సునీత భుర్‌కుటే మాతృభాష కోలామీ, కానీ ఈ పత్తి రైతు రోజు మొత్తంలో ఎక్కువగా మరాఠీ భాషనే మాట్లాడతారు. "మా పత్తిని అమ్ముకోవాలంటే మాకు మార్కెట్ భాష తెలిసివుండాలి," అంటారామె.

మహారాష్ట్రలోని యవత్మళ్ జిల్లాలో పెరిగిన ఆమె కుటుంబం ఇంట్లో మాత్రం తమ కోలామీ భాషలోనే మాట్లాడుకుంటారు. సుర్ దేవి పోడ్ (గూడెం)లోని తమ మాహెర్ (పుట్టిల్లు)లో తన తాత నాయనమ్మలు స్థానిక భాష మరాఠీని మాట్లాడేందుకు ఎంతగా కష్టపడేవారో సునీత గుర్తుచేసుకున్నారు. "వాళ్ళెప్పుడూ బడికి వెళ్ళినవారు కాదు, చిన్న చిన్న మరాఠీ వాక్యాలను వాళ్ళు నట్లు కొడుతూ మాట్లాడేవారు," అన్నారామె.

అయితే కుటుంబం నుంచి మరింతమంది పత్తిని అమ్మడానికి స్థానిక మార్కెట్‌కు వెళ్తుండటంతో వారికి భాష పట్టుబడింది. ఈ రోజున, అందరూ కోలామ్ అదివాసులే నివాసముండే భుల్‌గడ్ గ్రామంలోని ఆమె పోడ్‌ లో బహుభాషలను మాట్లాడతారు: వాళ్ళు మరాఠీ, హిందీలో కొన్ని వాక్యాలు, మాతృభాష కోలామీ భాషలను మాట్లాడతారు.

ద్రావిడ భాష అయిన కోలామీని ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లలో మాట్లాడతారు. యునెస్కోవారి ఆట్లస్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్ ప్రకారం, ఇది 'ఖచ్చితంగా అంతరించిపోయే ప్రమాదంలో' ఉన్న భాషగా వర్గీకరించివుంది – అంటే, దీనిని పిల్లలు తమ మాతృభాషగా నేర్చుకోవడం లేదని ఈ వర్గీకరణ సూచిస్తోంది.

పన్ ఆమ్‌చీ భాషా కమీ హోత్ నాహీ. ఆమ్‌హీ వాపర్‌తాత్ [మా భాష చచ్చిపోవటంలేదు, మేం దాన్ని ఉపయోగిస్తున్నాం]!" అంటారు 40 ఏళ్ళ సునీత

PHOTO • Ritu Sharma
PHOTO • Ritu Sharma

కోలామ్ ఆదివాసీ పత్తి రైతు సునీత భుర్‌కుటే (ఎడమ). మహారాష్ట్ర, యవత్మళ్‌లోని భుల్‌గడ్ గ్రామంలో కోలామ్ ఆదివాసీ సముదాయపు రిజిస్టర్‌ను నిర్వహిస్తోన్న ప్రభుత్వేతర సంస్థ, ప్రేరణ గ్రామ్ వికాస్ (కుడి)

మహారాష్ట్రలోని కోలామ్ ఆదివాసీల జనాభా 1,94,671 (భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గణాంకాల ప్రొఫైల్, 2013 ). కానీ జన గణన డేటాలో, వారిలో సగానికంటే తక్కువమంది కోలామీని తమ మాతృభాషగా నమోదు చేశారు.

"మా పిల్లలు బడికి వెళ్ళినపుడు అక్కడ మరాఠీ నేర్చుకుంటారు. అదేమంత కష్టమైన భాష కాదు, కానీ కోలామీ మాత్రం కష్టమైనదే," అంటారు సునీత. "బడుల్లో మా భాషను మాట్లాడగలిగే టీచర్లు లేరు." ఆమె కూడా మరాఠీలోనే 2వ తరగతి వరకూ చదివింది, కానీ తండ్రి మరణించడంతో ఆమె బడి మానేయవలసివచ్చింది.

తన మూడెకరాల పొలంలో పత్తి ఏరుతూ తీరికలేకుండా ఉన్న సమయాన PARI సునీతను కలిసింది. "ఈ పంటకాలం ముగిసేలోగా నేను వీటిని కోసేయాలి," ఆమె చేతులు కప్పివున్న తొడిమ నుండి తెల్లటి దూదిని తొలగించడంలో నేర్పుగా కదులుతుండతా, ఆమె మాతో చెప్పారు. నిమిషాల్లోనే ఆమె ఒడ్డీ సగం నిండిపోయింది.

"ఇవి కాపస్ [మరాఠీలో పత్తి]లో మిగిలిన చివరి రెండు తాస్ [మరాఠీ, కోలామీ భాషల్లో వరుసలు]," అన్నారు సునీత. ఆమె తాను ధరించిన దుస్తుల మీదుగా ఒక చొక్కా వేసుకునివున్నారు. "ఎండు రెక్కా (కోలామీలో రక్షకపత్రాలు), గడ్డి (కోలామీలో కలుపు) నా చీరకు చిక్కుకొని దాన్ని చింపేస్తాయి." రక్షకపత్రం పత్తి పువ్వును బయటివైపు నుంచి చుట్టుకుని పట్టివుంచుతుంది; గడ్డి అంటే పత్తిపొలాల్లో పెరిగే పనికిరాని కలుపుమొక్కలు.

మధ్యాహ్నం ఉష్ణోగ్రత పెరగడంతో, ఆమె సెలంగా ను - వడదెబ్బ తగలకుండా నివారించేందుకు తలపాగాగా ఉపయోగించే చిన్న నూలుగుడ్డ - బయటకు తీశారు. అయితే పొలం మీద ఆమె ధరించే దుస్తులలో అతి ముఖ్యమైనది ఒడ్డీ . ఒక పొడవాటి గుడ్డ, లేదా నూలు చీరను భుజం మీద నుంచి తుంటి వరకూ కట్టి, దానిలో ఆమె రోజంతా ఏరే పత్తిని వేస్తుంటారు. మధ్యలో ఒక చిన్న విరామం తీసుకొని, మొత్తంగా ఏడు గంటల పాటు ఆమె పని చేస్తారు. పని మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఈర్ (కోలామీలో నీరు) తాగడానికి సమీపంలోని బావి దగ్గరకు వెళ్తారు.

PHOTO • Ritu Sharma
PHOTO • Ritu Sharma

సునీత మూడెకరాల పొలంలో పత్తిని పండిస్తారు. 'పంటకాలం అయిపోకముందే నేను పంటను ఏరాలి.' అప్పుడప్పుడూ ఈర్ (కోలామీలో నీరు) తాగటానికి సమీపంలో ఉన్న బావికి వెళ్ళే ఆమె, రోజంతా పత్తిని ఏరుతూనే ఉంటారు

PHOTO • Ritu Sharma
PHOTO • Ritu Sharma

మొక్కల వలన తన బట్టలు చిరిగిపోకుండా ఉండేందుకు సునీత తన దుస్తుల మీదుగా ఒక చొక్కా వేసుకున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రత పెరగడంతో, ఆమె సెలంగాను - వడదెబ్బ తగలకుండా నివారించడానికి తలపాగాగా ఉపయోగించే చిన్న నూలు గుడ్డ - బయటకు తీశారు. ఆమె ఏరిన పత్తిని ఉంచడానికి తన తుంటి చుట్టూ ఒక ఒడ్డీని కూడా ధరించారు

కోతలకాలం మొదలయ్యే అక్టోబర్ 2023 నుంచి మొదలుకొని అది ముగిసే సమయానికి (జనవరి 2024), సునీత 1500 కిలోల పత్తిని కోశారు: "నిజానికి పత్తి ఏరటం ఎప్పుడైనా పెద్ద సవాలేమీ కాదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా కదా."

తనకు సుమారు 20 ఏళ్ళ వయసున్నప్పుడు ఆమెకు పెళ్ళయింది, కానీ 15 ఏళ్ళ తర్వాత, 2014లో ఆమె భర్త మరణించారు. "అతనికి మూడు రోజుల పాటు జ్వరం వచ్చింది." అతని ఆరోగ్యం ఇంకా విషమించటంతో సునీత ఆయనను యవత్మళ్‌లోని జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. "అదంతా హఠాత్తుగా జరిగిపోయింది. అతని మరణానికి కారణమేమిటో నాకు ఈ రోజు వరకూ తెలియదు."

సునీత ఇద్దరు పిల్లలతో మిగిలిపోయారు: “ మాణుస్ [భర్త] చనిపోయే నాటికి అర్పిత, ఆకాశ్‌లకు కేవలం పదేళ్ళ వయసు. నేను ఒంటరిగా పొలం వెళ్ళడానికి భయపడిన రోజులు కూడా ఉన్నాయి." మరాఠీ మాట్లాడటంలో తనకున్న పట్టు, ఇరుగుపొరుగు పొలాల్లోని రైతు స్నేహితుల నమ్మకాన్ని పొందడంలో తనకు సహాయపడిందని ఆమె భావిస్తారు. “మనం పొలంలో ఉన్నప్పుడు, లేదా మార్కెట్‌లో ఉన్నప్పుడు మనం వారి భాషలో మాట్లాడటమే సరైంది, అవునా? మన భాషను వాళ్ళు అర్థం చేసుకుంటారా?" అని ఆమె అడుగుతారు.

ఆమె తానే వ్యవసాయాన్ని కొనసాగించినప్పటికీ, పురుషాధిపత్యం ఉండే పత్తి మార్కెట్‌లో తాను పాల్గొనడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారని, అందుకే తాను దూరంగా ఉన్నానని సునీత చెప్పారు. “నేను పంటను మాత్రమే పండిస్తాను, ఆకాశ్ [ఆమె కొడుకు] దానిని అమ్ముతాడు."

పత్తిని ఏరుతూనే, మాట్లాడుతోన్న సునీత భుర్‌కుటేను చూడండి

సునీతా భుర్‌కుటే మాతృభాష కోలామీ, కానీ ఆమె రోజులో ఎక్కువ భాగం మరాఠీలోనే మాట్లాడుతుంటారు. 'మా పత్తిని అమ్మాలంటే మనం మార్కెట్‌ భాష తెలుసుకునివుండాలి,' అని ఆమె చెప్పారు

*****

మహారాష్ట్రలోని మూడు ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహా (PGVT)లలో ఒకటిగా కోలామ్ ఆదివాసీ సముదాయం జాబితా చేయబడింది. వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో కూడా నివసిస్తున్నారు.

మహారాష్ట్రలో ఈ సముదాయం తమని తాము ‘కోలావర్’ లేదా ‘కోలా’ అని పిల్చుకుంటారు- అంటే దీనర్థం వెదురు లేదా కొయ్య కర్ర. వెదురుతో బుట్టలు, చాపలు, తడకలు, ధాన్యాన్ని తూర్పారబట్టే చేటలు తయరుచేయటం వారి సంప్రదాయక వృత్తి.

"నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు, మా తాతయ్యవాళ్ళు తమ సొంత ఉపయోగం కోసం వెదుర్ [వెదురు]తో రకరకాల వస్తువులను తయారుచేయటం చూశాను," అని ఆమె గుర్తుచేసుకున్నారు. వాళ్ళు అడవుల నుంచి మైదాన ప్రాంతాలకు వలసపోవటం మొదలుపెట్టినప్పటినుంచి ఇంటికీ అడవికీ మధ్య దూరం పెరిగింది, "ఆ నైపుణ్యాలేవీ మా తల్లిదండ్రులు నేర్చుకోలేదు," ఆమె కూడా నేర్చుకోలేదు.

వ్యవసాయం ఆమెకు జీవనాధారం. "నాకు నా సొంత పొలం ఉన్నప్పటికీ, ఈ రోజు కూడా పంట సరిగ్గా పండకపోతే, నేను పని కోసం వేరొకరి పొలానికి వెళ్ళవలసి ఉంటుంది," అని ఆమె చెప్పారు. ఇది ఆమె కోలామ్ తెగలోని ఇతర రైతుల పరిస్థితి కూడా. వీరిలో అత్యధికులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ వ్యవసాయ ఋణాలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. సునీతకు కూడా గత జూన్ 2023లో విత్తనాలు విత్తే కాలంలో తీసుకున్న రూ. 40,000 అప్పు ఉంది.

"పత్తిని అమ్మేశాక, ఇక జూన్ నెల వరకూ ఇంకేం పని ఉండదు. మే నెల మరీ గడ్డు నెల," అంటారామె. ఆమెకు సుమారు 1500 కిలోగ్రాముల పత్తి దిగుబడి వచ్చింది. ఒక్కో కిలోగ్రాముకు తనకు రూ. 62-65 వరకూ వస్తుందని ఆమె చెప్పారు. "అంటే సుమారు రూ. 93,000 వస్తుంది. రూ. 20,000 వడ్డీతో సహా సాహుకార్ (వడ్డీ వ్యాపారి)కు అప్పు చెల్లిస్తే, ఏడాది మొత్తానికీ నా చేతిలో మిగిలేది 35,000 రూపాయలు మాత్రమే."

PHOTO • Ritu Sharma
PHOTO • Ritu Sharma

ఇతర కోలామ్ ఆదివాసీల (ప్రత్యేకించి హానికి లోనయ్యే ఆదివాసీ సమూహం) వలెనే, పంట విఫలమైతే 'నేను పని కోసం వేరొకరి పొలానికి వెళ్ళవలసి ఉంటుంది,' అని సునీత చెప్పారు. చాలామంది కోలాములు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ వ్యవసాయ ఋణాలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు

PHOTO • Ritu Sharma
PHOTO • Ritu Sharma

ఎడమ: మకర సంక్రాంతి (పంటల పండుగ)ని జరుపుకుంటోన్న ఘుబడ్‌హేటీ గ్రామానికి చెందిన మహిళలు. కుడి: సముదాయానికి చెందిన విత్తన భాండారంలో విత్తనాలను భద్రపరుస్తారు

స్థానికంగా ఉండే చిరువ్యాపారులు ఆమెకు అప్పులిస్తారు, కానీ వాటిని ప్రతి ఏటా వర్షాకాలం రావటానికి ముందే తీర్చాల్సివుంటుంది. " ఇస్‌కా 500 దో, ఉస్‌కా 500 దో, యే సబ్ కర్తే కర్తే సబ్ ఖతమ్! కుచ్ భీ నహీ మిల్తా... సారే దిన్ కామ్ కరో ఔర్ మరో! [వీళ్ళకో 500, వాళ్ళకో 500... చివరికి నీకేమీ ఉండదు. రోజంతా పనిచెయ్యి, చచ్చిపో!]," అటెటో చూస్తూ ఇబ్బాందిగా నవ్వారామె.

మూడేళ్ళ క్రితం సునీత రసాయనిక వ్యవసాయం నుండి సేంద్రియ వ్యవసాయానికి మారారు. "నేను మిశ్ర పీక్ షేతి [అంతర పంటలు / మిశ్రమ పంటలు]ని ఎంచుకున్నాను," చెప్పారామె. గ్రామంలోని మహిళా రైతులు ఏర్పాటుచేసిన విత్తన భాండారం నుంచి ఆమెకు మూంగ్ (పెసలు), ఉరద్ (మినుములు), జోవర్ (జొన్నలు), బాజ్రా (సజ్జలు), తిల్ (నువ్వులు), స్వీట్ కార్న్, తూర్ (కందులు) విత్తనాలు లభించాయి. వాస్తవానికి, పెసర, కంది పంటలను పండించటం పనులు దొరకని మే, జూన్ నెలలలో ఆమెకు చాలా సహాయపడింది.

అయితే ఒక సమస్య పరిష్కారం కాగానే, మరో సమస్య వచ్చిపడుతోంది. కంది పంట బాగా వచ్చినప్పటికీ, మిగిలిన పంటలు మంచి దిగుబడిని ఇవ్వలేదు: "అడవి పందులు వాటిని నాశనం చేశాయి," సునీత చెప్పారు.

*****

సూర్యుడు దిగిపోతుండగా, ఏరిన పత్తినంతటినీ సునీత ఒక ముడి (గుండ్రని మూట)గా చుట్టటం మొదలెట్టారు. ఆ రోజుకు ఆమె తన లక్ష్యాన్ని సాధించారు. చివరిగా మిగిలిన వరుసలు ఆమెకు సుమారు ఆరు కిలోల పత్తిని ఇచ్చాయి.

అయితే రేపటి కోసం ఆమె ఇప్పటికే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు: నిల్వ చేసిన పత్తి నుండి కేసర (కోలామీలో వ్యర్థాలు)ను, ఎండిన రెక్కా ను తొలగించడం. ఆ మరుసటి రోజు లక్ష్యం: దానిని మార్కెట్‌కి తీసుకువెళ్ళడానికి సిద్ధంచేయటం

PHOTO • Ritu Sharma
PHOTO • Ritu Sharma

ఇంటిలో నిలవచేయటం కోసం ముడి (గుండ్రని మూట)గా మలచిన పత్తి

"వేరే దేని గురించీ [తన పొలం గురించి తప్ప] ఆలోచించేందుకు సమయం లేదు," అంతరించిపొతోన్న భాషగా కోలామీ స్థితిని గురించి చెప్పారామె. సునీతకూ, ఆమె సముదాయానికీ మరాఠీలో ధారాళంగా మాట్లాడటం రానప్పుడు, "అందరూ 'మరాఠీలో మాట్లాడు, మరాఠీలో మాట్లాడు!' అనేవారు." ఇప్పుడు ఆ భాష ప్రమాదంలో పడినప్పుడు, "అందరూ మమ్మల్ని కోలామీలో మాట్లాడమని అడుగుతున్నారు," నవ్వుకున్నారామె.

"మేం మా భాషనే మాట్లాడతాం. మా పిల్లలు కూడా," అని ఆమె నొక్కిచెప్పారు. "మేం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మరాఠీలో మాట్లాడతాం. ఇంటికి తిరిగి రాగానే, మా భాషలోనే మాట్లాడుకుంటాం."

" ఆప్లీ భాషా ఆప్లిచ్ రాహిలీ పాహిజే [మా భాష మా భాషగానే మిగలాలి]. కోలామీ కోలామీగానే ఉండాలి, మరాఠీ మరాఠీగానే ఉండాలి. అదే ముఖ్యం."

ప్రేరణ గ్రామ్ వికాస్ సంస్థ, మాధురీ ఖడ్సే, ఆశా కరేవాలకు, కోలామీని వివరించడంలో సాయపడిన సాయికిరణ్ తేకామ్‌కు ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

PARI నిర్వహణలోని అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్ (ELP) భారతదేశంలోని హానికి లోనవుతున్న భాషలను ఆ భాషను మాట్లాడే వ్యక్తుల స్వరాల ద్వారా, ప్రత్యక్ష అనుభవాల ద్వారా డాక్యుమెంట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ritu Sharma

ਰਿਤੂ ਸ਼ਰਮਾ ਪਾਰੀ ਵਿਖੇ ਖ਼ਤਰੇ ਵਿੱਚ ਪਈਆਂ ਭਾਸ਼ਾਵਾਂ ਦੀ ਸਮੱਗਰੀ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਭਾਸ਼ਾ ਵਿਗਿਆਨ ਵਿੱਚ ਐਮ.ਏ. ਕੀਤੀ ਹੈ ਅਤੇ ਭਾਰਤ ਦੀਆਂ ਬੋਲੀਆਂ ਜਾਣ ਵਾਲ਼ੀਆਂ ਭਾਸ਼ਾਵਾਂ ਨੂੰ ਸੁਰੱਖਿਅਤ ਅਤੇ ਮੁੜ ਸੁਰਜੀਤ ਕਰਨ ਦੀ ਦਿਸ਼ਾ ਵਿੱਚ ਕੰਮ ਕਰਨਾ ਚਾਹੁੰਦੀ ਹਨ।

Other stories by Ritu Sharma
Editor : Sanviti Iyer

ਸੰਵਿਤੀ ਅਈਅਰ, ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਕੰਟੈਂਟ ਕੋਆਰਡੀਨੇਟਰ ਹਨ। ਉਹ ਉਹਨਾਂ ਵਿਦਿਆਰਥੀਆਂ ਦੀ ਵੀ ਮਦਦ ਕਰਦੀ ਹਨ ਜੋ ਪੇਂਡੂ ਭਾਰਤ ਦੇ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਲੈ ਰਿਪੋਰਟ ਕਰਦੇ ਹਨ ਜਾਂ ਉਹਨਾਂ ਦਾ ਦਸਤਾਵੇਜ਼ੀਕਰਨ ਕਰਦੇ ਹਨ।

Other stories by Sanviti Iyer
Editor : Priti David

ਪ੍ਰੀਤੀ ਡੇਵਿਡ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਇੰਡੀਆ ਦੇ ਇਕ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਪਾਰੀ ਵਿਖੇ ਐਜੁਕੇਸ਼ਨ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪੇਂਡੂ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਕਲਾਸਰੂਮ ਅਤੇ ਪਾਠਕ੍ਰਮ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਸਿੱਖਿਅਕਾਂ ਨਾਲ ਅਤੇ ਸਮਕਾਲੀ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਦਸਤਾਵੇਜਾ ਦੇ ਰੂਪ ’ਚ ਦਰਸਾਉਣ ਲਈ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਕੰਮ ਕਰਦੀ ਹਨ ।

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli