2024 సంవత్సరం PARI గ్రంథాలయా నికి ఒక మైలురాయి వంటిది - మేం ఈ ఏడాది రికార్డు సంఖ్యలో క్యూరేట్ చేసిన, ఆర్కైవ్ చేసిన వాటిలో చట్టాలు, శాసనాలు, పుస్తకాలు, సమావేశాలు, వ్యాసాలు, సంకలనాలు, పదకోశాలు, ప్రభుత్వ నివేదికలు, కరపత్రాలు, సర్వేలు, ఆర్టికల్స్ ఉన్నాయి.

ఈ మధ్యలో ఇతరంగా మరింత గంభీరమైన రికార్డులు కూడా బద్దలయ్యాయి - 2024 అత్యధిక ఉష్ణొగ్రతలు నమోదైన ఏడాదిగా నిలిచింది. ఉష్ణొగ్రతలలో ఇది అంతకుముందు అత్యధిక ఉష్ణొగ్రతలు నమోదు చేసిన ఏడాదిగా రికార్డుల్లో నిలిచిన 2023 సంవత్సరాన్ని మించిపోయింది. మారుతున్న వాతావరణం వలస వెళ్ళే జాతుల పై ప్రభావం వేసింది. ఈ జాతులలో ఐదింటిలో ఒకటి ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో పడింది. భారతదేశంలోని చిత్తడి నేల లైన - స్పాంగ్ , ఝీల్ , సరోవర్ , తాలాబ్ , తాల్ , కోలా , బిల్ , చెరువు - ఇవన్నీ స్వయంగా ముప్పులో ఉన్నాయి.

కాలుష్యం, వేడిమి మధ్య ఉన్న సంబంధం చక్కగా నమోదయింది. దక్షిణాసియాలో కణరూప పదార్థం కారణంగా ఏర్పడే వాయు కాలుష్యం మరింత హానికరమైనది. భారతదేశంలో సాంద్రీకరణ ఒక క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించిన పరిమితి కంటే ఇది 11 రెట్లు ఎక్కువ. సాంద్రీకరణ చాలా ఎక్కువగా ఒక క్యూబిక్ మీటర్‌కు 102.1 మైక్రోగ్రాములు ఉన్న న్యూ ఢిల్లీలో, రైడ్-సోర్సింగ్ సేవలో పనిచేసే ఒక గిగ్ శ్రామికుడి అనుభవాల గురించి ఒక కామిక్‌ వచ్చేలా ప్రేరేపించింది

PHOTO • Design courtesy: Dipanjali Singh

ఉష్ణోగ్రత వరుసగా రెండేళ్ళు రికార్డులను బద్దలుకొట్టడంతో, పారిస్ ఒప్పందం అతిక్రమించబడటానికి చాలా దగ్గరగా వచ్చింది. అయితే, సహజ వాతావరణం ఒక్కటి మాత్రమే ఉష్ణోగ్రతలలో పెరుగుదలను అనుభవించలేదు. దేశంలోని రాజకీయ వాతావరణం కూడా వేడెక్కి, 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగి, 18వ లోక్‌సభగా ఏర్పడటం వరకూ వెళ్ళింది.

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2018లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్‌ లను ఫిబ్రవరి 15, 2024న సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైనవిగా పరిగణించింది. ఇది జరిగిన ఒక నెల తర్వాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్‌లు ఈ బాండ్లను కొనుగోలు చేయటం, నగదుగా మార్చడం గురించిన వివరాలను విడుదల చేశాయి.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినవారిగా: ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ (పిఆర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్), మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఆండ్ క్విక్ (Qwik) సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ - ఈ మూడు సంస్థలు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. మరోవైపు , భారతీయ జనతా పార్టీ (రూ. 6,060 కోట్లు), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (రూ. 1,609 కోట్లు), భారత జాతీయ కాంగ్రెస్ (రూ. 1,422 కోట్లు) పార్టీలు వీటిద్వారా అత్యధికంగా లబ్ధి పొందాయి.

1922, 2022 సంవత్సరాలలో భారతదేశంలో సంపద పంపిణీ ని పోల్చి చూసినప్పుడు, దేశంలోని అత్యంత ధనవంతులుగా ఉన్న ఒక శాతం వారు మొత్తం జాతీయ ఆదాయంలో 1922లో కంటే 2022లో ఎక్కువ వాటాను కలిగి ఉన్నారని తేలింది. 2022లో జాతీయ ఆదాయంలో దాదాపు 60 శాతం దేశంలోని 10 శాతం సంపన్నులకే చేరింది.

ఇందుకు విరుద్ధంగా, గ్రామీణ భారతదేశంలోని సగటు వ్యక్తి వస్తువులపై, సేవలపై నెలకు కేవలం రూ. 3,773 మాత్రమే ఖర్చుచేసినట్టు, గృహ వినియోగ వ్యయం 2022-23 సర్వే నమోదు చేసింది. ఇంకా 2019, 2022ల మధ్య శ్రామికుల సగటు వాస్తవ ఆదాయాలలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు .

“భారతదేశాన్ని డిజిటల్‌గా సాధికారత కలిగిన సమాజంగానూ, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగానూ మార్చడం”ను లక్ష్యంగా పెట్టుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం, 2024 నాటికి 10వ సంవత్సరంలోకి ప్రవేశించింది. అయితే, హాస్యాస్పదమైన విషయమేమిటంటే 2024లో మనం ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల విషయంలో, వరుసగా ఆరవ సంవత్సరం, ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచాం.

జెండర్ పరంగా జరిగే అన్యాయం, అసమానతల విషయంలో భారతదేశం ఎటువంటి మార్పును చూపించలేదు. ప్రపంచ జెండర్ వ్యత్యాస నివేదిక ఈ విషయంలో దేశానికి 129వ స్థానాన్ని ఇచ్చింది; ఇది మునుపటి సంవత్సరం కంటే కూడా (మరింత అధ్వాన్నంగా) రెండు స్థానాలు తక్కువ. ఇది విద్య, రాజకీయ రంగాలలో భారతీయ మహిళల అధ్వాన్న స్థితిని సూచిస్తోంది. జెండర్ సమానత్వం విషయంలో ఎస్‌డిజి జెండర్ సూచిక లో కూడా మనం ఘోరంగా 139 దేశాలకు గాను 91వ స్థానంలో నిలిచాం.

జెండర్ గురించి చెప్పాలంటే, దాదాపు 135 మంది ప్రస్తుత శాసనసభ్యులపై మహిళలపై నేరాలకు పాల్పడినందుకు కేసులు ఉన్నాయి. ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించటం, వివాహం చేసుకునే ఉద్దేశంతో ఎత్తుకుపోవటం, అత్యాచారం, పదేపదే అత్యాచారం చేయటం, గృహహింస, వ్యభిచారం చేయించటంకోసం మైనర్‌ను కొనుగోలు చేయడం, మహిళకు ఉండే నమ్రతను దుర్వినియోగం చేయడం వంటి నేరాలకు వీరు పాల్పడ్డారు.

శాసనం గురించి మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి సమయంతో పనిలేదు. అలా చేయడంలో ప్రజలకు సహాయపడే లక్ష్యంతో, జస్టిస్ అడ్డా ఈ సంవత్సరం ది లా అండ్ ఎవ్రీడే లైఫ్ అనే ఒక టూల్‌కిట్‌ను ప్రచురించింది.

PHOTO • Design courtesy: Dipanjali Singh

వీటితో పాటు మేము ఆరోగ్యం, భాషలు, జెండర్, సాహిత్యం , ఇంకా మరిన్నింటి గురించిన వనరులను, వాటి పూర్తి సారాంశాలు, ముఖ్యాంశాలతో పాటు, ఆర్కైవ్ చేశాము. మేమింకా నిర్దిష్ట ఆందోళనలపై PARI కథనాలను, వనరులను కూర్పుచేసే మా లైబ్రరీ బులెటిన్ ప్రాజెక్ట్‌కు కూడా జోడించాము. ఈ ప్రజల గ్రంథాలయాన్ని కొనసాగించేందుకు వచ్చే సంవత్సరం మా అధ్యయన పరిధిని మరింత విస్తృతం చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్తగా ఏమున్నాయో చూడటానికి గ్రంథాలయాన్ని సందర్శిస్తూ ఉండండి.

PHOTO • Design courtesy: Dipanjali Singh

PARI గ్రంథాలయం కోసం స్వచ్ఛందంగా పనిచేయాలనుకుంటే [email protected] కు రాయండి.

మేం చేసే పని మీకు ఆసక్తి కలిగిస్తే, మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి [email protected]కు మాకు రాయండి. మాతో కలిసి పనిచేయడానికి ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర రచయితలు, రిపోర్టర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్ర నిర్మాతలు, అనువాదకులు, సంపాదకులు, ఇలస్ట్రేటర్‌లు, పరిశోధకులను మేం స్వాగతిస్తున్నాం.

కవర్ డిజైన్: స్వదేశ శర్మ

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Swadesha Sharma

ਸਵਦੇਸ਼ਾ ਸ਼ਰਮਾ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿੱਚ ਇੱਕ ਖੋਜਕਰਤਾ ਅਤੇ ਸਮੱਗਰੀ ਸੰਪਾਦਕ ਹੈ। ਉਹ ਪਾਰੀ ਲਾਇਬ੍ਰੇਰੀ ਲਈ ਸਰੋਤਾਂ ਨੂੰ ਠੀਕ ਕਰਨ ਲਈ ਵਲੰਟੀਅਰਾਂ ਨਾਲ ਵੀ ਕੰਮ ਕਰਦੀ ਹੈ।

Other stories by Swadesha Sharma
Editor : PARI Library Team

ਦੀਪਾਂਜਲੀ ਸਿੰਘ, ਸਵਦੇਸ਼ਾ ਸ਼ਰਮਾ ਅਤੇ ਸਿੱਧੀਤਾ ਸੋਨਾਵਨੇ ਦੀ ਪਾਰੀ ਲਾਇਬ੍ਰੇਰੀ ਟੀਮ ਨੇ ਪਾਰੀ ਦੇ ਰੋਜ਼ਾਨਾ ਜੀਵਨ ਦੇ ਲੋਕਾਂ ਦੇ ਸਰੋਤ ਸੰਗ੍ਰਹਿ ਦੀ ਸਿਰਜਣਾ ਕਰਨ ਦੇ ਫਤਵੇ ਨਾਲ ਸਬੰਧਿਤ ਦਸਤਾਵੇਜ਼ਾਂ ਨੂੰ ਤਿਆਰ ਕੀਤਾ।

Other stories by PARI Library Team
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli