ఆగస్టు నెల వరకు పన్నా జిల్లాలో వర్షాలు కురుస్తూనేవున్నాయి, కైథాబారో ఆనకట్ట తన పూర్తి సామర్థ్యానికి నిండిపోయింది. ఇది సమీపంలోని పన్నా టైగర్ రిజర్వ్ (PTR)లో ఉన్న కొండల నుండి ప్రవహిస్తుంది.
సురేన్ ఆదివాసీ ఒక సుత్తె తీసుకొని ఆనకట్ట వద్దకు వచ్చారు. ఆయన వడివడిగా ప్రవహిస్తోన్న నీటి వైపుకు, ఏదైనా కొత్త రాళ్ళు గానీ, చెత్త గానీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయేమోనని జాగ్రత్తగా చూశారు. వేగంగా ప్రవహిస్తున్న నీటిని మరింత మెరుగ్గా పారేలా చేసేందుకు ఆయన సుత్తెని ఉపయోగించి అడ్డుగా ఉన్న రెండు రాళ్ళను పక్కకు తప్పించారు.
"నీరు సరిగ్గా ప్రవహిస్తుందో లేదో చూడటానికి నేనిక్కడికి వచ్చాను," అని ఆయన PARIతో చెప్పారు. "అవును, అది చక్కగా పారుతోంది," బిల్‌పురా గ్రామానికి చెందిన ఆ చిన్న రైతు తల ఊపారు. కొద్ది మీటర్ల దూరాన దిగువకు ఉన్న తన వరి పంట ఎండిపోదని ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ చిన్న ఆనకట్ట మీదుగా చూపు సారిస్తూ ఆయన, “ఇదొక గొప్ప వరం. వరి పండించొచ్చు, గోధుమలు కూడా. ఇంతకుముందు నేను ఇక్కడున్న నా ఎకరం పొలానికి నీళ్ళు పారించి, వ్యవసాయం చేయలేకపోయేవాడిని," అన్నారు.
ఆనకట్టను నిర్మించడంలో సహాయం చేయటం ద్వారా బిల్‌పురా ప్రజలు తమకు తామే అందించుకున్న ఆశీర్వాదమది.
సుమారు వెయ్యిమంది ప్రజలు నివసించే బిల్‌పురా గ్రామంలో ఎక్కువమంది గోండ్ ఆదివాసులైన (షెడ్యూల్డ్ తెగలు) రైతులే. అందరికీ కొద్దిపాటి పశుగణం కూడా ఉంది. 2011 నాటి జనగణన ప్రకారం ఈ గ్రామంలో ఒకే ఒక చేతి పంపు, ఒక బావి ఉన్నాయి. ప్రభుత్వం జిల్లాలోనూ, చుట్టుపక్కలా రాళ్ళ వరుసలు పేర్చి చెరువులు నిర్మించింది, కానీ అక్కడ ఆయకట్టు లేదనీ, "పానీ రుక్తా నహీఁ హై [నీరు నిలబడదు]," అనీ స్థానికులు చెప్పారు








