రాయపుర్ ఇటుక బట్టీల వద్ద అది మధ్యాహ్న భోజన సమయం. అక్కడి కూలీలు గబగబా ఒక ముద్ద తినటమో లేదా తాత్కాలికంగా కట్టుకున్న నివాసాలలో కాస్త విశ్రాంతి తీసుకోవటమో చేస్తున్నారు.
తన మట్టి గుడిసె నుంచి బయటకు వస్తూ, "మేం సత్నా నుంచి వచ్చాం," అని ఒక మహిళా కూలీ చెప్పింది. ఇక్కడ పనిచేస్తోన్న కూలీలలో ఎక్కువమంది పొరుగు రాష్ట్రం నుంచి వలసవచ్చినవారు; వాళ్ళు ప్రతి ఏటా నవంబర్-డిసెంబర్ నెలలలో కోతల కాలం ముగిశాక ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని అయిన ఇక్కడకు వచ్చి, ఆరు నెలల పాటు - మే లేదా జూన్ నెల వరకు - ఇక్కడ ఉంటారు. భారతదేశ ఇటుక బట్టీల పరిశ్రమలో 10-23 మిలియన్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు (భారతదేశ ఇటుక బట్టీలలో బానిసత్వం, 2017).
ఈ ఏడాది, వాళ్ళు తిరిగి తమ ఇళ్ళకు చేరుకునే సమయానికి కేంద్రంలో ఒక కొత్త ప్రభుత్వం ఉంటుంది. కానీ తమ కొత్త నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఈ వలస కూలీల పాత్ర ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం.
"వోటు వేసే సమయానికి మాకు సమాచారం వస్తుంది," తన గుర్తింపును చెప్పడానికి ఇష్టపడని ఆ మహిళ PARIతో చెప్పింది.
ఆ సమాచారాన్ని బహుశా వాళ్ళ లేబర్ కంట్రాక్టర్, సంజయ్ ప్రజాపతి వారికి అందజేస్తుండవచ్చు. ఆ గుడిసెలకు కొంత దూరంలో నిల్చొని ఉన్న అతను మాతో ఇలా చెప్పాడు,"సత్నాలో పోలింగ్ గురించి మాకింకా సమాచారం లేదు. మాకు తెలిస్తే వాళ్ళకు చెప్తాం." సంజయ్‌తో సహా అక్కడ పనిచేసేవారిలో ఎక్కువమంది ప్రజాపతి సముదాయానికి (మధ్యప్రదేశ్‌లో ఇతర వెనుకబడిన వర్గంగా జాబితా అయివుంది) చెందినవారే.









