పట్నా ఒకప్పుడు వారంపాటు జరిగే తిలంగీ [గాలిపటం] పోటీలను నిర్వహించేది. లఖ్‌నవూ, దిల్లీ, హైదరాబాద్‌ల నుండి గాలిపటాలను ఎగరేసేవారిని ఆహ్వానించేవారు. అది ఒక పండుగ," అంటారు సయ్యద్ ఫైజాన్ రజా. మేం గంగానది వెంబడి నడుస్తూండగా ఆయన మాట్లాడుతున్నారు. నిశ్చలంగా పరచుకొని ఉన్న నది నీటిలో స్వేచ్ఛాకాశం ప్రతిబింబిస్తోంది. అక్కడ ఒకప్పుడు వేలాది గాలిపటాలు ఎగిరేవని అతను చెప్పారు.

పట్నాలోని నది ఒడ్డున ఉన్న దూలీఘాట్‌కు చెందిన వృద్ధుడైన రజా, కులీనుల నుండి తవాయిఫ్‌ల వరకు అన్ని సామాజిక తరగతుల ప్రజలు ఈ క్రీడను ఆదరించారని చెప్పారు. “బిస్మిల్లా జాన్ [ తవాయిఫ్ ] ప్రోత్సాహాన్ని అందించేవారు. మీర్ అలీ జమిన్, మీర్ కెఫాయత్ అలీలు పతంగ్-సాజీ [గాలిపటాలు తయారు చేయడం], పతంగ్-బాజీ [గాలిపటాలను ఎగురువేసే ఆట]కి చెందిన ప్రసిద్ధ ఉస్తాదుల లో [నిష్ణాతులు] కొందరు," అంటూ ఆయన వరసగా పేర్లను వల్లించారు.

ఈ అభిరుచి అభివృద్ధి చెందడానికి కారణం, పట్నాలోని అశోక్ రాజ్‌పథ్‌లోని గుర్‌హట్టా నుండి ఖ్వాజాకలాఁ మధ్య 700-800 మీటర్ల ప్రాంతం ఒకప్పుడు గాలిపటాల వ్యాపారులతో నిండి ఉండటమే. వారి రంగురంగుల గాలిపటాలు దుకాణాల వెలుపల ఆకర్షణీయంగా అల్లల్లాడుతూ అందరినీ ఆహ్వానించేవి. “గాలిపటాలు ఎగరేసేటందుకు పట్నాలో దొరికే దారాలు సాధారణంగా దొరికే దారాల కంటే మందంగా ఉంటాయి, వీటిని నూలు, పట్టు కలిపి తయారుచేస్తారు. ఈ దారాలను నఖ్ అని పిలుస్తారు,” అన్నారు రజా.

బలూ మాస పత్రిక 1868 నాటి సంచికలో పట్నా గాలిపటాలకు ప్రసిద్ధి చెందిన నగరంగా పేర్కొన్నారు. “వీలైనంత త్వరగా ధనవంతుడు కావాలనుకునే ప్రతి వ్యక్తి తన జీవితంలో పట్నా గాలిపటాలను చేర్చుకోవాలి. మార్కెట్‌లోని ప్రతి పదవ దుకాణం గాలిపటాలను విక్రయిస్తుంది, మొత్తం జనాభా గాలిపటాలు ఎగురవేస్తున్నారా అన్నట్లు మీకు అనిపిస్తుంది. "వజ్రం ఆకారంలో ఉండే ఈ గాలిపటాలు ఈకల వలె తేలికగా ఉంటాయి. వీటికి తోకలు ఉండవు, తేలికపాటి పట్టు దారాల సహాయంతో వీటిని ఎగురవేస్తారు."

వందేళ్ళు దాటిన తర్వాత, అనేక విషయాలు మారిపోయాయి కానీ పట్నా తిలంగీలు మాత్రం తమ ప్రత్యేక లక్షణాన్ని - అవి తోకలుండని గాలిపటాలు - నిలుపుకున్నాయి. దుమ్ తో కుత్తే కా న హోతా హై జీ, తిలంగీ కా థోడే [తోకలు కుక్కలకు ఉంటాయి, గాలిపటాలకు కాదు]," గాలిపటాలు తయారుచేసే శబీనా నవ్వుతూ అన్నారు. డెబ్బైల వయసులో ఉన్న ఆమె, తన కంటిచూపు బలహీనం కావటంతో తిలంగీ లను తయారుచేయటం మానేశారు.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Courtesy: Ballou’s Monthly Magazine

ఎడమ: గాలిపటంలోని వివిధ భాగాలను చూపించే బొమ్మ. కుడి: 1868 నాటి బలూ మాస పత్రిక సంచికలో గాలిపటాల గురించిన ఉల్లేఖన

PHOTO • Ali Fraz Rezvi

పట్నాలోని అశోక్ రాజ్‌పథ్ ప్రాంతం ఒకప్పుడు గాలిపటాల వ్యాపారులతో నిండి ఉండేది. వారి రంగురంగుల గాలిపటాలు, ఇతర సామాగ్రి దుకాణాల వెలుపల రెపరెపలాడుతూ అందరినీ ఆహ్వానిస్తూ ఉండేవి

పట్నా ఇప్పటికీ గాలిపటాల తయారీ, సరఫరా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గాలిపటాలు, సంబంధిత ఉపకరణాలు ఇక్కడి నుండే మొత్తం బిహార్‌కూ, చుట్టుపక్కల రాష్ట్రాలకూ వెళ్తాయి. పరేతీలు , తిలంగీలు - ఈ రెండూ పట్నా నుండి సిలిగురి, కొల్‌కతా, మాల్దా, రాంచీ, హజారీబాగ్, జాన్‌పూర్, కాఠ్మండూ, ఉన్నావ్, ఝాన్సీ, భోపాల్, పుణే, నాగ్‌పూర్‌లకు కూడా వెళ్తాయి.

*****

" తిలంగీ బనానే కే లియే భీ టైమ్ చాహియే ఔర్ ఉడానే కేలియే భీ [గాలిపటాలను తయారు చేయడానికీ, ఎగరేయటానికీ కూడా నీకు సమయం ఉండాలి]," అంటూ తన తండ్రిగారు అనే మాటలను చెప్పారు అశోక్ శర్మ. "ఈరోజున ఈ నగరంలో సమయమనేది అరుదైనవాటిలోకెల్లా అరుదైనదిగా మారింది."

శర్మ తిలంగీ (గాలిపటం)లను తయారుచేసి అమ్మేవారిలో మూడవ తరానికి చెందినవారు. వందేళ్ళకు పైగా వయసున్న, మట్టి గోడలూ మట్టి పెంకుల కప్పుతో ఉండే ఆయన దుకాణం పట్నా నగరం నట్ట నడుమన ఉంది. అశోక్ రాజ్‌పథ్‌లో ఉన్న బిహార్‌లోని అత్యంత పురాతనమైన చర్చి - పాదరీ కి హవేలీ - అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉంది. పరేతీలు [గాలిపటాల దారాన్ని చుట్టే వెదురు కండెలు] చేయగల అతి కొద్దిమంది నిపుణులలో ఆయన కూడా ఒకరు. ప్రస్తుతం మాంఝా లేదా నఖ్ అని పిలిచే గాలిపటం దారాలు చైనాలో కర్మాగారాలలో తయారైనవి, ఇంతకుముందు వాటి కంటే సన్నగానూ, తేలికగానూ ఉంటాయి.

ముందువైపు కూర్చొని ఉన్న శర్మా జీ చేతులు తీరికలేకుండా పనిచేస్తున్నాయి. ఒక గ్రామం నుంచి 150 పరేతీల కోసం, మరో గంటలో ఇవ్వాల్సిన ఆర్డర్‌ను పూర్తిచేసే తొందరలో ఆయన ఉన్నారు.

గట్టిగా ఉండే కొయ్య కర్రలను వంచి కట్టి పరేతీ లను తయారుచేయటం, గాలిపటాలను తయారుచేయటం కంటే చాలా భిన్నమైనది, ఎవరో చాలా కొద్దిమంది మాత్రమే దీనిని చేయగలరు. ఆ చేయటంలోని నైపుణ్యానికి శర్మ చాలా పేరుపొందారు. తిలంగీ లను తయారుచేసే ఇతర కళాకారులలాగా ఆయన గాలిపటాలను కానీ కండెలను కానీ వేరొకరికి ఉపజట్టీకి (సబ్‌కాంట్రాక్ట్) ఇవ్వకుండా తాను తయారుచేసినవాటిని తానే అమ్ముకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

పరేతీలు, తిలంగీలు తయారుచేయటం కోసం కర్రలను ముక్కలుగా చేస్తోన్న అశోక్ శర్మ. పరేతీలను (గాలిపటాల దారాలను చుట్టే వెదురు కండెలు) తయారుచేసే నైపుణ్యమున్న కొద్దిమందిలో ఆయన కూడా ఒకరు

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

అశోక్‌జీ కార్యశాలలో ఉన్న కొత్తగా తయారుచేసిన పరేతీలు (ఎడమ). దుకాణంలో కూర్చొని వున్న అశోక్‌జీ స్నేహితుడు. ఈయన మంచి నైపుణ్య శ్రామికుడు (కుడి)

తిలంగీలు , పరేతీ లతో నిండివున్న ఆ చిన్న గది చాలా చీకటిగా ఉంది. వెనకవైపు తెరచి ఉన్న చిన్న సందులోంచి పడుతోన్న కొద్ది వెలుతురులో ఆయన మనవడైన 30 ఏళ్ళ కౌటిల్య కుమార్ శర్మ లెక్కలు చూస్తున్నారు. ఆయన కుటుంబంలో ఈ కళ అనేక తరాలుగా ఉన్నప్పటికీ, వీటిని తయారుచేయడాన్ని తన కొడుకులు గానీ మనవలు గానీ కొనసాగించక పోవచ్చునని శర్మ అన్నారు.

తిలంగీ లను, పరేతీ లను తయారుచేసే కళను నేర్చుకోవటం ఆయన తనకు 12 ఏళ్ళ వయసులో మొదలుపెట్టారు. దుకాణ్ పర్ ఆకర్ బైఠే గయే, ఫిర్ కైసా బచపన్, కైసీ జవానీ? సబ్ యహీఁ బీత్ గయా. తిలంగీ బనాయీ బహుత్ మగర్ ఉడాయీ నహీఁ [నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు దుకాణంలో పనిచేయటం మొదలుపెట్టాను, ఈ పని చేయటంలోనే నా యవ్వనం కూడా గడచిపోయింది. నేను ఎన్నో తిలంగీ లను చేశాను కానీ వాటిని ఎప్పుడూ ఎగరేయలేదు]," అన్నారు ఈ గాలిపటాలను తయారుచేయటంలో దీర్ఘానుభవం ఉన్న అశోక్ శర్మ.

"గాలిపటాలను తయారుచేయడాన్ని నగరంలోని గొప్పవాళ్ళు, కులీనులు పర్యవేక్షించేవారు. వారి ప్రాపకం గాలిపటాలు తయారుచేసేవారుకి ఒక వరంలా ఉండేది," అన్నారు అశోక్ శర్మ. "పట్నాలో మహాశివరాత్రి వరకూ గాలిపటాల సీజన్ ముమ్మరంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో సంక్రాంతి నాడు [సంప్రదాయకంగా గాలిపటాలను ఎగురవేసే పంటల పండుగ] కూడా ఒక వినియోగదారుడు దొరకటం కష్టంగా ఉంది.”

*****

ఒక తిలంగీ వజ్రపుటాకారంలో గానీ, సమచతుర్భుజాకారంలో గానీ ఉంటుంది. దశాబ్దాల క్రితం వీటిని కాగితంతో తయారుచేసేవారు. కానీ ఇప్పుడు మొత్తం తయారీ అంతా ప్లాస్టిక్‌లోకి మారిపోయింది, ధర సగానికి తగ్గింది. కాగితపు తిలంగీలు సులభంగా చిరిగిపోతాయి, కాగితంతో తయారుచేయటం కష్టమైన పని కావటంతో వీటి ఖరీదు కూడా ఎక్కువే. ఒక మామూలు కాగితపు గాలిపటం రూ. 5కు అమ్ముడుపోతే, ప్లాస్టిక్ గాలిపటం వెల రూ. 3.

వీటి పరిమాణం మామూలుగా 12x12, 10x10 అంగుళాలుగా ఉంటుంది, కానీ 18x18, 20x20 పరిమాణంలో ఉండేవి కూడా తయారుచేస్తారు. పెరిగే పరిమాణం, డిజైన్లలో మార్పుతో పాటు వాటి ధరలు కూడా పెరుగుతాయి. ప్రత్యేక కార్టూన్లు, సినిమాల్లోని పాత్రలతో తయారుచేసినట్లయితే వాటి ధర రూ.25 వరకు ఉంటుంది. అయితే రాష్ట్రం వెలుపల నుండి వచ్చే ఆర్డర్ల ధర రూ. 80 నుండి రూ. 100 వరకు ఉంటుంది. ఇది ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన షీట్ల పైనా, తీలీల , ఖడ్డాల నాణ్యతను పెంచటంపైనా, లై (బియ్యం వండి చేసిన జిగురు) పైనా ఆధారపడి ఉంటుంది.

సంజయ్ జైస్వాల్ తిలంగీ కార్యశాలలో ఒక కొయ్యలను కోసే యంత్రం, రకరకాల వెదురు కర్రలు, తిలంగీ లను తయారుచేయడానికి అవసరమైన మరికొన్ని వస్తువులు కిటికీలు లేని ఆ 8 చదరపుటడుగుల గదిలో చెల్లాచెదురుగా పడివున్నాయి.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ఎడమ: తన కార్యశాలలో పనిచేస్తోన్నవారిని పర్యవేక్షిస్తోన్న మన్నన్ (కుర్చీలో). కుడి: ప్లాస్టిక్ షీట్లను లెక్కిస్తోన్న మొహమ్మద్ అర్మాన్. వెదురు ఖడ్డాలను అంటించేందుకు వాటిని ఆయన మహిళా శ్రామికుల దగ్గరకు పంపిస్తారు

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ఎడమ: కర్రలను కట్టలుగా కడుతోన్న శ్రామికులు. కుడి: యంత్రం సాయంతో వెదురును ముక్కలుగా కోస్తున్నారు

"ఈ కార్యశాలకు పేరేమీ లేదు," అన్నారు మన్నన్‌గా అందరూ పిలిచే సంజయ్. అయితే నగరంలో గాలిపటాల అతిపెద్ద సరఫరాదారు కావటంవలన పేరు లేకపోవటం పెద్ద సమస్యేమీ కాదు. " బే-నామ్ హై, గుమ్‌నామ్ థోడే హై [మాకు పేరు లేదు కానీ అనామకులం కాము]," తన చుట్టూ ఉన్న పనిచేసేవాళ్ళతో కలిసి నవ్వుతూ చెప్పారాయన.

మొహల్లా దీవాన్‌లోని గుర్‌హట్టా ప్రాంతంలో ఉన్న మన్నన్ కార్యశాల ప్రాథమికంగా ఒక బహిరంగ ప్రదేశం. అందులో వెదురు స్తంభాల మీద రేకుల పైకప్పు ఉన్న ఒక షెడ్డు, బహిరంగ ప్రదేశానికి ఆనుకుని ఒక చిన్న గది ఉన్నాయి. దాదాపు 11 మంది కార్మికులను ఆయన నియమించుకున్నారు. కొన్ని పనులను "అవసరాలకు అనుగుణంగా వారి ఇళ్ళ నుండి పనిచేసే మహిళలకు" ఇస్తారు.

55 ఏళ్ళ మొహమ్మద్ షమీమ్ ఇక్కడ పనిచేస్తోన్న అందరికంటే అనుభవశాలి అయిన శ్రామికుడు. తాను కొల్‌కతాలోని ఒక ఉస్తాద్ (నిపుణుడు) వద్ద ఈ గాలిపటాల తయారీని నేర్చుకున్నట్టు పట్నాలోని చోటీ బజార్‌కు చెందిన ఈయన చెప్పారు. కొల్‌కతా, అలహాబాద్, ముంబై, వారణాసిలలో పనిచేసిన ఈయన, ఒక శాశ్వత కార్యస్థానాన్ని వెతుక్కుంటూ తన నగరానికి తిరిగివచ్చారు.

గత 22 ఏళ్ళుగా తానిక్కడ ఉంటున్నట్టు తీలీ లను అంటిస్తోన్న ఆయన చెప్పారు. బిరుసుగా ఉండే వెదురుకర్రలను వంచి జిగురుతో వాటిని అంటించటంలో చేయితిరిగినవాడని ఆయనకు పేరుంది. షమీమ్ ఒక్క రోజులో 1500 తీలీ లను చేయగలరు, కానీ అదొక పరుగుపందెం.

" కోశిశ్ హోతా హై కి ఏక్ దిన్ 200 రూపయే తక్ కమా లేఁ, తో మహీనే కా 6000 బన్ జాయేగా . [నెలకు 6000 రూపాయలు రావాలంటే, రోజుకు 200 రూపాయలు వచ్చేలా పనిచేయటం]," అంటారు షమీమ్. 1500 గాలిపటాలకు ఆయన తీలీలు అంటించి, అవి కదలకుండా టేపు అంటించి సాయంత్రానికల్లా సిద్ధంచేస్తారు. " ఇస్ హిసాబ్ సే 200-210 రూప్యా బన్ జాతా హైఁ [ఈ విధంగా నేను రోజుకు 200-210 రూపాయలు సంపాదించగలను]," చెప్పుకుంటూ పోయారాయన.

ఈ ఏడాది మే నెలలో PARI వీరిని కలవటానికి వెళ్ళినప్పుడు బయటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలిపటాలను తయారుచేసే పలుచని ప్లాస్టిక్ షీట్లు ఎగిరిపోకుండా ఉండేందుకు ఫ్యాన్లు వేసుకోకుండా పనిచేస్తున్నారు

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ఎడమ: తిలంగీల కోసం కర్రలను ముక్కలు చేస్తోన్న శ్రామికులు. కుడి: కర్రలను గాలిపటాలకు అంటిస్తోన్న అశోక్ పండిత్ (నల్ల టి-చొక్కా), ప్లాస్టిక్ షీట్లను కత్తిరిస్తోన్న సునీల్ కుమార్ మిశ్రా

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ఎడమ: తీలీలను అంటిస్తోన్న మొహమ్మద్ షమీమ్. కుడి: ప్లాస్టిక్ షీట్లతో పనిచేస్తోన్న సునీల్

ప్లాస్టిక్ షీట్లను చిన్న చదరాలుగా కత్తిరిస్తోన్న సునీల్ కుమార్ మిశ్రా ఒక చేరుమాలుతో చెమటను తుడుచుకున్నారు. "గాలిపటాలను చేసి సంపాదించినదానితో ఒక కుటుంబాన్ని పోషించుకోలేం. ఇక్కడ పనిచేసే శ్రామికులెవరూ నెలకు 10,000 [రూపాయలు] కంటే ఎక్కువ సంపాదించలేరు," అని ఆయన మాతో చెప్పారు.

ఒకప్పుడు నగరంలో గాలిపటాలు తయారుచేసే సముదాయానికి కేంద్రంగా ఉన్న హాజీగంజ్ మొహల్లాలో నివాసముంటోన్న ఈయన అక్కడ గాలిపటాల రూపకల్పనను చూస్తూ పెరిగారు. కోవిడ్-19 సమయంలో ఆయన చేసే పూలు అమ్మే పని పోయిన తర్వాత చిన్నతనంలో తాను గాలిపటాలను, వాటి తయారీని చూసివుండటం ఆయనకు ఉపయోగపడింది. దాంతో ఆయన గాలిపటాల తయారీ పనికి మారగలిగారు.

సునీల్ ఒక రెగ్యులర్ ఉద్యోగి అయినప్పటికీ, ఆయనకు కూడా గాలిపటాల తయారీని అనుసరించే చెల్లిస్తారు. "ఉదయం 9 గంటలకు మొదలుకొని రాత్రి 8 గంటలవరకూ పనిచేస్తూ అందరూ వేలకు వేలు గాలిపటాలను తయరుచేసే ప్రయత్నం చేస్తుంటారు," అన్నారాయన.

*****

గాలిపటాలను మొత్తంగా కానీ, భాగాలుగా కానీ తమ ఇళ్ళలో తయారుచేసే ముస్లిమ్ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడ ఉన్నారు. నలుగురు సభ్యులున్న తన కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండటం కోసం ఆయషా పర్వీన్ తిలంగీలు తయారుచేసే కళను నేర్చుకున్నారు. భర్త, ఇద్దరు పిల్లలతో తాను కలిసివుండే ఒంటిగది, వంటగది ఉన్న ఇంటినే ఆమె గత 16 ఏళ్ళుగా గాలిపటాలను తయారుచేసే కార్యశాలగా మార్చుకున్నారు. "ఈమధ్యకాలం వరకూ నేను వారానికి 9,000 తిలంగీ లను తయారుచేసేదాన్ని," అని ఆమె గుర్తుచేసుకున్నారు. "ప్రస్తుతం 2000 గాలిపటాలకు ఆర్డర్ రావటమే పెద్ద విషయమైపోయింది," అన్నారామె.

" తిలంగీ ని ఏడు భాగాలుగా చేస్తారు, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు చేస్తారు," అన్నారు ఆయషా. ఒక శ్రామికుడు ప్లాస్టిక్ షీటుని కావలసిన పరిమాణంలో వివిధ చదరాలుగా కత్తిరిస్తారు. ఈ లోపు ఇద్దరు శ్రామికులు వెదురును చిన్న తీలీలు గా, ఖడ్డాలు గా - ఒకటి పొడవుగా సన్నగా ఉండేలా, మరొకటి దానికన్నా మందంగా, చిన్నగా ఉండేలా - కత్తిరిస్తుంటారు. మరో శ్రామికుడు చదరపు ఆకారంలో కత్తిరించిన ప్లాస్టిక్ షీటు పైన ఖడ్డా లను అతికించి మరొక శ్రామికునికి అందిస్తారు. ఆయన వంపుతిప్పిన తీలీ లను వాటికి అంటిస్తారు.

చివరి ఇద్దరు శ్రామికులు మిగిలిన పనిని పూర్తిచేస్తారు. అందులో ఒకరు అంటుకునే టేప్ పొరను తనిఖీ చేసి, దానిపై మరో పొరను అంటించి, కన్నాలు అని పిలిచే రంధ్రాలు చేసి దారాలను కట్టే పనిని పూర్తిచేయటం కోసం చివరి కార్మికుని వద్దకు పంపిస్తారు.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ప్లాస్టిక్ షీట్ల మీద ఖడ్డాలను (ఎడమ) అంటించే పనిలో మునిగివున్న తమన్నా. ఆ పని పూర్తిచేశాక సరిగ్గా ఉందో లేదో పరీక్షించడానికి సూర్యుని వెలుతురుకు ఎదురుగా గాలిపటాన్ని ఎత్తి పట్టుకొన్న తమన్నా

ప్లాస్టిక్ షీట్లను కత్తిరించేవారు 1000 గాలిపటాలకు రూ. 80, అలాగే వెదురును కత్తిరించేవారు రూ. 100 సంపాదిస్తారు. ఈ అన్ని భాగాలను గాలిపటంగా ఒకచోటికి కూర్చేవారు రూ. 50 సంపాదిస్తారు. ఒక కార్మికుల బృందం ఒక్కరోజులో ఉదయం 9 గంటల నుంచి మొదలుకొని 12 గంటల పాటు పనిచేసి - మధ్యలో చిన్న చిన్న విరామాలను మాత్రమే తీసుకుంటూ - 1000 గాలిపటాలను తయారుచేస్తారు.

"మొత్తం ఏడుగురు కలిసి ఒక తిలంగీ ని తయారుచేస్తే, అది బజారులో రెండు నుంచి మూడు రూపాయలకు అమ్ముడుపోతుంది," అని ఆయషా పేర్కొన్నారు. 1000 గాలిపటాలు చేయటానికి అయ్యే మొత్తం ఖర్చు రూ. 410ని ఈ ఏడుగురికీ పంచుతారు. "నా కూతురు రుఖ్‌సానా ఈ గాలిపటాలు చేసే పనిలోకి రావాలని నేను కోరుకోవటంలేదు," అన్నారామె.

కానీ చాలామంది ఇతర మహిళా కళాకారుల మాదిరిగానే, ఆమెకు ఇల్లు వదిలి బయటకు వెళ్ళకుండా సంపాదించడం సంతోషంగానే ఉంది, కానీ సంపాదన చాలా తక్కువగా ఉందని ఆమె అంటారు. "అయితే మొదట్లో కనీసం పని అయినా సక్రమంగా ఉండేది," అన్నారామె. ఆయషాకు ఖడ్డా లను అతికించడం కోసం, 2,000 గాలిపటాలకు కన్నాలు కట్టడం కోసం రూ.180 చెల్లించారు. 100 గాలిపటాలకు ఈ రెండు పనులనూ పూర్తి చేయడానికి ఆమెకు దాదాపు 4-5 గంటల సమయం పట్టింది

దీవాన్ మొహల్లాలోనే నివసించే తమన్నా కూడా తిలంగీ లను చేస్తోంది. "మహిళల చేతనే [ఎక్కువగా] ఈ పనిని చేయించడం ఎందుకంటే, గాలిపటాల తయారీ పరిశ్రమలో అన్నిటికంటే తక్కువ వేతనం చెల్లించే పని ఇదే కావడం," అంటోంది 25 ఏళ్ళ తమన్నా. " ఖడ్డా లను, తీలీ ని అంటించడంలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు, కానీ 1000 ఖడ్డా లను అతికించినందుకు మహిళకైతే రూ. 50, 1000 తీలీ లను అతికించినందుకు పురుషులకు రూ. 100 చెల్లిస్తారు."

PHOTO • Ali Fraz Rezvi

తాను తయారుచేసిన తిలంగీని చూపిస్తోన్న రుఖ్‌సానా

పట్నా ఇప్పటికీ గాలిపటాల తయారీ, సరఫరా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గాలిపటాలు, సంబంధిత ఉపకరణాలు ఇక్కడి నుండే మొత్తం బిహార్‌కూ, చుట్టుపక్కల రాష్ట్రాలలోని సిలిగురి, కొల్‌కతా, మాల్దా, రాంచీ, హజారీబాగ్, జాన్‌పూర్, ఉన్నావ్, ఝాన్సీ, భోపాల్, పుణే, నాగ్‌పూర్‌లకు, కాఠ్మండూకు కూడా వెళ్తాయి

ఆయషా 17 ఏళ్ళ వయసున్న కూతురు రుఖ్‌సానా ఒక ఖడ్డా మాస్టర్ . ఆమె జారిపోతుండే ప్లాస్టిక్ షీట్ల మీద ఆ సన్నని వెదురు పుల్లలను అంటిస్తుంది. 11వ తరగతి చదువుతోన్న ఈ వాణిజ్యశాస్త్ర విద్యార్థిని మధ్య మధ్య తన తల్లికి గాలిపటాల తయారీలో సహాయం చేస్తుంటుంది.

రుఖ్‌సానా ఈ కళను తన తల్లి దగ్గర 12 ఏళ్ళ వయసులో ఉండగా నేర్చుకుంది. "ఆమె చిన్నపిల్లగా ఉండగా ఈ గాలిపటాలతో ఆడుతుండేది, అందులో నైపుణ్యం సంపాదించింది," అంటారు ఆయషా. అయితే అది ఎక్కువగా అబ్బాయిలు ఆడే ఆట కాబట్టి తాను ఆమెను గాలిపటాలు ఎగురవేయకుండా నిరుత్సాహపరుస్తుంటానని ఆమె చెప్పారు.

మొహల్లా దీవాన్‌లోని శీష్‌మహల్ ప్రాంతంలో ఉన్న తన అద్దె గది ప్రవేశ ద్వారం దగ్గర తాము తాజాగా తయారుచేసిన తిలంగీ లను ఆయషా సర్దిపెడుతున్నారు. ఆ గాలిపటాలకు తుది మెరుగులు దిద్దే పనిలో రుఖ్‌సానా మునిగిపోయి ఉంది. వాటిని తీసుకువెళ్ళేందుకు వచ్చే కాంట్రాక్టర్ షఫీక్ కోసం వారు ఎదురుచూస్తున్నారు.

"2000 గాలిపటాల కోసం మాకు ఆర్డర్ ఉంది, కానీ నేను ఆ సంగతి మా అమ్మాయికి చెప్పటం మర్చిపోయాను. దాంతో ఆమె మిగిలిన వస్తువులతో మరో 300 గాలిపటాలను అదనంగా చేసింది," అన్నారు ఆయషా.

"మరేం ఫర్వాలేదు, తర్వాతి ఆర్డర్ కోసం మనం వీటిని ఉపయోగించుకోవచ్చు," మా సంభాషణను వింటోన్న రుఖ్‌సానా చెప్పింది.

"ఏదైనా మరో ఆర్డర్ వచ్చినప్పటి సంగతి," అన్నారు ఆయషా.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ali Fraz Rezvi

ਅਲੀ ਫਰਾਜ਼ ਰਿਜ਼ਵੀ ਇੱਕ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਥੀਏਟਰ ਕਲਾਕਾਰ ਹੈ। ਉਹ 2023 ਲਈ ਪਾਰੀ-ਐਮਐਮਐਫ ਫੈਲੋ ਵੀ ਹੈ।

Other stories by Ali Fraz Rezvi
Editor : Priti David

ਪ੍ਰੀਤੀ ਡੇਵਿਡ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਇੰਡੀਆ ਦੇ ਇਕ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਪਾਰੀ ਵਿਖੇ ਐਜੁਕੇਸ਼ਨ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪੇਂਡੂ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਕਲਾਸਰੂਮ ਅਤੇ ਪਾਠਕ੍ਰਮ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਸਿੱਖਿਅਕਾਂ ਨਾਲ ਅਤੇ ਸਮਕਾਲੀ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਦਸਤਾਵੇਜਾ ਦੇ ਰੂਪ ’ਚ ਦਰਸਾਉਣ ਲਈ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਕੰਮ ਕਰਦੀ ਹਨ ।

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli