చక్కగా అల్లిన కమల్‌కోశ్ చాపను కొద్దిమంది మాత్రమే మెచ్చుకోగలరు.
చాలా కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ ఆ చాపను అల్లగలరు.
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ జిల్లాలో తయారుచేసే ఈ అత్యంత సవిస్తరమైన పేము చాపలను బిరుసుగా ఉండే సన్నటి పేము చీలికలతో అల్లుతారు. వాటిపై ఉండే సాంస్కృతిక కళాకృతుల వలన ఇవి ఇతర చాపల నుండి ప్రత్యేకంగా నిలుస్తాయి.
"సంప్రదాయక కమలకోశ్, కోలా గాచ్ [అరటి చెట్టు], మయూర్ [నెమలి], మంగళ్ ఘట్ [కొబ్బరికాయ కలశం], స్వస్తిక్ [శ్రేయస్సుకు ప్రతీక] వంటి మంగళకరమైన కళాకృతులతో అలంకరించి ఉంటుంది," అని ప్రభాతి ధర్ చెప్పారు.
వీటిని కమల్‌కోశ్ చాపలుగా అల్లగల కొద్దిమంది అల్లికదారులలో ప్రభాతి కూడా ఒకరు. ఆమె 10 సంవత్సరాల చిన్న వయస్సు నుంచే ఈ చాపలను అల్లుతున్నారు. "ఈ గ్రామం [ఘెగిర్‌ఘాట్ గ్రామం]లోని ప్రతి ఒక్కరూ చాలా చిన్న వయస్సు నుండే చాపలు అల్లడం ప్రారంభిస్తారు," అని ఈడుకు మించిన బుద్ధి కావొచ్చునేమో అనే సూచనను తోసిపుచ్చుతూ చెప్పారు 36 ఏళ్ళ ప్రభాతి. "మా అమ్మ కమల్కోశ్ను భాగాలుగా మాత్రమే అల్లగలదు, కానీ మా నాన్నకు మాత్రం డిజైన్‌పై మంచి పట్టు ఉంది. 'ఈ డిజైన్‌ను ఇలా అల్లడానికి ప్రయత్నించండి' అని బాగా వివరిస్తాడు కూడా. ఆయన స్వయంగా అల్లలేనప్పటికీ, ఆయన వివరణాత్మక వివరణల నుండి తాను చాలా ఎక్కువ గ్రహించినట్టు ప్రభాతి భావిస్తున్నారు.
మేం ఘెగిర్‌ఘాట్‌లోని ఆమె ఇంటి వరండాలో కూర్చొని ఉన్నాం. చుట్టూ మూసివున్న ఆ వసారాలో ఆ ప్రాంతంలోని చాలామంది అల్లిక కార్మికులు పనిచేయడానికి ఇష్టపడతారు. ఈ కళకు సంబంధించిన వివిధ పనుల్లో సహాయం చేస్తూ ఆమె కుటుంబమంతా ఆమె చుట్టుపక్కలే ఉంటారు. చాప అల్లికలో వచ్చే కళాకృతులను ఆమె మాత్రమే ఊహించి, రూపొందిస్తారు. "మా జ్ఞాపకశక్తితోనే వీటిని చేయడం మాకు అలవాటైపోయింది," అని ఆమె తన డిజైన్ ప్రక్రియ గురించి చెప్పారు.


























