“ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి రంగూ బరువూ కోల్పోతోంది. రంగు ఎంతగా వెలిసిపోతే, వ్యాపారులు అంత తక్కువ ధర ఇస్తారు,” ఆందోళనగా అన్నారు సందీప్ యాదవ్. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లాలోని గోగాఁవ్ తహసీల్‌కు చెందిన ఒక పత్తి రైతు. అక్టోబర్ 2022లో పంట కోసినప్పటి నుండి సరుకు ధర పెరుగుతుందని ఆయన ఎదురుచూస్తున్నారు
మధ్యప్రదేశ్‌లోని అతిపెద్ద పత్తిని ఉత్పత్తి చేసే జిల్లాల్లో ఒకటైన ఖర్‌గోన్‌లో 2.15 లక్షల హెక్టార్ల భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ పంటను ఏటా మేలో విత్తుతారు, అక్టోబర్ నుండి డిసెంబర్ రెండవ వారం వరకు పత్తి ఏరటం సాగుతుంది. ఎనిమిది నెలల (అక్టోబర్-మే) కాలంలో ఖర్‌గోన్ పత్తి మండీ నుండి రోజుకు దాదాపు రూ.6 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేస్తారు. సందీప్ మధ్యప్రదేశ్‌లోని బహరామ్‌పురా గ్రామంలో తనకున్న 18 ఎకరాల పొలంలోని 10 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.
అక్టోబర్ 2022లో సందీప్, అప్పుడే చేతికివచ్చిన దాదాపు 30 క్వింటాళ్ల పత్తితో సంతోషంగా ఉన్నారు. ఇది అతని భూమిలో ఈ సీజన్లో మొదటిసారి ఏరగా వచ్చిన పత్తి. అతను రెండవ విడత ఏరినప్పుడు కూడా అంతే మొత్తంలో వస్తుందని అంచనా వేశారు, అలాగే 26 క్వింటాళ్ళు సాధించారు కూడా.
అయితే కొన్ని రోజుల తర్వాత సందీప్ ఖర్‌గోన్ పత్తి మండీలో తన 30 క్వింటాళ్ళ పత్తిని అమ్మలేకపోయారు. వాస్తవానికి అక్టోబర్ 11, 2022 నుండి వ్యాపారులు సమ్మె చేస్తున్న కారణంగా మధ్యప్రదేశ్‌లోని అన్ని పత్తి మండీలు మూతపడ్డాయి. ప్రతి 100 రూ. వర్తకం మీద రూ. 1.70గా ఉన్న మండీ పన్నును తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ఈ పన్ను దేశంలోనే అత్యధికం. ఈ సమ్మె ఎనిమిది రోజులు కొనసాగింది.
సమ్మెకు ఒకరోజు ముందు (అక్టోబర్ 10), ఖర్‌గోన్ పత్తి మండీలో పత్తి ధర క్వింటాల్‌కు రూ. 8,740 ఉంది. అక్టోబర్ 19, 2022న సమ్మె ముగిసి మండీలు తిరిగి తెరిచేప్పటికి, ఈ ధర క్వింటాలుకు రూ. 890 పడిపోయి, రూ. 7,850 అయ్యింది. ధర పడిపోవటంతో అతను తన దిగుబడిని విక్రయించలేదు. "ఇప్పుడు నా పంటను అమ్మితే, నాకు ఎటువంటి లాభం ఉండదు," అని 34 ఏళ్ళ ఈ రైతు అక్టోబర్ 2022లో తనను కలిసిన PARIతో చెప్పారు.








