సుకుమార్ బిశ్వాస్ కొబ్బరికాయలమ్మే ఒక మామూలు వ్యాపారి కాదు. దాహంతో ఉన్న కొనుగోలుదారుల కోసం కొబ్బరికాయలను కొట్టేటపుడు కూడా పాటపై ఆయన ప్రేమ ఆగదు, "నేను ఆహారం లేకుండానైనా ఉండగలను గానీ పాడకుండా ఉండలేను." శాంతిపూర్‌లోని లొంకాపారా చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన డాబ్‌దాదూ (కొబ్బరికాయల తాతయ్య)గా సుపరిచితుడు.

ఈ 70 ఏళ్ళ వృద్ధుడు, పచ్చటి కొబ్బరికాయను కొట్టి అందులో స్ట్రా వేసి మీకు ఇస్తారు. మీరు నీరు తాగిన తర్వాత ఆ కాయను పగులగొట్టి అందులో ఉండే లేత కొబ్బరిని తోడి మీకు అందిస్తారు. ఈ పనులు చేస్తున్నంతసేపూ ఆయన జానపద గీతాలను పాడుతూనే ఉంటారు. లాలన్ ఫకీర్, సంగీతకారుడైన షా అబ్దుల్ కరీమ్, భబా ఖేపా వంటి ఆధ్యాత్మికవాదులు స్వరపరచిన గీతాలను ఆయన పాడుతుంటారు. తన జీవితానికి అర్థాన్ని ఆ పాటలలో కనుగొన్నానని చెప్పే ఆయన PARI కోసం ఒక గీతాన్ని ఉటంకిస్తూ, భావానువాదం చేశారు: సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం సత్యాన్ని చేరుకోగలం. ఆ సత్యాన్ని తెలుసుకోవటం కోసం మనలో మనం నిజాయితీని పెంపొందించుకోవాలి. మనం కపటానికి దూరంగా ఉన్నపుడే ఇతరులను ప్రేమించగలుగుతాం."

ఆయన తన టోలీ (ఒక మూడు చక్రాల సైకిల్‌కు జోడించిన వ్యాన్) పై ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కూడా పాడుతూనే ఉంటారు. ఆయన పాట వినే, ఆయన వచ్చినట్టుగా ఆ ప్రాంతంలోనివారు తెలుసుకుంటారు.

"కొబ్బరికాయలను కొనకపోయినా కాసేపు నిలబడి నా పాటను వినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కొనాల్సిన పనిలేదు. అమ్మకాలు జరగాలని నేనూ పెద్దగా ఆశించను. జరిగినంతవరకూ నాకు సంతోషమే," కొనేవాళ్ళకు కొబ్బరికాయలు అందిస్తూనే ఆయన ఈ మాటలన్నారు.

Left: Sukumar selling coconuts on the streets of Santipur.
PHOTO • Tarpan Sarkar
Right: Back home, Sukumar likes to sing while playing music on his harmonium and dotara
PHOTO • Tarpan Sarkar

ఎడమ: శాంతిపూర్ వీధుల్లో కొబ్బరికాయలు అమ్ముతోన్న సుకుమార్. కుడి: ఇంటికొచ్చాక తన హార్మోనియం, దోతారాలపై సంగీతాన్ని పలికిస్తూ పాడటమంటే సుకుమార్‌కు ఇష్టం

సుకుమార్ బంగ్లాదేశ్‌లోని కుష్టియా జిల్లాలో పుట్టారు. అక్కడ ఆయన తండ్రి జీవిక కోసం చేపలు పట్టేవారు, చేపలు పట్టలేనప్పుడు దినసరి కూలీగా పనిచేసేవారు. 1971లో బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) యుద్ధం ప్రారంభమైనప్పుడు అనేకమంది ప్రజలు భారతదేశంలో ఆశ్రయం పొందారు. వారిలో సుకుమార్ కూడా ఒకరు. "మేమీ దేశానికి వచ్చినప్పుడు ఇక్కడివారందరికీ మేం శరణార్థులమే. ప్రజల్లో ఎక్కువమంది మమ్మల్ని దయతో చూసేవారు," అన్నారతను. వాళ్ళు భారతదేశానికి వచ్చేటపుడు ఒకే ఒక చేపల వలను తమతో తెచ్చుకోగలిగారు.

సుకుమార్ కుటుంబం మొదట పశ్చిమ బెంగాల్‌లోని శికార్‌పూర్ గ్రామానికి వచ్చింది. కొద్ది నెలల పాటు కృష్ణనగర్‌లో ఉన్న తర్వాత, వారు ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్-అజీమ్‌గంజ్‌లో స్థిరపడ్డారు. గంగా నదిలో తన తండ్రి చేపలు పట్టేవారన్న విషయం గురించి చెప్పేటపుడు సుకుమార్ కళ్ళు మెరిసిపోతాయి. చేపలు పట్టిన తర్వాత, "స్థానిక మార్కెట్‌కు వాటిని తీసుకువెళ్ళి మంచి ధరకు అమ్మేవారు. ఇంటికొచ్చాక, మేమింక దేనికోసం చింతించాల్సిన పని లేదని మాతో చెప్పేవారు. అదేదో ఆయన లాటరీలో గెలుపొందినట్టు. మొదటిసారి చేపలు అమ్మినపుడు మాకు రూ. 125 వచ్చాయి. ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తం కింద లెక్క."

పెరిగి పెద్దవాడయ్యే వయసులో సుకుమార్ వివిధ రకాల పనులు చేశారు: రైలు బళ్ళలో హాకర్‌గా, నదిలో పడవ నడిపేవాడిగా, దినసరి కూలీగా. మురళి, దోతారా వంటి సంగీత వాయిద్యాలను తయారుచేశారు. కానీ ఆయన ఏ పని చేసినా, పాడటాన్ని మాత్రం ఆపలేదు. ఈ నాటికి కూడా, బంగ్లాదేశ్‌లోని నదుల ఒడ్డునా, పచ్చటి పొలాలలోనూ తాను నేర్చుకున్న పాటలను ఆయన గుర్తుచేసుకుంటారు.

సుకుమార్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, నదియా జిల్లాలోని శాంతిపూర్‌లో తన భార్యతో కలిసి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. ఆయన కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కొడుకు మహారాష్ట్రలో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. "నేను ఏం చేసినా వారు స్వీకరిస్తారు. నన్ను నన్నులా ఉండనిస్తారు. ఎప్పుడూ నాకు తమ సహకారాన్ని అందిస్తూవుంటారు. నా రోజువారీ సంపాదన గురించి నాకేమాత్రం చింత లేదు. నేను పుట్టి ఇప్పటికి చాలా కాలమైంది. నా మిగిలిన జీవితాన్ని కూడా నేను ఇలాగే జీవించగలను."

ఈ చిత్రాన్ని చూడండి: డాబ్‌దాదూ, పాటలు పాడే కొబ్బరికాయల వ్యాపారి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Tarpan Sarkar

ਤਰਪਨ ਸਰਕਾਰ ਇੱਕ ਲੇਖਕ, ਅਨੁਵਾਦਕ ਤੇ ਗ੍ਰਾਫ਼ਿਕ ਡਿਜ਼ਾਇਨਰ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਜਾਵਦਪੁਰ ਯੂਨੀਵਰਸਿਟੀ ਤੋਂ ਕੰਪੈਰਾਟਿਵ ਲਿਟਰੇਚਰ ਵਿੱਚ ਮਾਸਟਰ ਕੀਤੀ ਹੋਈ ਹੈ।

Other stories by Tarpan Sarkar
Text Editor : Archana Shukla

ਅਰਚਨਾ ਸ਼ੁਕਲਾ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਕੰਟੈਂਟ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪ੍ਰਕਾਸ਼ਨ ਟੀਮ ਨਾਲ਼ ਕਰਦੇ ਹਨ।

Other stories by Archana Shukla
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli