ఆకలే జలాల్ అలీకి చేపలు పట్టే వెదురు మావులను ఎలా తయారుచేయాలో నేర్చుకునేలా చేసింది.
ఆయన యువకునిగా ఉన్న రోజుల్లో కూలీ పని చేసుకుని బతికేవారు, కానీ వర్షాకాలంలో ఏ పనీ దొరికేది కాదు. ‘‘వర్షాకాలం అంటే వరి నాట్లు వేసే కొన్ని రోజులు తప్ప వేరే పని ఉండదు," అని ఆయన చెప్పారు.
కానీ అవే రుతుపవనాలు ఆయన నివసించే దరంగ్ జిల్లా, మౌసితా-బాలాబారీలోని కాలువలు, చిత్తడి నేలల్లోకి చేపలను తీసుకొస్తాయి. అందువల్ల చేపలు పట్టే వెదురు మావులకు చాలా ఎక్కువ గిరాకీ ఉంటుంది. “నేను చేపలు పట్టే వెదురు మావులను ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాను, ఆ రకంగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నీకు ఆకలిగా ఉన్నప్పుడు, కడుపులోకి ఇంత ఆహారాన్ని పంపే సులభమైన దారి కోసం ఆలోచిస్తావు,” నవ్వుకుంటూ అన్నారు ఆ 60 ఏళ్ళ వృద్ధుడు..
ఈ రోజున జలాల్, నీళ్ళున్న చోట రకరకాల చేపలను పట్టే సెపా, బాయిర్, బొస్న లాంటి దేశవాళీ వెదురు మావులను తయారుచేయడంలో చేయితిరిగిన వ్యక్తి. ఆయన అస్సామ్‌లోని మౌసితా-బాలాబారీ చిత్తడి నేలల వెంట ఉన్న పుబ్-పదోఖాత్ గ్రామంలోని తన ఇంటిలోనే వాటిని తయారుచేస్తారు.
"కేవలం రెండు దశాబ్దాల క్రితం, మా గ్రామంతోపాటు సమీప గ్రామాల్లోని దాదాపు ప్రతి ఇంటివాళ్ళూ చేపలు పట్టేందుకు [వెదురు] మావులను ఉపయోగించేవాళ్ళు. అప్పట్లో వెదురు మావులు, లేదా చేతితో తయారుచేసిన శివ్ జాల్తోనే చేపలు పట్టేవాళ్ళు." ఆయన స్థానికంగా టోంగీ జాల్ లేదా ఝెత్కా జాల్ అని కూడా పిలిచే వలల గురించి చెబుతున్నారు. అవి నాలుగు మూలలను వెదురు కర్రలతో లేదా తీగలతో జోడించిన చతురస్రాకారపు వలలు.
స్థానికంగా చేపలు పట్టే వెదురు మావులకు వాటి ఆకారం ప్రకారం పేరు పెడతారు: “సెపా దీర్ఘచతురస్రాకారంలోని డోలులా ఉంటుంది. బాయిర్ కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది, అయితే ఇది ఇంకా ఎక్కువ పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డార్కి ఒక దీర్ఘచతురస్రాకార పెట్టెలా ఉంటుంది,” అని జలాల్ వివరించారు. దుయెర్, దియర్, బొయిష్ణో మావులను పారే నీళ్ళలో అమరుస్తారు. వీటిని ఎక్కువగా నీరు నిలిచే వరి, జనపనార పొలాల్లో, చిన్న కాలువలు, బురద నేలలు, చిత్తడి నేలలు లేదా నదీ సంగమాలలో అమరుస్తారు.














