"మా శరీరాలకు రంగులు వెయ్యడం కష్టం. మేం రాత్రంతా లేచి ఉండాలి (రంగులు వేయించుకోవడానికి)," అంటాడు ఆయుష్ నాయక్, తన దేహానికి మొదటిసారిగా నూనె రంగులు రాసుకుంటూ. "నా శరీరం మండుతున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి, మేం ఈ రంగుని కుదిరినంత తొందరగా ఆరబెట్టాలి," అంటాడు పదిహేడేళ్ళ ఈ అబ్బాయి.
కోస్తా కర్ణాటకలో 'పిలి వేష' (లేక హులి వేష), దసరా జన్మాష్టమి పండుగలప్పుడు చేసే ఒక జానపద నృత్యం. దీని కోసం శరీరాలకు మెరిసిపోయే రంగుల గీతలు వేసుకునే బాలబాలికలలో ఆయుష్ ఒకడు. ఈ ప్రదర్శన చేసేటప్పుడు చుట్టూ గట్టిగా డోళ్ళు మోగుతుంటే పులి ముసుగులు వేసుకుని గట్టిగా గాండ్రిస్తారు, కేకలు వేస్తారు.
కోస్తా కర్ణాటకలో మాట్లాడే తుళు భాషలో పిలి అంటే పులి, వేష అంటే వేషం. "ఎవరూ ఎవరి నించీ ఏమీ నేర్చుకోవక్కర్లేదు. ఇది మా ఆత్మలో ఉంటుంది." అంటారు గత ఇరవై రెండేళ్ళుగా పిలి వేష వేస్తోన్న వీరేంద్ర శెట్టిగార్. "ఆ డోలు చప్పుళ్ళతో పాటు చుట్టూ ఆవరించి ఉండే శక్తి తాళానికి అనుగుణంగా మీ చేత నాట్యమాడిస్తాయి." 30 ఏళ్ళ వయసున్న ఈయన అమెజాన్ పంపిణీదారుడిగా పనిచేస్తారు, తన గ్రామంలోని యువతను ఈ నృత్యం చేయమని ప్రోత్సహిస్తూ ఉంటారు.
నాట్యకారులు పులులలాగా, రకరకాల చిరుతపులులలాగా కనిపించడానికి శరీరమంతా అక్రీలిక్ రంగులతో పసుపు, మట్టి రంగు చారలు వేసుకుంటారు. ఇంతకుముందు రోజులలో పులివేషగాళ్ళు తమ ఒంటిపై వేసుకునే ప్రకాశవంతమైన రంగులకు బొగ్గు, మట్టి, వేర్లు, శిలీంధ్రాలు మూలకాలుగా ఉండేవి .
కొన్నేళ్ళుగా ఈ నాట్యం సంప్రదాయక అడుగులు మరిన్ని విన్యాసాలతో కూడుకున్నవిగా మారాయి. ఇప్పుడు ముందుకూ వెనక్కూ పల్టీలు కొట్టడం, తలతో కొబ్బరికాయల్ని పగులగొట్టడం, నోట్లోంచి మంటలను బయటికి ఊదటం వంటి తమాషా పనులు ఎక్కువయ్యాయి. ఈ కొరియోగ్రఫీకి ఎంత శక్తి కావలసి వస్తోందంటే, వయసుమళ్ళినవాళ్ళు ఈ నృత్యాన్ని చిన్న వయసువారికి వదిలేస్తున్నారు.






























