ర్యాపిడ్ మలేరియా టెస్ట్ కిట్ కోసం ఆమె తన సంచి అంతా వెదుకుతున్నది. ఆ సంచిల మందులు, సెలైన్ బాటిళ్లు, ఐరన్ సప్లిమెంట్లు, ఇంజక్షన్లు, బీపీని కొలిచే యంత్రం లాంటివన్నీ ఉన్నాయి. రెండు రోజులుగా ఈమె కోసం ప్రత్నిస్తున్న ఒక కుటుంబం లోని ఒక మహిళ మంచం మీద నిస్సత్తువగా పడి ఉన్నది. ఆమె శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఆమెకు మలేరియా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తది.
ఆమె మల్లోక మల్క తన సంచిలకి చెయ్యిపెట్టింది, ఈ తాప ఇంట్రావీనస్ (IV) ద్రావణం - 500 ml డెక్స్ట్రోస్ సెలైన్ బాటిల్ కోసం వెదికింది. ఆ మహిళ మంచం దగ్గరికి వెళ్లి, ఆమె పైకప్పు మీదుగా వేలాడుతున్న దూలం చుట్టూ ప్లాస్టిక్ తాడును చుట్టుకుంటా సెలైన్ బాటిల్‌ను ఆకట్టుకునే వేగంతో దానికి కట్టింది.
35 ఏండ్ల జ్యోతి ప్రభ కిస్పొట్టా, గత 10 సంవత్సరాలుగా జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని గ్రామాలల్ల వైద్య సేవలను అందిస్తున్నది. అయితే ఆమె అర్హత కలిగిన డాక్టరమ్మనో లేదా శిక్షణ పొందిన నర్సో కాదు. ఆమెకు ఏ ప్రభుత్వ దవాఖాన లేదా ఆరోగ్య సంరక్షణ కేంద్రంతో సంబంధం లేదు. కానీ ఓరాన్ తెగకు చెందిన ఈ యువతి పశ్చిమ సింఘ్‌భూమ్‌లోని ఆదివాసీలు ఎక్కువగా ఉండే గ్రామాల ప్రజలకు మొదటి దిక్కు, చాలా సార్లు ఆమె వారి చివరి ఆశ కూడా.
గ్రామీణ భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ చేపడుతున్నది దాదాపు 70 శాతానికి పైగా ఈ RMP లే అని ప్రాంతీయ సర్వేలు సూచిస్తున్నయి. అలాంటి అనేక మంది 'RMP'లలో ఆమె ఒకరు. ఇక్కడ RMP అనేది ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు, అయితే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అనివార్యంగా పిలవాల్సిన సంక్షిప్త రూపంగా అనిపిస్తది. అయితే వీరిని జోలా చాప్ (క్వాక్) అని వైద్యులు ఎగతాళిగా పిలుస్తరు. గ్రామీణ భారతదేశంలో సమాంతరంగా ప్రైవేట్ హెల్త్‌కేర్ సర్వీస్‌ను నడుపుతున్న ఈ అర్హత లేని వైద్య అభ్యాసకులు అకడమిక్ లిటరేచర్‌లో 'క్వాక్స్'గా అవహేళన చేయబడుతరు. అంతేగాక, వీరు చేసే ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ విధానాలలో కూడా ఎక్కువ సందిగ్ధతతో చూస్తరు.
RMPలు తరచుగా భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన వైద్య మండలిలో నమోదు చేసుకోరు. అయితే వాళ్ళల్లో కొందరు హోమియోపతి లేదా యునాని వైద్యులుగా నమోదు చేసుకొని ఉంటారు, కానీ తమ వైద్యంలో అల్లోపతి మందులను వాడుతారు, లేదా రోగులకు అవే మందులను పంపిణీ చేస్తరు.
జ్యోతికి అల్లోపతి మెడిసిన్‌లో RMP సర్టిఫికేట్ ఉన్నది. దీనిని ఆమె, బీహార్ ప్రభుత్వంచే రిజిస్టర్ చేయబడింది అని చెప్తున్న 'కౌన్సిల్ ఆఫ్ అన్ ఎంప్లాయ్డ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్' అనే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ లో ఆరు నెలల కోర్సు పూర్తి చేసింది. అందుకు ఆమె 10,000 రూపాయల కట్టినది. ఆ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు అయితే నడుస్త లేదు.
*****
జ్యోతి IV బాటిల్ ఖాళీ అయ్యే దాకా ఎదురు చూసి, ఆ తరవాత రోగి స్నేహితురాలికి కొన్ని మందులను ఇచ్చి అవి వాడే విధానం చెప్పింది.. అయితే అక్కడి చెడిపోయిన రోడ్ల కారణంగా 20 నిమిషాల దూరంలో పార్క్ చేసిన ఆమె బైక్ వద్దకు మేము తిరిగి వెళ్ళాము.
పశ్చిమ సింఘ్ భూమ్ జిల్లాలో ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నది, అయితే ఆ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు అందించండంలో చాలా వెనుకబడి ఉన్నది. ముఖ్యంగా ఆసుపత్రులు, స్వచ్ఛమైన తాగునీరు, విద్యా సౌకర్యాలు మరియు ఉపాధి కల్పన వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. ఇది జ్యోతి స్వస్థలం - చుట్టూ అడవులు, పర్వతాలతో కూడిన మారుమూల ప్రాంతమే కాకుండా ఇది రాష్ట్రం-మావోయిస్ట్ వివాదం అధికంగా ఉన్న సమస్యాత్మక ప్రాంతంగా కూడా పేరున్నది. అందుకే ఇక్కడ కొన్ని రహదారులు కూడా సరిగా లేవు. ఇక మొబైల్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉంటది, లేదా కొన్ని ప్రాంతాల్లో అది కూడా లేదు. కాబట్టి తరచుగా, అక్కడ ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి చేరుకోవడానికి నడక మాత్రమే ఏకైక మార్గం. అయితే అత్యవసర సమయాల్లో, గ్రామస్థులు ఆమెను తీసుకురావడానికి సైకిళ్లపై ఎవరినో ఒకరిని పంపుతరు.
జ్యోతి, బోరోటికా గ్రామంలోని, పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని గోయిల్‌కేరా బ్లాక్‌కి వెళ్లే సన్నని రోడ్డు అంచున ఉన్న చిన్న మట్టి ఇంట్లో నివసిస్తుంది. ఈ విలక్షణమైన ఆదివాసీ ఇంట్లో మధ్యలో ఉన్న గదికి అన్ని వైపులా వరండాలు ఉన్నయి. వరండాలో ఒక భాగం వంటగదిలా ఏర్పాటుచేసుకున్నరు. గ్రామంలో కరెంటు సక్రమంగా లేకపోవడంతో ఆమె ఇల్లు ఎక్కువ చీకటిగా ఉన్నది.
ఈ గ్రామంలోని చాలా ఆదివాసీ ఇళ్లకు కిటికీలు ఉండవు. అందువలన ప్రజలు పగటిపూట కూడా ఇంట్లో ఒక మూలకు చిన్న టార్చ్ లైట్ లేదా లాంతరును ఏర్పాటు చేసుకుంటరు. జ్యోతి భర్త 38 ఏండ్ల సందీప్ ధన్వర్, కూడా RMP గానే పనిచేస్తడు. ఆమె 71 ఏళ్ల తల్లి, జూలియాని కిస్పొట్టా, ఇంకా ఆమె సోదరుని ఎనిమిదేళ్ల కొడుకు జాన్సన్ కిస్పొట్టాతో కలిసి ఇక్కడ నివసిస్తున్నది.
సైకిల్ మీద వచ్చిన ఒకాయన జ్యోతిని గురించి అడుగుకుంటూ ఇంటి దగ్గరకు వస్తున్నడు. అది విన్న ఆమె తను తినేది విడిచిపెట్టి, కొత్తగా వచ్చిన పేషెంట్ దగ్గరకు పోవడానికి అత్యవసరంగా తన సంచీని సర్దుకుని పట్టుకుంది. తన కూతురు బయటకుపోవడానికి తయారవుడూ చూసుకుంటా “ భట్ ఖాయ్ కే తో జాతే (కనీసం నీ మధ్యాహ్న భోజనమైనా పూర్తి చేయమ్మా),” అని జూలియానీ సద్రీ భాషలో అంటున్నది. “నేను ఎక్కడికైనా మధ్యలో తింటా కానీ, ప్రస్తుతం రోగి ముఖ్యం. నేను వెళ్ళాలి," అని జ్యోతి చెప్పింది. ఆమె తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు తలుపు లోపల ఒక అడుగు బయట ఒక అడుగు ఉంది. ఇది వారి ఇంట్లో తరచుగా కనపడే దృశ్యం.
బోరోటికా, హుటుటువా, రంగమతి, రోమా, కంది, ఒసంగితో సహా హెర్టా పంచాయత్ లోని 16 గ్రామాలల్లా జ్యోతి పనిచేస్తది. అవన్నీ కూడా 12 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నయి. గ్రామాల్లోకి వెళుతున్నప్పుడు ఒక్కోక్కసారి ఆమె కొద్ధి దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటది. అంతేకాక ఒక్కొక్కసారి ఆమెను అదనంగా, రుంధికొచా మరియు రోబ్‌కేరా లాంటి ఇతర పంచాయతీలలో ఉన్న గ్రామాల మహిళలకు వైద్యసేవలు అందించడానికి పిలుస్తరు.
*****
అది 2009 వ సంవత్సరం. అప్పుడు నేను నా మొదటి బిడ్డతో గర్భవతిని అయ్యాను, ”అని 30 సంవత్సరాల వయస్సులో ఉన్న గ్రాసి ఎక్కా, కష్ట సమయంలో జ్యోతి తనకు ఎట్లా సహాయం చేసిందో మాకు చెప్పింది. ఆమె బోరోటికాలోని తన ఇంట్లో మాతో మాట్లాడుతున్నది. “నాకు అర్ధరాత్రి పాప పుట్టింది. ఆ సమయంలో మా ముసలి అత్త కాకుండా నాతో ఉన్న ఏకైక మహిళ జ్యోతి. ఆరోజు ప్రసవం తర్వాత నాకు విపరీతమైన విరేచనాలు అయినయి. ఇంకా చాలా బలహీనంగా ఉన్నాను. దాంతోటి నేను స్పృహ కోల్పోయినను. జ్యోతి నన్ను అన్ని విధాలా చూసుకున్నది.”
ఆ రోజుల్లో గ్రామాన్ని కలుపుతూ రవాణా సదుపాయాలు లేక సరైన రోడ్లు లేకుండే. అప్పుడు గ్రేసీని 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న చైబాసాకు తీసుకపోయి, ప్రభుత్వ నర్సు జరానాటి హెబ్రామ్‌ను సంప్రదించే వరకు జ్యోతి స్థానిక మూలికలపైనే ఆధారపడ్డది. ఆ కొత్త తల్లి కోలుకుని తిరిగి నిలద్రొక్కుకోవడానికి ఒక సంవత్సరం పట్టింది. "జ్యోతి అప్పుడే పుట్టిన నా పసిగుడ్డును పాలు పట్టించడం కోసం గ్రామంలోని ఇతర పాలిచ్చే తల్లుల దగ్గరికి తీసుకుపోయేది",అని గుర్తుకు చేసుకున్నది గ్రేసీ. "ఆమె లేకపోతే నా బిడ్డ బతికేది కాదు." అని చెప్పింది.
ఇక్కడ రెండు సంవత్సరాల నుండి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది, అక్కడికి ఒక నర్సు వారానికి ఒకసారి మాత్రమే వస్తది అని గ్రేసి భర్త, 38 సంవత్సరాల సంతోష్ కచ్చప్ చెప్పారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జ్యోతి ఇంటికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ ఇది ఎటువంటి సౌకర్యాలను అందించదు. “నర్సు ఊర్లో ఉండదు. ఆమె వచ్చినప్పుడు మాత్రం జ్వరం వంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవాళ్లను తనిఖీ చేస్తుంది. నర్సు రోజు రిపోర్టు పంపాలి, కానీ గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు కాబట్టి ఆమె ఇక్కడ ఉండదు. జ్యోతి ఇక్కడే గ్రామంలో నివసిస్తుంది, అందుకే ఆమె చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ”అని ఆయన చెప్పారు. గర్భిణులు పీహెచ్‌సీకి రావడం లేదు. ఇంట్లోనే ప్రసవించేందుకు జ్యోతిని ఆశ్రయిస్తరు.
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని పిహెచ్‌సిలు ఇప్పటికి కూడా పనిచేస్తలేవు. గోయిల్‌కెరా బ్లాక్‌లోని ఆసుపత్రి బోరోటికా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆనందపూర్ బ్లాక్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన పిహెచ్‌సి కూడా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటది. అక్కడికి పోవాలంటే ఒక చిన్న 12-కిలోమీటర్ల దారి బోరోటికా నుండి సెరెంగ్డా గ్రామం మీదుగా వెళ్లి కోయెల్ నది దగ్గర ఆగిపోతది. ఎండాకాలం అయితే, ప్రజలు ఆనందపూర్ చేరుకోవడానికి తక్కువ వరద ఉన్న నదిని దాటుకుని నడుస్తరు. కానీ వర్షాకాలంలో, నది పొంగి ప్రవహిస్తుంది. దాంతో నదిని దాటలేరు. పోవడానికి దారి ఉండదు., దీనితోటి హేర్టా పంచాయత్ లోని గ్రామాల ప్రజలు ఆనంద్‌పూర్‌కు వెళ్లడానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఎక్కువగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తది. నది నుండి ఆనంద్‌పూర్ వరకు, అక్కడక్కడ తెగి కొట్టుకుపోయిన తారు రోడ్డు, రాళ్లు, బురద మట్టి ఉండే దారిలో దాదాపు 10 కిలోమీటర్ల వరకు అడవిమార్గంలో పోవాలి.
ఇక్కడ నుండి చక్రధర్‌పూర్ నగరానికి వెళ్లేటందుకు ఒక బస్సు ఉండేది, కానీ అది ఒక ప్రమాదం తర్వాత ఆగిపోయింది. అప్పట్నుంచి ప్రజలు ప్రయాణాలకు సైకిళ్లు మరియు మోటర్ బైక్‌లపైన్నే ఆధారపడుతున్నరు. అవి కూడా లేకపోతే నడిచిపోతరు. ఇది గర్భిణీ స్త్రీలు ఏమాత్రం చేయ్యలేని ప్రయాణం. ఇక్కడ ఆనంద్‌పూర్ పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాలు మాత్రమే జరుగుతయి. గర్భం క్లిష్టంగా, ప్రమాదకరంగా ఉంటే లేదా ఆపరేషన్ అవసరమైతే, మహిళలు ఆనంద్‌పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనోహర్‌పూర్‌కు వెళ్లాలి లేదా 60 కిలోమీటర్ల దూరంలో ఒడిశాలో ఉన్న రూర్కెలాకు రాష్ట్ర సరిహద్దును దాటిపోవాలి..
"చిన్నప్పటి నుండి నేను చూస్తున్న, స్త్రీలు అనారోగ్యం పాలైనప్పుడు చాలా నిస్సహాయంగా ఉంటారు," అని జ్యోతి చెప్పింది. “[నగరాలు మరియు పట్టణాలలో] సంపాదించడానికి పురుషులు బయటకు వెళతరు. పట్టణాలు, ఆసుపత్రులు గ్రామం నుండి చాలా దూరంగా ఉన్నయి. దానికి తోడు తరచుగా స్త్రీల పరిస్థితి మరింత దిగజారుతంది. ఎందుకంటే వాళ్ళు తమ భర్తలు తిరిగి వస్తరని ఎదురుచూస్తరూ.. చాలా మంది ఆడవాళ్లకు, వాల్ల భర్తలు గ్రామంలో నివసిస్తున్న కూడా ఎటువంటి సహయం ఉండదు. ఎందుకంటే మగవాళ్ళు తరచుగా తాగి, కడుపుతో ఉన్న సమయంలో కూడా వారి భార్యలను కొడతరు, ”అని ఆమె చెప్పింది.
"పూర్వం ఈ ప్రాంతంలో ఒక దై-మా (దాయమ్మా) (మంత్రసాని) ఉండేది. ప్రసవ సమయంలో మహిళలకు ఆమె మాత్రమే ఆసరాగా ఉండేది. కానీ ఎవరో ఆమెను ఒక గ్రామ ఉత్సవంలో చంపారు. ఇంకా ఆమె తర్వాత అంత నైపుణ్యం ఉన్న మహిళ ఈ ఊరిలో మరొకరు లేరు’’ అని చెప్పారు జ్యోతి.
ప్రతి గ్రామంలో ఒక అంగన్‌వాడీ సేవిక ( కార్యకర్త), ఒక సహాయక( సహాయకురాలు) ఉన్నరు. అంగన్వాడీ కార్యకర్త గ్రామంలోని పిల్లల రికార్డులను నమోదు చేస్తది, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వారి శిశువుల ఆరోగ్యాన్ని సమీక్షిస్తది. సహాయకురాలు గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో సహాయం చేస్తది. అయితే రోగి ఆమె ఆహారం, రవాణా, బస ఖర్చులను భరించాలి. కాబట్టి ప్రజలు సహాయకురాలు కంటే జ్యోతిని సంప్రదించడానికే ఇష్టపడుతున్నరు. ఎందుకంటే జ్యోతి ఎప్పుడూ ఇంటింటికి వెళ్లి చూస్తున్నందుకు విడిగా ఎలాంటి చార్జీలు వసూలు చేయదు, కానీ మందుల కోసం మాత్రమే తీసుకుంటది.
ఈ గ్రామాల్లోని చాలా కుటుంబాలు వర్షాధార వ్యవసాయం, కూలీ పనులపై ఆధారపడి బతుకుతున్నరు. అదే వాళ్ళ ప్రధాన ఆదాయం. పశ్చిమి సింగ్‌భూమ్ జిల్లాలోని గ్రామీణ జనాభాలో 80 శాతానికి పైగా సాధారణ లేదా వ్యవసాయ కూలీలు (సెన్సస్ 2011 ప్రకారం)గా జీవిస్తున్నరు. వీళ్ళలో చాలా కుటుంబాల నుండి పురుషులు పని కోసం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళతరు.
*****
NITI అయోగ్ యొక్క 'జాతీయ బహుమితీయ పేదరిక సూచిక' నివేదిక ప్రకారం, పశ్చిమ సింఘ్‌భూమ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యేతర సూచికల ఆధారంగా దాదాపు 64 శాతం మంది ప్రజలు ‘బహుకాల పేదలుగా’ మిగిలిపోయినరు. ఇక్కడ తరచుగా ఉచిత ప్రభుత్వ సౌకర్యాలను పొందడానికి అధిక ఖర్చులు చేయడమా లేక ఒక RMP ద్వారా అందించబడే ఖరీదైన మందులు కొనడమూ అనే విషయాలను బట్టి ప్రజలు ఎంచుకోవలసి ఉంటది. జ్యోతి తన ఫీజును కొంతకాలం పాటు వాయిదాల రూపంలో తీసుకుంటది కాబట్టి ప్రజలు కూడా ఆమె ఫీజులను కొంత కాల వ్యవధిలో చిన్న వాయిదాలలో చెల్లించడాన్ని అంగీకరిస్తరు.
రోగులు ఆస్పత్రికి చేరుకునే అలస్యాన్ని తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సౌకర్యాలకు ఉచిత సేవల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది - మమతా వాహన్ లు, సాహియా — జిల్లా ఆసుపత్రుల్లో కాల్ సెంటర్ లు, ఇవన్నీ అటువంటియే. గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసిన రవాణా వ్యాన్ గురించి జ్యోతి మాట్లాడుతూ, “ప్రజలు మమతా వాహనం కోసం ఫోన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. కానీ చాలా సార్లు గర్భిణీ స్త్రీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అనుమానించినట్లయితే వ్యాన్ డ్రైవర్ తన బండిలో తీసుకుపోవడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే తన వాహనంలో ఒక మహిళ చనిపోతే ఆ డ్రైవర్ ప్రజల ఆగ్రహానికి గురి అవుతడు.”
మరోవైపు జ్యోతి ఇంట్లోనే మహిళలకు ప్రసవం అవ్వడానికి సహాయం చేస్తుంది. ఆ సహాయం అందించినందుకు ఆమె దాదాపు 5,000.రూపాయిలు తీసుకుంటది. సెలైన్ బాటిల్ పెట్టడానికి 700-800 తీసుకుంటది ఇది మార్కెట్‌లో 30 రూపాయిల ఖరీదు ఉంటుంది. మలేరియా చికిత్సకు డ్రిప్ లేకుండా 250, న్యుమోనియా మందులకు 500-600 దాకా, కామెర్లు లేదా టైఫాయిడ్ చికిత్సకు రూ. 2,000-3,000 చొప్పున తీసుకుంటది. ఒక నెలలో జ్యోతికి దాదాపు 20,000 రూపాయల దాకా వస్తయి. అయితే అందులో సగం డబ్బులు మందులు కొనడానికి అయిపోతయి.
2005లో ప్రతిచీ (ఇండియా) ట్రస్ట్ ప్రచురించిన ఒక నివేదిక , గ్రామీణ భారతదేశంలో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీల మధ్య ఆందోళన కలిగించే బంధం ఉన్నదని గమనించింది. "పిహెచ్‌సిలు, ఇతర ప్రజారోగ్య సేవా విభాగాలు తీవ్రమైన మందుల కొరతతో బాధపడుతున్నప్పుడు, ఈ భారీ ప్రైవేట్ డ్రగ్ మార్కెట్ ఇంకా ఎప్పటికప్పుడు వైద్యులు అనైతిక పద్ధతులు ఉపయోగించడం, ప్రచారం చేయడం జరుగుతోంది. ఒక నియంత్రణ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ ఖర్చును, లాభాలను సామాన్య ప్రజల నుండి దండుకుంటున్నరు.” అని నివేదిక పేర్కొంది.
2020లో జార్ఖండ్ ముఖ్యమంత్రిచే నియమించబడిన రాష్ట్ర ఆరోగ్య సమీక్ష , సేవల అందుబాటు పరంగా చూసినప్పుడు, రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క భయంకరమైన నిస్సహాయకరమైన నిజాల్ని బయటపడ్డాయి. ఈ సమీక్ష ప్రకారం 3,130 ఆరోగ్య ఉప కేంద్రాలు, 769 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు 87 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల కొరతను ఉన్నట్టు తెలిసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి లక్షమంది జనాభాకు కేవలం 6 మంది వైద్యులు, 27 పడకలు, 1 ల్యాబ్ టెక్నీషియన్, దాదాపు 3 నర్సుల దాకా మాత్రమే ఉన్నారు. అలాగే, 85 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నయి.
దాదాపు గత దశాబ్ద కాలం నుంచి ఈ పరిస్థితి మారడం లేదు. జార్ఖండ్ ఎకనామిక్ సర్వే 2013-14 ప్రకారం పీహెచ్‌సీల సంఖ్యలో 65 శాతం, సబ్ సెంటర్లలో 35 శాతం, సీహెచ్‌సీల్లో 22 శాతం కంటే ఎక్కువ కొరత ఉన్నట్లు గుర్తించింది. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ల కొరత అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటిగా ఆ నివేదిక పేర్కొంది. సిహెచ్‌సిలలో ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టులు, శిశువైద్యులలో 80 నుండి 90 శాతానికి పైగా లోటును ఆ నివేదిక గుర్తించి దృవీకరించింది.
నేటికీ, రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి ఆసుపత్రి ప్రసవాలు అందుబాటులో లేవు. అవసరమైన దానికంటే 5,258 దాకా వైద్యులు తక్కువగా ఉన్నరు. అంతేకాదు 3.29 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో (2011 జనాభా లెక్కలు), అన్ని ప్రజారోగ్య సౌకర్యాలలో 2,306 మంది వైద్యులు మాత్రమే ఉన్నరు.
అటువంటి అసమానమైన ఆరోగ్య సంరక్షణ డెలివరీ వ్యవస్థ ఉన్న ఈ సందర్భంలో RMP లు ఒక ముఖ్యమైన అవసరం. ఎందుకంటే జ్యోతి ఇంటి దగ్గర అయ్యే ప్రసవాలను ప్రసవానంతర సంరక్షణను చూసుకుంటుంది. గర్భిణీ స్త్రీలకు కావలసిన ఐరన్ మరియు విటమిన్ సప్లిమెంట్లను అందిస్తది. ఆమె చిన్న,పెద్ద ఇన్ఫెక్షన్లకు, చిన్న చిన్న గాయాలకు వైద్యం చేస్తది. చాలాసార్లు ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ సేవలను కూడా అందిస్తది. సంక్లిష్టమైన సందర్భాల్లో, ఆమె రోగిని ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేస్తుంది, రవాణాకు కూడా ఏర్పాట్లు చేస్తది లేదా ప్రభుత్వ నర్సుతో మాట్లాడిపిస్తది.
*****
జార్ఖండ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యుడు వీరేంద్ర సింగ్, పశ్చిమ సింఘ్‌భూమ్‌లోనే 10,000 మంది దాకా RMPలు ప్రాక్టీస్ చేస్తున్నరని అంచనా వేసినరు. వీరిలో 700 మంది మహిళలు ఉన్నట్టు చెప్పారు. "ఆనంద్‌పూర్‌లో ఉన్నటువంటి కొత్త పిహెచ్‌సిలకు డాక్టర్లు లేరు" అని ఆయన చెప్పారు. “ఈ ప్రదేశమంతా నర్సులచే నడుపబడుతున్నది. జ్యోతి లాంటి ఆర్‌ఎంపీలు తమ గ్రామాలను చూసుకుంటరు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అయినా వాళ్ళు ప్రజలతో కలిసి ఉండడం వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలను అర్థం చేసుకుంటరు. కాబట్టి ప్రజలతో కనెక్ట్ అయ్యారు. మీరు వారి పనిని ఎలా కాదనగలరు..? ” అని అడుగుతడు ఆయన.
హెర్టా గ్రామానికి చెందిన 30 ఏళ్ల సుసారి టోప్పో మాట్లాడుతూ, 2013 లో తన మొదటి బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు, తన కడుపులో పిండం కదలడం మానేసింది, “నాకు కడుపుల విపరీతమైన నొప్పి వచ్చింది ఇంకా రక్తస్రావం కూడా అయింది. ఎంబడే జ్యోతికి ఫోన్ చేసినము. ఆమె ఆరోజు రాత్రంతా ఇంకా తెల్లవారి రోజు కూడా మాతోనే ఉన్నది. ఆ రెండు రోజుల్లో ఆమె రోజుకు మూడు చొప్పున ఆరు సెలైన్ బాటిళ్లను పెట్టింది. చివరకు, నాకు సాధారణ ప్రసవం జరిగింది.” అని చెప్పింది పాప ఆరోగ్యంగా 3.5 కిలోల బరువు పుట్టింది. జ్యోతికి ఫీజు 5,500 అయితే మా కుటుంబం దగ్గర అప్పుడు కేవలం 3,000 ఉన్నయి. అవి తీసుకుని మిగిలిన మొత్తాన్ని తర్వాత తీసుకోవడానికి ఆమె ఒప్పుకున్నదని సుసారి చెప్పినరు
హెర్టాలోని, ఎలిసాబా టోప్పో, మూడు సంవత్సరాల క్రితం తన 30 ఏళ్ల వయసులోని అనుభవాన్ని వివరిస్తున్నది. “అప్పుడు నేను కవలలకు గర్భవతిని. నా భర్త ఎప్పటిలాగనే పూర్తిగా తాగి ఉన్నడు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి నేను ఆసుపత్రికి వెళ్లాలని అనుకోలేదు ” అని ఆమె చెప్పింది. ఇంటి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుకోవడానికి కూడా పొలాల మీదుగా నడిచి కాలువలు దాటాలి, అని ఆమె చెప్పింది.
ఎలిసాబాకు రాత్రిపూట నొప్పి మొదలయ్యింది. ఆ నొప్పి నుంచి ఉంపశమనం కోసం పొలాల వద్దకు వెల్లింది. అరగంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. తన అత్తగారు ఆమెకు మసాజ్ చేసినా నొప్పి మాత్రం అలాగే ఉంది. “మేము అప్పుడు జ్యోతిని పిలిచాము. ఆమె వచ్చింది, నాకు మందులు ఇచ్చింది. ఆమె వల్లనే నాకు ఇంట్లనే నార్మల్ డెలివరీ ద్వారా కవలలు పుట్టారు. మహిళలకు సహాయం చేయడానికి ఆమె అర్ధరాత్రి సుదూర ప్రాంతాలకు కూడా చేరుకుంటుంది", అని ఆమె చెప్పింది.
RMPలు ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లను విచక్షణారహితంగా ఉపయోగిస్తరు అంటరు. బీహార్‌లోని జార్ఖండ్‌లోని RMPలు దాదాపు అన్ని రకాల జబ్బులకు 'సెలైన్'గా ప్రసిద్ధి చెందిన IV ద్రావణాన్ని ఉపయోగించడాన్ని ప్రతిచీ నివేదిక పేర్కొన్నది. ఇది అనవసరమైనది ఇంకా ఖరీదైనది మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో ప్రతికూలంగా కూడా ఉంటదని ఆ అధ్యయనం గమనించింది. "ఇంటర్వ్యూ చేసిన 'ప్రాక్టీషనర్లు' సెలైన్ లేకుండా ఎటువంటి చికిత్స చేయలేమని గట్టిగా నొక్కిచెప్పారు, ఎందుకంటే 'సెలైన్ శరీరంలో రక్తాన్ని పెంచుతుది, పోషకాన్ని, వేగవంతమైన ఉపశమనంను ఇస్తది,'" అని ఆ నివేదిక పేర్కొన్నది.
ఆమెది ప్రమాదంతో కూడుకున్న పని, కానీ జ్యోతికి అదృష్టం కలిసి వచ్చింది. తన 15 ఏళ్ల సుదీర్ఘ ప్రాక్టీస్‌లో ఎప్పుడూ వైఫల్యం చెందలేదని ఆమె చెప్పింది. “కేసును చూసుకోవడంలో నాకు ఎప్పుడైనా సందేహం ఉంటే, నేను ఎల్లప్పుడూ రోగిని మనోహర్‌పూర్ బ్లాక్ ఆసుపత్రికి పంపుతను. లేదా నేను వారికి మమతా వాహన్‌కి కాల్ చేయడంలో సహాయం చేస్తను., ఇంకా అవసరం అయితే వారిని ప్రభుత్వ నర్సుకు కనెక్ట్ చేయడంలో కూడా నేను సహాయం చేస్తను,” అని ఆమె చెప్పింది.
జ్యోతి దృఢ నిశ్చయంతో తన నైపుణ్యాలను సంపాదించుకుంది. ఆమె సెరెంగ్డాలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నప్పుడే తన తండ్రి చనిపోయినడు. దీనివల్ల ఆమె పాఠశాల విద్యలో పెద్ద విరామం ఏర్పడింది. “ఆ రోజుల్లో నగరం నుండి తిరిగి వచ్చిన ఒక మహిళ, నాకు పని ఇప్పిస్తానని చెప్పి పాట్నాకు తీసుకెల్లింది. ఒక డాక్టర్ దంపతుల వద్ద నన్ను విడిచిపెట్టింది. నేను అక్కడ ఇంటిని ఊడ్చి శుభ్రం చేసేదాన్ని. ఒకరోజు అక్కడి నుంచి పారిపోయి ఊరికి తిరిగొచ్చాను’’ అని జ్యోతి గుర్తుచేసుకుంది.
తరువాత, ఆమె ఆనంద్‌పూర్ బ్లాక్‌లోని చర్బండియా గ్రామంలోని కాన్వెంట్ పాఠశాలలో తన విద్యను తిరిగి ప్రారంభించింది. "డిస్పెన్సరీలో పనిచేస్తున్న సన్యాసినులను చూస్తున్నప్పుడు, నర్సింగ్ లో ఉండే సంతృప్తి మరియు ఆనందాన్ని నేను మొదట అర్థం చేసుకున్నను" అని ఆమె చెప్పింది. “అంతకు మించి చదువుకోలేకపోయాను. మా అన్న 10,000 రూపాయలు ఏర్పాటు చేశాడు. దాంతో నేను ఒక ప్రైవేట్ సంస్థ నుండి అల్లోపతి వైద్యంలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ కోర్సు చేసాను. అదీగాక, ఆమె జార్ఖండ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నుండి సర్టిఫికేట్ కూడా పొందింది. కిరిబురు, చైబాసా మరియు గుమ్లాలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యుల దగ్గర రెండు నుండి మూడు నెలల పాటు సహాయకురాలిగా చేసిన తర్వాత, ఆమె తన సొంత ప్రాక్టీస్ ప్రారంభించేందుకు తన గ్రామానికి తిరిగి వచ్చింది.
హెర్టా పంచాయత్ లో పనిచేసే ప్రభుత్వ నర్సు, జరానాటి హెబ్రం ఇలా అంటోంది: “మీరు బయటి నుంచి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో పని చేయడం చాలా కష్టం. జ్యోతి ప్రభ గ్రామంలో ప్రాక్టీస్ చేస్తున్నది కాబట్టి ప్రజలు కూడా సహాయం చేస్తరు.”
ప్రభుత్వ నర్సులు నెలకు ఒకసారి గ్రామానికి వస్తరు" అని జ్యోతి చెప్పింది. "కానీ ప్రజలు చికిత్స కోసం వారి వద్దకు వెళ్లరు ఎందుకంటే వారు నర్సులను విశ్వసించరు. ఇక్కడి ప్రజలు చదువుకోలేదు. కాబట్టి నమ్మకం, ఇంకా ప్రవర్తన వారికి మరింత ముఖ్యమైన కారకాలు. అవే ఔషధాల కంటే చాలా ఎక్కువ.”
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.
అనువాదం: కవిత పులి