మూడు దశాబ్దాల క్రితం, యువకుడైన సంజయ్ కాంబ్లేకు వెదురుతో ఎలా పని చేయాలో ఎవరూ నేర్పించలేదు. కానీ నేడు, ఆయన కనుమరుగైపోతున్న ఆ నైపుణ్యాన్ని అందరికీ నేర్పించాలనుకున్నప్పుడు, ఎవరూ నేర్చుకోవాలనుకోవడం లేదు. "విధి వైపరీత్యం కాకుంటే కాలం ఎంతలా మారిపోయింది!" అని 50 ఏళ్ళ సంజయ్ అన్నారు.
తన ఎకరం పొలంలో పెరిగే వెదురుతో, కాంబ్లే ఇర్లేలను తయారుచేస్తారు. ఇర్లే అంటే పశ్చిమ మహారాష్ట్రలోని ఈ ప్రాంతంలో వరి పండించే రైతులు ఉపయోగించే ఒక రకమైన గూడ [రెయిన్‌కోట్ వంటిది]. "దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం, ప్రతి రైతు పొలాల్లో పని చేసేటప్పుడు ఒక ఇర్లేను ఉపయోగించేవాడు. ఎందుకంటే, మా షాహువాడీ తాలూకాలో అప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసేవి," అని కెర్లే గ్రామానికి చెందిన సంజయ్ చెప్పారు. ఆయన కూడా తన పొలంలో పని చేసేటప్పుడు ఇర్లేను ధరించేవారు. ఈ వెదురు గూడ కనీసంగా ఏడు సంవత్సరాల పాటు మన్నికగా ఉంటుంది, "ఆ తర్వాత కూడా దీనికి సులభంగా మరమ్మతులు చేయవచ్చు," అన్నారాయన..
కానీ పరిస్థితులు మారిపోయాయి.
కొల్హాపూర్ జిల్లాలో జూలై - సెప్టెంబర్ మధ్య వర్షపాతం గత 20 సంవత్సరాలలో 1,308 మి.మీ. (2003) నుంచి 973 మి.మీ.(2023)కు తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
"ఇక్కడ వర్షపాతం ఇంతగా తగ్గిపోతుందని, అది నా కళను చంపేస్తుందని ఎవరికి తెలుసు?" అని ఇర్లేలను తయారుచేసే సంజయ్ కాంబ్లే వాపోయారు.
"మేం ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యవసాయం చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది," అని కాంబ్లే చెప్పారు. చాలా సంవత్సరాలుగా, వర్షాలు కురవటం తగ్గిపోవటంతో చాలామంది గ్రామస్తులు ముంబై, పుణెలాంటి నగరాలకు వలస వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు రెస్టరెంట్లలో, ప్రైవేట్ బస్సు కంపెనీలలో కండక్టర్లుగా, తాపీ పనివారిగా, రోజువారీ కూలీలుగా, వీధి వ్యాపారులుగా, లేదంటే మహారాష్ట్ర అంతటా పొలాల్లో కూలీలుగా పని చేస్తున్నారు.


















