"పానీ లే లో! పానీ [నీళ్ళండీ నీళ్ళు]!"
మీరు నీళ్ళు నిలవ చేసుకునే కుండా తపేలాలు తెచ్చుకోవడానికి తొందరపడకండి. ఈ నీళ్ళ టాంకర్ చాలా చాలా బుడ్డిది. ఒక ప్లాస్టిక్ సీసా, ఒక పాత రబ్బరు చెప్పు, ఒక పొట్టి ప్లాస్టిక్ పైపు, కర్ర ముక్కలతో చేసిన ఈ 'టాంకర్'లో మహా అయితే ఒక గ్లాసెడు నీళ్ళు పడతాయి.
బల్‌వీర్ సింగ్, భవానీ సింగ్, కైలాస్ కన్వర్, మోతీ సింగ్ - 5 నుంచి 13 ఏళ్ళ వయసున్న ఈ పిల్లలంతా సాంవతా గ్రామానికి చెందినవారు. రాజస్థాన్‌కు తూర్పువైపు మూలన ఉండే ఈ గ్రామానికి వారానికి రెండుసార్లు వచ్చే నీళ్ళ టాంకర్‌ను చూడగానే తమ తల్లిదండ్రులు, గ్రామస్థులంతా ఎంతలా సంతోషిస్తారో గమనించిన ఈ పిల్లలు ఈ బొమ్మ టాంకర్‌ను తయారుచేశారు.








