"మేం మా జీవితమంతా ఇక్కడ ఉన్న అందరిలాగే మేం కూడా ఈ దేశ పౌరులమేనని రుజువు చేయడం కోసం ప్రభుత్వానికీ తోటి దేశవాసులకీ పత్రాలు సమర్పిస్తూనే గడిపాం."
బహారుల్ ఇస్లామ్ చెత్తను వేరుచెయ్యడంలో మునిగివున్నారు. ప్లాస్టిక్ సీసాలు, తడి చెత్త, అట్టలు, థెర్మోకోల్ - వీటన్నిటినీ వేరు వేరు గుట్టలుగా చేసి వేర్వేరు బస్తాలలోకి నింపుతున్నారు. 35 ఏళ్ళ బహారుల్, అస్సామ్‌లోని బర్‌పేట, బొంగైగాఁవ్, గొవాల్‌పారా జిల్లాల నుంచి వలస వచ్చిన 13 కుటుంబాలలో ఒకరు. హరియాణాలోని అసావర్‌పుర్‌లో వీరంతా కలిసి ఒక చిన్న స్థలంలో నివాసముంటున్నారు. చెత్త ఏరుకోవడం, దాన్ని వేరు చెయ్యడం వారి జీవనాధారం.
"జనం మేమెవరమని ఎప్పుడూ అడుగుతూనే వుంటారు- ఇక్కడా, అస్సామ్‌లో కూడా." అధికారులు తరచుగా తమ మురికివాడకు వచ్చి గుర్తింపు పత్రాలు చూపించమని అడుగుతూ వుంటారని బహారుల్ చెప్పారు. "మేం చెత్త ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి జనం మేమెక్కడినుంచి వచ్చాం అని అడుగుతారు. మేం అస్సామ్ అని చెప్తే వాళ్ళు బంగ్లాదేశ్ అని ఊహించుకుంటారు." అంతేగాక పోలీసులు వచ్చి, వారిపై క్రిమినల్ కేసులు ఏమీ లేవని నిర్ధారించుకోడానికి అస్సామ్ పోలీసుల ధృవీకరణ కోసం అడుగుతారని కూడా ఆయన చెప్పారు. "మేమేం చెప్తున్నామనేది ఎవరూ పట్టించుకోరు," అన్నారు బహారుల్. అతనికి అస్సామ్‌లో దేశీయ పౌరసత్వ నమోదు (NRC) జరుగుతోందని తెలుసు. అయితే ఆయన దగ్గర భూ యాజమాన్య పత్రాలు వున్నాయి కాబట్టి ఆయనేం భయపడటంలేదు.
అతనితో పాటే ఉంటోన్న అన్నదమ్ములు రియాజ్, నూర్ ఇస్లామ్ కూడా అస్సామ్ నుంచి వచ్చినవాళ్ళే. తరచుగా వచ్చే బ్రహ్మపుత్ర వరదలవల్ల వాళ్ళ పొలంలో వ్యవసాయం చేయటం కష్టం కావడంతో ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్పారు. అక్కడ బర్‌పేటలో వారికున్న 800 చదరపు అడుగుల స్థలంలో వాళ్ళ తల్లితండ్రులు పచ్చిమిర్చి, టమాటో ఇంకా ఇతర కూరగాయలను పండిస్తారు. "భారీ వర్షాలప్పుడు మా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. మేం ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సివస్తుంది. అరటి బోదెల మీద ఎక్కి ఒక చోటినుండి ఇంకోచోటికి ప్రయాణాలు చేస్తాం," అని ఆ అన్నదమ్ములు చెప్పారు. దేశీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (NRSC) లెక్కల ప్రకారం 1998 నుండి 2005 మధ్య వరదల వల్ల అస్సామ్ రాష్ట్రంలో 28.75 శాతం భూమి ప్రభావితమయింది.
బహారుల్, రియాజ్, నూర్‌లు తమలాంటి ఇంకో 11 కుటుంబాలతో పాటు అస్సామ్‌లోని వారి ఇళ్ళ నుండి వేల కిలోమీటర్ల దూరంలో బతుకుతున్నారు. వీరంతా అస్సామ్‌లోని బార్‌పేట, బొంగయ్‌గాఁవ్, గొవాల్‌పారా జిల్లాల నుంచి వచ్చారు. వీరంతా ఒకే దగ్గర ఉంటూ కలసి పని చేసుకుంటూ ఈ పరాయి వాతావరణంలో ఒకరికొకరు సహాయంగా, పరాయివాళ్ళను స్థానికులు చూసే చిన్నచూపును ఎదుర్కోవడంలో ఒకరికొకరు ఆసరాగా వుంటున్నారు.
"ఇక్కడ ఎవరికైనా డబ్బు అవసరం అయితే మాలో మేమే ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. కేవలం కొద్దిమంది మాత్రమే అస్సామ్‌కి వెళ్ళగలిగే స్తోమత కలిగివుంటారు కాబట్టి మీఠీ ఈద్, బక్రీద్ లాంటి పండగలను ఇక్కడే మేమంతా కలిసి చేసుకుంటాం. రమాదాన్ రోజుల్లో అప్పుడప్పుడూ కలిసి సహరీ ని కూడా పంచుకుంటాం," అన్నారు బహారుల్.
ఎక్కువ కుటుంబాలు కరోనాకి ముందు 2017లో, మిగిలినవి 2021లో ఇక్కడికి వచ్చాయి. అందరూ కలిసి వాళ్ళు ఉంటున్న స్థలాన్ని నెలకు 17000 రూపాయలకు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో కుటుంబం నెలకు వెయ్యి రూపాయలకంటే కొంచెం ఎక్కువ అద్దె చెల్లిస్తాయి. బహారుల్ భార్య మోఫిదా లాంటి కొందరు ఆడవాళ్ళు కూడా పనిలో సహాయంగా వుంటారు. పదో తరగతి వరకు చదువుకున్న మోఫిదాకు అస్సామీ భాషతో పాటు ఆంగ్లంలో కూడా చదవడం, రాయడం వచ్చు. చెత్త తూకం వెయ్యడం, ప్రతి కుటుంబం సేకరించిన చెత్త వివరాలను ఒక చిన్న పుస్తకంలో రాసిపెట్టడం వంటి పనులను ఆమె చేస్తారు.
ఇక్కడి అన్ని కుటుంబాల పనులూ చెత్త సేకరణ చుట్టే ఉంటాయి: కొందరు స్థానిక నివాసాలనుంచి చెత్త తీసుకువస్తారు. బహారుల్ లాంటివాళ్ళు చుట్టుపక్కల కర్మాగారాల నుంచి చెత్త తెస్తారు. చిన్నపిల్లలు చెత్తను వేరుచేయడంలో సహాయపడటంతో పాటు ఒక్కోసారి వాళ్ళు కూడా పెద్దవాళ్ళకు సహాయంగా చెత్త ఏరుకురావడానికి వెళతారు.
"మేం పొద్దున్న 7 గంటలకు మా పనిని మొదలుపెట్టి, నగరంలోకి వెళ్ళి చెత్తను తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగివస్తాం," అన్నారు నూర్ ఇస్లామ్. అయితే ఒక్కోసారి పని ఎక్కువగా వున్నప్పుడు రాత్రి 9 కూడా అవుతుందని ఆయన అన్నారు. ఒకసారి చెత్తనంతా తీసుకొచ్చాక దాన్ని 30 నుంచి 35 రకాలుగా వేరు చేస్తారు: వాడేసిన సీసాలు, ప్లాస్టిక్ సంచులు, చపాతీలు, థెర్మోకోల్, గాజు వస్తువులు ఇంకా చాలా. "తర్వాత మేం ఆ వ్యర్థాలను స్థానిక వ్యాపారులకు అమ్ముతాం," అన్నారు బహారుల్. గిరాకీని బట్టి డీలర్ దాని ధరను నిర్ణయిస్తాడు, దాన్నే ఈ చెత్త ఏరుకునేవాళ్ళు ఒప్పుకోవాల్సి ఉంటుంది. "ఒక కిలో థెర్మోకోల్ ధర 15 నుంచి 30 రూపాయల మధ్యలో ఉంటుంది." బహారుల్ అన్నారు.
ఒక్కో కుటుంబం నెలకు 7000 నుంచి 10000 రూపాయల వరకూ సంపాదిస్తుంది. ఎండాకాలంలో పాస్టిక్ సీసాలలో నీళ్ళు తాగడం ఎక్కువ అవ్వడం మూలాన వీళ్ళకు ఎక్కువ సంపాదన ఉంటుంది.
