" మాకు సోమవారం (మార్చి 16 ) నుండి ఏ పని దొరకలేదు, డబ్బులు ఎక్కడనుంచి తీసుకురావాలి?" అంటూ ఐదు రూపాయలు కావాలని పట్టుబట్టిన తన ఏడేళ్ల కూతురుని గుర్తుచేసుకుంటూ చెప్పసాగింది వందన ఉమ్బర్సాడా.
మహారాష్ట్ర లోని వాడాలో నిర్మాణ సైట్లలో పనిచేసే 55 ఏళ్ళ వందన, పాల్గర్ జిల్లాలోని కవాతేపాడ గ్రామంలో తన ఇంట్లో 'ఆంగాన్' లో కూర్చుని ఏం చెప్తుందంటే " మాకసల ఏం జరుగుతుందో తెలీదు. మమ్మల్ని నా కొడుకు ఇంట్లోనే ఉండమన్నాడు, ఎందుకంటే ఏదో వ్యాధి ప్రబలుతుందని ప్రభుత్వం వారు ఎవరిని ఇళ్లు వదిలి బయటకు రావొద్దని చెప్పారంట"
సాయంత్రం 4 గంటలు అయింది, వందన ఇరుగు పొరుగు వారంతా ఆరు బయటకు చేరి ఎన్నో విషయాలు చర్చించుకుంటున్నారు, అందులో ముఖ్యమైనది కోవిడ్-19 సంక్షోభం. అంతమందిలో ఒకే ఒక్క యువతి మాత్రం మాట్లాడేటప్పుడు కనీస దూరం పాటించమని అక్కడి వారిని వారిస్తుంది. గ్రామస్తుల అంచనా ప్రకారం కావాతేపాడలో రామ రమి ఒక డబ్భై ఇళ్లు వరకు ఉండొచ్చు, అందరు కూడా వ్వార్లి ఆదివాసీ తెగకు సంబంధించిన వారే.
ఈ రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ మొదలయ్యే వరకు, వందన మరియు తన పొరుగింటి మణిత ఉమ్బర్సాడా కలిసి ఉదయం ఎనిమిది గంటలకు నడక ప్రారంభించి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడా చుట్టుపక్కల నిర్మాణాలు జరుగుతున్న స్థలాలకు చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు నుండి సాయంత్రం 6 వరకు పని చేస్తే 200 రూపాయలు కూలి తెచ్చుకునేవారు. ఆ విధంగా నెలకి ఒక నాలుగు వేలు వరకు సంపాదిస్తారు. కానీ ఇపుడు అక్కడ గుత్తేదారు దగ్గర ఏ పనీ లేదు.
" నా కొడుకులకి కూడా ఏ పనీ దొరకడం లేదు. మేము తిండి గింజలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. కానీ ఏ పనీ లేకుండా ఎలా.?" అని అడిగింది వందన. “మా కోటా సరుకులు కూడా అయిపోతున్నాయి. కేవలం పచ్చడి మెతుకులు పెట్టి మా పిల్లల కడుపులు నింపాలా?. ఇది త్వరగా ముగిస్తే బావుండు"
వందనకి ముగ్గురు కొడుకులు, 11 మంది మనుమలు. తన కొడుకులు ఇటుక బట్టీల దగ్గర లేక వాడాలో నిర్మాణాలు జరుగుతున్న స్థలాల దగ్గర పనిచేస్తుంటారు. వాడా 1 ,54 ,416 జనాభా, 168 గ్రామాలున్న ఒక తాలూకా. వందన భర్త మద్యానికి బానిసై , ఆరోగ్యం పాడై పదిహేనేళ్ల క్రితమే కాలంచేశాడు. తను అక్కడే ఉన్న ఒక దుకాణం లో పనిచేసేవాడు.
కవాతేపాడ నుండి ఎంతో మంది వారి వారి కుటుంబాలను ఊరిలోనే వదిలేసి కాలానుగుణంగా 90 కిలోమీటర్స్ దూరం లో ఉన్న ముంబై నగరానికి వలస వెళ్తారు. " నా కొడుకు కోడలు భివాండీ లో ఉన్నారు (పడ నుండి 45 కి.మీ. దూరం). వాళ్ళు మూడు నెలల పనికి ఒక నిర్మాణం జరిగే స్థలం లో ఉంటున్నారు. వారి పిల్లలను సాకాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు పాఠశాలలు కూడా మూసేసారు, మధ్యానభోజనం కూడా దొరకదు" అంది వందన
తన రెండో కొడుకు మారుతీ (32 సం||) కూడా నిర్మాణ రంగ కార్మికుడుగా వాడా లోనే పనిచేస్తాడు. " ప్రభుత్వం ఈ వ్యాధి ప్రబలకుండా అన్నింటిని మూసివేసింది" అంటాడు మారుతి. తను కూడా మార్చ్ 16 నుండి ఉపాధిని కోల్పోయాడు.
" వార్తా ఛానళ్లు ఈ వ్యాధిని నివారించాలంటే ప్రతి గంటకు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి అని ప్రచారం చేస్తున్నాయి. కానీ మేము ఆకలితో ముందే చనిపోతే మమ్మల్ని సబ్బులేం కాపాడతాయి”
కవాతేపాడలో, 12 చదరపడుగుల ఒక చిన్న ఇంటిలో తను, తన తల్లి, వదిన వైశాలి, భార్య మనీషా (ఇద్దరూ గృహిణిలు) మరియు ఇద్దరు పిల్లలు ఉంటారు. " మా వదినని ప్రతి వారం ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తను అధిక మధుమేహం తో బాధపడుతుంది. నిత్యం ఇంజెక్షన్స్ చేయాలి". ప్రతి ఇన్సులిన్ ఖరీదు రూ|| 150 . " మేము ఎంతో భారంగా రోజు కూలి మీద జీవనం సాగిస్తుంటాము. ఏ పని లేకుండా నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి?"
ఆరు బయట గుముగూడిన సామూహంలో, వందన పక్కింటి మణిత ఉమ్బర్సాడా (48 సం ||) మాటాడుతుంది. తను కూడా నిర్మాణాలు జరిగే స్థలాల్లో బరువులను లోడింగ్, ఆన్లోడింగ్ చేస్తూ, రోజులో ఎనిమిది గంటలు పని చేస్తే రూ|| 200 సంపాదిస్తుంది. " వ్యవసాయ పని కన్నా ఈ పని ఎంతో మెరుగు. రోజంతా ఎండలో పనిచేయక్కర్లేదు, ఇందులో కనీసం సమయానికి కూలి డబ్బులైనా వస్తాయి". " కానీ ఇపుడు వాడాలో ఎవరు ఏ పని ఇవ్వట్లేదు, ఇంక ఇక్కడే దగ్గర్లో ఏదైనా పొలం పని ఉందేమో చూసుకోవాలి" అంది మణిత.
[ ప్రస్తుతానికి ఉన్న తిండి గింజలతో ఈ నెల ఎలాగోలా గడిపేస్తున్నారు, కానీ పోను పోను పని, డబ్బులు లేకుండా ఎలా బతకాలి అనేదే వాళ్లకి తోచట్లేదు ]
మణిత భర్తకి 50 సం||. పదేళ్ల క్రితమే మధుమేహం వలన ఒక కాలిని పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి ఏ పనికి పోవట్లేదు. తను ఒకప్పుడు కౌలు రైతు. వాళ్లకి ఐదుగురు కొడుకులు. వాళ్ళు కూడా వాడాలో నిర్మాణ రంగ కార్మికులుగా లేక చిన్న ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటారు. 23 సం|| కల్పేష్ అందరికన్నా చిన్న, అతను ఒక పైపులు తయారు చేసే కర్మాగారం లో నెలకి రూ 7000 జీతానికి పనిచేస్తుంటాడు. " వాళ్ళు మమ్మల్ని పనిలోకి రావద్దన్నారు. మా జీతాలలో కూడా కోత విధిస్తారేమో తెలీదు" అంటూ కంగారుపడ్డాడు.
ఆరుగురు మనుమలతో కలిపి మొత్తం 15 మంది కుటుంబం వాళ్లది. ఇప్పుడు ఎవరికీ ఎటువంటి ఆదాయం లేదు. ప్రస్తుతానికి ఉన్న తిండి గింజలతో ఈ నెల ఎలాగోలా గడిపేస్తున్నారు, కానీ పోను పోను పని, డబ్బులు లేకుండా ఎలా బతకాలి అనేదే వాళ్లకి తోచట్లేదు.
18 సం|| వయసు గల సంజయ్ తుమ్బడా మణిత వాళ్లకి మూడిళ్లు అవతల నివసిస్తూ ఉంటాడు. మార్చ్ 17 నుండి తను కూడా ఏమీ సంపాదించలేదని వాపోతున్నాడు. తను కూడా పాల్గర్ జిల్లాలోని ఇటుక బట్టీల దగ్గర నెలకు ఒక 20 రోజులు, రూ|| 300 -400 రోజుకూలికి పని చేస్తుంటాడు. వాడలోని పనులకి మనుషులని సమకూర్చే ఒక గుత్తేదారు ఏమైనా పని ఉంటే చెప్తుంటాడు. తను కూడా ఒక వారం నుండి రాలేదు. " నేను వార్తల్లో చూసా, ఈ నెలంతా దుకాణాలు మూసేస్తారని". సంజయ్ మాట్లాడుతూ " ఇప్పటికే మా దగ్గరున్న తిండి గింజలు తక్కువ. వచ్చే వారం నుండి ఉన్నవి కూడా నిండుకోవడం మొదలవుద్ది"
20 సం|| అజయ్ బోచల్ కూడా అదే ఆందోళన వ్యక్తపరుస్తున్నాడు. తను కూడా నిర్మాణాలు జరిగే సైట్లలో పనిచేస్తుంటాడు. " మా అమ్మ రెండు రోజుల నుండి ములక్కాళ్ళ కూరే చేసింది. ఇంతలో పని దొరక్కపోతే ఇంక డబ్బులు వేరే వాళ్ళని అడగాలి." అజయ్ తల్లికి 42 సం||, తను కూడా వాడాలో ఓ ఇంట్లో పని మనిషిగా చేసేది. తను కొన్ని నెలల నుండి అలసట వలన పని మానేసింది. ఆమె భర్త సురేష్ మద్యానికి బానిస. చాలా రోజులనుండి పనికి కూడా పోవట్లేదు.
కుటుంబం దగ్గర ఉన్న ఆహార నిల్వలు, సరుకులు చాలా వరకు అయిపోయాయి. " మాకు కిలో రూ|| 2 చొప్పున 12 కిలోల గోధుమలు, కిలో రూ|| 3 చొప్పున 8 కిలోల బియ్యం ప్రభుత్వం రేషన్ కోటా కింద ఇస్తుంది. ఇప్పుడు ఈ నెల తిండి గింజలు కొనటానికి డబ్బులు కావాలి" అంటూ చెప్పసాగాడు అజయ్. వాడాలో రేషన్ దుకాణం ప్రతి నెల 10 వ తేదీ సరకులతో సిద్ధంగా ఉంటుంది. సాధారణంగా అజయ్ వాళ్ళు ఈ తేదీ తరవాత, వాళ్ళ ఇంట్లో సరుకులు అయిపోయే సమయానికి ఆ దుకాణానికి వెళ్లి ఆహార ధాన్యాలు తెచ్చుకుంటారు. క్రిందటి వారం మార్చ్ 20 కే వాళ్ళదగ్గరున్న సరుకులన్నీ చాలా వరకు నిండుకున్నాయి. నేను అజయ్ తో రెండు రాత్రుల క్రితం మాట్లాడే సమయానికి వారికి సరుకులేవి సమకూరలేదు. ఆ రాత్రికి పప్పన్నంతో కానిచ్చేశారు. అజయ్, తన తల్లి ఏదోలా అక్కడ దగ్గర్లో ఉన్న ఫార్మ్ హౌస్ లో పనికి కుదురుకుంటుందని ఆశిస్తున్నాడు
ముంబై లోని పరేల్ దగ్గర ఉన్న KEM హాస్పిటల్ లో గాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు సర్జన్ గా పని చేస్తున్న డా|| అవినాష్ సూపే ఏమంటారంటే " ఇపుడు రోజు కూలీలకు తక్షణ సమస్య కోవిడ్-19 కాదు, భోజనం దొరకదేమో అనే భయం". " రోజువారీ బ్రతుకు బండి నడవాలంటే కార్మికులకు రోజుకూలి చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు వలస కూలీలు తిరిగి వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లకుండా చూడటం చాలా ముఖ్యం. ఇప్పుడు గ్రామాల నుండి పట్నాలకి గాని లేక అటు నుండి ఇటు గాని రాకపోకలు జరిగితే సామాజిక వ్యాప్తి పెరగడానికి కారణం అవుతాయి. ఇప్పుడు మనం అందరికి ఈ కరోనా వైరస్ గురించి మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది".
కవాతేపాడ గ్రామస్తులకు అందుబాటులో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వాడాలోనిదే. వాడాలోని గ్రామీణ ప్రభుత్వాసుపత్రిలో పని చేసే డా|| శైల అధావు ఏమంటారంటే " మాకు అసలేం జరుగుతుందో తెలీదు, కరోనా వైరస్ కి సంబంధించిన ఏ పరీక్షలు నిర్వహించటానికి కూడా ఇక్కడ సౌకర్యాలు లేవు. కేవలం ఒక సాధారణ రక్త పరీక్ష మాత్రమే చేయగలం". " ఈ వైరస్ మరింత ప్రబలకుండా జాగ్రత్త పడటం, ఇంకా స్వీయ ఏకాంతం లో ఉండటం ఒక్కటే మార్గం"
ప్రస్తుతం కవాతేపాడ గ్రామస్తులకి ఇంటిపట్టున ఉండడం కన్నా పని, ఆదాయం ఇంకా భోజనం ముఖ్యం. " మోడీ సర్కారు ఈ వైరస్ ప్రబలడం మూలాన అన్నీ మూసేసి మమ్మల్ని ఇంట్లోనే ఉండమంటున్నారు". " కానీ ఇళ్లలోనే ఉండే స్థోమత మాకేది?" ఆందోళన చెప్పింది వందన.
అనువాదం: వంశీ ముత్యాల