నాలుగవ రోజున నేను వచ్చాను; నేనక్కడికి చేరేసరికి మధ్యాహ్నం కావొస్తోంది.
చెన్నై నుంచి వయనాడుకు చేసిన ప్రయాణంలో, స్వచ్ఛందసేవకులతో నిండిన ప్రాంతాలను దాటాను. ఎక్కడా బస్సులు లేవు, అపరిచితులను లిఫ్ట్ అడిగి వెళ్ళాల్సివచ్చింది.
లోపలికీ బయటకూ తిరుగుతోన్న ఆంబులెన్సులతో ఆ ప్రదేశం ఒక యుద్ధభూమిని తలపిస్తోంది. భారీ యంత్రాల సాయంతో జనం మృతదేహాలను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు. సూరల్‌మల, అట్టమల, ముండక్కై పట్టణాలు శిథిలమైపోయాయి. ఎక్కడా నివాసయోగ్యమైన చోటు ఉన్న సంకేతాలు లేవు. అక్కడ నివసించేవారి జీవితాలు చితికిపోయి, వారు తమ ప్రియమైనవారి మృతదేహాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు.
నదీతీరాలు శిథిలాలతోనూ, మృతదేహాల కుప్పలతోనూ నిండివున్నాయి. రక్షకులూ, కుటుంబ సభ్యులూ నది ఒడ్డున మృతదేహాల కోసం వెతుకుతూ, తాము ఇసుకలో కూరుకుపోకుండా ఉండేందుకు కర్రలను ఉపయోగిస్తున్నారు. నా కాలు ఇసుకలో ఇరుక్కుపోయింది. అక్కడ మృతదేహాలను గుర్తించడం అసాధ్యం, వాటి శకలాలు మాత్రమే చుట్టూ చెల్లాచెదురుగా పడివున్నాయి. నాకు ప్రకృతితో లోతైన సంబంధం ఉంది, అయినా ఈ అనుభవం నన్ను భయపెట్టింది.
భాషా అడ్డంకి కారణంగా, నేను ఆ వినాశనానికి సాక్షిగా మాత్రమే ఉండగలిగాను. వారికి అడ్డురాకుండా వెనకే ఉండిపోయాను. నేను ఇంతకుముందే ఇక్కడికి రావాలనుకున్నాను, కానీ నా అనారోగ్యం వలన రాలేకపోయాను.
నీటి ప్రవాహాన్ని అనుసరిస్తూ నేను సుమారు మూడు కిలోమీటర్లు నడిచాను. ఇళ్ళు భూమిలోకి పూడుకుపోయివున్నాయి, కొన్నయితే పూర్తిగా కనిపించటమేలేదు. అన్నిచోట్లా స్వచ్ఛందసేవకులు మృతదేహాల కోసం వెదుకుతుండటాన్ని చూశాను. సైన్యం కూడా గాలింపును చేపట్టింది. నేనక్కడ రెండు రోజులు ఉన్నాను, ఆ సమయంలో ఎక్కడా మృతదేహాలు కనిపించలేదు, కానీ వాటి కోసం గాలింపు మాత్రం నిర్విరామంగా సాగింది. అందరూ కలిసి పనిచేస్తూ, ఆహారాన్నీ తేనీటినీ పంచుకుంటూ, పట్టు వదలకుండా పనిచేస్తున్నారు. ఆ ఐక్యతా భావన నన్ను ఆశ్చర్యపరచింది.































