డిసెంబర్ 11న వాళ్ళు కరెంట్ తీగలను తీసేస్తున్నప్పుడు ఒక దుకాణదారుడు ఏడ్చినంత పని చేశాడు. “మా మీద బెంగ పడతానని, మేము లేకపోతే ఒంటరినౌతానని అతను అన్నాడు. మాకు కూడా వీరిని వదిలి వెళ్లడం కష్టంగానే ఉంది. కానీ ప్రస్తుతం రైతుల విజయమే ఒక పెద్ద వేడుక.” అన్నాది గురువిందర్ సింగ్.
అప్పటికే ఉదయం 8.15 అయింది. గురువిందర్ ఇంకా అతని గ్రామం నుండి వచ్చిన ఇతర రైతులు పశ్చిమ ఢిల్లీలోని తిక్రిలో, నిరసన జరిగిన స్థలాలలోని గుడారాలను తీసివేస్తున్నారు. కొన్ని సార్లు వారు అక్కడ ఉన్న వెదురు బద్దలను విరగ్గొట్టడానికి చెక్క బద్దలను, కొన్నిసార్లు గుడారాలకు కింద దన్నుగా ఉన్న పునాదులను విరగగొట్టడానికి ఇటుకలను వాడవలసి వచ్చింది. ఇరవై నిముషాలలో ఇదంతా ఒక కుప్పగా మారింది. వారు అల్పాహార (టీ,పకోడా) విరామం తీసుకున్నారు.
“మేము ఈ గుడారాలని మా చేతులతో కట్టాము. ఇప్పుడు స్వయంగా మా చేతులతోనే వీటిని తీసేస్తున్నాము,” అన్నాడు 34 ఏళ్ళ గురువిందర్. ఇతని కుటుంబం గోధుమ, వరి, బంగాళా దుంపను పంజాబ్లోని లూథియానా జిల్లాలో డాంగియాన్ గ్రామంలో ఆరు ఎకరాల భూమిలో సాగు చేస్తుంది. “ విజయంతో ఇంటికి వెళ్లడం సంతోషంగా ఉంది, కాని ఇక్కడ ఏర్పరచుకున్న బంధాలను వదిలివెళ్లడం కూడా కష్టంగా ఉంది.” అన్నాడు.
“నిరసన మొదలైనప్పుడు ఇక్కడ ఏమి లేదు. మేము ఇక్కడ రోడ్ల పైనే పడుకునేవాళ్ళము. దీనినే ఇంటిగా మార్చుకున్నాము.” అన్నాడు 35 ఏళ్ళ దీదార్ సింగ్, ఈయన గురువిందర్ గ్రామం నుండే వచ్చాడు. ఈయన తన ఏడు ఎకరాల పొలంలో గోధుమ, వరి, బంగాళా దుంప, ఆకుకూరలు పండిస్తాడు. “మేము ఇక్కడ చాలా నేర్చుకున్నాము. ముఖ్యంగా ఒకరితో ఒకరం సోదరభావంతో మెలగడం నేర్చుకున్నాం. మన ప్రభుత్వాలు మనకు ఒకరితో ఒకరు పోట్లాడుకోడమే నేర్పాయి. కాని అందరం - పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ కలిసేసరికి మేమంతా ఒకటే అని అర్థం చేసుకున్నాం.”
“మాకు పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి. మేము సరైన వ్యక్తికే ఓటు వేస్తాము,” అన్నారు గురువిందర్. “మేము మా చేయూతనినిచ్చే వారికే ఓటు వేస్తాము. అధికారంతో మమ్మల్ని మోసం చేసేవారిని కాదు.” అని దీదార్ చెప్పాడు.
డిసెంబర్ 9న, 40 నిరసన తెలుపుతున్న రైతు యూనియన్ల సంఘం అయిన సంయుక్త్ కిసాన్ మోర్చా(SKM), సంవత్సరకాలం పాటు ఢిల్లీ సరిహద్దుల వద్ద సాగిన రైతుల నిరసనను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఇది ప్రభుత్వం ఆ మూడు రైతుల చట్టాలను రద్దు చేసి, వారి ఇతర డిమాండ్లను ఒప్పుకున్నాక జరిగింది.
