"కలకత్తా, జైపూర్, ఢిల్లీ, బొంబాయి- ఏ పట్టణానికైనా వెదురు పోలో బంతులు నేరుగా దేవుల్‌పుర్ నుంచే సరఫరా అయ్యేవి," అంటారు రంజిత్ మాల్, భారతదేశంలో పోలో ఆటను ఆడే ప్రదేశాల గురించి మాట్లాడుతూ.
పశ్చిమ బెంగాల్, దేవుల్‌పుర్ పట్టణానికి చెందిన నిపుణుడైన పోలో బంతుల తయారీ కళాకారుడు 71 ఏళ్ళ రంజిత్, దగ్గర దగ్గర 40 ఏళ్ళుగా గువాదువా వెదురు మూలం (మూల వేరు) నుంచి బంతులను చెక్కుతున్నారు. స్థానికంగా బాఁశ్-ఎర్ ఘొడోలుగా పిలిచే ఈ మూల వేర్లు, నేలలోంచి వెదురు మొక్క పెరగడానికి సహాయపడతాయి. ఈనాటికి చరిత్రలో భాగం అయిపోయిన ఈ నైపుణ్యం గురించి మాట్లాడుతూ, ఈ కళ తెలిసిన చివరి శిల్పకారుడు తానేనని రంజిత్ చెప్తారు.
అయితే, ప్రారంభంలో మిలిటరీ, రాజ కుటుంబీకులు, ఉన్నతవర్గాలలో ప్రాచుర్యం పొందిన దాదాపు 160 ఏళ్ళ ఆధునిక పోలో ఆటకు కావలసిన వెదురు బంతులు దేవుల్‌పుర్ నుండే వచ్చేవి. నిజానికి, ప్రపంచంలోనే మొదటి పోలో క్లబ్‌ను 1859లో అస్సామ్‌లోని శిల్చర్‌లో స్థాపించారు; రెండవది 1863లో కలకత్తాలో స్థాపితమైంది. ఆధునిక పోలో ఆట సాగోల్ కాంగ్జేయి (మణిపుర్‌కు చెందిన మైతేయీ తెగ వారి సంప్రదాయక క్రీడ) నుంచి పొందుపడినది. వెదురు మూలంతో తయారుచేసిన బంతులను మైతేయీలు వాడేవారు.
1940ల ప్రారంభంలో, దేవుల్‌పుర్‌కు చెందిన ఆరేడు కుటుంబాలు సంవత్సరానికి దగ్గర దగ్గర లక్ష బంతులను తయారుచేసే 125 మంది కళాకారులకు ఉపాధిని కల్పించాయి. "నైపుణ్యం కలిగిన మా శిల్పకారులకు పోలో విపణి గురించి తెలుసు," అంటారు రంజిత్. ఆయన వ్యాఖ్యలను బ్రిటిష్ యుగంలో వచ్చిన హౌరా జిల్లాకు చెందిన సర్వే అండ్ సెటిల్మెంట్ నివేదిక ధృవీకరించింది: "భారతదేశం మొత్తంలో దేవుల్‌పుర్ మాత్రమే పోలో బంతులను తయారుచేసే ప్రదేశంగా కనపడుతోంది."
"అభివృద్ధి చెందుతున్న పోలో బంతుల వ్యాపారాన్ని చూసి, మా నాన్న నాకు 14 ఏళ్ళకే పెళ్ళి చేసేశారు," అన్నారు రంజిత్ భార్య, మినొతి. ప్రస్తుతం 60 ఏళ్ళు దాటిన ఆమె, పదేళ్ళ కిందటి వరకు ఈ బంతుల తయారీలో తన భర్తకు సహాయం చేసేవారు. వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌లో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేసివున్న మాల్ సముదాయానికి చెందినది; రంజిత్ తన జీవితమంతా దేవుల్‌పుర్ లోనే జీవించారు.
తన ఇంట్లో 'మాదుర్' గడ్డితో అల్లిన చాప మీద కూర్చుని ఉన్న రంజిత్, పాత వార్తాపత్రికల నుంచి, పత్రికల వ్యాసాల నుంచి సేకరించిన తన విలువైన సంపదను తిరగేస్తున్నారు. "ఈ ప్రపంచంలో ఎక్కడైనా మీకు లుంగీ కట్టుకొని పోలో బంతులు తయారుచేస్తున్న మనిషి బొమ్మ కనిపించిందంటే, అది నాదే!" అంటారాయన సగర్వంగా.














