సమాచారాన్ని తెలియచేయటంలో వారికుండే అడ్డంకులతో పాటు, సంరక్షకులపై ఆధారపడటం వంటివాటి వలన భారతదేశంలో మానసిక, శారీరక వైకల్యాలు ఉన్న బాలికలు, మహిళలు కూడా లైంగిక హింసకు ఎక్కువగా గురవుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. మానసిక వైకల్యంతో జీవిస్తోన్న 21 ఏళ్ళ కజ్రీ విషయంలో జరిగినట్టుగా, ఫిర్యాదు నమోదు అయినప్పటికీ కూడా, చట్టపరమైన ప్రక్రియే శిక్షగా కూడా మారుతుంది. 2010లో కిడ్నాప్‌కు గురైన కజ్రీ, పదేళ్ళ పాటు అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల కార్మిక బాధితురాలిగా గడిపింది. "పోలీసు స్టేట్‌మెంట్‌లు, పరీక్షలు మొదలైనవాటి కోసం కజ్రీని రోజుల తరబడి తిప్పడానికి నాకు సెలవులు అవసరం కావటంతో నా ఉద్యోగాన్ని ఒకే చోట కొనసాగించడం కష్టంగా మారింది. నేను తరచుగా సెలవు అడుగుతుండటంతో నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నారు," అని కజ్రీ తండ్రి తెలియజేశారు.
"సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థను సృష్టించడం, వారిని [మహిళలను] నిరంతరం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత" గురించి ప్రొ. ఉమా చక్రవర్తి Conceptualising Brahmanical Patriarchy in Early India అనే వ్యాసంలో రాశారు. వ్యాసంలో పేర్కొన్నట్లుగా ఈ నియంత్రణ తరచుగా పితృస్వామ్య నిబంధనలను అమోదించే మహిళలను గొప్పచేసి, ఆమోదించనివారిని అవమానించడం రూపంలో జరుగుతుంది. మహిళల చలనశీలతను హింసాత్మకంగా పరిమితం చేసే నియంత్రణా నిబంధనలు తరచుగా మహిళల లైంగికత, వారి ఆర్థిక స్వాతంత్య్రానికి సంబంధించిన భయాలతో ముడిపడి ఉంటాయి. “ఇంతకుముందు, నేను గ్రామంలో ఎవరైనా గర్భిణీ స్త్రీని చూడటానికో, లేదా వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికో వెళ్ళినప్పుడు, నేను ఇతర పురుషులను కలవడానికి వెళ్తున్నానని వారు [ఆమె అత్తమామలు] అనేవారు. ఒక ఆశాగా అది నా కర్తవ్యం,” అని 30 ఏళ్ళ గిరిజ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో నివాసముండే గిరిజ, తాను చేస్తోన్న అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) ఉద్యోగాన్ని మానేయాలని ఆమె అత్తమామల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. "నిన్న నా భర్త తాత నన్ను లాఠీ (కర్ర)తో కొట్టాడు. నా గొంతు నులిమే ప్రయత్నం కూడా చేశాడు," అన్నారామె.
మరో జెండర్ సంబంధిత అవరోధం ఏమిటంటే, మహిళలు పని చేస్తూ, అందుకు వేతనం పొందే పనిప్రదేశాలలో ఎదుర్కొనే వేధింపులు. దేశ రాజధాని ప్రాంతంలోనూ, బెంగళూరులోనూ వస్త్ర పరిశ్రమలలో పనిచేసే కార్మికులలో నిర్వహించిన సర్వే ప్రకారం, 17 శాతం మంది మహిళా కార్మికులు పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురైన సందర్భాలను నివేదించారు. "పురుష మేనేజర్లు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు మమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఈ విషయంగా ఫిర్యాదు చేయాలంటే ఎవరూ ఉండరు," అని వస్త్ర పరిశ్రమలో కార్మికురాలైన లత (చదవండి: దిండుక్కల్‌లో దళిత మహిళలు సంఘటితమైన వేళ) పేర్కొన్నారు. మహిళా కార్మికుల సామూహిక సంప్రదింపుల సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో, ఒక మహిళ నేతృత్వం వహించేలా, ఇందులో సగానికి తక్కువ కాకుండా మహిళలు ఉండేలా ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని సంస్థలకు విశాఖ గైడ్‌లైన్స్ (1997) సిఫార్సు చేసింది. కాగితంపై ఇటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటి అమలు మాత్రం బలహీనంగానే కొనసాగుతోంది. పనిలోనూ, ఇళ్ళల్లోనూ మహిళలపై హింస పెచ్చరిల్లిపోతోంది.