రుఖాబాయి పాడవీ ఆ వస్త్రాన్ని వేళ్ళతో తడమకుండా ఉండలేకపోతున్నారు. మేం మాట్లాడుకుంటోన్న సమయంలో, అలా చేయటం ఆమెను మరో సమయానికి, మరో జీవితంలోకి తీసుకువెళ్తోందని నేను గ్రహించాను.
"ఇదే నా పెళ్ళి చీర," అక్రాణీ తాలూకా లోని కొండలతో నిండిన ఆదివాసీ ప్రాంతంలో మాట్లాడే భిల్ ఆదివాసీ భాషలో చెప్పారామె. ఒక చార్‌పాయ్ (మంచం) మీద కూర్చొని ఉన్న ఆ 90 ఏళ్ళ మహిళ తన ఒడిలో పెట్టుకున్న బంగారు రంగు అంచున్న లేత గులాబీ రంగు నూలు చీరను మృదువుగా తడుముతున్నారు.
"నా తల్లిదండ్రులు తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో దీన్ని కొన్నారు. ఈ చీర నాకు వాళ్ళ జ్ఞాపకం," చిన్నపిల్లలా సంబరంగా నవ్వుతూ చెప్పారామె.
మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లా, అక్రాణీ తాలూకా లోని మోజరా గ్రామంలో రుఖాబాయి పుట్టారు; ఆమె జీవితమంతా ఈ ప్రాంతంలోనే గడిచింది.
"నా తల్లిదండ్రులు నా పెళ్ళి కోసం 600 రూపాయలు ఖర్చుచేశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ డబ్బు కింద లెక్క. వాళ్ళు ఐదు రూపాయలు ఖర్చుచేసి ఈ పెళ్ళి చీరతో సహా బట్టలు కొన్నారు," చెప్పారామె. అయితే నగలను మాత్రం ఆమె ప్రియమైన తల్లి ఇంటివద్దనే తయారుచేశారు.
"అప్పుడు కంసాలి గానీ, నగలు చేసేవారుగానీ లేరు. మా అమ్మ వెండి నాణేలతో ఒక నెక్లెస్ తయారుచేసింది. నిజమైన వెండి రూపాయలు. ఆమె వాటికి రంధ్రం చేసి, వాటిని మందమైన గోధడీ (చేతి తయారీ దుప్పట్లు) దారానికి గుచ్చింది," ఆ ప్రయత్నాన్ని తలచుకొని ముసిముసిగా నవ్వుతూ చెప్పారు రుఖాబాయి. ఆమె తన మాటల్ని మరోసారి చెప్పారు: "వెండి నాణేలు హా . ఇప్పటిలా కాగితాల డబ్బు కాదు."
తన పెళ్ళి చాలా వైభవంగా జరిగిందని ఆమె చెప్పారు. పెళ్ళవగానే ఆ నవ వధువు మోజరాకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న సుర్వాణీ గ్రామంలోని తన అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఈ సమయంలోనే ఆమె జీవితం మలుపులు తిరగడం మొదలయింది. ఇక ఆమె రోజులు ఎంతమాత్రం మామూలుగానూ, సంతోషకరంగానూ లేకుండాపోయాయి.
"అది నాకు పరాయి ఇల్లయినప్పటికీ, నేనిక ఈ ఇంటిలోనే ఉండాలని నన్ను నేను ఒప్పించుకున్నాను. నా జీవిత పర్యంతం," అన్నారామె. "నేనప్పుడు రుతుక్రమంలో ఉన్నాను కాబట్టి నన్ను ఎదిగిన వ్యక్తిగానే పరిగణించారు."
"కానీ నాకు పెళ్ళంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో కొంచెంగా కూడా తెలియదు."
అప్పటికామె ఇంకా చిన్నపిల్లే; పిల్లలందరూ అడుకునేట్లే తన స్నేహితులతో కలిసి ఆడుకునే పాటి చిన్న పిల్ల. చిన్నతనంలోనే జరిగిన ఆ పెళ్ళి వలన, ఆమె తన వయసుకు మించిన పనులు చేయాల్సివచ్చింది, కష్టాలను సహించవలసివచ్చింది.
"రాత్రంతా మొక్కజొన్నలను, చిరుధాన్యాలను విసరాల్సి వచ్చేది. ఈ పని మా ఐదుగురి కోసం - మా అత్తమామలు, ఆడపడుచు, నా భర్త, నేను - చేయవలసివచ్చేది.”
ఈ పని ఆమెకు నిరంతర వెన్నునొప్పిని ఇవ్వటంతో పాటు చాలా అలసిపోయేలా చేసింది. "ఇప్పుడు మిక్సర్లు, మరలూ రావటంతో పని చాలా సులభమైపోయింది."
ఆ రోజుల్లో, తనలో తాను అనుభవించిన అలజడిని ఎవరితోనైనా పంచుకోవడం ఆమెకు కష్టంగా ఉండేది. ఎవరూ తన మాటను చెవినపెట్టేవారు కాదని ఆమె చెప్పారు. వినటానికి ఇష్టపడే సానుభూతి గల శ్రోతలు లేనప్పటికీ, రుఖాబాయికి ఒక అసంభవమైన స్నేహం దొరికింది. అది ప్రాణంలేనిది. పాత రేకు పెట్టెలో ఉంచిన మట్టి పాత్రలను ఆమె బయటకు తీసేది. “నేను వాటితో చాలా సమయం గడిపేదాన్ని. వాటిని చూల్ (పొయ్యి) మీద ఉంచి, అన్ని రకాల మంచీ చెడుల గురించి ఆలోచించేదాన్ని. పాత్రలే ఓపిక కలిగిన నా శ్రోతలు.”
ఇదేమీ అసాధారణ విషయం కాదు. గ్రామీణ మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో మహిళలు మరో వంట సాధనమైన విసుర్రాయిలో తమ నమ్మకమైన స్నేహితులను చూసుకుంటారు. ప్రతిరోజూ వారు పిండి విసురుతున్నప్పుడు, అన్ని వయసులలోని మహిళలు తమ భర్తలు, సోదరులు, కొడుకుల చెవులకు వినబడనంత దూరంగా ఈ వంటగది సాధనానికి తమ ఆనందం, దుఃఖం, హృదయ వేదనను వెలిబుచ్చే పాటలు పాడి వినిపించేవారు. విసుర్రాయి పాటల గురించి PARI సిరీస్ నుండి మీరిక్కడ మరింత చదవవచ్చు.
రుఖాబాయి తన పెట్టెను తిరగేస్తున్నప్పుడు, తనలో రేగే ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. “ఇది డవీ [సొరకాయ బుర్ర]. మేం ఇంతకుముందు ఇలాగే నీళ్ళు తాగేవాళ్ళం," అని ఎలా తాగేవాళ్ళో చూపిస్తూ చెప్పారు. ఎలా తాగేవారో నాకు చూపించటం కూడా ఆమెకు నవ్వు తెప్పించింది.
పెళ్ళి అయిన ఏడాదిలోనే రుఖాబాయి తల్లి అయ్యారు. ఆ సమయానికి ఆమెకు ఇంటి పనినీ, పొలం పనినీ ఎలా సంబాళించుకోవాలో అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంది.
బిడ్డ పుట్టగానే ఇంట్లో నిరాశ అలముకుంది. "ఇంట్లో అందరూ అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు, కానీ అమ్మాయి పుట్టింది. అదేమీ నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే నేనే కదా బిడ్డ సంరక్షణను చూసుకోవాల్సింది," అన్నారామె.
ఆ తర్వాత రుఖాబాయికి ఐదుగురు కూతుళ్ళు పుట్టారు. "ఒక అబ్బాయి పుట్టాలని చాలా మొండిగా ఉండేవాళ్ళు. ఎలాగైతేనేం, ఇద్దరు కొడుకుల్ని కన్నాను. అప్పుడు మాత్రమే నేను స్వేచ్ఛను పొందాను," ఆ జ్ఞాపకం తెచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు రుఖాబాయి.
ఎనిమిదిమంది పిల్లలను కన్నాక, ఆమె శరీరం చాలా బలహీనమైపోయింది. "కుటుంబమైతే పెరిగింది కానీ మా రెండు గుంఠల (సుమారు 2,000 చదరపు అడుగులు) పొలంలో దిగుబడి మాత్రం పెరగలేదు. తినటానికి సరిపోయినంత ఉండేది కాదు. అందులో కూడా అడవాళ్ళకీ, ఆడపిల్లలకీ చాలా తక్కువ భాగం ఉండేది. నా వెన్నులో నిరంతరాయంగా నొప్పి ఉండటం కూడా ఏం పనిచేయలేదు." బతకటానికి మరింత సంపాదించాలి. "వెన్నునొప్పి సతాయిస్తున్నా కూడా నేను నా భర్త మోత్యా పాడవీతో కలిసి రహదారులు కట్టే పనికి రోజుకు 50 పైసల కూలికి వెళ్ళేదాన్ని."
ఈ రోజున, తన కళ్ళముందే తన కుటుంబంలోని మూడో తరం ఎదగడాన్ని రుఖాబాయి చూడగలుగుతున్నారు. "ఇదొక కొత్త ప్రపంచం," అన్నారామె. ఈ మార్పు కొంత మంచిని తెచ్చిందనే విషయాన్ని ఆమె గుర్తించారు.
మా సంభాషణ ముగుస్తుండగా, ఈనాటి ఒక వింత విషయాన్ని ఆమె పంచుకున్నారు: "ఇంతకుముందు మేం బహిష్టులో ఉన్నపుడు ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మహిళలను వంటగదుల్లోకి రానివ్వడంలేదు," ఆమె చిరాకుపడుతూ చెప్పారు. "ఇళ్ళల్లోకి దేవుడి పటాలు వచ్చాయి కానీ, స్త్రీలు మాత్రం బయటకు వెళ్ళారు."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి