ఈ కథనం , 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో , రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.

‘సమయం ఉదయం 11.40 దాటుతోంది. కాబట్టి  ఇక ఇప్పుడు  రాబోయే గాలివేగపు తాజాసమాచారం’ అని కడల్ ఒసై రేడియో స్టేషన్ నుంచి ప్రకటించాడు ఎ. యశ్వంత్. ‘‘గత వారంగా, ఇంకా చెప్పాలంటే, గత నెలగా కంచన్ కాతు (దక్షిణపు గాలి) ఉద్ధృతంగా వీస్తోంది.  గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగం ఉండింది. ఈ రోజే  మత్స్యకారుల కోసమే అన్నట్లుగా కాస్త నెమ్మదించి, పదిహేను కిలోమీటర్లకు తగ్గింది’’

రామనాథపురం జిల్లాలోని పంబన్ దీవికి చెందిన మత్స్యకారులకు ఇది గొప్ప శుభవార్త. ‘‘అంటే ఏ భయమూ లేకుండా సముద్రం మీదకి వెళ్లొచ్చు’’ అని వివరించాడు యశ్వంత్.  తను కూడా మత్స్యకారుడే. ఇప్పుడు ఆ ప్రాంతపు సమూహం కోసం ఏర్పాటుచేసిన కడల్ ఒసై రేడియో స్టేషన్‌లో రేడియో జాకీగా కూడా పనిచేస్తున్నాడు.

రక్త దానానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమ ప్రసారానికి ముందుగా ఇస్తున్న ఈ వాతావరణ నివేదికను, ‘‘ప్రస్తుత ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. నీళ్లు బాగా తాగండి. ఎండలోకి వెళ్ళకండి’’ అన్న సూచనలతో ముగించాడు.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం కచ్చితంగా అవసరం. ఎందుకంటే పంబన్ దీవిలో గతంతో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు ఉండే రోజులు బాగా పెరిగాయి. యశ్వంత్ పుట్టిన 1996లో ఏడాదికి 32డిగ్రీల సెల్సియస్ , అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న రోజులు కనీసం 162 ఉండేవి. యశ్వంత్ వాళ్ల నాన్న ఆంటోని సామీ వాస్ పుట్టింది 1973లో. అప్పట్లో  ఆ స్థాయి ఉష్ణోగ్రతలుండే రోజులు  ఏడాదికి 125 కంటే ఎక్కువ ఉండేవి కావు. ఇప్పుడు సంవత్సరానికి 180 రోజులు వేడిగా ఉంటున్నాయని అంచనా.   వాతావరణాన్ని అంచనా వేయగలిగే, భూతాపాన్ని కొలవగలిగే ఒక ఉపకరణం ద్వారా లెక్కించగా వచ్చిన ఈ వివరాల్ని ఈ జూలైలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆన్ లైన్లో ప్రచురించింది.

కేవలం వాతావరణం గురించి మాత్రమే కాదు, మొత్తంగా శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తున్న స్థూలమైన అంశాలను అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు యశ్వంత్, అతని సహోద్యోగులు. అలానే యశ్వంత్ తండ్రి, మిగిలిన మత్స్యకారులు మాత్రమే కాదు,   పంబన్ దీవిలో ముఖ్యమైన రెండు పట్టణాలు  పంబన్, రామేశ్వరంలకు చెందిన మొత్తం 83వేల మందీ వీరు చెప్పేది విని వాతావరణ మార్పులను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు.

