“ బాపూ తూ ఆజా (తాతా, నువ్వొచ్చేయ్)”, తన్నా సింగ్ కొడుకు ఫోన్ లో ఎప్పుడూ చెబుతుంటాడు. “నేనెలా వస్తాను? నేను అతని భవిష్యత్తు కోసమే ఇక్కడ ఉన్నాను,” తన టెంటులో ప్లాస్టిక్ కుర్చీ మీద కూర్చుని అన్నారు సింగ్.
“అతని మాటలు విన్నప్పుడల్లా గట్టిగా ఏడవాలనిపిస్తుంది(నా కొడుకుకు 15 ఏళ్లు), ఇలా మనవలని వదిలి ఎవరు వస్తారు? ఎవరన్నా తమ పిల్లలను వదిలి ఎలా ఉండగలరు?” కన్నీళ్లతో అడుగుతాడతను.
ఏది ఏమైనా తన్నా సింగ్ వెనక్కి వెళ్ళొద్దని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాడు. నవంబర్ 26, 2020 నుండి ఒక్కరోజు కూడా అతను నిరసన స్థలాన్ని వదిలి వెళ్ళలేదు. ఒక ఏడాది తరవాత, నవంబర్ 19, 2021న, ఆ మూడు వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని ప్రకటించాక, భార్య విగతుడైన 70 ఏళ్ళ సింగ్, ఆ రద్దును నిజంగా కాగితాలపై ముద్రించాకనే తిక్రిని వదిలి వెళతానని చెప్పారు. “మేము ఈ చట్టాలను రద్దు చేయడానికి రాష్ట్రపతి ముద్ర కోసం ఎదురుచూస్తున్నాము. ఈ రోజు కోసమే మేము మా ఇళ్లను వదిలి ఇక్కడికి వచ్చాము.” అన్నారు ఆయన.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాది క్రితం రాజధాని సరిహద్దులకు వచ్చి తిక్రీ (పశ్చిమ ఢిల్లీలో), సింగు (రాజధానికి వాయువ్యం), మరింత ముందుకు వెళ్ళడానికి అనుమతించనప్పుడు ఘాజీపూర్‌లో(తూర్పులో) బస చేసిన పదివేల మంది రైతులలో ఆయన కూడా ఉన్నారు.
సింగ్ పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలోని భంగ్‌చారి గ్రామం నుండి తన ట్రాక్టర్‌పై మరికొంత మంది రైతులతో ఇక్కడకు వచ్చారు, ఆ ట్రాక్టరు ఇప్పటికీ ఆ నిరసన ప్రదేశానికి సమీపంలో నిలిపి ఉంది. అతని గ్రామంలో, అతని కుటుంబం వారి ఎనిమిది ఎకరాలలో, గోధుమ, వరి పంటలను సాగు చేస్తుంది. "నేను మా ఖేత్ [వ్యవసాయ భూమి] బాధ్యతను నా కొడుకుకు వదిలి ఇక్కడకు వచ్చాను," అని అతను చెప్పాడు.
సింగ్ కు ఇది చాలా కష్టమైన ఏడాదిగా గడిచింది. ఎన్నో కోల్పోయిన ఏడాది ఇది. ఈ సమయంలో ఇద్దరు బంధువులు చనిపోయారు- ఒక మేనమామ కొడుకు, అతని మరదలి మనవడు. “అతను అప్పుడే తన మాస్టర్స్ చేసాడు. చాలా చిన్నవాడు. అయినా వెళ్ళలేకపోయాను.” అన్నారు. “పోయిన ఏడాది చాలా విషయాలు జరిగాయి కానీ వెళ్ళలేదు. ఇక్కడ నిరసనను వదిలి వెళ్లాలనిపించలేదు.”
ఇంట్లో మరికొన్ని సంతోషకరమైన విషయాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా అతను వెళ్ళలేదు. “మా అమ్మాయి 15 ఏళ్ళ తరవాత ఒక బిడ్డను కన్నది, అయినా నేను వెళ్ళలేకపోయాను. నా మనవడిని చూడడానికి కూడా వెళ్ళలేదు. నేను వెనక్కి వెళ్తే మొదట వారినే కలుస్తాను. నేను ఇప్పుడు మాత్రమే ఫోన్లో ఫోటోల ద్వారానే చూశాను(పది నెలల పిల్లవాడు). ఎంత చక్కని బిడ్డో చెప్పలేను.”
అదే రోడ్డు మీద ఇంకొక టెంటు ఉంది, ఇది రోడ్డు డివైడర్ పక్కగానే ఉంది. దీని పైన ఢిల్లీ మెట్రో వెళ్తుంది. అక్కడ ఉండే జస్ కరణ్ సింగ్ నాతో అన్నారు, “మేము మా ఇంట్లో సుఖంగా ఉండగలం, కానీ ఇల్లు వదిలి ఇక్కడ వీధుల మీదకు నిరసన చేయడం కోసం వచ్చాము. ఉండడానికి సరైన ప్రదేశం లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది.”
చలికాలం, వేసవికాలం చాలా కఠినంగా ఉన్నా భరించామని చెప్పారు ఆయన. కాని వర్షాలప్పుడు దారుణంగా ఇబ్బంది పడ్డారు. వర్షాకాలపు రాత్రుళ్లు ఎవరికీ సరైన నిద్ర ఉండేది కాదు. “చాలాసార్లు మా పైకాప్పు బలమైన గాలులవలన ఎగిరిపోయేది. అలా జరిగినప్పుడల్లా, మేము దానిని తిరిగి సరిచేసుకునేవాళ్లము.”
భీఖీ మాన్స జిల్లా నుండి వచ్చిన జస్ కరణ్ (పైన కవర్ ఫోటో లోని వ్యక్తి) అన్ని నిరసన స్థలాల మధ్యా తిరుగుతూ ఉండేవారు. ఇంటి వద్ద తన 12 ఎకరాల పొలంలో అతను గోధుమ, వరి పండిస్తారు. అతని కొడుకు షాక్ తగిలి చనిపోయాడు. ఇప్పుడు అతను తన 80 ఏళ్ళ అత్తగారు, కోడలు, ఇద్దరు మనవలతో ఉంటున్నాడు.
పోయిన శుక్రవారం అతను తిక్రికి వస్తుండగా, ప్రధాని ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. “ఈ ప్రకటన వెలువడినప్పుడు మేము మా ఊరిలోనూ లేము, తిక్రి లోనూ లేము. అందరితో సంతోషాన్ని పంచుకోవడం సాధ్యపడలేదు”, అన్నారు 55 ఏళ్ళ జస్ కరణ్. వెంటనే అతని తల్లి వద్ద నుండి, ఇక నిరసన అయిపోయింది కాబట్టి వెనక్కి రమ్మని ఫోన్ వచ్చింది. కాని అతను,”మేము ఆ చట్టాలను గురించి పార్లమెంట్ లో మాట్లాడేదాకా వేచి ఉంటాము,” నవంబర్ 29న జరగబోయే చలికాలపు సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన అన్నారు. “రైతులుగా ఈ నిరసనలో ఉపయోగపడినందుకు మేము సంతోషిస్తున్నాం. కానీ ఈ చట్టాలు రద్దు అయి ఇంటికి చేరాక నిజమైన సంతోషాన్ని పొందుతాము.”
వారి ఊరు వెళ్లడం కూడా అంత తేలికేమి కాదు అంటారు, పరంజిత్ కౌర్. ఈమె భటిండా జిల్లాలో కోత్రా కొరియన్వాలా గ్రామం నుండి తిక్రికి వచ్చారు. “మా మనసుకు చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో మా చేతులతో స్వయంగా ఇక్కడ కట్టుకున్నఈ ఇళ్ల మీద చాలా బెంగ ఉండిపోతుంది. పంజాబ్ లో ఉన్నట్టే ఇక్కడ ప్రతి సౌకర్యం వుండేట్లుగా చూసుకున్నాము.”
హార్యాణా బహదుర్గ్ దగ్గరలో ఉన్నహైవే డివైడర్ పైన, టెంటులకు దగ్గరలోనే, ఆమె, మిగిలిన మహిళా రైతులు కలిసి ఆకుకూరలు, టమోటోలు, ఆవాలు, క్యారట్లు, బంగాళా దుంపలు పండిస్తున్నారు. నేను ఆమెని కలిసిన రోజు ఆమె ఈ ‘తోట’ నుండి తెచ్చిన పాలకూరను పెద్ద గిన్నెలో వండుతోంది.
ఈ జ్ఞాపకాలను, నష్టాలను తట్టుకుని,మనసును సంబాళించుకోవడం కష్టమే, అని పరంజిత్ అంటుంది, “మేము నిరసన సమయంలో కోల్పోయిన ఆ 700 వందల మందిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. వారు ఇక్కడ 10 రోజులు ఉండి దీపావళికి ఇంటికి వెళ్ళబోతూ ఉన్నారు. వారంతా చాలా సంతోషంగా, తిరిగి వెళ్ళడానికి ఇక్కడ ఆటోల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడే అలా జరిగింది. ఆ రోజు రాత్రి తిండి కూడా తినలేకపోయాము. మోదీ ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోనేలేదు.”
భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా)(ఉగ్రహన్) తన భటిండా జిల్లాలో నాయకురాలు, 60 ఏళ్ళ పరంజిత్ కౌర్, జనవరి 26 న జరిగిన ట్రాక్టర్ పెరేడ్ గురించి “చాలా మంది లాఠీలు కర్రలతో గాయపడ్డారు. వారు మా మీద టియర్ గ్యాస్ కూడా ప్రయోగించి, మా పై ఎఫ్ ఐ ఆర్ లు నమోదుచేశారు. మేము దీనిని జీవితాంతం గుర్తుంచుకుంటాము.” అన్నది.
రైతుల పోరాటం ఈ మూడు చట్టాల రద్దుతోనే ఆగిపోదు,అని ఆమె గట్టిగా చెప్పింది. “అధికారంలో ఉన్న, మనం ఓట్లు వేసి గెలిపించిన ఏ ప్రభుత్వమూ ఇప్పటిదాకా రైతుల గురించి ఎన్నడూ ఆలోచించలేదు. వారు వారి గురించి మాత్రమే ఆలోచించుకుంటారు. మేము మా ఇళ్లకు వెళ్లి మా పిల్లను కలిసి, మనవలతో ఆడుకుంటాము. కానీ ఇంకా రైతులు ఎన్నో సమస్యలపై పోరాడవలసింది ఉంది.”
“మాకిప్పటికీ అతని(మోదీ) ఉద్దేశాల పై సందేహం ఉంది,” అన్నారు అరయైఏళ్ళ జస్ బీర్ కౌర్ నాట్. ఈమె మాన్స జిల్లాకి చెందిన పంజాబ్ కిసాన్ యూనియన్ కమిటీ మెంబెర్. తిక్రి లో బస చేసిన రైతులలో ఒకరు. “ఆయన ప్రకటనలో కొన్ని వర్గాల రైతులను ఒప్పించలేకపోవడం వలన చట్టాలను రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. అంటే ఆయన ఈ చట్టాలు సరైన నిర్ణయమని నమ్ముతున్నట్లు అర్థమవుతుంది. ఆయన ప్రకటలో చెప్పింది రాతపూర్వకంగా జరగాలని ఎదురుచూస్తున్నాము. అప్పుడు మేము కూడా అందులో ఏమి రాసారో చూస్తాము, ఎందుకంటే వారు చాలాసార్లు మాటలతో ఆడుకుంటారు.”
జస్ బీర్ విద్యుత్ (సవరణ) బిల్లు, 2020, అలాగే స్టబుల్ బర్నింగ్ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవడంతో సహా పెండింగ్‌లో ఉన్న ఇతర డిమాండ్‌ల జాబితా చెప్పారు. "ఈ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించవచ్చని మాకు తెలుసు, అయితే వారు MSP [కనీస మద్దతు ధర]పై హామీని అందించడానికి ఒప్పుకోకపోవచ్చు. మేము డిమాండ్ చేస్తున్న అంశాలు ఇంకొన్ని ఉన్నాయి: నిరసన తెలిపిన రైతులపై పెట్టిన అన్ని పోలీసు కేసులను వెనక్కి తీసుకోండి, రైతులకు వారి ట్రాక్టర్లకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వండి. ఇన్ని విషయాలు తేల్చవలసి ఉన్నాయి కాబట్టి మేము త్వరగా బయలుదేరడం లేదు.”
నవంబర్ 21, ఆదివారం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న దాదాపు 40 రైతు సంఘాల కూడిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ పంచాయితీ తో సహా, తమ ఆందోళన, ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని ధృవీకరించింది – నవంబర్ 22న లక్నోలో కిసాన్ పంచాయితీ, నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దు పాయింట్ల వద్ద సమావేశాలు, నవంబర్ 29న పార్లమెంటుకు మార్చ్.
అనువాదం: అపర్ణ తోట