"మిర్చీ మే ఆగ్ లగ్ గయీ [మిరపకాయలు కాలిపోతున్నాయి]."
అది 1984, డిసెంబర్ 2 నాటి రాత్రి సమయం. భోపాల్ నివాసి నుస్రత్ జహాఁ ఊపిరి పీల్చుకోలేక నిద్ర నుంచి మేల్కొన్నారు. ఆమె కళ్ళు మండిపోతూ నీళ్ళు కారుతున్నాయి. కొద్దిసేపటికే ఆరేళ్ళ వయసున్న ఆమె కొడుకు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దానికి ఆమె భర్త మహమ్మద్ షఫీక్ నిద్ర లేచారు.
"ఖయామత్ కా మంజార్ థా [అదొక వినాశకర దృశ్యం]," ప్రస్తుతం 70 ఏళ్ళ వయసున్న షఫీక్, నవాబ్ కాలనీలోని తన ఇంటిలో కూర్చుని, నేటికి 40 ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్ రాజధానీ నగరంలో జరిగిన, భోపాల్ వాయు విపత్తు (BGD) అని పిలిచే ఆ సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
ఒక కాగితపు మిల్లులో దినసరి కూలీగా పనిచేసే షఫీక్, ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ఆ విష వాయువు ప్రభావం వల్ల క్షీణించిన తన కుటుంబ ఆరోగ్య చికిత్స కోసం ప్రాణాలొడ్డి పోరాడారు. ఇది 18 సంవత్సరాల పాటు వారికున్న ఒకే ఒక నీటి వనరైన బావి నీరు కలుషితమవడం వల్ల మరింత దిగజారింది. ఆ నీరు ఆయన కళ్ళను బాగా చికాకు పెట్టేదనీ, కానీ వేరే గత్యంతరం ఉండేది కాదనీ ఆయన చెప్పారు. 2012లో మాత్రమే సంభవనా ట్రస్ట్ క్లినిక్ ఆ నీటిని పరీక్షించి, వాటిలో విషపూరిత మూలకాలున్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని బోరుబావులను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది.
షఫీక్ కుటుంబాన్ని అగచాట్ల పాలుచేసిన ఆ 1984 నాటి రాత్రి వెలువడిన విషవాయువు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) కర్మాగారం నుండి వచ్చింది. అప్పుడా కర్మాగారం బహుళజాతి యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యుసిసి) యాజమాన్యం కింద ఉండేది. ఆ డిసెంబరు 2 రాత్రి, యుసిఐఎల్ కర్మాగారం నుండి వెలువడిన అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు వల్ల ఏర్పడిన విపత్తును ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణిస్తున్నారు.











