అతను ఆ షాపుకు యజమాని కానని చెప్పాడు, అది అతని స్నేహితుడిది. కాస్తాగి, అతను తన స్థాయిని పెంచుకుంటూ, “ఓనర్ కు బంధువును,”అని చెప్పుకున్నాడు. ఇంకాసేపటికి, “ఆ షాపులో పని చేసే బంధువును,” అని చెప్పాడు. ఇక అలానే అడుగుతూ పొతే, తానే ఓనర్ ని అని చెప్పుకునేవాడే.

అతను ఫోటో తీసుకోవడానికి ఒప్పుకోలేదు. షాపులో వీడియో కూడా తీసుకోనివ్వలేదు. కానీ బయట ఉన్న సైన్ బోర్డు ఫోటో తీసుకున్నందుకు మాత్రం సంతోషించాడు.

ఆ బోర్డు మీద విదేశీ షరాబ్ దుకాణ్ అని ఉంది - ఎంట్రన్స్ కి కాస్త దూరంలో(విదేశీ లిక్కర్ దుకాణం, అని అర్థం)లైసెన్సీ: రమేష్ ప్రసాద్ అని కూడా ఉంది. ఇది ఛత్తీస్గఢ్(అప్పట్లో ఇది మధ్యప్రదేశ్)లోని సుర్గుజా జిల్లాలో కట్ఘోరా పట్టణ చివరలో ఉంది. కాస్త మత్తుతో తూలుతూ మాతో సంభాషిస్తున్న ప్రస్తుత వ్యక్తి అయితే రమేష్ ప్రసాద్ కాదు. ఈ విదేశీ లిక్కర్ దుకాణంలో ఇతను ఒక పెద్ద కస్టమర్ ఏమో, అనే అనుమానం మొదలైంది మాలో.

విదేశీ లిక్కర్? అంటే, పూర్తిగా కాదు. నేను చివరగా IMFL అన్న ఎక్రోనీమ్ విన్నది ఎప్పుడో గుర్తులేదు. దాని పూర్తి అర్థం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(Indian Made Foreign Liquor). 1994 లో, ఈ ఫోటో తీసుకున్నప్పుడు IMFLకు, దేశి లిక్కర్ కు మధ్య చాలా వేడిగా వాదోపవాదాలు జరిగేవి.

IMFL రకం అంటే, లా ఇన్‌సైడర్ వెబ్‌సైట్ నుండి నేను తెలుసుకున్నట్లుగా, “విదేశాల నుండి దిగుమతి చేసుకున్న జిన్, బ్రాందీ, విస్కీ లేదా రమ్ పద్ధతిలో భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన, తయారు చేయబడిన లేదా సమ్మేళనం చేయబడిన మద్యం, మిల్క్ పంచ్ ఇంకా ఏదైనా ఇతర మద్యాలను కలిగి ఉంటుంది. కానీ ఇందులో బీర్, వైన్, విదేశీ మద్యం మాత్రం ఉండవు.” ఇక్కడ "బీర్, వైన్ మరియు విదేశీ మద్యం" మినహాయించబడుతాయని గమనించండి.

IMFL లో దిగుమతి చేసుకున్న లిక్కర్ తో పాటుగా ఒక దేశీయ విశేషం ఉండాలి. (బహుశా మొలాసిస్ కానీ, స్థానికంగా కలపడంగాని, లేదా దిగుమతి చేసుకున్న పదార్ధాన్ని బాటిళ్లలో పోయడం గాని). మనకు నిజంగానే ఏమి తెలియదు.

PHOTO • P. Sainath

గతించిన కాలంలో దేశి లిక్కర్ తయారీదారులకు కలిగిన కోపం న్యాయమైనదే. కల్లు, సారా,ఇంకా ఇతర దేశి సరుకు ఒక రాష్ట్రంతో మొదలుపెట్టి నెమ్మదిగా అన్ని రాష్ట్రాలలోనూ నిషేధించబడింది. కానీ IMFL ని వేడుక చేసుకున్నారు. మేము ఆ విదేశీ షరాబ్ దుకాణ్ వైపు చూస్తుండగా, నేను 1993లో, ఇక్కడకు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న, తమిళనాడులోని పుదుక్కోట్టైలో చూసినది గుర్తొచ్చింది. అక్కడ సారా నిషేధ అధికారులు బ్రాందీ షాపులను(IMFL ఔట్లెట్లను దక్షిణ తమిళ నాడులో ఆ పేరుతో పిలుస్తారు) వేలం పాడుతున్నారు. సారాయితో ఉన్న పెద్ద తలకాయనొప్పి ఏమిటంటే చట్టపరంగా అమ్మే ఆల్కహాల్ వలన వచ్చే ఆదాయం పై అది దెబ్బ కొడుతుంది.

ఒక ప్రజా సమావేశంలో, మధ్య నిషేధాన్ని అమలు చేస్తున్న అధికారులను చూసి ఒక DMK కార్యకర్త, నిషేధ అధికార నాయకుడికి ఐదురూపాయిలను ఇచ్చి ఇబ్బంది పెట్టాడు. ఇస్తూ, “ఇది బ్రాందీ షాపులను పెంచుతూ, తాగుబోతులను రూపుమాపడానికి  చేసే మీ పోరాటానికి బహుమతి,” అని చెప్పాడు.

ఇక 1994లో, కాట్ఘోరాకి వద్దాం. ఆలస్యం అవుతుందని మేము గ్రహించి, కాస్త మత్తులో ఉండి, తనకు తానే నియమించుకున్న గైడ్తో చేతులు కలిపాము. ఇప్పుడు అతను విదేశీ ప్రభావాలకు సమ్మతినిచ్చే ఉద్దేశంతో ఉన్నాడనిపించింది. కానీ మేము విదేశీ షరాబ్ దుకాణ్ లైసెన్స్ కలిగిన రమేష్ ప్రసాద్ ని ఇప్పటిదాకా కలవలేకపోయాము. మేము ఈ దేశి హైవే పైన ప్రయాణించి మూడు గంటలలో అంబికాపుర చేరాలి.

ఈ డిసెంబర్ 22న మధ్యప్రదేశ్ ఎక్సయిజ్ మంత్రి జగదీష్ దేవ్డా రాష్ట్ర అసెంబ్లీలో (కాస్త గర్వంగా) “IMFL వినియోగం 2010-11 లో 341.86 లక్షల ప్రూఫ్ లీటర్ల నుండి 23.05 శాతం పెరిగి, 2020-21 లో 420.65 లక్షల ప్రూఫ్ లీటర్లకు చేరింది,” అని చెప్పారు.

ఈ ప్రూఫ్ లీటర్లలో ప్రూఫ్ అంటే ఏమిటి? ఇది, శతాబ్దాల క్రితం ఇంగ్లాండ్ లో లిక్కర్ లో ఎంత మోతాదులో ఆల్కహాల్ ఉందో తెలుసుకోవడానికి చేసిన పరీక్ష. నిపుణులు ఇటువంటి ప్రూఫ్ ప్రస్తుత సమయాలకు అవసరం లేదు అని చెప్పారు. ఓహ్, నిజమే, మధ్యప్రదేశ్లోని మంత్రి, దేవ్డా ఇది ఇంకా చరిత్రను సృష్టిస్తుంది, అని వాదించవచ్చు. ఇదే దశాబ్దంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ 23 శాతం పెరిగినా, స్థానిక లిక్కర్ 8.2 శాతం పెరిగింది. కానీ దాని వినియోగం IMFL కన్నా రెట్టింపుగా ఉంది. అందుకని దేశి ఫారెన్ కన్నా గొప్పదే, కానీ విదేశీ సరుకు మాత్రం రెట్టింపు ఎదుగుదలను చూడగలిగింది. ఆత్మ గౌరవం మెండుగా కల దేశభక్తులకు ఇది ఒక విరోధాభాస.

అనువాదం:  అపర్ణ తోట

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota