“రైలు ఐదు నిమిషాలు మాత్రమే ఆగుతుంది, మేం చాలా రద్దీ నడుమ రైల్లోకి ఎక్కుతాం. కొన్నిసార్లు రైలు కదలడం మొదలవుతుంది, అప్పుడు మేం ప్లాట్‌ఫామ్‌పై కొన్ని మూటలను వదిలేయాల్సివస్తుంది." సారంగ రాజ్‌భోయ్ తాళ్ళు తయారుచేస్తారు. ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్లాట్‌ఫామ్ మీద విడిచిపెట్టే మూటలు, ఆమెలాంటి మహిళలు తాళ్ళుగా తయారుచేసి అమ్ముకునే వస్త్ర కర్మాగారాలలో మిగిలిపోయిన ఫైబర్ (పీచు) ముక్కలు. వీళ్ళు తయారుచేసే తాళ్ళను ఆవులను, గేదెలను కట్టేయడానికి, ట్రక్కులు, ట్రాక్టర్లలో సరుకులను కట్టడానికి, చివరికి బట్టలు ఆరవేసుకునే తాళ్ళుగా కూడా ఉపయోగిస్తారు.
" హమారా ఖాన్‌దానీ హై [మాది కుటుంబ వ్యాపారం]" సంత్రా రాజ్‌భోయ్ చెప్పారు. అహ్మదాబాద్‌లోని వట్వాలో మునిసిపల్ హౌసింగ్ బ్లాక్‌లో ఉన్న తన ఇంటికి సమీపంలోని ఒక బహిరంగ ప్రదేశంలో కూర్చునివున్న ఆమె, సింథటిక్ ఫైబర్ చిక్కులను విప్పదీయడంలో తలమునకలై ఉన్నారు.
సారంగ, సంత్రాలు గుజరాత్‌లోని రాజ్‌భోయ్ సంచార తెగకు చెందినవారు. వాళ్ళు అహ్మదాబాద్ నుండి సూరత్‌కు ప్రయాణం చేస్తూ, దారిలో ఉన్న వస్త్రాల మిల్లుల నుంచి ఫైబర్ వ్యర్థాలను కొంటారు, తర్వాత వాటిని తాళ్ళుగా పేనుతారు. ఈ పని కోసం వాళ్ళు రాత్రి పదకొండు గంటలకు ఇంటి నుండి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి తిరిగి వస్తారు. వీళ్ళు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు తమ పిల్లలను బంధువులు, ఇరుగుపొరుగు వారి సంరక్షణలో వదిలి వెళ్తారు.
వాళ్ళు ఎక్కే రైళ్ళు తరచుగా తెల్లవారుజామున ఒకటి లేదా రెండు గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటాయి. అందువల్ల తాళ్ళు తయారుచేసే ఈ మహిళలు రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మీదు పడుకుంటారు, అలాంటప్పుడు వీళ్ళకు తరచూ వేధింపులు తప్పవు. “మమ్మల్ని రెండు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నిస్తారు. పోలీసులు పేదలనే కదా పట్టుకునేది,” అని కరుణ అన్నారు. "ఒకవేళ వాళ్ళు మమ్మల్ని నిర్బంధించాలనుకుంటే, వాళ్ళు ఆ పనీ చేస్తారు."
కరుణ, సంత్రా, సారంగ అందరూ వట్వాలో ఉన్న చార్ మాలియా మున్సిపల్ హౌసింగ్‌లో పక్కపక్కనే ఉంటున్నారు. తమ ఇళ్ళలో సాధారణ నీటి సరఫరా, మురుగునీటి సదుపాయం వంటి కనీస సౌకర్యాలు లేవని వీళ్ళు తెలిపారు. ఎంతో కాలం పోరాడితే కానీ వీళ్ళకు విద్యుత్ కనెక్షన్లు రాలేదు.
రాజ్‌భోయ్ తెగకు చెందిన వీరిలో స్త్రీలకు తాళ్ళు పేనడం సంప్రదాయ వృత్తి. మగవాళ్ళు చెవిలోని గులిమిని శుభ్రంచేసే పని చేస్తారు. వీరి సముదాయం ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి గుర్తింపు కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం పోరాడుతోంది. రాజ్‌భోయిలు ఒక సంచార తెగ, కానీ "మమ్మల్ని నిగమ్ [గుజరాత్ నొమాడిక్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్] జాబితాలో చేర్చలేదు," అని ముఖియా లేదా వారి సంఘ పెద్ద, రాజేశ్ రాజ్‌భోయ్ చెప్పారు. సంచార తెగలకు అందుబాటులో ఉన్న పని అవకాశాలు, ఇతర పథకాలను పొందడం అనేది అంత సులభమైన పనేం కాదు. ఎందుకంటే, "మేమక్కడ 'రాజ్‌భోయ్'కి బదులుగా 'భోయిరాజ్' అని జాబితా చేసి ఉన్నాం. అందుచేత ప్రభుత్వంతో వ్యవహరించడం చాలా కష్టమైన పనిగా మారింది."
గుజరాత్ ప్రభుత్వ వెబ్‌సైట్ లో కనిపించే 28 సంచార తెగలు, 12 డీనోటిఫైడ్ తెగల జాబితాలో రాజ్‌భోయ్, భోయిరాజ్ రెండు పేర్లూ లేవు. గుజరాత్‌లోని 'భోయ్'లను భారతదేశంలోని డీనోటిఫైడ్ తెగలు, సంచార జాతులు, పాక్షిక సంచార జాతుల ముసాయిదా జాబితా (సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ)లో చేర్చారు. గుజరాత్‌లో, భోయిరాజ్‌లు ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్నారు. "మా తెగకు చెందినవాళ్ళను గుజరాత్ వెలుపల సలాట్-ఘేరా అని కూడా పిలుస్తారు. వాళ్ళు తిరగలి రాళ్ళు, రుబ్బుడు పొత్రాలను తయారుచేసే పనిలో ఉన్నారు," అని రాజేశ్ చెప్పారు. సలాట్-ఘేరా కూడా ఒక సంచార తెగ, అది వెబ్‌సైట్‌లో ఆ పేరుతోనే జాబితా చేసివుంది.
*****
తాళ్ళను తయారుచేయడానికి అవసరమైన పీచు కోసం ఈ మహిళలు సూరత్‌లోని వస్త్ర కర్మాగారాలకు వెళతారు. “వట్వా నుంచి మణినగర్, మణినగర్ నుంచి కీమ్. మేం [ముడి] సరుకును కిలో ఇరవై ఐదు రూపాయలకు కొంటాం," అని వక్కాకు నములుతూ చెప్పారు సారంగ రాజ్‌భోయ్. మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె చేతులు పీచు ముక్కలను పేనుతూనే ఉన్నాయి.
అహ్మదాబాద్‌లోని మణినగర్ నుంచి సూరత్‌లోని కీమ్‌కు దాదాపు 230 కిలోమీటర్ల దూరం. రైలు ప్రయాణం తప్ప వారికి వేరే దారి లేదు. ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి, కానీ తన గడ్డం మీదకు కారుతోన్న తమలపాకు రసాన్ని తుడుచుకుంటూ, "మేం టిక్కెట్లు కొనం," అని సారంగ నవ్వుతూ చెప్పారు. కీమ్ రైల్వే స్టేషన్ నుండి ఈ మహిళలు రిక్షాలో ప్రయాణించి ఆ ప్రాంతంలో ఉన్న వస్త్ర కర్మాగారాలకు వెళతారు.
“ఏదైనా పాడైపోయిన మెటీరియల్‌ను పక్కన పెట్టి ఉంచుతారు. కార్మికులు వాటిని మాకు కానీ, వ్యర్థాలను కొనే డీలర్లకు కానీ అమ్మితే, ఆ డీలర్లు మళ్ళీ మాకు అమ్ముతారు,” అని 47 ఏళ్ళ గీతా రాజ్‌భోయ్ చెప్పారు. అయితే, తాళ్ళ తయారీకి అన్ని రకాల పీచు పనికిరాదని కరుణ అన్నారు. “పత్తి మాకు ఉపయోగపడదు. మాకు రేసం [కృత్రిమ పట్టు] మాత్రమే ఉపయోగపడుతుంది, దానిని తయారుచేసే ఫ్యాక్టరీలు కీమ్‌లో మాత్రమే ఉన్నాయి," అని ఆమె వివరించారు.
తరచుగా ముడి పదార్థం (ఫైబర్) చిక్కులుపడి ఉంటుంది, అది తక్కువ ధరకు దొరుకుతుందని గీత చెప్పారు. దాని ధర కిలోకు రూ. 15 నుంచి 27 మధ్య ఉంటుంది. సోఫాలు, పరుపులు, దిళ్ళలో ఉపయోగించే తెల్లని ఫైబర్ ఖరీదైనది. దాని ధర కిలో రూ. 40.
“ఒక స్త్రీ 100 కిలోల వరకు తేగలదు. ఆమె 25 కిలోలు లేదా కొన్నిసార్లు 10 కిలోలు కూడా తీసుకురావచ్చు," అని సంత్రా చెప్పారు. కానీ వాళ్ళకు అంత ఎక్కువ దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. దాన్ని కొనడానికి చాలామంది వ్యక్తులు ఎదురు చూస్తుంటారు, కానీ ఎప్పుడూ తగినంత ఫైబర్ దొరకదు.
కీమ్ నుండి అహ్మదాబాద్‌కు సరుకు రవాణా చేయాలంటే, "ఫైబర్‌ను కొని, స్టేషన్‌కు తీసుకురావడానికి మేం కీమ్‌లోని చాలా ఫ్యాక్టరీల చుట్టూ తిరగాలి," అని సారంగ వివరించారు.
వాళ్ళు మోసుకెళ్ళే పెద్దపెద్ద మూటలు స్టేషన్ వద్ద రైల్వే సిబ్బంది దృష్టిని ఆకర్షిస్తాయి. “వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నప్పుడు, మేం బీదవాళ్ళమని చెప్పుకుంటే కొన్నిసార్లు మమ్మల్ని వదిలేస్తారు. ఎవరైనా తలబిరుసు అధికారి వస్తే, 100-200 రూపాయలు చెల్లించుకోవాల్సివుంటుంది,” అన్నారు కరుణా రాజ్‌భోయ్. "మేం వెయ్యి రూపాయల విలువైన సరుకును కొనుగోలు చేసిన ప్రతిసారీ, ప్రయాణానికి మూడు వందలు ఖర్చు చేయాల్సివస్తోంది." వారికి కావాల్సిన మెటీరియల్ లభించినా, లభించకున్నా రూ. 300 మాత్రం ఖర్చు చేయక తప్పదు.
30 చేతి పొడవున్న (arms’ length) తాడును రూ. 80కు, 50 చేతి పొడవున్న తాడును రూ. 100 కు వీరు అమ్ముతారు.
మహిళలు తమ వెంట 40-50 తాళ్ళను తీసుకువెళతారు. మహెమ్మదాబాద్, ఆనంద్, లింబాచి, తారాపూర్, కఠ్‌లాల్, ఖేడా, గోవింద్‌పురా, మాతర్, చాంగా, పల్లా, గోమ్తీపూర్ వంటి అనేక చిన్న పట్టణాలు, నగరాలలో ఈ తాళ్ళను విక్రయిస్తారు. కొన్నిసార్లు అన్నీ అమ్ముడుపోతే మరికొన్నిసార్లు దాదాపు 20 మాత్రమే అమ్ముడుపోతాయి.
"మేం కష్టపడి తాళ్ళను తయారుచేస్తాం, వాటిని నడియాద్, ఖేడాలలోని గ్రామాలకు వెళ్ళి అమ్మడానికి డబ్బు ఖర్చు చేస్తాం. ఇంతా చేస్తే కేవలం 100 నుండి 50-60 రూపాయల వరకూ బేరం సాగుతుంటుంది," అని సారంగ చెప్పారు. ఆపైన ప్రయాణం ఖర్చులు, జరిమానాలు వాళ్ళ సంపాదనకు చిల్లులు పెడతాయి.
తాళ్లు తయారు చేయడం అనేది కష్టమైన, ప్రయాసతో కూడుకున్న పని. ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూనే ఆ పని చేస్తారు. “ జబ్ నల్ ఆతా హై తబ్ ఉఠ్ జాతే హై [కుళాయిలలో నీరు వచ్చినప్పుడు, మేం నిద్ర లేస్తాం],” అని కరుణా రాజ్‌భోయ్ చెప్పారు.
చేసే పనికి తగినట్లు వీళ్ళ ఇళ్ళు పెద్దగా లేకపోడంతో ఈ మహిళలు ఎలాంటి రక్షణ కూడా లేకుండా ఆరుబయట ఎండలోనే పని చేస్తారు. "మేం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం రెండు నుండి ఐదున్నర వరకు పని చేస్తాం," అని ఆమె చెప్పారు. "మేం వేసవిలో ఎక్కువ తాళ్ళను తయారుచేస్తాం, ఎందుకంటే అప్పుడు పగటి సమయం ఎక్కువ. వేసవిలో మేం రోజుకు 20-25 తాళ్ళు తయారుచేస్తే, శీతాకాలంలో 10-15 మాత్రమే తయారుచేస్తాం,” అని రూప చెప్పారు.
చేతితో తిప్పే ఒక చిన్న రాట్నం, స్థిరంగా ఉండే పెద్ద రాట్నం వాళ్ళ వ్యాపారంలో రెండు ముఖ్యమైన సాధనాలు.
ఒక మహిళ చక్రం తిప్పుతుంటే, మరొకరు ఆ ఫైబర్ పోగులను పట్టుకుని, అవి ఒకదానితో మరొకటి అతుక్కుపోకుండా చూస్తారు. మరో మహిళ తాడు చివరలను సరి చేస్తుంటారు. ఈ పనికి ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు మనుషులు అవసరం కాబట్టి, తరచుగా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ పని చేస్తారు. "మేం రాట్నం తిప్పుతూ ఉంటే, పీచు తాడుగా మారుతుంది. మూడు వేర్వేరు పోగులు ఏర్పడతాయి. ఒక తాడును తయారు చేయడానికి ఈ మూడు పొరలనూ కలిపి పేనుతాం,” అని సర్విలా రాజ్‌భోయ్ చెప్పారు. అలాగే, 15-20 అడుగుల తాడును తయారుచేయడానికి 30-45 నిమిషాల సమయం పడుతుందని ఆమె చెప్పారు. ఒక రోజులో, ఒక బృందం 8-10 తాళ్ళను తయారుచేయగలదు, కొన్నిసార్లు వాళ్ళు ఇరవై తాళ్ళు కూడా తయారుచేస్తారు. ఆర్డర్‌లు వస్తే వాళ్ళు 50-100 అడుగుల పొడవైన తాళ్ళను కూడా తయారుచేస్తారు.
రాష్ట్రంలో భోయ్ తెగవాళ్లు ఎక్కువగా సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్నారు. 1940లలో ప్రచురించిన గుజరాతీ విజ్ఞానసర్వస్వ నిఘంటువు భగవద్‌గోమండల్ ప్రకారం, భోయ్‌లు ఒకప్పుడు చర్మశుద్ధి పనిచేసే "వెనుకబడిన శూద్ర వర్గం". కానీ ఆధిపత్య జైన సమాజం నుంచి జంతు వధకు వ్యతిరేకత ఎదురుకావడంతో వాళ్ళలో చాలామంది వ్యవసాయం, ఇతర కూలీ పనులకు మళ్ళారు. రకరకాల వృత్తులలోకి మారిన భోయ్‌లను రకరకాలుగా పిలుస్తున్నారు. బహుశా రాజ్‌భోయిలు పల్లకీలు మోసేవాళ్ళు కావచ్చు.
ఆడవాళ్ళు చేసే వ్యాపారాన్ని, వాళ్ళు పడే కష్టాలను భాను రాజ్‌భోయ్‌తో సహా ఆ తెగలోని ఇతర మగవాళ్ళు పెద్దగా లెక్కపెట్టరు. వృత్తిరీత్యా చెవిలోని గులిమిని శుభ్రంచేసే ఈయన, ఆడవాళ్ళు సంపాదించే డబ్బు గురించి, “అది పెద్దగా ఉపయోగపడదు. అది వాళ్ళ ఇంటి ఖర్చులకు కొద్దిగా సహాయపడుతుందంతే," అన్నారు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం, వారసత్వ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయం, " థోడా బహుత్ ఘర్ కా ఖర్చ్ " (కొంచెం ఇంటి ఖర్చులకు) మాత్రం ఉపయోగపడుతుంది.
కానీ గీతా రాజ్‌భోయ్ అభిప్రాయం ప్రకారం జీతం వచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నించడం కంటే ఇదే మంచిది. “ దస్వీఁ కే బాద్ బార్వీఁ, ఉస్కే బాద్ కాలేజ్, తబ్ జాకే నౌకరీ మిల్తీ హై. ఇస్సే అచ్ఛా అప్నా దందా సంభాలో! [మొదట 10వ తరగతి, ఆ తర్వాత 12వ తరగతి, ఆ పైన కళాశాల చదువు. అప్పుడే ఉద్యోగం వస్తుంది. దానికి బదులు మన సొంత వ్యాపారం చేసుకోవడమే మేలు!]”
ఈ విలేకరి ఆతిశ్ ఇంద్రేకర్ ఛారాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అనువాదం: రవి కృష్ణ