ్రామం ఉరర్భుయిలోనే రఖాలు గా పంపివేయబడ్డారు. అతని తండ్రి హుస్సేన్ అలీ(పోయిన నెల, 80 నిండాక, ఆయన చనిపోయారు), స్వంత భూమి లేని రైతు. ఆయన పండించిన పంటను పంచుకునే షరతు మీద 7-8 భీఘాల నేల కౌలుకు తీసుకుని అందులో వరి సాగుచేస్తాడు. (అతని తల్లి, నొసరిన్ ఖాతూన్ 2018 లో చనిపోయింది.)
నొసుముద్దీన్ కష్టజీవి. రఖాలు గా అతని దినం పొద్దున్న 4గంటలకు మొదలవుతుంది . “నేను పొద్దున్న ప్రార్ధన సమయంలో లేచేవాడిని.” అంటాడు. అతను గడ్డిని, నీళ్లను, ఆవపిండిని కలిపి కుడితి తయారు చేస్తాడు. గొడ్ల చావిడిని శుభ్రం చేసి, ఆవులను అతని యజమాని కొడుకులతో వారి పొలానికి తీసుకెళ్తాడు. అక్కడ అతను గడ్డిని తొలగించి, ఆవులకు నీళ్లు తాగించి, వేరే పనులు ఏవైనా ఉంటే చేస్తాడు. పగటి భోజనం పొలానికి పంపుతారు. పంటను కోసే సమయంలో, కొన్నిసార్లు సాయంత్రం వరకు పనిచేయవలసి వస్తుంది. “నేను రోజంతా పని చేసి అలసిపోతాను, మరి రాత్రి నాకు సరైన భోజనం ఇవ్వకపోయినా, పాచిపోయిన తిండి పెట్టినా ఎలా ఉంటుంది? నిస్సహాయంగా అనిపిస్తుంది.”
చాలాసార్లు, గడ్డితోనూ, పాత గుడ్డలతోను నింపిన దిండులో వెదురు మంచం మీద పడుకుని, అతను రాత్రులు ఏడ్చేవాడు.
ప్రతి 2-3 నెలలకు ఒకసారి, అతనిని తన ఊరికి పంపేవారు. అక్కడ “రెండుమూడు రోజులు ఉండి వచ్చేవాడిని, కానీ ఇల్లు వదిలి వెనక్కి రావడం చాలా కష్టంగా ఉండేది.”
నొసుముద్దీన్ కి 15 ఏళ్ళు ఉన్నప్పుడు, అతని తండ్రి నొసుముద్దీన్ ని వేరే యజమాని దగ్గర పనికిపెట్టాడు. అతని కొత్త యజమాని ఒక వ్యాపారి- రైతు. ఈ యజమానికి మానుల్లాపుర గ్రామం లో, 30-35 బీఘాల నేల, ఒక బట్టల దుకాణం, ఇంకా వేరే వ్యాపారాలు ఉన్నాయి. “అక్కడినుండి వేరే చోటకు తీసుకెళ్తున్నారంటే బెంగపడి మళ్లీ ఏడ్చాను. సోదా బేపారి(కొత్త యజమాని) వాళ్ళింట్లో వాళ్ళని పరిచయం చేసి నేను కొత్తగా పనిలో చేరినందుకు 2 రూపాయిలు బహుమతిగా ఇచ్చాడు. తరవాత ఆ డబ్బులతో చాక్లెట్ కొనుక్కున్నాను. దీనివలన సంతోషపడ్డాను. కొంతకాలానికి నేను అలవాటు పడ్డాను.”
మళ్ళీ, గొడ్లచావిడిలో పడుకోడం, పంట చేతికందాకా రెండు బస్తాల బియ్యం, ఇంకొ 400 రూపాయిల నగదు, ఇది అతని జీతం’గా అందేది. అతని రోజూ గొడ్లను మేపడం, గొడ్ల చావిడిని శుభ్రం చేయడం చేసేవాడు. కానీ నొసుముద్దీన్ జీవితం మెరుగైంది. ఇప్పుడు అతని వయసు 15 ఏళ్ళు, ఇంకా బాగా పనిచేసేవాడు, పైగా అతని యజమాని కూడా దయగా చూసేవాడని చెబుతాడు.