"మా సంపాదనలో దాదాపు సగం అద్దెకు, విద్యుత్తుకు, మంచినీటికి ఖర్చవుతుంది. కరెంటు బిల్లు 1000 రూపాయలదాకా వస్తుంది," అన్నారు బహారుల్. ఆ ప్రదేశంలో వచ్చే కుళాయి నీళ్ళు తాగడానికి పనికిరాకపోవడంతో, ఈ కుటుంబాలు నీళ్ళను కూడా ఒక సరఫరాదారు నుంచి కొనుక్కోవాల్సిందే.
ఈ ఖర్చులకు తోడు తిండి ఖర్చులు అదనం అని బహారుల్ అన్నారు. "మా ఇంటి దగ్గర [అస్సామ్‌లో] మాకు రేషన్ వచ్చేది," అన్నారతను, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే ఆహారధాన్యాల గురించి చెప్తూ. "కానీ ఇక్కడ [హరియాణాలో] మాకు హరియాణా గుర్తింపు కార్డు ఉండాలి. అది మాకు లేదు."
2019లో వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ తీసుకునే దేశవ్యాప్త పథకం – ONORC (ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు) గురించి బహారుల్‌కి తెలియదు. "నాకు దీని గురించి తెలియదు," అని ఈ రిపోర్టర్‌తో బహారుల్ అన్నారు.
వారి తాత్కాలిక నివాసాలు వెదురు బొంగుల పైన టార్పాలిన్ పట్టాలు పరచి కట్టినవి. వారి ఇళ్ళు, వారు సేకరించిన చెత్త - వేరు చేసినదీ, వేరు చేయనిదీ కూడా - ఒకదాంట్లో ఒకటి కలిసిపోయినట్టే వుంటాయి. వాటి చుట్టే పిల్లలు పరుగులు తీస్తుంటారు. ఈ నివేదిక ప్రకారం, తల్లిదండ్రులతో పాటు పట్టణాలకు వలస వచ్చిన పిల్లల్లో కేవలం 55 శాత్రంమంది మాత్రమే బడికి వెళుతున్నారు. ఈ ప్రాంతంలో పిల్లల్లో చాలామంది చదువు కొనసాగించడం కంటే పనికి వెళ్ళడం మీదే ఆసక్తి కనబరుస్తున్నారు. రియాజ్ కొడుకు 12 ఏళ్ళ అన్వర్, 3వ తరగతి తర్వాత బడి మానేసి తండ్రికి చెత్త ఏరటంలోనూ, వేరుచేయడంలోనూ సహాయంగా ఉంటున్నాడు. " కబాడీవాలా కొడుకుకి దగ్గరగా ఎవరూ రావాలనుకోరు. నాకెవరూ స్నేహితులు లేరు. మా నాన్నకి సహాయం చెయ్యడం కోసం నేను బడి మానేశాను," అన్నాడు అన్వర్.
సోనీపత్‌కు ఈ పనిలోకి రాకముందు బహారుల్ చెన్నైలోని ఒక కళాశాల సెక్యూరిటీ గార్డ్‌గా మూడేళ్ళు పనిచేశారు. "మా ఊరినుంచి వచ్చిన ఒకరి అడుగుజాడలను అనుసరించి నేనిక్కడకు వచ్చేశాను," అన్నారతను.
"నేనీ పని చేస్తున్నానని నా తల్లిదండ్రులకు గానీ మా ఊరివాళ్ళకు గానీ చెప్పాలంటే నాకు సిగ్గుగా వుంటుంది," అన్నారు బహారుల్. "బడుల్లో చిన్న చిన్న పనులు చేస్తుంటానని చెప్తాను." వలస రావటంలో ఇంకొన్ని విధాలైన కష్టాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు "అస్సామ్‌లో చేపలు మా ఆహారంలో ప్రధాన భాగం. ఇక్కడ మా పొరుగువాళ్ళు కొందరు చేపలు తినడాన్ని తక్కువగా చూస్తారు. మేం చాలా రహస్యంగా వండుకొని తినాలి."
సరిపడా డబ్బు సంపాదించి అస్సామ్‌లో కొంచెం స్థలం కొనుక్కొని తనవాళ్ళతో కలిసి ఉండాలనేది అతని కోరిక. "కుటుంబసభ్యులకు అబద్దాలు చెప్పాలని ఎవరూ కోరుకోరు. మాకందరికీ గౌరవంగా బతకాలనే వుంటుంది."
అనువాదం: వి. రాహుల్జీ