అయితే వేరే ముఖ్యమైన విషయాలు అలానే ఉన్నాయి- పంటలకు హామీ ఇవ్వబడిన కనీస మద్దతు ధర (MSP), వ్యవసాయ రుణాల గురించి ఆందోళనలు మొదలైనవి, వీటిపై SKM కేంద్రంతో చర్చలు కొనసాగించాలని నిర్ణయించుకుంది.
“మేము ఈ నిరసనను నిలిపివేశాము కానీ ముగించలేదు. సైనికులు సెలవు పై వెళ్ళినట్లే, రైతులం కూడా వెళ్తున్నాము. ప్రభుత్వం మళ్లీ ఇబ్బంది పెడితే మేము రాక తప్పదు,” అన్నారు దీదార్.
“ఒకవేళ ప్రభుత్వం, మళ్ళీ మమ్మల్ని ఇబ్బ్బంది పెడితే(MSP, ఇంకా ఇతర రైతుల విషయాలని) మేము మొదటిసారి వచ్చినట్లే మళ్ళీ వస్తాము,” అని గురువిందర్ చెప్పారు.
డాంగియాన్ గ్రామ నిరసనకారులు కొద్ధి మీటర్ల దూరంలో, హర్యాణా లోని ఫతేబాద్ జిల్లాలో ధాని భోజరాజ్ గ్రామం నుండి వచ్చిన సత్బీర్ గోదారా ఇంకా ఇతరులు ఒక చిన్న ట్రక్లో సామానులు ఎక్కించారు. రెండు పోర్టబుల్ ఫాన్లు, వాటర్ డ్రమ్ములు, రెండు ఎయిర్ కూలర్లు, ఒక టార్పాలిన్, ఐరన్ రాడ్లు ఇక్కడనుండి తీసుకువెళ్తున్నారు.
“ఈ ట్రక్ ని ఊరిలో ఇంకో రైతు పంపించాడు. మేము డీజిల్ కి మాత్రమే ఖర్చు పెట్టవలసి వస్తుంది.” అన్నాడు 44 ఏళ్ళ సత్బీర్. “ఇవన్నీ మా జిల్లాలో ధాని గోపాల్ చౌక్ వద్ద దింపుతారు. మళ్లీ మేము ఇలాంటి పోరాటాన్ని చేయవలసి వస్తే ఎలాగ? అప్పుడు మేము దాని కోసం సిద్ధంగా ఉంటాము. మా డిమాండ్లన్నీ ఇంకా తీర్చలేదు. కాబట్టి మేము ఇవన్నీ ఒకచోట ప్యాక్ చేసి పెట్టి ఉంచుతున్నాము. మేము ప్రభుత్వానికి ఎలా పాఠం చెప్పాలో తెలుసుకున్నాము.” ఆ మాటతో చుట్టూ ఉన్నవారందరూ గట్టిగా నవ్వారు.
మేము ప్రభుత్వానికి సమయం ఇచ్చాము. “మేము MSP కొరకు మళ్ళీ పోరాడవలసి వస్తే పోరాడుతాము. ప్రస్తుతం మా ఆందోళన్ (నిరసన) నిలిపివేశాము, అంతే.” అని సత్బిర్ అన్నాడు. “మాకు ఇదొక ఛారిత్రక సంవత్సరం. మేము వాటర్ కానోన్లను, టియర్ గ్యాస్ ని ఎదుర్కొన్నాము. రోడ్ల మీద బౌల్డర్లు పెట్టి మమ్మల్ని అడ్డుకోడానికి ప్రయత్నించారు. మేము అన్ని ఎదుర్కొని తిక్రికి చేరుకున్నాం.”
డిసెంబర్ 11, శనివారం ఉదయం 9 గంటలకి తిక్రికి ఎందరో రైతులు చేరుకున్నారు. సామాను సర్దుకున్నవారు బయలుదేరడం మొదలుపెట్టారు కూడా. ట్రాక్టర్ ట్రాలీల పై వేసిన పరుపులు, బొంతల, టార్పాలిన్లు ఇంకో ఎన్నో సామానులపై ఎక్కి కూర్చున్నారు. కొందరు ట్రక్కులలో వెళ్తున్నారు. కొందరు కార్లు, బోలెరోలు ఎక్కుతున్నారు.
వారిలో ఎక్కువ మంది నేరుగా వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేని దారి మీదుగా వెళుతుండగా, మరికొందరు ఢిల్లీ-రోహ్‌తక్ రహదారికి (హర్యానాలోని బహదూర్‌ఘర్ నగరానికి సమీపంలో) ఎడమవైపు తిరిగారు.ఇక్కడే భారతీయ కిసాన్ యూనియన్ (BKU, ఏక్తా ఉగ్రహన్) ఉన్నది.
ఝార్ఖండ్ రాష్ట్రం పాకూర్ జిల్లా నుండి వలస వచ్చిన 30 ఏళ్ళ కల్పనా దాసి, అదే రోడ్డులో తన పదేళ్ల కొడుకు ఆకాష్ తో ఉంది. ఆమె బహదుర్గాహ్ లో చెత్త ఏరుకునే పని చేస్తుంది. ఆమెకు ఏదోక రోజున ఈ నిరసనకారులంతా ఇంటికి వెళ్తారని తెలుసు కానీ, ఇప్పుడు బాధ అనిపిస్తుంది అని చెప్పింది. “మేము ఇక్కడ చెత్త ఎత్తుకోడానికి వచ్చినప్పుడల్లా, వారు రోజుకు రెండుసార్లు నాకు కడుపునిండా అన్నం పెట్టి పంపేవాళ్లు.” అన్నదామె.
“ఈ రోడ్డు మీద ట్రాక్టర్లు(రోహతక్ వైపు వెళ్ళేవి)) ప్లాస్టిక్,కాగితం పూలతో, మెరుస్తున్న స్కార్ఫులతో, రిబ్బన్లతో, యూనియన్ జెండాలతో అలంకరించబడి ఉంది. మేము మా ట్రాక్టర్‌లను అలంకరించిన తర్వాత వాటిని తీసుకెళుతున్నాము ఇదొక పెళ్లి ఊరేగింపులా వేడుకలా కదులుతాము” అని పంజాబ్‌లోని మోగా జిల్లా దాలా గ్రామానికి చెందిన 50 ఏళ్ల సిరిందర్ కౌర్ చెప్పారు. ఒక ట్రాక్టర్-ట్రాలీలో ఆమె కుటుంబంలోని పరుపులు, వంటగది పాత్రలు, ఇంకా మరెన్నో ఎక్కించారు, మరొక ట్రాలీని పురుషులు ప్రయాణించడానికి ఉపయోగిస్తున్నారు, మహిళలు క్యాంటర్ ట్రక్కు ఎక్కారు.
“వందల ట్రాక్టర్లు మొదట మోగాలోని బుట్టార్‌కు చేరుకుంటాయి, మా గ్గ్రామం కంటే రెండు-మూడు గ్రామాల ముందు ఉంది అది. అక్కడ మమ్మల్ని అందరూ పూలతో స్వాగతిస్తారు, ఆపై మేము చివరకు మా గ్రామానికి చేరుకుంటాము, ”అని సిరిందర్ చెప్పారు. దాలా గ్రామంలోని నాలుగు ఎకరాల్లో ఆమె కుటుంబం వరి, గోధుమలు, శనగలను సాగు చేస్తారు. ఆమె స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు [డిసెంబర్ 11 వరకు], “నా అన్నదమ్ముల్లో ఒకరు తిక్రీ వద్ద, ఒకరు సింగు సరిహద్దు వద్ద నిరసనలు చేస్తున్నారు. నా కుటుంబం ఇక్కడ [బహదూర్‌ఘర్‌లోని రోహ్‌తక్ రహదారి వద్ద] ఉంది. మాది యోధుల కుటుంబం, ఈ పోరాటంలో కూడా విజయం సాధించాం. మా డిమాండ్ [మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే] నెరవేరింది, ఇప్పుడు మేము మా యూనియన్ [BKU ఏక్తా ఉగ్రహన్] చెప్పినట్లు చేస్తాము.”
సమీపంలోని మరో ట్రాలీలో, మోగా జిల్లా, పంజాబ్‌లోని బద్ని కలాన్ గ్రామానికి చెందిన 48 ఏళ్ళ కిరణ్‌ప్రీత్ కౌర్, అలసిపోయి కనిపించింది. “మేము ఒక గంట మాత్రమే నిద్రపోయాము. నిన్నటి నుంచి సర్దుకుంటున్నాం’’ అంది. "విజయోత్సవం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది."
ఆమె గ్రామంలో, ఆమె కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉంది, అక్కడ వారు గోధుమ, వరి, మొక్కజొన్న, ఆవాలు, బంగాళదుంపలు పండిస్తారు., "చాలామంది శాంతియుతంగా ఎలా నిరసన తెలియజేయాలో నేర్చుకున్నారు, కాని వారు తమ హక్కుల కోసం పోరాడినప్పుడు, వారు గెలవగలరు" అని ఆమె చెప్పింది.
బయలుదేరే ముందు, కిరణ్‌ప్రీత్ మాట్లాడుతూ, ఆమె, ఇతరులు రోడ్లపై వారు ఆక్రమించిన భూమిని శుభ్రం చేశారు. “నేను ఇక్కడి భూమికి నమస్కరించాను. ఈ భూమి నిరసన తెలిపేందుకు మాకు అవకాశం కల్పించింది. మీరు ఆరాధించే భూమి మాత్రమే మీకు తిరిగి ఏమైనా ఇస్తుంది.”
బహదూర్‌ఘర్‌లోని BKU యొక్క ప్రధాన వేదిక దగ్గర, యూనియన్ కోసం బటిండా జిల్లా మహిళా నాయకురాలు పరమ్‌జిత్ కౌర్ ప్రతిదీ ట్రాలీల్లోకి అమర్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. దాదాపు 60 ఏళ్ల పరమ్‌జిత్ రోడ్డు డివైడర్‌పై ఉన్న భూమిని కూడా తొలగించారు, అక్కడ ఆమె బంగాళదుంపలు, టమోటాలు, ఆవాలు, ఆకు కూరగాయలు పండించింది. (చూడండి: తిక్రీ రైతులు: ‘ఇవన్నీ జీవితాంతం గుర్తుంచుకుంటాం’ .) “నేను వాటిని [పంటలు] కోసి ఇక్కడి కూలీలకు కూరగాయలు ఇచ్చాను,” అని ఆమె చెప్పింది. “మేము కొన్ని వస్తువులను మాత్రమే ఇంటికి తీసుకువెళుతున్నాము. మిగిలిపోయిన చెక్కని, టార్పాలిన్ ని ఇక్కడ పేదవారికి వారి ఇళ్లు కట్టుకోవడానికి ఇచ్చేశాము.”
ఈ రాత్రి, మా ట్రాలీ దారిలో ఏదైనా గురుద్వారా వద్ద ఆగుతుంది, మరుసటి రోజు ఉదయం మళ్లీ కదలడం ప్రారంభిస్తుంది, అని ఆమె చెప్పింది. “మా గ్రామస్తులు మాకు స్వాగతం పలుకుతారు. మా భూమిని కాపాడుకున్నామని సంబరాలు చేసుకుంటాం. అయినా మా పోరాటం ఆగదు. మేము రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటాము, తరవాత పంజాబ్ నుండే మా ఇతర డిమాండ్ల కోసం పోరాడుతాము.”
ఆమె మాట్లాడుతుండగా, తమ ట్రాక్టర్-ట్రాలీలు, ట్రక్కులు మరియు ఇతర వాహనాలపై నిరసన తెలుపుతున్న రైతుల కాన్వాయ్ వారి ఇంటికి వెళుతున్నాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు హర్యానా పోలీసులను మోహరించారు. నిరసన స్థలం మొదలులో, పంజాబ్ కిసాన్ యూనియన్ వేదికకు కొద్ది దూరంలో, వ్యవసాయ నిరసనకారులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆపడానికి గత సంవత్సరం అక్కడ ఉంచిన బండరాళ్లను బద్దలు కొట్టే ఒక JCB యంత్రం ఉంది.
సుమారు ఉదయం 11 గంటల సమయానికి, తిక్రీ మైదానం నుండి ప్రతిదీ ఖాళీ చేయబడింది, ఇంకా కొంతమంది నిరసనకారులు మాత్రమే మిగిలారు. వీరు కూడా ఇక వారి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఒక సంవత్సరం పాటు ‘కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్’ నినాదాలతో ప్రతిధ్వనించిన నిరసన వేదిక నిశ్శబ్దంగా ఉంది. వేడుకలు, నినాదాలు రైతుల గ్రామాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి - అక్కడ వారు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నారు.
అనువాదం: అపర్ణ తోట