ఉత్తరప్రదేశ్, లక్నోలోని తమ అద్దె ఇంటి పెరట్లో తన మూడేళ్ళ బంధువుతో కలిసి ఆడుకుంటోన్న ఏడేళ్ళ కజ్రీని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
పదేళ్ళ తర్వాత, డిసెంబర్ 2020లో, మరొక బంధువు - బ్యాంక్ ఏజెంట్ - పని కోసం పట్టణంలోని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, కజ్రీలా కనిపిస్తోన్న ఒక అమ్మాయి ఇల్లు తుడుస్తూ కనిపించింది. అతను, ఆమె తండ్రి పేరు కనుక్కుంటుండగా ఒక మహిళ వాళ్ళ సంభాషణకు అడ్డుతగిలి, వాళ్ళని మాట్లాడుకోనివ్వలేదు. అక్కడి నుండి బయటికి వచ్చిన అతను వెంటనే లక్నో వన్-స్టాప్ కేంద్రానికి కాల్ చేశారు. హింసకు గురైన మహిళలను, బాలికలను రక్షించి, వారికి అండగా నిలిచే ఉదేశ్యంతో ఆ కాల్ సెంటర్‌ను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. కొన్ని గంటల్లోనే, మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్, వన్-స్టాప్ కేంద్రం నుండి వచ్చిన ఒక పోలీసు బృందం ఆ ఇంటిపై దాడి చేసి, కజ్రీని రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించింది.
ఇప్పుడు, 21 ఏళ్ళ కజ్రీ మానసిక వైకల్యంతో జీవిస్తోంది. ఆమె తన నోట్లో, దిగువ వరుసలోని ముందు పళ్ళను కోల్పోయింది. మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురై, బాల కార్మికురాలిగా గత పదేళ్ళుగా తాను అనుభవించిన కష్టాల మసకబారిన జ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలి ఉన్నాయి.