భోజనంలో ఇప్పుడు వేడి అన్నం, కూరగాయలు, చేప లేదా మాంసం ఉండేది, కానీ ఇదివరకు యజమాని పెట్టినట్టు పులిసిన అన్నం ఉండేది కాదు. “నేను వాళ్లతో పాటు బజారుకెళ్తే వాళ్ళు నాకు ఒక రసగుల్ల కొనేవాళ్ళు. రంజాన్ కి కొత్తబట్టలు కూడా కొనేవారు. నేను వాళింట్లో మనిషిలానే అనుకునేవాణ్ణి.”
కానీ అతని తండ్రికి వేరే ఆలోచనలున్నాయి. నొసుముద్దీన్ కి 17 ఏళ్ళప్పుడు, అంటే రెండేళ్ల తరవాత అతని స్వంత ఊరు, ఉరార్భుయికి వచ్చేసాడు. ఆ గ్రామ పంచాయతీ ముఖియా అతనిని 1500 రూపాయిల సంవత్సర జీతం మీద పనికి పెట్టుకున్నాడు. పంట చివర రెండు బస్తాల బియ్యాన్ని కూడా పంపేవారు.
ఇంకో సంవత్సరం అలా గడిచిపోయింది.
“చాలాసార్లు ఇలా బానిసగానే నా బతుకు వెళ్లిపోతుందేమో అని అనుమానం వచ్చేది. కానీ నాకు వేరే దారి లేకపోయింది.” అన్నాడు నొసముద్దీన్. అయినా అతను ఆశను వీడలేదు. అతని స్వంతంగా ఏదైనా పని చెయ్యాలనుకున్నాడు. అతను తన ఊరిలో యువకులు 1990ల్లో వేరే ప్రదేశాలకు పని కోసం వలస వెళ్లడం చూశాడు. యువకులు ఎవరూ రఖాలు గా పనిచేయడానికి ఇష్టపడట్లేదు, వాళ్లు చాయ్ దుకాణాల్లో, హోటళ్లలో పని చేసి నెలకు 300-500 సంపాదించి, ‘బోల్డంత’ డబ్బుతో వెనక్కి వస్తున్నారు.
వీరి విషయాలు వింటూ, వాళ్ళ దగ్గరున్న కొత్త రేడియోలను, వాచీలు చూసేకొద్దీ నొసుముద్దీన్ కి లోపల రంధి మొదలైంది. కొంతమంది సైకిళ్ళు కూడా కొనుక్కున్నారు. “వాళ్ళు అమితాబ్ బచ్చన్ లాగా మిథున్ చక్రవర్తిలాగా గొట్టం ప్యాంట్లు కూడా వేసుకుని ఆరోగ్యంగా కనిపించేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఖర్చుపెడుతున్నారో కనుక్కునేవాణ్ణి. ఇక వారితో వెళ్లాలని నిర్ణయించుకున్నాను.”
నొసుముద్దీన్ తన ఊరి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాలయాలో బాగామరా పట్టణంలో ఉద్యోగాల గురించి కనుక్కున్నాడు. అతను ఎవరికీ తెలీకుండా అక్కడికి వెళ్లే దారి కూడా తెలుసుకుని ఒక ప్రణాళిక వేసుకున్నాడు. “నాకు కంగారుగా ఉన్నా, పట్టుదలగా ఉన్నాను. నేను ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదు, చెప్తే వాళ్లు నా వెనుకే వచ్చి, నన్ను మళ్లీ తీసుకొచ్చేస్తారని భయపడ్డాను.”
ఒక ఉదయం గొడ్లను మేపడానికి తీసుకెళ్లకుండా నొసుముద్దీన్ పరిగెత్తడం మొదలుపెట్టాడు. “నేను బయట దొరికే పని గురించి ఒకతనితో మాట్లాడేవాడిని. అతనితో పాటు పారిపోయాను. మేము హాట్సింగిమరీ పట్టణం చేరేవరకు అలా పరిగెడుతూనే ఉన్నాము. అక్కడనుంచి బాగామరా చేరడానికి తొమ్మిది గంటలు పట్టింది.. నేనేమి తినలేదు. పదిహేడు రూపాయిల టిక్కెట్ కొనడానికి కూడా డబ్బు లేదు. బాగామారా చేరాక మా ఊరిలో వేరే అబ్బాయిని అడిగి డబ్బులు తీసుకున్నాను.”
“చాలాసార్లు ఇలా బానిసగానే నా బతుకు వెళ్లిపోతుందేమో అని అనుమానం వచ్చేది. కానీ నాకు వేరే దారి లేకపోయింది.” అన్నాడు నొసముద్దీన్. అయినా అతను ఆశను వీడలేదు. అతని స్వంతంగా ఏదైనా పని చెయ్యాలనుకున్నాడు
అతను కలలు కన్న గమ్యం వద్ద, నొసముద్దీన్, ఖాళీ జేబుతో, ఖాళీ కడుపుతో, బస్సు నుండి రొమేని చాయ్ దుకాణ్(రొమేని టీ స్టాల్) ముందు దిగాడు. ఆకలి కళ్ళతో ఉన్న ఒంటరి పిల్లాడిని గమనించి స్టాల్ ఓనర్ లోపలికి రమ్మని సైగ చేశాడు. నొసుముద్దీన్ కు భోజనం దొరకడమే కాకుండా, ఉండడానికి ఒక చోటు, అక్కడ గిన్నెలు తోమే పని కూడా దొరికాయి.
మొదటి రాత్రి కన్నీళ్ల రాత్రయింది. అతని పాత యజమాని నుంచి అతనికి జీతంగా రావలసిన వెయ్యి రూపాయిలు అందుకోకుండానే వచ్చేశాడు - అది తలచుకుని బాగా ఏడ్చాడు. ఆ సమయంలో, అదొక్కటే అతని బాధ. “అంత కష్టపడి సంపాదించిన ఆ డబ్బును అలా వృధాపోనిచ్చానని చాలా బాధ పడ్డాను.”
నెలలు గడిచిపోయాయి. అతను టీ కప్పులు, ప్లేట్లు కడిగి, టేబుల్ మీద అమర్చిపెట్టడం నేర్చుకున్నాడు. మంచి టీ తయారు చేయడం నేర్చుకున్నాడు. అతనికి నెలకు 500 రూపాయిలు ఇచ్చేవారు. అతనా డబ్బులన్నీ దాచుకున్నాడు. “నేను 1500 పోగేశాక మా అమ్మానాన్నలని కలుద్దామని అనుకున్నాను. ఆ డబ్బు వారికి చాలా ఉపయోగపడుతుందని తెలుసు. కలిసే రోజు కోసం విపరీతంగా ఎదురు చూసాను.”
ఇంటికెళ్ళగానే అతను దాచిన డబ్బులు తన తండ్రికి ఇచ్చాడు. ఆ డబ్బుతో చాలా కాలంగా కుటుంబానికి ఉన్న అప్పు తీరింది. దాని వలన అతని కుటుంబం అతన్ని ఊరు నుండి పారిపోయినందుకు క్షమించింది.
ఒక నెల తరవాత, నొసుముద్దీన్ బాగామరాకి తిరిగివచ్చి, ఇంకో టీ స్టాల్ లో నెలకు వెయ్యి రూపాయిల జీతం మీద చేరాడు. ఆ తరవాత అతన్ని వెయిటర్ గా ప్రమోట్ చేశారు. అతను షాప్ బయట టీ, మిఠాయిలు, చిరుతిళ్ళు కొనుగోలుదారులకు అందిస్తుండేవాడు - పూరి సబ్జి, పరాఠాలు, సమోసాలు, రసమలై, రసగుల్లా లు ఇలా ఎన్నో ఉండేవి. పొద్దున్న 4 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు పని ఉండేది . అక్కడ పని చేసేవారందరూ షాపులోనే పడుకునేవారు.
అతను అక్కడ నాలుగు ఏళ్ళు పనిచేశాడు. ఇంటికి తప్పకుండా ప్రతినెలా డబ్బు పంపేవాడు. అతను 4000 రూపాయిలు కూడబెట్టాక, మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
అతను ఆ డబ్బుతో ఒక ఆంబోతుని కొని కౌలుకు భూమిని తీసుకుని, దానిని దున్నడం మొదలుపెట్టాడు. అతని ఊరిలో ఆ ఒక్క పని చేయడానికే ఆస్కారం ఉన్నది. దున్నడం, నాటడం, శుభ్రంచేయడంతో పొలంలోనే అతనికి సమయం గడిచిపోతుంది.
ఒక ఉదయం, ఒక హాలోయ్ (మిఠాయిలు తయారు చేసేవారు) బృందం తన పొలం దాటిపోతున్నారు. “వాళ్ళు మోస్తున్న అల్యూమినియం గిన్నెల్లో ఏమున్నాయో అడిగాను. అవి రసగుల్లాలని వాళ్లు చెప్పారు. అది బాగా లాభదాయక వ్యాపారం అని అర్థమైంది.. నేను టీ స్టాల్ లో పని చేసినప్పుడు అక్కడ రసగుల్లాలు తయారుచేసేవారు కాని అప్పుడు నేను అవి తయారుచేయడం నేర్చుకోలేదని బాధపడ్డాను.”
నొసుముద్దీన్ ఇక“స్థిరపడాల”నుకున్నాడు. “నా వయసు పిల్లల(20ఏళ్ళ వాళ్లు)కి పెళ్లిళ్లవుతున్నాయి. కొందరు ప్రేమలో ఉన్నారు. నాకు కూడా ఒక తోడు ఉండి, ఇల్లుకట్టుకుని పిల్లాపాపలతో సంతోషంతో ఉండాలని అనిపించింది.” పొలాలకు నీళ్లు పారిస్తున్న ఒక ఆడామె మీదకి అతని మనసు పోయింది. ఆ పచ్చటి పొలాల్లో ఆమెని చూస్తుండిపోయేవాడు. ఒకరోజు ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె భయపడి పారిపోయింది.
“ఆమె కోసం ఎదురుచూశాను కాని ఆమె మళ్లీ ఎప్పుడు కనిపించలేదు.” తరవాత నేను మా బావతో మాట్లాడి నాకోసం సంబంధం చూడమని చెప్పాను. అతని పెళ్లి బాలి ఖాతూన్ తో జరిగింది. , ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్ళు. ఆమె దగ్గర్లోని గ్రామం లో హాలోయ్ కూతురు. (తరవాత అతను మొదట మనసు పడింది తన భార్యకు మేనత్త వరస అయ్యే ఆమెతో అని తెలిసింది.)
పెళ్లి అయ్యాక అతను, అతని భార్య కుటుంబం నుంచి మిఠాయిలు తయారు చేయడం నేర్చుకున్నాడు. అతను స్వయంగా మొదటసారి చేసిన రసగుల్లా లను తయారు చేసే ప్రయత్నంలో మూడు లీటర్ల పాలని వాడాడు. అతను 100 రసగుల్లా లు తయారు చేసి, ఇంటింటికి తిరిగి, రూపాయికి ఒక రసగుల్లా చొప్పున అమ్మి, 50 రూపాయిలు లాభం చేసుకున్నాడు.
ఇదే అతని ఆదాయమార్గం అయింది. కాలం గడిచే కొద్దీ కరువు, వరదల వలన వ్యవసాయంలో జరిగిన నష్టాలు, కుటుంబ అప్పులు కూడా తీర్చేసాడు.
2005 లో నొసుముద్దీన్ కి 25 ఏళ్ళు వచ్చాయి. అతను 35 కిలోమీటర్ల దూరంలో మేఘాలయ సరిహద్దులో ఉన్న నైరుతి గారో పర్వతాల జిల్లా వద్ద ఉన్న మహేంద్రగంజ్ వరకు ప్రయాణించాడు. అక్కడ తన వ్యాపారం బాగా సాగుతుందని విన్నాడు. కానీ ఆ ఊరిలో కొత్తవాడవడం వలన, అది అంత తేలిక అవలేదు. పైగా వరసగా జరుగుతున్న బందిపోట్ల దాడి అంత భద్రతనివ్వలేదు. మనుషులు చాలా అనుమానంగా ఉండేవారు. నొసుముద్దీన్ కి ఒక స్థలం వెతుక్కుని స్థిరపడడానికి మూడు నెలలు పట్టింది. తనకు మంచి ఖాతాదారులను వెతుక్కోవడానికి మూడేళ్ళ పైనే పట్టింది.
అతని దగ్గర పెట్టుబడిలేదు. అందుకని ఋణం పైనే తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అన్ని ముడిసరుకులు వేరే ధరపై, తరవాత చెల్లించే పద్ధతిలో తీసుకునేవాడు. అతని భార్య బాలి ఖాతూన్, 2015లో మహేంద్ర గంజ్ కి మారింది. అప్పటికే వారికి ముగ్గురు పిల్లలు. అతని కూతురు రెమియా ఖాతూన్ కి పద్దెనిమిది ఏళ్ళు, కొడుకులు ఫోరిదుల్ ఇస్లాం, సోరిఫుల్ ఇస్లాం కు 17, 11 ఏళ్ళు. ఇద్దరూ బడిలో చదువుతున్నారు.
పోయిన సంవత్సరాలలో, నొసుముద్దీన్ నెలకు దగ్గరగా 18000-20000 రూపాయిల వరకు లాభం చూశాడు. అతని కుటుంబ వ్యాపారం విస్తరించింది. రసగుల్లాల తోపాటు అతను, అతని భార్య బాలి ఖాతూన్ జిలెబీ లు చేస్తున్నారు.
నొసుముద్దీన్ కాలాన్ని బట్టి వారానికి 6-7 రోజులు వ్యాపారం చేస్తాడు. అతను, బాలి ఖాతూన్ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రసగుల్లాలు తయారుచేస్తారు. దీనికోసం ఐదు లీటర్ల పాలని, 2 కిలోల చక్కర ని వాడి 100 రసగుల్లా లని చేసి దాస్తారు. పొద్దుగూకేలోగా జిలెబీ లు కూడా చేసి, తాజా గా ఉన్నవాటిని అమ్ముతారు. ఆ తరవాత నొసుముద్దీన్ ఆ రెండు మిఠాయిల డబ్బాలనూ పట్టుకుని ఇంటింటికి తిరిగి, టీ స్టాళ్లలో ఇచ్చి, తిరిగి 2 గంటలకు ఇంటికి వస్తాడు.
అతని తీయని చిన్ని ప్రపంచం మార్చ్ 2020 లో దేశవాప్తంగా విధించిన లాక్ డౌన్ తో స్థంభించిపోయింది. ఆ తరవాత కొన్ని వారాలు చాలా కష్టంగా గడిచాయి. వారి వద్ద ఉన్న కొద్ది బియ్యం, పప్పులు, ఎండుచేపలు, కారంతో కాలం గడిపారు. వారి ఇంటి యజమాని వారికి ఇంకొద్దిగా బియ్యం కూరగాయలు ఇచ్చి ఆదుకున్నాడు. నోసుముద్దీన్ వలస వెళ్లినందున అతని రేషన్ కార్డు ఇక్కడ పని చెయ్యదు.
ఇంకొద్ది రోజులకు, అతను ఇంటిలో తోచక చుట్టుపక్కల వారికి రసగుల్లాలు అమ్మి, 800 వరకు సంపాదించేవాడు. ఇది కాక అతనికి వేరే ఆదాయం లేదు.
లాక్ డౌన్ అయి ఒక నెల గడిచిపోయింది. ఒక మధ్యాహ్నం అతని ఇంటి యజమాని జిలేబీ లను తినాలన్న కోరికను వెలిబుచ్చాడు. నొసుముద్దీన్ తన వద్దనున్న ముడిపదార్ధాలతో కుదిరినట్లు చేసిపెట్టాడు. ఆ తరవాత చుట్టుపక్కల వారు జిలేబీ లను అడగడం మొదలుపెట్టారు. నొసుముద్దీన్ ఋణం పై కొద్దిగా పిండి,, చక్కర, పామ్ ఆయిల్ అక్కడ ఉన్న దుకాణం దగ్గరనుంచి తెచ్చాడు. అతను జిలేబీ ల వలన రోజుకు 400-500 సంపాదించేవాడు.
ఏప్రిల్ లో రంజాన్ నెల మొదలవగానే జిలేబీలకున్న గిరాకీ పెరిగిపోయింది. పోలీస్ చెక్ పోస్టులున్నా గాని, ఆ లాక్ డౌన్ సమయంలోనే వారంలో ఒకటి రెండు సార్లు ఊరిలో అమ్మేవాడు. శానిటైజర్, మాస్క్ తప్పకుండా వాడి జాగ్రత్తలు పాటించేవాడిని చెప్తాడు. వీటివలన మొదటి సారి లాక్ డౌన్ వలన కలిగిన నష్టాల నుండి తేరుకోగలిగాడు.
ఒక్కసారి లాక్ డౌన్ తీసివేశాక, అతని రసగుల్లా , జిలేబి వ్యాపారం మళ్లీ మొదలుపెట్టాడు. అయినా గాని అతని ఆదాయం చాలా వరకు అతని తండ్రి, భార్య, కూతురు ఆరోగ్యానికి ఖర్చయ్యిందని చెప్పాడు.
2020 ఆఖరుకు, నొసుముద్దీన్ అస్సాంలోని తన స్వంత ఊరు ఉరార్భయిలో ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. దానివలన అతను పొదుపు చేసిన సొమ్ములో చాలావరకు ఖర్చుపెట్టవలసి వచ్చింది. .
ఆ తరవాత 2021లో లాక్ డౌన్ విధించారు. నొసుముద్దీన్ తండ్రికి ఆరోగ్యం పాడైంది. (జులై లో చనిపోయాడు). అతని వ్యాపారం కూడా నిలిచిపోయింది. “నా ఆదాయం ఈ మహారోగ కాలంలో నిలకడగా లేదు.” అన్నాడు. “నేను దగ్గరలోని గ్రామాలకు అమ్మడానికి వెళ్తాను, కొన్నిసార్లు నేను 20-25 కిలోమీటర్లు, 20-25 కిలోల మిఠాయిలు మోసుకుంటూ తిరుగుతాను. నేను ఇప్పుడు వారానికి 6-7 రోజులు కాక 2-3 రోజులే మిఠాయిలు చేస్తున్నాను. నాకు అలసటగా ఉంటోంది. జీవితం ఈ మధ్యకాలం లో చాలా కష్టంగా నడుస్తోంది. కానీ నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పడిన కష్టమంత కఠినంగా అయితే లేదు. అప్పటి రోజులు ఇప్పుడు గుర్తొచ్చినా నాకు కన్నీళ్లొస్తాయి.”
నొసుముద్దీన్ షేక్, తన కుటుంబం తో కలిసి, 2015 నుంచి మహేంద్రగంజ్ లో మా తలిదండ్రుల పాత ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఎల్లవేళలా నవ్వుతూ , మా పెరటి తోటని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాడు.
అనువాదం: అపర్ణ తోట