ఆమె ఇంటి కిటికీ నుండి బయటికి చూస్తే, కనుచూపు మేరా మొత్తమంతా నీరే. ఈ సంవత్సరం వచ్చిన వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రూపాలీ పెగు సుబన్‌సిరి నదికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో నివసిస్తున్నారు. ఇది బ్రహ్మపుత్రా నదికి ముఖ్యమైన ఉపనది, ఏటా అస్సామ్‌లోని విస్తారమైన భూములను వరదతో ముంచెత్తుతుంటుంది.
చుట్టుపక్కలంతా నీరే ఉన్నా, తాగు నీరు దొరకటం ఒక పెద్ద సమస్య అంటారామె. ఆమె స్వగ్రామమైన అస్సామ్‌లోని లఖింపూర్ జిల్లా, బొర్‌దుబి మలువాల్‌లో తాగునీరు కలుషితమైపోయింది. "మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేతి పంపులన్నీ వరదనీటిలో మునిగిపోయాయి," రూపాలి వివరించారు.
రోడ్డుకు దగ్గరగా ఉన్న చేతి పంపు నుండి నీరు తెచ్చుకోవటానికి ఆమె దోనెపై ఆధారపడతారు. నీరు నింపుకునే మూడు పెద్ద స్టీలు పాత్రలను తీసుకొని, పాక్షికంగా మునిగివున్న రోడ్డు వైపుకు దోనెపై వెళ్తారు రూపాలీ. వరదలో మునిగివున్న గ్రామం గుండా దోనెను నడుపుకుంటూ వెళ్ళటానికి ఆమె ఒక పొడవైన వెదురుకర్రను ఉపయోగిస్తారు. "మొనీ, రా వెళ్దాం!" ఈ ప్రయాణాల్లో తరచుగా తనతోపాటు వచ్చే పొరుగింటామెను పిలుస్తారామె. పాత్రలలో నీరు నింపుకోవడానికి స్నేహితులిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటారు.








