ఝార్ఖండ్‌లోని చెచరియా గ్రామంలో ఉండే సవితా దేవి మట్టి ఇంటి గోడల మీంచి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటం కిందకి చూస్తూ ఉంది. "బాబాసాహెబ్ మాకు ఇచ్చారు [వోటు వేసే హక్కులు], అందుకనే మేం వోటు వేస్తున్నాం," అంటారు సవిత.
సవితకు ఒక బిఘా (0.75 ఎకరం) సొంత భూమి ఉంది. అందులో ఆమె ఖరీఫ్ కాలంలో వరి, మొక్కజొన్న; రబీ కాలంలో గోధుమ, చనా(సెనగ), నూనె గింజలను పండిస్తారు. తన పెరటిలో కూరగాయలను పెంచాలని ఆమె అనుకుంటున్నారు. "కానీ రెండేళ్ళుగా, నీరు లేదు"; వరుసగా రెండేళ్ళ పాటు వచ్చిన కరవు ఆమె కుటుంబాన్ని అప్పులపాలు చేసింది.
ముప్పైరెండేళ్ళ వయసున్న సవిత తన నలుగురు పిల్లలతో కలిసి పలామూ జిల్లాలోని ఈ గ్రామంలో నివసిస్తున్నారు; ఆమె భర్త ప్రమోద్ రామ్ (37) అక్కడికి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరులో వలస కార్మికుడిగా పనిచేస్తారు. "ప్రభుత్వం మాకు ఉద్యోగాలివ్వటం లేదు," అంటారు దినసరి కూలీగా పనిచేసే ఈ దళితుడు. "మా సంపాదన పిల్లలను పోషించేందుకు కనాకష్టంగా సరిపోతుంది."
నిర్మాణ ప్రదేశాలలో పనిచేస్తున్న ప్రమోద్, నెలకు 10,000-12,000 వరకు సంపాదిస్తారు. కొన్నిసార్లు ఆయన ట్రక్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తారు కానీ ఆ అవకాశం ఏడాది పొడుగునా ఉండదు. "మగవాళ్ళు నాలుగు నెలలపాటు ఇంటి దగ్గరే కూర్చుంటే, మేం బిచ్చమెత్తుకోవడం మొదలెట్టాలి. మరేం చేయగలం [వలసపోవటం తప్ప]?" అనడుగుతారు సవిత.
960 మంది (జనగణన 2011) నివాసముండే చెచరియా గ్రామానికి చెందిన మగవాళ్ళలో ఎక్కువమంది పని కోసం వెతుక్కుంటూ వలస వెళ్తారు. "ఇక్కడ ఉద్యోగావకాశాలు లేవు. ఇక్కడే పని దొరికితే, జనం ఎందుకు పనికోసం బయటికి వెళ్ళటం?' సవితా దేవి అత్తగారైన 60 ఏళ్ళ సుర్‌పతి దేవి అంటారు.












