కరోనా వైరస్ గురించి ఇచ్చిన మొదటి ఉపన్యాసం ద్వారా మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే, జనాలచేత ప్లేటులు, గరిటెలు తెగ మోగించేలా చేసి దెయ్యాలని, భూతాల్ని తరిమికొట్టారు. ఇక రెండో ఉపన్యాసం ద్వారా ఏకంగా మననే బెదరగొట్టారు.

సామాన్య ప్రజలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి రాబోయే వారాల్లో ఆహారం, నిత్యావసరాలు ఎలా దొరుకుతాయనే విషయం మీద ఒక్కమాట కూడా చెప్పని ఆ ఉపన్యాసం భయాందోళనలకి తెర తీసింది. మధ్యతరగతి వాళ్ళు సూపర్ మార్కెట్లు, షాపుల మీద గుంపులుగా ఎగబడ్డారు. పేదవాళ్ళకి, నగరాన్ని వదిలి వెళ్తున్న వలసకూలీలకి ఇది వీలయ్యే పని కాదు. చిన్న దుకాణాదారులకి, ఇళ్ళల్లో పని చేసేవాళ్ళకి, వ్యవసాయకూలీలకి కూడా ఈ అవకాశం లేదు. రబీ పంట కోతలు పూర్తవకో, కోసిన పంటని అమ్ముకోలేకనో ఇబ్బంది పడే రైతులకీ ఇది వీలు కాదు. అట్టడుగున ఉన్న, వెనకబడ్డ వర్గాలకి చెందిన కోట్లమంది భారతీయులకి ఇలా నిత్యావసరాలకోశం కొట్ల మీద ఎగబడే సౌకర్యం లేదు.

నిన్న, అంటే మార్చి 26 న, ఆర్థికమంత్రి ప్రకటించిన సహాయనిధిలో కాస్త ఊరటనిచ్చే ఒకే ఒక్క విషయం ఏంటంటే- ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఇచ్చిన 5 కిలోల ఉచిత బియ్యం లేక గోధుమలతో పాటు, ఒక మూడు నెలల పాటు మనిషికి ఐదుకిలోల చొప్పున ఉచిత ధాన్యాలు ఇస్తామని చెప్పడం. ఇప్పటికే ఇస్తున్న ఐదుకిలోలు ఇప్పుడు కూడా ఉచితమేనా లేక వాటికి డబ్బులు కట్టాలా  అనే విషయం మీద ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ దానికి డబ్బులు కట్టాల్సివస్తే ఈ పథకం వల్ల  ఉపయోగం లేనట్టే. ఈ పాకేజ్ లో ఇచ్చిన నిధులు చాలావరకు ఇదివరకే అమలులో ఉన్న పథకాలకి సంబంధించినవే. MGNREGA కింద పెంచాల్సిన 20 రూపాయల కూలీ ఎలాగూ ఇప్పటికే బకాయి ఉంది. అయితే అదనపు రోజుల కూలి గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు పనికి వెళ్ళడం మొదలుపెడితే సామాజికదూరం పాటిస్తూ చేయగలిగే పనులు ఏముంటాయి? అందరికీ సరిపోయేంత పని కల్పించాలంటే ఎన్నిరోజులు పడుతుంది? వాళ్ళ ఆరోగ్యం పనికి సహకరిస్తుందా? ఈ గండం గడిచి గట్టెక్కేవరకూ ప్రతి కూలీకి, ప్రతి రైతుకి, పని ఉన్నా లేకున్నా MGNREGA ప్రకారం వేతనం ఇవ్వక తప్పదు.

PM-KISAN కింద ప్రకటించిన 2,000 రూపాయల సహాయం ఇప్పటికే అమలులో ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేముంది? ఆ డబ్బుని త్రైమాసికంలోని చివరి నెలలో ఇచ్చేబదులు ఇప్పుడు మొదటి నెలలో ఇస్తామనడం ఒక్కటే తేడా. ఈ ప్రపంచవ్యాధికి స్పందిస్తూ, లాక్డౌన్ లో సహాయం కోసం ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన 1.7 లక్షల కోట్ల పాకేజ్ లో దేనికెంత పంచారు అనేది ఎక్కడా చెప్పలేదు. ఈ పాకేజ్ లో కొత్తగా చేర్చిన అంశాలేవి అనేది కూడా మనకి తెలియదు. ఎంతవరకూ ఇప్పటికే ఉన్న పాత పథకాలను కొత్త పేర్లతో కలిపి ఈ అంకెలు చూపిస్తున్నారు? వీటిని అత్యాసవర చర్యలు అని ఎలా పిలవగలం? పైగా పెన్షనర్లకి, విధవలకి, వికలాంగులకీ రాబోయే మూడు నెలలకీ కలిపి 1,000 రూపాయాలిస్తారట, అదీ రెండు వాయిదాల్లో! ఇదే మూడు నెలలకీ 20 కోట్ల మంది ఆడవాళ్ళకి జన ధన యోజన కింద 500 రూపాయిలు వస్తాయి. ఇదంతా నామమాత్రపు, కంటి తుడుపు ఉద్ధరణ కార్యక్రమంలాగా అసహ్యంగా ఉంది.

స్వయం సహాయక సంఘాలకి ఎక్కువ అప్పులివ్వడం వల్ల పరిస్తితి ఏమీ మెరుగవ్వదు. ఇప్పటికే ఉన్న అప్పు వాళ్ళకి పీడకలలాగా తయారయింది. దూర ప్రదేశాలలో ఇరుక్కుపోయి సొంతఊళ్ళకి తిరిగి వెళ్లాలనుకునే అసంఖ్యాకమైన వలస కూలీలకి ఈ పాకేజ్ వల్ల ఇసుమంతైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందనడానికి ఏదైనా ఆధారం ఉందా? ఈ సమయంలో సరైన అత్యవసర చర్యలు తీసుకోకపోవడం ఎంత ఆందోళన కలిగిస్తుందో, అధికారుల ప్రవర్తన అంతకంటే ఎక్కువ భయం కలిగిస్తుంది. వాళ్లకసలు వాస్తవ పరిస్థితి అర్థం కానట్టు అనిపిస్తుంది.

PHOTO • Labani Jangi

ఈ వ్యాసంలోని బొమ్మలు రెండూ ఢిల్లీ, నోయిడా ల నుంచి ఉత్తర ప్రదేశ్, ఇంకా ఇతర రాష్ట్రాలలోని స్వంత వూళ్ళకి తిరిగెళ్తున్న వలస కూలీల గురించి ఒక చిత్రకారిణి ధృక్కోణం. చిత్రకారిణి లాబాని జాంగి సొంతగా చిత్రకళ నేర్చుకున్నారు. ఆమె కోలకత్తా లోని సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ లో వలస కార్మీకుల గురించి పరిశోధన చేస్తున్నారు.

ఇప్పుడు మనకి విధించిన లాక్డౌన్ లాంటివి బలహీన వర్గాలకి ఏ మాత్రం సహాయం అందకుండా, వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా తయారు చేసినవి. వీటిమూలాన తిరుగు వలసలు జరక్క తప్పదు, అలా జరగటం ఇప్పటికే మొదలైంది కూడా. ఈ తిరుగు వలసల తీవ్రత, పరిథి  లాంటి విషయాలు మనం అంచనా వేయడం అసాధ్యం. కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారాం వలసకూలీలు ఇప్పటికే చాలాశాతం వాళ్ళ సొంతఊళ్ళకికి వెళ్ళడానికి తయారయ్యారు.

వాళ్ళలో చాలామంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ప్రయాణసాధనాన్ని వాడుతున్నారు- అవి వాళ్ళ కాళ్ళు. కొందరు ఇళ్ళకి సైకిళ్లమీద వెళుతున్నారు. రైళ్ళు, బస్సులు, వాన్ లు మార్గమధ్యంలో ఆగిపోవడం వల్ల మరికొందరు ఎక్కడెక్కడో చిక్కుకుపోయారు. ఈ పరిస్తితులు ఇంకా జటిలమైతే ఏం జరుగుతుందో ఊహించడానికే భయమేస్తుంది.

గుజరాత్ లోని నాగరాలనుంచి రాజస్తాన్ లోని గ్రామాలకి, హైదరాబాద్ నుంచి తెలంగాణలోని, ఆంధ్రాలోని దూరపు పల్లెలకి, ఢిల్లీ నుండి ఉత్తర ప్రదేశ్, బీహార్ లలోని ఊళ్ళకి, ముంబై నుండి ఇంకా ఎక్కడెక్కడికో, పెద్ద గుంపులుగా జనం నడిచి వెళ్ళటాన్ని ఊహించండి. వాళ్ళకి గనక ఏ సహాయం అందకపోతే, మంచినీళ్ళు, ఆహారం సమయానికి సరిగ్గా దొరక్క ఎలాంటి విపత్తుకయినా దారి తియ్యవచ్చు. వాళ్ళకి డయేరియా, కలరా లాంటి జబ్బులు కూడా రావచ్చు.

ఇప్పుడు తీవ్రమౌతున్న ఆర్ధిక సంక్షోభాన్ని బట్టి చూస్తే ఈ మరణాలకి ఎక్కువగా బయటికెళ్ళి పనిచేసే యువకులు గురికావచ్చు అనిపిస్తుంది. ప్రజారోగ్య ఉద్యమానికి కో-ఆర్డినేటర్ అయిన టి. సుందరరామం గారు మాతో చెప్పినట్టు “ఈ ఆర్థిక సంక్షోభం  ఉన్నన్నాళ్ళు మిగతా మరణాలన్నీటి బదులు కోవిడ్ మరణాలే సంభవించే అవకాశం ఉంది.”

జనాభాలో 8% ఉన్న60 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి కరోనా వైరస్ వల్ల నష్టం ఎక్కువ. మిగతా రోగాలు వ్యాప్తి చెందటం, అత్యవసర వైద్యసదుపాయాలు తగ్గడం, ఒక్కోసారి పూర్తిగా అందుబాటులో లేకపోవడం లాంటి కారణాల వల్ల పనిచేసే వయసులో ఉన్న యువతకి ప్రమాదం ఎక్కువగా ఉంది.

డాక్టర్ సుందరరామం గారు గతంలో, జాతీయ ఆరోగ్య వనరుల కేంద్రం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ఏమంటారంటే “వలసకూలీలు పనులు పోగుట్టుకుని, సొంతవూళ్ళకి తిరిగివెళ్లడం గురించి, త్వరగా ఏదో ఒక చర్య తీసుకోవాలి” అని. అలాంటి చర్యలేం తీసుకోకపోతే, దీర్ఘకాలంగా మనదేశంలో పేదవాళ్ళని హింసిస్తున్న రోగాలు ఇంకా చెలరేగి కరోనామరణాల కంటే ఎక్కువ మరణాలని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా నగరాల్లోని వలసకూలీలు కనీస వేతనం దొరక్క ఆకలితో సొంతఊళ్ళకి బయల్దేరితే ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది.

PHOTO • Rahul M.

ప్రతివారం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ నుండి కేరళ లోని కొచ్చి కి తిరిగి అలసిపోయిన వలస కార్మీకులు

చాలామంది కార్మీకులు వాళ్ళ పనిచేసే చోటే నివసిస్తారు. పనిస్థలాలు మూత పడటంవల్ల వాళ్ళు అక్కడనుంచి ఖాళీ చేయాల్సివచ్చింది. వాళ్లిప్పుడు ఎక్కడికి పోవాలి? వాళ్ళంతా ఇంతేసి దూరాలు నడవగలరా? వాళ్ళకి రేషన్ కార్డులు కూడా లేవు, మరి ఆహారం ఎలా దొరుకుతుంది?

ఆర్థిక సంక్షోభం ఇప్పటికే చాలా వేగం పుంజుకుంది.

దానితో పాటు పెరుగుతున్న ఇంకొక సమస్య ఏంటంటే, వలస కార్మీకుల్ని, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళని, మురికివాడల్లో ఉండేవాళ్ళని, ఇతర పేదవాళ్ళని భయంతో చూడటం, నివాసప్రాంతాల్లో వాళ్ళు పెద్దసమస్య అని అందరూ నమ్మడం. నిజానికి, గతంలో అయినా, ఇప్పుడైనా సార్స్, కోవిడ్ 19 లాంటి రోగాలని మోసుకొచ్చేది విమానాల్లో తిరిగే ఎగువ తరగతి మనుషులే. ఈ విషయాన్ని గుర్తించకుండా మనం నగరాల్ని రోగరహితంగా శుభ్రం చేయాలనుకుంటున్నాం. ఒకవేళ విమానాల్లో వచ్చిన మనుషులు గ్రామలకి తిరిగి వెళ్తున్న వలస కార్మీకులకి గనక ఈ రోగాన్ని అంటిస్తే, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి?

అదే రాష్ట్రంలోనో, పక్క రాష్ట్రాలకో నడిచిపోతున్న వలస కార్మీకులు మనకి రోజూ కనపడుతూనే ఉన్నారు. ఇదివరకైతే దార్లో ఉన్న టీ కొట్లలో, ధాబాల్లో పని చేసి అక్కడే తిని, రాత్రుళ్ళు అక్కడే పడుకుని మళ్ళీ ప్రయాణం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడా కొట్లన్నీ మూసేసి ఉన్నాయి కదా, వాళ్ళకి తిండి, నిద్ర ఎలా జరుగుతాయి?

కొద్దో గొప్పో డబ్బున్న వాళ్ళు, మధ్యతరగతి జనం ఇంటిపట్టున ఉండి సామాజిక దూరం పాటిస్తే సరిపోతుందనుకుంటున్నారు. ఈ పద్ధతిలో కనీసం వైరస్ నుంచి రక్షణ దొరకొచ్చు. కానీ ఆర్ధిక సంక్షోభం మనమీద ఎలా దాడి చేయబోతుందో మనం ఊహించలేదు. ఇంకొంతమందికి   సామాజిక దూరం వేరేలా అర్థం ఔతుంది. మనం దాన్ని రెండు శతాబ్ధాల క్రితమే కులం, వర్గం అనే పేర్లతో సృష్టించుకున్నాం. లాక్డౌన్ కి మనం స్పందిస్తున్న తీరులో ఈ కులం, వర్గం అనేవి ప్రధానపాత్ర పోషిస్తున్నాయి.

ప్రతి ఏడాదీ క్షయ వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది చనిపోవడం, డయేరియా పదివేలమంది పసిపిల్లల ప్రాణాలు బలితీసుకోవడం లాంటి విషయాలు మనని పెద్దగా కదిలించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మనలో వాళ్ళు కాదు. ఎప్పుడైతే గొప్ప వాళ్ళు కూడా ప్రాణాంతక వ్యాధుల్ని తట్టుకునే నిరోధకశక్తి తమకి లేదని తెలుసుకుంటారో అప్పుడు మనలో ఆందోళన మొదలౌతుంది. సార్స్ అయినా, 1994 లో వచ్చిన ప్లేగ్ అయినా ఇదే వరస. ఈ రెండూ చాలా భయంకరమైన జబ్బులే కానీ, మనదేశంలో వాటివల్ల జరగాల్సిన దానికంటే తక్కువ ప్రాణనష్టం జరిగిందనే చెప్పాలి. కానీ ఆ జబ్బులకి చాలా ప్రాచుర్యం వచ్చింది. అప్పట్లో సూరత్ గురించి నేనిలా రాసాను. “ప్లేగ్ క్రిములకి వర్గ తారతమ్యం తెలీకపోవడం గొప్ప విషయమే, అంతకు మించిన సంగతి ఏంటంటే అవి విమానం ఎక్కి క్లబ్ క్లాస్ లో న్యూయార్క్ దాకా ప్రయాణం చేయగలవు.”

PHOTO • Jyoti

ముంబై లోని చెంబుర్, మహుల గ్రామం లోని పారిశుద్ధ్య కార్మికులు కనీస రక్షణ లేకుండా ప్రమాదకరమైన చెత్తకుప్పల దగ్గర పని చేస్తున్నారు.

మనమిప్పుడు వెంటనే స్పందించాలి. ఇది ఒక్క వైరస్ కాదు, ఇలాంటి వ్యాధులు ఒక పాకేజ్ లాగా వస్తాయి. ఆ పాకేజ్ లో భాగంగా ఆర్ధిక సంక్షోభాన్ని మనం కొని తెచ్చుకోడమో, పెంచి పోషించడమో చేశాం. అందువల్ల ఆపద కాస్తా విపత్తుగా మారింది.

మనం పోరాడుతున్నది ఒక వైరస్ తో అనుకుని, దాన్ని గెలిస్తే ఇక అంతా బాగుంటుందని అనుకోవడం తప్పు. మనం ఈ ప్రపంచవ్యాధిని సర్వశక్తులతో ఎదుర్కోవాల్సిన మాట నిజమే. 1918 నుంచి ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ఇది అతిపెద్ద వ్యాధి. ఇది కాక స్పానిష్ ఫ్లూ పేరుతో పిలిచిన మరొక వ్యాధికి కూడా 16-21 మిలియన్ల ప్రాణాలు బలయ్యాయి. నిజానికి 1921 లెక్కల ప్రకారం మాత్రమే గ్రామీణ ప్రాంతపు జనాభా తగ్గడం నమోదు అయింది.

అసలు విషయాలన్నీటిని పక్కన పెట్టి కోవిడ్-19 ని మాత్రమే పట్టించుకోవడం ఎలా ఉంటుందంటే, ఇంట్లో పంపులన్నీ వదిలి నేలని పొడిగా తుడవాలనుకున్నట్టు. ఇప్పటికైనా మనం ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజల హక్కులు, వాళ్ళకి చేరాల్సిన లాభాలు వీటన్నిటి మీద పనిచేసే దృష్టిని అలవర్చుకోవాలి .

WHO మీద పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారీ పెత్తనం లేనిరోజుల్లో, 1978 లో ఆరోగ్య రంగంలోని కొందరు మేధావులు “అల్మా ఆట” అనే ఒక ప్రకటనని విడుదల చేశారు.  బాగా ప్రాచుర్యం పొందిన “2000 సంవత్సరం కల్లా అందరికీ ఆరోగ్యం” అనే వాక్యం ఈ ప్రకటన లో భాగంగా వచ్చిందే. ప్రపంచ ప్రజలందరికీ “ప్రపంచ వనరులన్నీటిని పూర్తిగా, సమర్ధవంతంగా వాడి..” ఈ ఆశయాన్ని సాధించవచ్చని ఈ ప్రకటన ఉద్దేశం.

80 ల నుంచీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సాంఘిక, ఆర్థిక కారణాల్ని అర్థం చేసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. కానీ దాంతో పాటుగా మన ఆలోచనలని ఉదారవాద విధానాలు కూడా చాలా త్వరగా ఆక్రమించుకున్నాయి.

80 లు 90 ల చివర నుంచి ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి విషయాలు కూడా మానవ హక్కుల లాగానే అనవసరమని పక్కన పడేశారు.

90 ల మధ్యలో అంటువ్యాధుల ప్రపంచీకరణ మొదలైంది. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధుల్ని ఎదుర్కోవడానికి ఆరోగ్య సదుపాయాల్ని అందరికీ అందుబాటులోకి తేవాల్సి ఉండగా చాలా దేశాలు  వైద్యసేవలని ప్రైవేట్ రంగానికి అప్పజెప్పాయి. మనదేశంలో అయితే ఎప్పుడూ  ప్రైవేట్ హవానే నడుస్తుంది. జాతీయ ఉత్పత్తిలో 1.2 శాతాన్ని మాత్రమే మనం ఆరోగ్యానికి కేటాయిస్తున్నాం. ప్రపంచదేశాలతో పోలిస్తే ఇది అతితక్కువ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ అంతా బలంగా లేని ప్రజారోగ్య వ్యవస్థ 90 ల నుంచి అమలవుతున్న కొత్త విధానాల వల్ల మరింత దిగజారింది.  ఇప్పటి ప్రభుత్వం అయితే జిల్లా స్థాయి ఆసుపత్రులని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలని చూస్తుంది.

గ్రామీణ కుటుంబాల్లో చేసే అప్పుల్లో ఆరోగ్యకారణాలవల్ల అయ్యేభాగం రానురాను పెరిగిపోతుంది. జూన్ 2018 లో భారత ప్రజారోగ్య సంస్థ రకరకాల సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన వివరణ ప్రకారం, 2011-12  సంవత్సరం లో 55 మిల్లియన్ల భారతీయులు కేవలం మందుల ఖర్చుల వల్లే అప్పులపాలయ్యారని నిర్ధారించింది. 55 million people

రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వేలాది ఇళ్ళల్లో ప్రముఖంగా కనిపించే కారణం ఇది: మితిమీరిన అనారోగ్యపు ఖర్చులు, వాటికోసం షావుకారు నుంచి తీసుకున్న అప్పులు.

PHOTO • M. Palani Kumar

మిగతా చోట్లలాగానే చెన్నైలోని పారిశుద్ధ్య కార్మీకులు కూడా అరకొర రక్షణ సౌకర్యాలతో పనిచేస్తు న్నారు.

మన జనాభాలో ఎక్కువభాగానికి కోవిడ్- 19 లాంటి విపత్తులని ఎదుర్కునే సౌకర్యాలు లేవు. అసలైన విషాదం ఏంటంటే రాబోయే సంవత్సరాలలో ఇటువంటి వ్యాధులే వేరేపేర్లతో వస్తాయి. 90 ల చివర నుంచి మనం సార్స్, మెర్స్ లాంటి జబ్బులని చూశాం (ఇవి రెండూ కరోనా వైరస్ కుటుంబానికి చెందినవే). ఇవేకాక ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మరికొన్ని జబ్బులని కూడా చూశాం. 1994 లో మనదేశంలోనే సూరత్ లో ప్లేగ్ వ్యాధిని చూశాం. మనం నిర్మించుకుని నివశిస్తున్న ఈ ప్రపంచంలో ఏమేం జరగవచ్చో ముందే మనకి సూచనలు అందాయి.

గ్లోబల్ విరోమ్ ప్రాజెక్ట్ లో Global Virome Project పనిచేస్తున్న ప్రొఫెసర్ డెనిస్ కారల్ ఈమధ్యనే చెప్పినట్టు “ We’ve penetrated deeper into ecozones we’ve not occupied before….” ఇదివరకు జనావాసాలు ఉన్న చోట్లలో నూనెగనులు తవ్వడం, ఖనిజాల్ని వెలికి తియ్యడం లాంటి పనులకి మనం పెద్ద మూల్యమే చెల్లించాము. సున్నితమైన పర్యావరణం మీద మనం దాడి చేయడం వల్ల వాతావరణం లో మార్పులు రావడం మొదలైంది. అంతే కాకుండా వన్య ప్రాణులతో దగ్గరగా మసలడం వల్ల మనకి ఇంతకుముందు పరిచయం లేని క్రిములు, అంటువ్యాధులు కూడా పరిచయం అయ్యాయి.

మనం ఇలాంటివి మరిన్ని చూడబోతున్నాం అన్నది నిజం.

ఇక కోవిడ్ -19 విషయానికొస్తే రెండు రకాలుగా జరగవచ్చు.

మన అదృష్టం కొద్దీ ఈ వైరస్ కొద్ది వారాల్లోనే నిర్వీర్యం అయి చచ్చిపోవచ్చు.

అయితే, దాని అదృష్టం కొద్దీ అది రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాప్తి చెందవచ్చు. ఆదేగనక జరిగితే మనం నిజంగా దురదృష్టవంతులమనే చెప్పాలి.

ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇండియాలోని గొప్ప ఉద్యమకారులు, మేధావులు చేసిన సూచనలని ఆమోదిస్తూ, వాటితో పాటు, అదనంగా నేను ఈ కింది సలహాలు ఇస్తాను. (ప్రభుత్వాల అప్పు, ప్రైవేటీకరణ, పెట్టుబడుల మార్కెట్ విఫలమవ్వడం వంటి అంశాల నేపథ్యం లో కూడా ఈ సూచనలు అవసరం). ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు larger global context ఆదర్శనీయం అని చెప్పుకోవాలి.

Ø మొట్టమొదటగా చేయాల్సింది: మనదగ్గరున్న 60 మిలియన్ టన్నుల ఆహారనిల్వలని పంపిణీ చేయడానికి సిద్ధమవ్వాలి. ఈ విపత్తుకి కుప్పకూలిపోయిన లక్షల మంది పేదవారికి, వలసకార్మీకులకి ఈ ఆహారం అందేలా చూడటం. నిలవనీడలేక చెల్లాచెదురైన ఈ జనమంతటికీ స్కూళ్ళు, కాలేజీలు, కమ్యూనిటీ హాళ్లు లాంటి స్థలాల్ని తాత్కాలిక నివాసప్రదేశాలు గా మార్చడం.

Ø రెండోది, ముఖ్యమైనది ఏంటంటే, కరీఫ్ లో రైతులందరూ ఆహారాధాన్యాలు పండించేలా చూడటం. ఇప్పటి పరిస్థితి ఇలానే ఉంటే త్వరలో తీవ్రమైన ఆహారసమస్య ఏర్పడవచ్చు. ఈ విడత కోతకోసిన వాణిజ్యపంటల్ని అమ్ముకోవడం కష్టమౌతుంది.  ఈసారి కూడా వాణిజ్యపంటలు వేస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. కరోనాకి వాక్సిన్ రావడానికి చాలా నెలలు పట్టేలా ఉంది. ఈలోగా ఆహారనిల్వలు అడుగంటుతాయి.

Ø ప్రభుత్వం కల్పించుకుని రైతులనుంచి వీలైనంత ఎక్కువ పంటని కొనాలి. సామాజిక దూరం వల్ల, లాక్ డౌన్ వల్ల రైతులు రబీ పంటని కొయ్యలేకపోయారు. కోతకోసిన కొద్దిమంది కూడా రవాణా సౌకర్యాలులేక దాన్ని అమ్ముకోలేకపోయారు. ఖరీఫ్ లో ఆహారాధాన్యాలు పండించడానికి కూడా రైతులకి విత్తనాలు, ఇతర సహాయం, అమ్మకపు సౌకర్యాలు కావాలి.

Ø ప్రైవేట్ ఆరోగ్య వసతుల్ని జాతీయీకరణ  చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రులన్నీ కరోనా ప్రత్యేక విభాగాల్ని మొదలు పెట్టడం ఒక్కటే సమస్యకి పరిష్కారం కాదు. స్పెయిన్ లో గతవారం ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాలు అన్నిటినీ ప్రభుత్వపరం చేశారు. లాభాపేక్షతో పనిచేసే సంస్థల వల్ల ఈ విపత్కర పరిస్థితుల్లో ఏమీ ఉపయోగం లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు.

Ø పారిశుద్ధ్య కార్మీకులని వెంటనే మున్సిపాలిటీ/ప్రభుత్వ పూర్తిస్థాయి ఉద్యోగులుగా ప్రకటించాలి. ఇప్పుడు ఇస్తున్న జీతాలతో పాటు నెలకి 5,000 రూపాయలు, వారికి ఇదివరికి అందుబాటులో లేని పూర్తిస్థాయి ఆరోగ్యవసతులు కల్పించాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రక్షణ సౌకర్యాలు కల్పించాలి. అసలే దుర్బలంగా ఉన్న పారిశుద్ధ్య పనివాళ్ళని మనం మూడు దశాబ్ధాలుగా మరింత అణగతొక్కేశాము. వాళ్ళని బహిరంగంగా పనిచేయనివ్వకుండా,  వాళ్ళ పనుల్ని ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పామ. ఆ సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో తిరిగి వీళ్ళనే తక్కువ జీతానికి పనిలో పెట్టుకున్నాయి. పైగా వాళ్ళకి ఇతర ప్రయోజనాలు ఏమీ కల్పించలేదు.

Ø మూడు నెలల పాటు పేదవాళ్ళకి ఉచిత రేషన్ ప్రకటించి వెంటనే పంపిణీ చేయాలి.

Ø ఆష, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పధకాలని పునరుద్ధరించాలి. ఈ యుద్ధంలో ముందువరసలో ఉండి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సరైన వేతనం, ఉద్యోగ భద్రత, వ్యాధిని ఎదుర్కునే రక్షణ కల్పించాలి. ఎందుకంటే మనదేశ బాలల ఆరోగ్యం, జీవితాలు ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి.

Ø ఈ ఆపద గట్టెక్కేవరకూ రైతులకి, కూలీలకి MGNREGA ప్రకారం రోజువారీ వేతనం ఇవ్వాలి. పట్టణాల్లో ఉండే రోజుకూలీలకి నెలకి 6,000 రూపాయలు అందేలా చూడాలి.

ఈ చర్యలన్నిటిని మనం వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన పాకేజ్ లను చూస్తే నిర్దయ, నిరాసక్తత కలగలిసినట్టు ఉంది. కోవిడ్ అనేది ఒక్క వైరస్ కాదు, ఇలాంటి వ్యాధులు ఒక పాకేజ్ లాగా వస్తాయి. ఆ పాకేజ్ లో భాగంగా ఆర్ధిక సంక్షోభాన్ని మనం కొని తెచ్చుకోడమో, పెంచి పోషించడమో చేశాం. అందువల్ల ఆపద కాస్తా విపత్తుగా మారింది.

ఈ వైరస్ మరో రెండు వారాలు ఇలాగే వ్యాపిస్తే, ఖరీఫ్ లో ఆహారాధాన్యాలు పండించమని రైతుల్ని ప్రాధేయపడటమే మనకున్న ఏకైక మార్గంగా మిగులుతుంది.

ఇదిలా ఉండగా, మానవ చరిత్రలో ఒక గొప్ప సత్యాన్ని బయటపెట్టిన ఒక సందర్భంగా ఈ కోవిడ్ రోజుల్ని మనం చూడగలమా? ఈ కూడలినుంచి మనం ఏ దారిలోకి వెళ్ళాలో నిర్ణయించుకోవాలి. అసమానతల గురించి, ఆరోగ్య సమన్యాయం గురించి కొత్తగా ఆలోచించి చర్చించడానికి అనువైన సందర్భంగా దీన్ని మనం చూద్దాం.

వ్యాసం యొక్క మరొక కథనం వైర్ పత్రికలో మార్చ్ 26, 2020 ప్రచురించబడింది .

అనువాదం: బి. స్వాతికుమారి

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath
Translator : B. Swathi Kumari

B. Swathi Kumari is a Chartered Accountant. She works as a teacher at Rishi Valley school at present. She is a Poet, Translator and Co-editor of vaakili.com. She can be reached at [email protected]

Other stories by B. Swathi Kumari