అబ్దుల్ కుమార్ మాగరే చివరిగా పట్టూను నేసి 30 ఏళ్ళవుతోంది. ఉష్ణోగ్రతలు -20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే కఠినమైన కశ్మీర్ శీతాకాలాలను తట్టుకుని నిలబడగల ఈ ఉన్ని బట్టను నేసే చిట్టచివరి నేతకారులలో ఈయన కూడా ఉన్నారు.
"నేను ఒక్కరోజులో 11 మీటర్ల బట్టను నేసేవాడిని," చాలావరకూ కంటిచూపును కోల్పోయిన 82 ఏళ్ళ అబ్దుల్ గుర్తుచేసుకున్నారు. గదిలోంచి బయటకు వెళ్ళడానికి ఆయన ఒక చేత్తో గోడను తడుముతూ ముందుకు సాగారు. " అపరిమితంగా నేత పని చేయటం వలన నాకు 50 ఏళ్ళ వయసప్పుడు నా కంటిచూపు బలహీనపడింది."
అబ్దుల్ దావర్ గ్రామంలో నివసిస్తుంటారు. ఈ గ్రామానికి కనుచూపు దూరంలో గురేజ్ లోయలోని హబా ఖాతూన్ శిఖరం ఉంది. మొత్తం 4,253 జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్న ఈ గ్రామం బండీపురా జిల్లాలో ఉంది. ప్రస్తుతం పట్టూను నేస్తున్న నేత కార్మికులు లేరని ఆయన మాతో చెప్పారు. “దాదాపు ఒక దశాబ్దం క్రితం వరకూ, చలికాలంలో, ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ వసంత ఋతువులోనూ వేసవిలోనూ అమ్మడం కోసం బట్టలు నేసేవారు."
అబ్దుల్, అతని కుటుంబం శ్రీనగర్‌లోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించేందుకు నేసే దుస్తులలో ఫెరన్ (సంప్రదాయ గౌను వంటి పై వస్త్రం), దుపాఠీ (కంబళి), మేజోళ్ళు (సాక్స్), చేతి తొడుగులు (గ్లోవ్స్) ఉన్నాయి.
అయితే, అబ్దుల్‌కు తన పని పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, ఈ రోజు దానిని నిలబెట్టుకోవడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే, ఆ పనికి కావలసిన ముడి పదార్థమైన ఉన్ని, ప్రస్త్తుతం సులభంగా అందుబాటులో ఉండటంలేదు. అబ్దుల్ వంటి నేతకారులు గొర్రెలను పెంచుతూ, తాము పెంచే జంతువుల నుండి పట్టూ నేయడానికి అవసరమైన ఉన్నిని పొందేవారు. సుమారు 20 సంవత్సరాల క్రితం, అతని కుటుంబానికి దాదాపు 40 నుంచి 45 గొర్రెలు ఉండటం వలన ఉన్ని సులభంగానూ చౌకగానూ లభించేదని ఆయన చెప్పారు. "మేం మంచి లాభాలను సంపాదించేవాళ్ళం," అని అతను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆరు గొర్రెలు మాత్రమే ఉన్నాయి.


















