“ఎయ్ గాచ్, ఎయ్ ఘర్, ఎయ్ మాటిర్ జే మాయా, షెయ్ మాయా లియే అమ్రా కుథాయ్ జాబో? (ఈ చెట్టు... ఈ ఇల్లు... ఈ నేల మెత్తదనం... ఈ ప్రేమనంతా ఎక్కడికని తీసుకువెళ్తాం?)”
అపున్‌కురి హేంబ్రమ్‌కు విచారంగానూ కోపంగా కూడా ఉంది. "ఇదంతా నాది," కళ్ళు తిప్పి చుట్టుపక్కలంతా చూస్తూ అన్నారామె. "నాకు నా సొంత భూమి ఉంది," భూమి మీద ఒక చోటి నుండి మరో చోటుకు గుర్తులు చూపిస్తూ అన్నారు 40 ఏళ్ళ వయసున్న అపన్‌కురి. 5-6 బిఘాలున్న (సుమారు ఒకటిన్నర ఎకరం) ఆమె పొలంలో వరి పండిస్తారు.
"ఇన్నేళ్ళుగా నేను కష్టపడి కట్టుకున్నదాన్నంతా ఈ ప్రభుత్వం తిరిగి ఇవ్వగలుగుతుందా?" పశ్చిమ బెంగాల్, బీర్‌భూమ్ జిల్లాలోని దేవ్‌చా పచామి (దీవ్‌చా పచ్మీ అని కూడా పలుకుతారు) రాష్ట్ర బొగ్గు గనుల ప్రాజెక్టు అపన్‌కురి స్వగ్రామమైన హరిణ్‌సింగాతో సహా 10 గ్రామాలను తుడిచిపెట్టబోతోంది.
"ఇదంతా వదిలేసి మేమెక్కడికి వెళ్ళాలి? మేం ఎక్కడికీ వెళ్ళేది లేదు," దృఢంగా చెప్పారు అపన్‌కురి. బొగ్గు గనికి వ్యతిరేకంగా ముందు నిలిచి పోరాడుతున్నవారిలో ఈమె కూడా ఒకరు. ఆమెవంటి మహిళలు సభలనూ ఊరేగింపులనూ నిర్వహిస్తూ కర్రలు, చీపుర్లు, కొడవళ్ళు, కటారులు (ఒక రకమైన కత్తి) వంటి వంటింటి, వ్యవసాయ పరికరాలనే ఆయుధాలుగా పోలీసుల, పాలక పార్టీల ఉమ్మడి బలాన్ని ఎదుర్కొంటున్నారు.
శీతాకాలపు మధ్యాహ్నపు సూర్యుడు హరిణ్‌సింగా గ్రామంపై తళతళా మెరుస్తున్నాడు. గ్రామం మొదట్లోనే ఇటుకలతో నిర్మించిన గదులూ, పలకల పైకప్పుతో ఉన్న తన పొరుగువారైన లబసా ఇంటి ప్రాంగణంలో నిల్చొని, అపన్‌కురి మాతో మాట్లాడుతున్నారు.
"మా భూమి కోసం వాళ్ళు మా ప్రాణాలనే తీయాల్సుంటుంది," మాటల్లోకి వస్తూ అన్నారు లబసా హెంబ్రమ్. గత రాత్రి వండిన మిగిలిపోయిన కూరగాయలను అన్నం, నీళ్ళతో కలిపి మధ్యాహ్న భోజనంగా తీసుకుంటూ ఆమె ఈ చర్చలో పాల్గొన్నారు. 40 ఏళ్ళ లబసా రాళ్ళను పగలగొట్టే క్రషర్‌లో పనిచేస్తున్నారు. క్రషర్‌లో రోజువారీ వేతనం రూ. 200 నుండి 500 వరకూ ఉంటుంది.








