అంజన్ గ్రామ శివారులలో ఉన్న ఒక చిన్నగుట్ట కాషాయం, తెలుపు రంగుల జెండాలతో నిండి ఉంది. తెల్ల జెండాలు ప్రకృతిని ఆరాధించే సర్నా ఆదివాసీ సముదాయానికి - ఇక్కడ ఉరాంవ్ ఆదివాసులు - చెందినవి కాగా, కాషాయ జెండాలు ఝార్ఖండ్ రాష్ట్రం, గుమ్లా జిలాలో ఉన్న ఈ కొండపై 1985లో హిందువులు నిర్మించిన హనుమాన్ గుడికి చెందినవి. ఇది తమ దేవుడి జన్మస్థలంగా హిందువులు చెప్పుకుంటారు.
అక్కడి వెదురు గేటుకు రెండు కమిటీల పేర్లు ఉన్న పెద్ద బ్యానర్లు కట్టివున్నాయి. అటవీ శాఖ, అంజన్ గ్రామ నివాసులు (సంయుక్త్ గ్రామ్ వన ప్రబంధన్ సమితి కింద కలిసి పనిచేస్తారు) గుమ్లా వన్ ప్రబంధన్ మండల్ కింద సంయుక్తంగా 2016 నుంచి ఈ తీర్థయాత్రను నిర్వహిస్తున్నారు. 2019లో హిందువులు ఏర్పాటుచేసిన అంజన్ మందిర్ వికాస్ సమితి ఇక్కడి గుడిని నిర్వహిస్తుంటుంది.
స్వాగతం పలుకుతోన్న వెదురు గేటును దాటుకుని లోపలికి వెళ్ళగానే, రెండు వేర్వేరు ఆరాధనా స్థలాలకు దారితీసే రెండు వేర్వేరు మెట్ల వరస మాకు కనిపించింది. ఒక మెట్ల వరుస మిమ్మల్ని తిన్నగా కొండపైనున్న హనుమాన్ గుడికి తీసుకువెళ్తుంది. రెండో మెట్లవరుస ఆదివాసీ పాహణ్‌లు ఈ హిందువుల గుడి ఉనికిలోకి రాకముందు కొన్ని శతాబ్దాల క్రితం నుంచి పూజలు నిర్వహిస్తోన్న రెండు గుహలకు దారితీస్తుంది.
రెండు వేర్వేరు బృందాలు నిర్వహిస్తోన్న రెండు వేర్వేరు పూజాస్థలాలకు సంబంధించిన రెండు వేర్వేరు చందాల పెట్టెలు - ఒకటి గుహల దగ్గర, మరొకటి గుడి లోపల - పెట్టివున్నాయి. భజరంగ్ దళ్‌కు చెందిన మరో(మూడో) చందాల పెట్టె ఆవరణలో పెట్టివుంది. ఈ పెట్టెలో పోగుపడిన డబ్బును సాధు సన్యాసులకు చేసే మంగళవారపు భండారా విందుకు ఖర్చుచేస్తారు. కొండ దిగువన గ్రామానికి దగ్గరగా ఉన్న మరో పెట్టెలో పోగుపడిన డబ్బు ఆదివాసులు పూజకు అవసరమైన వస్తువులను, నైవేద్యాలను కొనేందుకు ఉపయోగపడుతుంది.
"ఈ ప్రాంతం మొత్తంగా ఆదివాసీ ప్రాంతం. అంజన్‌లో ఇంతకుముందు పండితులు (పూజారులు) ఉండేవారు కాదు," ఈ మతసంబంధమైన ప్రదేశంలో కొత్తగా ఉన్న పూజలు చేసే ఏర్పాట్ల గురించి నా కుతూహలాన్ని చూసి, ఇంతకుముందు గ్రామానికి పెద్దగా పనిచేసిన రంజయ్ ఉరాంన్ (42) చెప్పారు. "ఇటీవలి కాలంలోనే వారణాసి నుంచి పండితులు ఈ ప్రాంతానికి వచ్చారు. ఉరాంన్ ఆదివాసులు ప్రకృతి దేవత అయిన అంజనిని ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పూజిస్తున్నారు. కానీ అంజనికీ హనుమంతుడికీ సంబంధం ఉందని మాకు ఎన్నడూ తెలియదు," అన్నారాయన.
"ఈ పండితులు వచ్చాక అంజని హనుమాన్ల తల్లి అనే ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చారు," చెప్పారు రంజయ్. "హనుమాన్లు పుట్టిన పవిత్ర స్థలంగా అంజన్‌ను ప్రకటించారు. ఎవరైనా ఏదైనా అర్థంచేసుకునేలోపే కొండ మీద హనుమంతుడి గుడి వెలసింది, ఆ ప్రదేశానికి అంజన్ ధామ్ అనే పేరును కూడా ప్రకటించారు."