PHOTO • A. Yashwanth
PHOTO • Kadal Osai

తండ్రి ఆంటోనీ సామీతో రేడియో జాకీ యశ్వంత్, తమ పడవతో యశ్వంత్ (కుడి): ‘ సముద్రానికి బయలదేరబోతూ గాలి వేగాన్ని, వాతావరణాన్ని అంచనా వేసుకోగలిగేవాళ్లం. ఇప్పుడు మా లెక్కలెందుకూ పనికిరావడం లేదు’

‘‘నా పదోఏట నుంచే చేపల వేటకు వెళుతున్నాను’’ అని చెప్పారు ఆంటోని సామీ. ‘‘అప్పటికీ ఇప్పటికీ సముద్రాల్లో అతి పెద్ద మార్పే వచ్చింది. బయలుదేరబోతూ  మేము గాలుల్ని, వాతావరణాన్ని చూసి అంచనా వేసుకోగలిగేవాళ్లం. ఇప్పుడు ఆ లెక్కలేవీ పనికి రావడం లేదు. ఈ పెనుమార్పులు మా జ్ఞానానికి అందడం లేదు. ఇదివరకటి కంటే వేడి కూడా బాగా ఎక్కువగానే ఉంటోంది. గతంలో సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఇంత వేడెప్పుడూ లేదు. ఇప్పుడు ఈ వేడి మాకు చేపల వేటను మరింత కష్టతరం చేస్తోంది’’

ఆంటోని చెప్పిన ఆ కల్లోల మార్పులు  ఒక్కొక్కసారి సముద్రాన్ని ప్రాణాలు తీసేంతటి ప్రమాదకారిగా మారుస్తాయి. ఈ సంవత్సరం జూలై నాలుగున అదే జరిగింది. తన తండ్రితో పాటు వీలైనప్పుడల్లా చేపలు పట్టడానికి వెళ్ళే యశ్వంత్ ఆ రోజు రాత్రి తొమ్మిది తర్వాత సముద్రంలోకి వెళ్లిన నలుగురి జాడ తెలియడం లేదన్నసమాచారాన్ని తీసుకుని రేడియోస్టేషన్‌కి వచ్చాడు. కడల్ ఒసై అప్పటికి మూసేసి ఉంది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటలవరకే ఆ రేడియో ప్రసారాలు ఉంటాయి. కాని ఒక రేడియో జాకీ మత్స్యకారులు ప్రమాదంలో ఉన్నారన్న వార్తను వెంటనే ప్రసారం చేసి దాని వైపు దృష్టి సారించమని కోరాడు. ‘‘రేడియో స్టేషన్ అధికారికంగా మూసేసి ఉన్నా ఆ పరిసరాలలో ఎవరో ఒక రేడియో జాకీ ఉంటారు’’ అని చెప్పారు ఆ స్టేషన్ ముఖ్య నిర్వాకురాలు గాయత్రి ఉస్మాన్. మిగిలిన ఉద్యోగులు కూడా దగ్గరలోనే నివసిస్తున్నారు. ‘‘కాబట్టి మేము అత్యవసర పరిస్థితులలో ఎప్పుడైనా ప్రసారం చేయగలం’’, అని చెప్పారు. ఆ రోజు కడల్ ఒసై సిబ్బంది నిరంతర అప్రమత్తతతో పనిచేస్తూ పోలీసులను, తీరప్రాంతపు గార్టులను, సామాన్యజనాన్ని, మిగిలిన మత్స్యకారులను జాగృతపరుస్తూ వచ్చారు.

అలా రెండు నిద్ర లేని రాత్రులు గడిచాక కేవలం ఇద్దరిని మాత్రం కాపాడగలిగారు. ‘‘ఆ చెడిపోయిన వల్లమ్( నాటు పడవ)ను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. మిగిలిన ఇద్దరూ చేతుల  నొప్పి భరించలేక మధ్య దారిలోనే వదిలేశారు,’’ అని చెప్పారు గాయత్రి. తమ కుటుంబసభ్యులకు తమ ప్రేమని తెలియచేయమని,  ఇక తమ వల్ల కాకే పడవను వదిలేస్తున్నామని వారికి చెప్పమని తమ సహచరులకు చివరగా చెప్పారు. వారి మ‌ృతదేహాలు జూలై పదిన తీరానికి కొట్టుకుని వచ్చాయి.

‘‘ఇప్పుడిక ఏమాత్రం పాత రోజుల్లోలా లేదు ’’ అని దిగులుగా అన్నారు 54 సంవత్సరాల ఎ.కె. శేషురాజు. కెప్టెన్ రాజు అని కూడా అంటారతనిని. తన పడవ పేరు వల్ల ఆయనకు  ఆ పేరు వచ్చింది. తొమ్మిదేళ్ల వయసు నుంచే సముద్రానికి వెళ్ళేవారు. ‘‘అప్పట్లో సముద్రం సానుకూలంగా ఉండేది’’ అన్నారాయన. ‘‘వాతావరణం ఎలా ఉండబోతోందో, ఏయే చేపలు ఎంతెంత దొరకవచ్చో ముందే అంచనా వేసుకోగలిగేవాళ్లం. ఇప్పుడు రెండూ అనూహ్యంగానే ఉంటున్నాయి’’

వీడియో చూడండి :  అంబ  గాన ప్రదర్శన చేస్తున్న కెప్టెన్ రాజ్

'ఇప్పుడిక ఏమాత్రం పాత రోజుల్లోలా లేదు' అని దిగులుగా అన్నారు 54 సంవత్సరాల ఎ.కె. శేషురాజు. 'అప్పట్లో సముద్రం సానుకూలంగా ఉండేది' అన్నారాయన. 'వాతావరణం ఎలా ఉండబోతోందో, ఏయే చేపలు ఎంతెంత దొరకవచ్చో ముందే అంచనా వేసుకోగలిగేవాళ్లం. ఇప్పుడు రెండూ అనూహ్యంగానే ఉంటున్నాయి'

రాజ్ ఈ మార్పుల వల్ల తీవ్రమైన కలవరానికి లోనవుతున్నట్లున్నారు. కాని కడల్ ఒసై దగ్గర పాక్షికంగానైనా, కొన్నిటికైనా పరిష్కారాలున్నాయి. నెసక్కరంగల్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ 2016, ఆగస్టు 15న ఈ కడల్ ఒసైని ప్రారంభించింది. నాటి నుంచి అది సముద్రం, వాతావరణ నమూనాలు, వాతావరణ మార్పుల మీద ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది.

‘‘ సముతిరమ్ పళగు (సముద్రాన్ని గురించి తెలుసుకో) పేరుతో కడల్ ఒసై ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని నడుపుతుంది’’ అని చెప్పారు గాయత్రి. ‘‘సముద్రాలను పరిరక్షించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నడుపుతున్నాం. ఈ సమూహాన్ని దీర్ఘకాలంలో ప్రభావితం చేసే స్థూలమైన అంశాలున్నాయని మాకు తెలుసు. వాతావరణ మార్పులపై సంభాషణ నడుస్తూనే ఉండడం కోసమే సముతిరమ్ పళగు ను నిర్వహిస్తున్నాం. సముద్రాల పరిరక్షణకు అవరోధంగా ఉండే పద్ధతులను గురించి మాట్లాడుతున్నాం. వాటిని ఎలా నిరోధించాలో చెబుతున్నాం. (ఉదాహరణకు మరపడవలతో పెద్దమొత్తంలో  చేపలు పట్టడం గురించి, డీజిల్, పెట్రోల్‌లు నీటిని ఎలా కలుషితం చేస్తున్నాయన్న దాని గురించి ). కొన్నిసార్లు వాళ్ళే తాము చేసిన తప్పుల గురించి చెబుతారు. మళ్ళీ చేయమని హామీ ఇస్తారు.’’

‘‘కడల్ ఒసై బృందం దానిని ప్రారంభించినప్పటి నుంచీ మాతో సంబంధంలోనే ఉంది’’ అని చెప్పారు చెన్నైకు చెందిన  ఎమ్. ఎస్. స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్‌  (ఎమ్  ఎస్. ఎస్. ఆర్ )లో కమ్యూనికేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న క్రిస్టీ లీమా. ఆ సంస్థ రేడియో స్టేషన్‌కి సహకారాన్ని అందిస్తోంది. ‘‘వాళ్ళు మా నిపుణుల సేవలను వాళ్ళ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. కానీ మే నుంచీ మేము కూడా ఆ సమూహంలో వాతావరణ మార్పులపై అవగాహన  కలిగించేందుకు వారితో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే పంబన్‌లో ఈ రేడియోకు విస్తృత ప్రజాదరణ ఉండడంతో దాని ద్వారా ఈ పని సులువుగా చేయగలం’’

రేడియో స్టేషన్ ఇప్పటి వరకు ‘ కడల్ ఒరు అతిశయం, అదై కాపాతునమ్ అవశియమ్ ’ (సముద్రం ఒక అద్భుతం, దానిని కాపాడడం అవసరం) పేరుతో ప్రత్యేకించి  వాతావరణ మార్పుల అంశంపై నాలుగు కథనాలను మే, జూన్లలో ప్రసారం చేసింది.   ఎమ్. ఎస్. ఎస్. ఆర్ కు చెందిన తీరప్రాంత వ్యవస్థ పరిశోధన యూనిట్‌కి అధిపతిగా ఉన్న సెల్వం, అతని బృందంలోని ఇతర నిపుణులు ఈ ప్రత్యేక ప్రసార కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. ‘‘ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాతావరణ మార్పుల గురించి  మేము ఎక్కువగా పై స్థాయిలో లేదా నిపుణుల స్థాయిలోనే మాట్లాడతాం. కాని క్షేత్రస్థాయిలోనే, రోజువారీ జీవితంలో వాటి ప్రభావాన్ని అనుభవిస్తున్న వారి మధ్య చర్చ జరగడం చాలా అవసరం’’ అన్నారు సెల్వం

PHOTO • Kavitha Muralidharan
PHOTO • Kadal Osai

(ఎడమ) పంబన్ పట్టణంలో చేపల వ్యాపారం బాగా సాగే ఒక వీధిలో ఉన్న కడల్ ఒసై కార్యాలయం. (కుడి) రేడియో స్టేషన్‌లో పనిచేసే పదకొండు మందిలో డి.రెడిమర్ ఒకరు. ఇప్పటికీ చేపలు పట్టడానికి సముద్రం మీదకు వెళతారు

పంబన్ దీవిలో జరిగిన ఒక పెద్ద మార్పును గురించి అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన కలగడానికి కడల్ ఒసై  మే పదిన ప్రసారం చేసిన కార్యక్రమం ఉపయోగపడింది. పంబన్ వంతెన రామేశ్వరం పట్టణాన్ని భారతదేశపు ప్రధాన భూభాగంతో కలుపుతుంది. దాని పొడవు 2,065 మీటర్లు. రెండు దశాబ్దాల క్రితం వరకు దానికి దగ్గరగా కనీసం వంద కుటుంబాలు నివాసముండేవి. సముద్ర జల మట్టాలు పెరగడంతో అక్కడి నుంచి ఆ కుటుంబాలు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ప్రసార కార్యక్రమంలో వాతావరణ మార్పులు ఇలాంటి పరిస్థితులను ఎలా తీవ్రతరం చేస్తాయో  సెల్వం శ్రోతలకు వినిపించారు.

రేడియో స్టేషన్ విలేకరులు , నిపుణులు , మత్స్యకారులు , ఎవరూ కూడా ఉన్న సమస్యను అతిగా సరళీకరించి చెప్పదానానికి ప్రయత్నించరు. ఏదో ఒక సంఘటన వలనో, ఒక కారణం వలనో ఈ పరిణామాలు సంభవించాయని, వాటిని వివరించేద్దామన్న ఆరాటానికి లోనుకాకుండా తమని తాము నిలవరించుకుంటారు. అయితే సంక్షోభానికి దారితీయడంలో మానవకార్యకలాపాల పాత్రను మాత్రం ఎత్తి చూపుతారు. తమ సమూహాన్ని పరిష్కారాలు కనుగొనే దిశగా ప్రయాణించేలా చేసేందుకు కడల్ ఒసై ప్రయత్నిస్తోంది.

‘‘పంబన్‌ది ఒక దీవి జీవావరణ వ్యవస్థ. కాబట్టే ప్రకృతి విపత్తులకు గురయ్యే అవకాశం మరింత ఎక్కువ’’ అని చెప్పారు సెల్వం. ‘‘కాని ఇసుక తిన్నెలు ఈ దీవిని కొన్నిరకాల శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాలకు గురి కాకుండా కాపాడుతున్నాయి. శ్రీలంక తీరం కూడా కొంతవరకు తుపానుల నుంచి ఈ దీవిని కాపాడుతోంది’’ అని  ఆయన వివరించారు.

అయితే సముద్ర సంపద క్షీణించిపోవడం మాత్రం వాస్తవం.  శీతోష్ణస్థితుల్లో వచ్చిన మార్పులతో పాటు, దానితో సంబంధం లేని ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమైనాయని అంటారాయన. మరపడవలతో పెద్దమొత్తంలో చేపలు పట్టేయడమే ఇప్పుడు చేపలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తీరానికి దగ్గరగా ఉండే  చేపల గుంపులు అపసవ్యదిశలో , వక్రగతిలో తిరుగాడుతుంటాయి.

PHOTO • Kadal Osai
PHOTO • Kavitha Muralidharan

( ఎడమ) పంబన్ దీవికి చెందిన తన తోటి మత్స్యకార సమూహపు మహిళలను ఇంటర్వ్యూ చేస్తున్న ఎమ్. సెలాస్. (కుడి)  ఒక సమూహపు వేదిక అయిన రేడియోస్టేషన్‌ను స్పష్టమైన దిశలో నడిపిస్తున్న ముఖ్యనిర్వాహకురాలు గాయత్రి ఉస్మాన్

‘‘ ఊరల్, సిర, వేలకంబన్ రకాల చేపలు ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయాయి. పాల సుర , కల్వేటి, కొంబన్ సుర రకాల చేపలు ఇప్పటికైతే ఉన్నాయి కాని వాటి సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది.   ఇప్పుడు విచిత్రంగా కేరళలో ఒకప్పుడు విరివిగా దొరికే మత్తి చేపలు, మనవైపు అధిక సంఖ్యలో పడుతున్నాయి.’’ అని  మే 24న ప్రసారమైన కార్యక్రమంలో వివరించారు మధుమిత. మత్స్యకారుల కుటుంబాలకు చెందిన ఆమె కడల్ ఒసైలో రేడియోజాకీగా పనిచేస్తుంది.

రెండు దశాబ్దాల క్రితం వరకు టన్నుల కొద్దీ దొరికిన మండైకలుగు చేపలిప్పుడు కనుమరుగైపోయాయని చెప్పారు అదే కార్యక్రమంలో పాల్గొన్న లీనా అనే పెద్దవయసు మహిళ. అప్పట్లో తమ తరం వాళ్ళు ఆ చేప నోటిని తెరిచి గుడ్లను వెలికి తీసి ఎలా తినేవాళ్ళో ఆమె గుర్తు చేసుకున్నారు. అదెలా చేశారో పూర్తిగా అర్థం చేసుకోవడం ఈ తరానికి చెందిన ఎమ్ సెలాస్ లాంటి మత్స్యకార యువతులకు కూడా కష్టమైంది. ఆమె కడల్ ఒసై లో పూర్తికాలపు యాంకర్‌గా, కార్యక్రమ నిర్వాహణాధికారిగా కూడా పనిచేస్తున్నారు.

“1980లలో కట్టై , శీల, కొంబన్ సుర ఇంకా కొన్ని అలాంటి రకాల చేపలు టన్నులలో దొరికేవి. ఇప్పుడు వాటిని డిస్కవరీ చానల్లో వెతుక్కుంటున్నాం. మా అవ్వ, తాతలు (వాళ్లు నాటుపడవలే వాడేవారు) ఇంజన్ శబ్దాలకు చేపలు బెదిరిపోయి దూరంగా పోతాయని అనేవారు. డీజిల్, పెట్రోలు వల్ల చేపల రుచి మారిందని కూడా అనేవాళ్ళు’’ అని చెప్పారు లీనా. అప్పట్లో మహిళలు సముద్ర తీరం నుంచి కాస్త లోపలికి వెళ్ళి నీళ్లలో వల వేస్తే చాలు చేపలు దొరికేవని గుర్తుచేసుకున్నారామె. ఇప్పుడలా తీరానికి సమీపంగా ఉండే జలాల్లో చేపలు దొరకకపోవడంతో మహిళలు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళడం మానేశారు.

మే 17న ప్రసారమైన కార్యక్రమంలో చేపలు పట్టడంలో వాడే సంప్రదాయపద్ధతుల గురించి, ఈ మధ్య వచ్చిన సాంకేతిక పద్ధతుల గురించి వివరించారు. సమద్ర జీవసంపదను  పరిరక్షించడానికి ఆ రెండిటిని కలిపి ఎలా వాడొచ్చో  చర్చ జరిగింది. “తీరానికి దగ్గరగా సముద్రజలాల్లో  వలలతోనే  పంజరాల్లాంటివి ఏర్పాటు చేసి అందులో చేపలను పెంచే విధానాన్ని, చేప పిల్లలను వృద్ధి చేసే పద్ధతిని(కేజ్ కల్చర్) అవలంబించేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నాం. ఇది సముద్ర జీవ సంపద నాశనమైపోకుండా కాపాడుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ తరహా ఏర్పాట్లకు సహకారాన్ని అందిస్తోంది’’ అన్నారు గాయత్రి.

PHOTO • Kadal Osai

మత్యకారుల సమూహపు అనునాదమై...

పంబన్ దీవికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల ఆంటోని ఇనిగో ఈ పద్ధతిని అనుసరించాలన్న ఆసక్తితో ఉన్నారు. ‘‘గతంలో డగాంగ్‌లు  (సముద్రపు క్షీరదం) వలలో పడితే వాటిని తిరిగి సముద్రంలోకి వదిలే వాళ్లం కాదు. కానీ ఇప్పుడు మన చర్యలు, పర్యావరణ మార్పులు కలిసి వాటిని అంతరించిపోయే దశకు చేర్చాయని తెలుసుకున్నాక అవసరమైతే మా ఖరీదైన వలలు తెగ్గొట్టి కూడా వాటిని సముద్రంలోకి వదలడానికి సిద్ధంగా ఉన్నాం. తాబేళ్ళను కూడా అలానే వదులుతున్నాం’’ అని చెప్పారాయన.

రేడియోలో ఎవరైనా నిపుణులు శీతోష్ణస్థితిలో వచ్చిన మార్పులు చేపలపై చూపుతున్న ప్రభావాన్ని వివరిస్తుంటే మత్స్యకారులు మాతో సంబంధంలోకి వచ్చి అది నిజమేనని తమకు కూడా అనిపిస్తోందని తమ అనుభవం నుంచి చెబుతారు’’ అని చెప్పారు గాయత్రి.

‘‘కొన్ని రకాల చేపలు అంతరించిపోయినందుకు దేవుడిని, ప్రక‌ృతిని నిందించేవాళ్ళం.  చాలావరకు మేం చేసిన తప్పులే అందుకు కారణమని ఈ కార్యక్రమాల ద్వారా అర్థమైంది’’అన్నారు సెలాస్. ఆమెలానే కడల్ ఒసైలో పనిచేసే సిబ్బందంతా మత్స్యకారుల కుటుంబాలకు చెందినవారే, ఒక్క గాయత్రి తప్ప. గాయత్రి - సౌండ్ ఇంజనీర్, ఏడాదిన్నర క్రితం ఆమె ఈ బృందంలో చేరి ఈ సమూహపు వేదికకు ఒక దిశ, లక్ష్యాన్ని తీసుకొచ్చింది.

కడల్ ఒసై కార్యాలయం పంబన్‌లో  చేపలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళతో సందడి సందడి గా ఉండే ఒక వీధిలో ఉంది. సాదాసీదాగా కనిపించే ఈ కార్యాలయం బయట ఒక నీలిరంగు బోర్డు మీద ‘కడల్ ఒసై’ అని రాసి ఉంటుంది .  ఆ పేరు కింద ‘‘ ఎన్ అమతు మున్నేట్రతుక్కన వానోలి ( మన అభివృద్ధి కోసం రేడియో),”అన్న వాక్యం రాసి ఉంటుంది.  ఈ ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్ లోపలికి వెళితే అధునాతన రికార్డింగ్ స్టూడియో ఉంది. పిల్లలకు, మహిళలకు, మత్స్యకారులకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. ఆ కార్యక్రమాల మధ్యలో మత్స్యకారులు పల్లె గీతాలను(అంబ )ను ప్రసారం చేస్తారు. స్టేషన్‌లో పనిచేసే 11మంది ఉద్యోగులలో యశ్వంత్, డి. రెడిమర్ ఈ ఇద్దరు మాత్రమే సముద్రంలో చేపలు పట్టేందుకు వెళతారు.

చాలా ఏళ్ళ క్రితమే యశ్వంత్ కుటుంబం తూత్తుకూడి నుంచి పంబన్‌కు వలస వచ్చింది. ‘‘అక్కడ చేపలు పట్టడం ఏ మాత్రం లాభదాయకం కాదు. మా నాన్నకు అక్కడ కావలసినన్ని  చేపలు పడటమే కష్టమైపోయింది’’ అని చెప్పాడు యశ్వంత్. దానితో పోలిస్తే రామేశ్వరంలో మెరుగే. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ ఇక్కడ కూడా చేపలు దొరకడం తగ్గిపోతూ వస్తోంది. ఈ ఇబ్బందులు ఎవరో చేతబడి చేయడం వల్ల కాదు, బహుశా పర్యావరణంపై మనం చేసిన ‘చేతబడి’ వల్లే వచ్చుంటాయని అతను తెలుసుకునేలా చేసింది కడల్ ఒసై.

మత్స్యకారులకు లాభం మీదే ధ్యాస ఉండడం పట్ల అతను ఆందోళన చెందుతున్నాడు. ‘‘కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పుటికీ తమ ముందుతరాల వాళ్లు పెద్దమొత్తంలో చేపలు పట్టకపోవడం వల్లే తాము పేదలుగా మిగిలిపోయామని నమ్ముతున్నారు. అందుకే అత్యధిక లాభాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అది చివరకు సముద్రం నుంచి మితిమీరి తీసుకోవడమే అవుతోంది. దీనిలో ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన కొంతమంది యువకులం ఆ ‘చేతబడి’కి విరుగుడు కోసం ప్రయత్నిస్తున్నాం’’ అంటున్నాడు యశ్వంత్.

'కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పుటికీ తమ ముందుతరాల వాళ్లు పెద్దమొత్తంలో చేపలు పట్టకపోవడం వల్లే తాము పేదలుగా మిగిలిపోయామని నమ్ముతున్నారు. అందుకే అత్యధిక లాభాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అది చివరకు సముద్రం నుంచి మితిమీరి తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది'

వీడియో చూడండి : వాతావరణ నివేదికను  అందిస్తున్న ఆర్ జె యశ్వంత్

ఇప్పటికీ ఆ పెద్ద సమూహంలో సంప్రదాయకంగా వస్తున్న జ్ఞానం ఒక మంచి వనరుగానే ఉంది. దాని నుంచి తర్వాతి తరాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ‘‘నిపుణులు  తరచూ ఆ సంప్రదాయ జ్ఞానానికి ప్రామాణికతను ఇస్తారు. మేము దానిని ఉపయోగంలోకి తేవాలని గుర్తు చేస్తుంటారు. మా రేడియో స్టేషన్ సంపద్రాయకంగా వస్తున్న జ్ఞానానికి గౌరవం ఇస్తుంది. దానికో వేదికను కల్పిస్తుంది. తద్వారా మా ప్రసారాలలో  మేము అందిస్తున్న నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని మా సమూహం ఉపయోగించుకుంటుంది.’’ అని చెప్పారు మధుమిత

ఆమె చెప్పిన దానితో ఏకీభవిస్తున్నారు పంబన్ నాటు పడవల మత్స్యకారుల సమాఖ్య అధ్యక్షుడు ఎస్. పి. రాయప్పన్. ‘‘సముద్ర జీవరాశిని అతిగా వేటాడడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి మేమెప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాం. అయితే కడల్ ఒసై ఇదే అంశంపై మరింత గట్టి అవగాహనను కలిగించింది. మా వాళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు ఒక డుగాంగ్‌నో, ఒక తాబేలునో  పట్టుకున్నా, దానిని తిరిగి సముద్రంలో వదలడానికి తమ ఖరీదైన విదేశీ వలల్ని కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడిపోతున్నారు’’ అన్నారాయన. బహుశా ఏదో ఒక నాటికి మధుమిత, సెలాస్, వాళ్ల రేడియో స్టేషన్, ఆ దీవి జలాల్లోకి మండైకలుగు ను కూడా తిరిగి తెచ్చేందుకు దోహదపడతారని ఆశిద్దాం.

సమూహాలు నడుపుకునే చాలా రేడియోస్టేషన్లలానే కడల్ ఒసై ప్రసారాలు పదిహేను కిలోమీటర్ల పరిధి వరకే అందుబాటులో ఉంటాయి. కానీ పంబన్ దీవి ప్రజలు మాత్రం కడల్ ఒసైని ప్రేమతో ఆదరిస్తున్నారు. ‘‘మాకు శ్రోతల నుంచి రోజుకు కనీసం పది ఉత్తరాలైనా వస్తాయి. మేము ప్రారంభించినప్పుడు మేమెవరం, ఏ ‘అభివృద్ధి’ గురించి  మాట్లాతున్నాం లాంటి  సందేహాలు వారిలో ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని నమ్ముతున్నారు’’ అన్నారు గాయత్రి.

ఒక్క వాతావరణాన్ని మాత్రమే వారిప్పుడు నమ్మలేకపోతున్నారు .

కవర్ ఫోటో :  జూన్ ఎనిమిదిన  యునైటెడ్ నేషన్స్ ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా పంబన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కడల్ ఒసై అని రాసి ఉన్న బోర్డును పట్టుకున్న పిల్లలు (ఫోటో : కడల్ ఒసై)

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి మాటల్లోనే  రికార్డు చేయాలని, PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: వి. వి. జ్యోతి

Reporter : Kavitha Muralidharan

கவிதா முரளிதரன் சென்னையில் வாழும் சுதந்திர ஊடகவியலாளர் மற்றும் மொழிபெயர்ப்பாளர். இந்தியா டுடே (தமிழ்) இதழின் ஆசிரியராகவும் அதற்கு முன்பு இந்து தமிழ் நாளிதழின் செய்திபிரிவு தலைவராகவும் இருந்திருக்கிறார். அவர் பாரியின் தன்னார்வலர்.

Other stories by Kavitha Muralidharan

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

ஷர்மிளா ஜோஷி, PARI-ன் முன்னாள் நிர்வாக ஆசிரியர் மற்றும் எழுத்தாளர். அவ்வப்போது கற்பிக்கும் பணியும் செய்கிறார்.

Other stories by Sharmila Joshi
Translator : V. V. Jyothi

V.V. Jyothi is an independent journalist and translator from Hyderabad. Previously she worked as a journalist in Prajasakti and Andhra Jyoti newspapers. Currently she is translating books under organizations such as Prajasakti and Malupu. She also writes articles for women's magazines like Maanavi and Matruka.

Other stories by V. V. Jyothi