తన సబూజ్ సాథీ సైకిల్ దొంగతనం జరిగినప్పటి నుంచి, ఆమెకు బడికి వెళ్ళటం ఒక సవాలైపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులు చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఆ మహా ఘనమైన యంత్రాన్ని అందుకున్న రోజును సరస్వతి గుర్తుచేసుకుంది. ఓహ్! టెర్రకోట ఎరుపు రంగులోని సూర్యుని కింద అది ఎంతగా మిలమిలలాడిపోయిందో!
ఈ రోజు ఆమె మరో కొత్త సైకిల్ కోసం అర్జీ తీసుకొని, ఆశతో గ్రామ్‌ప్రధాన్ దగ్గరకు వచ్చింది. "సైకిల్ తో పేయే జాబీ రే ఛుడీ, కింతు తోర్ ఇస్కూల్-టా ఆర్ కొద్‌దిన్ థక్‌బే సెటా ద్యాఖ్ ఆగే [నీకు మరో సైకిల్ దొరకొచ్చు బుజ్జీ, కానీ మీ బడి ఇంకా ఎంతోకాలం ఇక్కడ ఉండదు]," బలవంతపు నవ్వుతో భుజాలెగరేస్తూ చెప్పాడు సర్పంచ్. సరస్వతికి తన కాళ్ళ కింది భూమి కదిలిపోయినట్లనిపించింది. గ్రామ్‌ప్రధాన్ చెప్తోన్న మాటలకు అర్థమేమిటి? బడికి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేది. ఇప్పుడా దూరం 10 లేదా 20 కిలోమీటర్లు లేదా అంతకు మించి ఉంటే, ఆమె నాశనమైనట్టే. ఆమెకు పెళ్ళిచేసి పంపాలనే గట్టి నిర్ణయంతో ఉన్న తండ్రితో పోరాటానికి ఏడాదికి కన్యాశ్రీ పథకం కింద వచ్చే ఒక వెయ్యి రూపాయలు సరిపోవు.
సైకిల్
బడికి పద చిన్నారీ బడికి పద
సర్కారీ సైకిల్ పై మొహుల్ను దాటి...
ఉక్కు నాగలి లాగా బలంగా,
బడా బాబులకు భూమిపై మనసయ్యింది
బడి మూతపడితే మాత్రమేమీ?
చిన్నారీ మొహమెందుకు చిట్లించావు?


