"దాని గురించి మాకేమీ తెలియదు," బడ్జెట్ గురించి నేను పదే పదే అడుగుతోన్న ప్రశ్నలను మొహమాటం లేకుండా తోసిపడేస్తూ అన్నారు బాబాసాహెబ్ పవార్.
"మాకేం కావాలో ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు అడిగింది?" ఆయన భార్య మందా, జవాబు తెలుసుకోవాలన్నట్టుగా అడిగారు. "అదేమీ తెలుసుకోకుండా మా గురించి వాళ్ళెలా నిర్ణయం తీసుకుంటారు? మాకు నెలలో 30 రోజులూ పని కావాలి."
పుణే జిల్లా శిరూర్ తాలూకా లోని కురులీ గ్రామ శివారులో ఉన్న వారి ఒంటి గది తగరపురేకుల ఇల్లు ఈ ఉదయం అసాధారణంగా రద్దీగా ఉంది. “మేం 2004లో జాల్నా నుండి ఇక్కడికి వలస వచ్చాం. మాకెప్పుడూ మా స్వంత గ్రామమనేది లేదు. మేం వలసపోతుంటాం కాబట్టి మా ప్రజలు ఎప్పుడూ గ్రామాల వెలుపలే నివసిస్తారు,” బాబాసాహెబ్ చెప్పారు.
ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చేత 'నేరస్థ' తెగగా ముద్ర వేయబడిన భిల్ పారధీలు, ఆ ముద్ర నుంచి విముక్తి పొందిన 70 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక వివక్షకు గురవుతూ, లేమి నిండిన జీవితాన్ని కొనసాగిస్తున్నారనే విషయాన్ని ఆయన బయటకు చెప్పలేదు. మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన తర్వాత కూడా. వారు వలస పోవడానికి వారిపై జరిగే అణచివేతే తరచుగా కారణమవుతోంది.
సహజంగానే వారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వలసల గురించి మాట్లాడిన మాటలు వినలేదు. ఒకవేళ వినివున్నా కూడా అది వారినేమీ ఆకట్టుకోదు. "గ్రామీణ ప్రాంతాలలో పుష్కలమైన అవకాశాలను సృష్టించడమే లక్ష్యం, తద్వారా వలసలు ఒక ఎంపిక అవుతాయి తప్ప అవసరం కాకుండా ఉంటాయి," అని ఆమె తన 2025-26 బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది.
![](/media/images/02-IMG_20221017_125148-J-What_we_want_is_w.max-1400x1120.jpg)
నలుగురితో కూడిన ఈ భిల్ పారధీ కుటుంబానికి - బాబాసాహెబ్ (57) (కుడివైపు చివర), మందా (55) (ఎరుపు, నీలం రంగు చీరలో), వారి కుమారుడు ఆకాశ్ (23), కోడలు స్వాతి (22) - నెలలో 15 రోజుల కంటే ఎక్కువ రోజులు పని దొరకదు. వారు వలసపోవటం అనేది ఎప్పుడూ అణచివేత వల్లనే తప్ప వారు ఎంచుకున్నందువలన కాదు
విధాన రూపకల్పన జరిగే చోటు నుండి దాదాపు 1,400 కిలోమీటర్ల దూరంలో ఉండే భిల్ పారధీ సముదాయానికి చెందిన బాబాసాహెబ్, ఆయన కుటుంబానికి జీవితంలో ఎంపికలు, అవకాశాలు కూడా చాలా దూరంగానే ఉంటాయి. భారతదేశంలోని భూమిలేని 144 మిలియన్ల ప్రజలలో వారు కూడా ఒక భాగం. వీరికి పని దొరకడమే ఒక పెద్ద సవాలు.
“మాకు నెలలో 15 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. మిగిలిన రోజుల్లో మేం నిరుద్యోగులం," బాబాసాహెబ్ కొడుకు ఆకాశ్ చెప్పాడు. కానీ ఈరోజు చాలా అరుదైన రోజు. ఆ నలుగురికీ - ఆకాశ్ (23), అతని భార్య స్వాతి (22), మందా (55), బాబాసాహెబ్ (57) - సమీప గ్రామంలోని ఉల్లి పొలాల్లో పని దొరికింది.
ఈ సెటిల్‌మెంట్‌లో నివసించే 50 ఆదివాసీ కుటుంబాలకు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు లేవు. “మేం మరుగుదొడ్డి అవసరాల కోసం అడవుల్లోకి వెళ్తాం. ఆరామ్ [సౌకర్యం] లేదు, భద్రతా లేదు. సమీప గ్రామాల్లో ఉందే బగాయత్‌దార్ [హార్టికల్చర్ రైతులు] మా ఏకైక ఆదాయ వనరు,” అందరి కోసం అల్పాహారం ప్యాక్ చేస్తోన్న స్వాతి చెప్పింది.
“ఉల్లిపాయల కోతకు మాకు రోజుకు 300 రూపాయలు వస్తుంది. జీవనోపాధికి ప్రతి రోజూ ముఖ్యమైనదే,” బాబాసాహెబ్ చెప్పారు. వారికి ఎంత తరచుగా పని దొరుకుతుందో అనే దానిపై ఆధారపడి వారి కుటుంబ ఉమ్మడి ఆదాయం ఏటా కేవలం రూ. 1.6 లక్షలు ఉంటుంది. ఈ ఆదాయపు పన్నుపై రూ. 12 లక్షల మినహాయింపు వారికి అర్థంలేని విషయం. “కొన్నిసార్లు మేం ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తాం, కొన్నిసార్లు ఇంకా ఎక్కువే నడుస్తాం. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళతాం," అన్నాడు ఆకాశ్.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి