"గులామ్ నబీ, నీ కళ్ళు పాడవుతాయి. ఏం చేస్తున్నావు? నిద్రపో!"
చాలా రాత్రివరకూ నేను కొయ్యపై ఆకృతులను చెక్కడాన్ని చూసినప్పుడల్లా మా అమ్మ ఇలాగే అనేది. ఆవిడలా తిట్టినా కూడా నేను ఎప్పుడో తప్ప నా పని ఆపేవాడ్ని కాదు. నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే నా కళను నేను 60 ఏళ్ళకు పైగా సాధన చేస్తూ ఉండటమే కారణం. నాపేరు గులామ్ నబీ దార్. నేను కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన దారుశిల్పిని.
నేనెప్పుడు పుట్టానో నాకు తెలియదు కానీ నా వయసిప్పుడు 70కి పైబడింది. నా జీవితమంతా నేనీ నగరంలోని మాలిక్ సాహిబ్ సఫాకాదిల్ ప్రాంతంలోనే జీవించాను. నేనిక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివాను, కానీ నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన మూడవ తరగతిలోనే బడి మానేశాను. మా నాన్నగారైన అలీ ముహమ్మద్ దార్, ఈ పొరుగునే ఉన్న అనంత్‌నాగ్ జిల్లాలో పనిచేసేవారు, అయితే నాకు పదేళ్ళ వయసప్పుడు ఆయన శ్రీనగర్‌కు తిరిగివచ్చేశారు.
మమ్మల్ని - ఆయన కుటుంబ సభ్యులైన మా అమ్మ, అజ్జి, 12 మంది పిల్లలు - పోషించేందుకు ఆయన నగరంలో కూరగాయలను, పొగాకును అమ్మడం మొదలెట్టారు. అందరిలోకీ పెద్దవాడినైన నేను మా నాన్నకు సాయంచేసేవాడిని, అలాగే నా తమ్ముడైన బషీర్ అహమద్ దార్ కూడా. మాకు పని ఎక్కువగా లేనప్పుడు, అన్నదమ్ములమిద్దరం అక్కడికీ ఇక్కడికీ తిరుగుతుండటం చూసిన మా మామూ (మేనమామ) మా తిరుగుళ్ళ గురించి మా నాన్నకు ఫిర్యాదు చేశారు. దారుశిల్పం పనిని నేర్చుకోమని మాకు చెప్పింది మా మామూయే.














