ఆకాశంలో చీకటిపడే సమయానికి, రంగురంగుల సీరియల్ లైట్లతో అలంకరించిన ఓం శక్తి భారీ కటౌట్ మెరుస్తూ కనులవిందుచేస్తుంది. ఓం శక్తి దేవతను కొలిచే వార్షిక తీమిది తిరువిళా లేదా నిప్పు తొక్కే తిరునాళ్ళను బంగళామేడులోని ఇరులర్లు జరుపుకుంటున్నారు.
మధ్యాహ్నమంతా మండుతూనే ఉన్న చెక్క దుంగల నిప్పులపై నివురు కప్పడం ప్రారంభమవుతుంది; స్వచ్ఛంద సేవకులు ఆ నిప్పులను మెరుస్తున్న పూల మంచాన్ని పోలి ఉండేలా పలుచని పొరగా నేలపై పరచి, ఈ నిప్పులగుండం తీమిది ని 'పూ-మిది ' లేదా పువ్వులపై నడక అనిపించే విధంగా ఇరులర్లకు ప్రేరణనిస్తారు.
అక్కడ వీచే గాలిలో కూడా ఆ రోజు కోసం స్పష్టమైన నిరీక్షణ కనిపిస్తుంది. తమ దేవత కాని ఓం శక్తిపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇరులర్లు నిప్పులగుండం తొక్కడాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది ప్రజలు అక్కడ గుమిగూడారు. ఓం శక్తిని బలానికీ శక్తికీ ప్రతిరూపంగా తమిళనాడు అంతటా ఆరాధిస్తారు.
తమిళనాడులో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న ఇరులర్లు (ఇరుల అని కూడా పిలుస్తారు) సంప్రదాయంగా కన్నియమ్మను పూజిస్తారు. కన్నియమ్మను వారు ఏడుగురు కన్యకా దేవతలలో ఒకరిగా భావిస్తారు. కన్నియమ్మకు ప్రతీకగా ప్రతి ఇరులర్ ఇంటిలో ఒక కళసం (కలశం) లేదా మట్టి కుండ ఉంటుంది, దీనిని వేప మండలపై ఉంచుతారు.
ఓం శక్తి అమ్మవారి కోసం బంగళామేడు ఇరులర్లు చేసే పండుగ ఏం వివరిస్తోంది?
1990ల చివరిలో తన సోదరి, ఇరులర్ సముదాయానికి చెందని ఒక యువకునితో ప్రేమలో పడటం వలన చెలరేగిన కుల ఉద్రిక్తతల కారణంగా చెరుక్కనూర్ గ్రామానికి చెందిన తన కుటుంబం తమ ఇంటి నుండి రాత్రికి రాత్రే పారిపోవాల్సి వచ్చిన సంఘటన గురించి జి. మణిగండన్ (36) వివరించారు. వారి కుటుంబం చెరుక్కనూరు సరస్సు సమీపంలో ఉన్న ఒక చిన్న గుడిసెలో ఆశ్రయం పొందింది.
“ఆ రాత్రంతా ఒక గౌళి (బల్లి) శబ్దం చేస్తూనే ఉంది. ఆ బల్లి అరుపు మాకు భరోసాగా అనిపించింది. మేం దానిని అమ్మన్ (దేవత) చూపించిన మంచి శకునంగా భావించాం,” ఆ రాత్రి తమ ప్రాణాలను కాపాడింది ఓం శక్తి అని నమ్ముతూ చెప్పారతను.
*****
“మేం పారిపోయినప్పుడు తిండి కోసం, పని కోసం వెతుక్కోవటం అంత సులభమేమీ కాలేదు. మా అమ్మ పొలాల నుండి వేరుశెనగలను ఏరుకొచ్చి, చిన్న జంతువులను వేటాడి తెచ్చి మాకు తిండి పెట్టేది. అమ్మన్ మాత్రమే మమ్మల్ని కాపాడింది,” అని అతను గుర్తుచేసుకున్నారు. [చదవండి: On a different route with rats in Bangalamedu ]
మణిగండన్ కుటుంబం, వారితో పాటు పారిపోయివచ్చిన మరికొంతమంది చివరకు చెరుక్కనూరు సరస్సు నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న బంగళామేడులో స్థిరపడి, ఆ సరస్సుకు సమీపంలో ఉన్న పొలాలలో పని వెతుక్కున్నారు.
మొదట్లో 10 కుటుంబాల కంటే తక్కువమందే ఉండిన బంగళామేడు ఇప్పుడు 55 ఇరులర్ల కుటుంబాలకు ఆవాసమైంది. అధికారికంగా చెరుక్కనూరు ఇరులర్ కాలనీ అని పిలిచే ఈ కాలనీ అంతా కలిపి ఒకటే వీధి, వీధికి ఇరువైపులా ఇళ్ళు ఉండి, చుట్టూ పొదలతో నిండి ఉంటుంది. సుదీర్ఘ పోరాటం తర్వాత 2018లో ఈ కాలనీకి విద్యుత్ వచ్చింది. ఇటీవలి కాలంలో ఈ సెటిల్‌మెంట్‌లో కొన్ని పక్కా ఇళ్ళు కూడా వచ్చిచేరాయి. ఇక్కడి ఇరులర్లు తమ రోజువారీ సంపాదన కోసం కూలి పనులపై, ఎమ్ఎన్ఆర్ఇజిఎ పనులపై ఆధారపడతారు. బంగళామేడులో మాధ్యమిక పాఠశాల చదువును పూర్తిచేసిన కొద్దిమందిలో మణిగండన్ కూడా ఉన్నారు.
ఇక్కడ స్థిరపడిన కొన్ని సంవత్సరాల తర్వాత, మణిగండన్ తండ్రి - ఇరులర్ పెద్ద అయిన పి. గోపాల్ - కష్టకాలంలో తమను ఆదుకొన్న అమ్మన్ కు కృతజ్ఞతగా సరస్సు సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఓంశక్తి అమ్మవారి కోసం ఒక మందిరాన్ని నిర్మించారు. 2018లో మరణించే వరకు ఆయన ఆ మందిరానికి పూజారిగా పనిచేశారు. “ఆ ఆలయం ఒక చిన్న గుడిసె. మేం సరస్సు నుండి తీసిన మట్టితో చేసిన అమ్మన్ విగ్రహాన్ని అక్కడ పెట్టాం. ‘ ఆడి తీమిది తిరువిళా ’ని ప్రారంభించింది మా నాన్నే," అని మణిగండన్ చెప్పారు.
గోపాల్ మరణానంతరం మణిగండన్ అన్న, జి. సుబ్రమణి, తండ్రి నిర్వర్తించిన పూజారి బాధ్యతను తాను స్వీకరించారు. సుబ్రమణి వారంలో ఒక రోజును ఆలయ విధులకు కేటాయిస్తారు; మిగిలిన ఆరు రోజులు కూలి పనుల కోసం వెతుక్కుంటారు.
ఓం శక్తికి నిప్పుల గుండం తొక్కడంతో ముగిసే ఒక రోజు ఉత్సవాన్ని చేస్తామనే తమ మాటను 15 సంవత్సరాలకు పైబడి, బంగళామేడు ఇరులర్లు నిలుపుకుంటున్నారు. ఈ పండుగను జూలై-ఆగస్టు నెలల్లో వచ్చే తమిళ మాసమైన ఆడి లో జరుపుకుంటారు. రుతుపవనాల రాకతో మండే వేసవి నుండి ఉపశమనం లభించే సమయమది. ఇరులర్లలో ఈ ఆచారం ఇటీవలికాలంలో మొదలయినదే అయినప్పటికీ తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణి తాలూకా అంతటా తీమిది అనేది ఆడి మాసంలో సాధారణంగా జరిగే ఒక ఉత్సవం. ఆ రోజు భక్తులు మహాభారతంలోని ద్రౌపది అమ్మన్ వంటి దేవతలకు, మారియమ్మన్ , రోజా అమ్మన్ , రేవతి అమ్మన్ , ఇంకా ఇతర దేవతలకూ పూజలు చేస్తారు.
“వేసవిలో ప్రజలు తరచుగా అమ్మన్ (మీజిల్స్- అమ్మవారు)తో అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ కష్ట కాలాన్నుండి బయటపడేయాలని మేం అమ్మన్ (దేవత)ను ప్రార్థిస్తాం,” దేవతనూ, అంటువ్యాధినీ కూడా సూచించేందుకు అమ్మన్ అనే ఒకే పదాన్ని ఉపయోగిస్తూ ఆ వ్యాధిని ఇచ్చేదీ, తనపైన విశ్వాసముంచినవారిని స్వస్థపరచేదీ కూడా ఆ దేవతే అని అందరూ సాధారణంగా నమ్మే సంగతినే తానూ చెప్పారు మణిగండన్..
బంగళామేడులో గోపాల్ తీమిది పండుగను ప్రారంభించినప్పటి నుండి, పొరుగు గ్రామమైన గుడిగుంటకు చెందిన ఇరులర్ సముదాయానికి చెందని మరో కుటుంబం దాని నిర్వహణలో పాల్గొంటూవస్తోంది. గోపాల్ కుటుంబం తమ స్వగ్రామం నుండి పారిపోయి వచ్చినప్పుడు ఆశ్రయం పొందింది, ఈ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిలో ఉన్న గుడిసెలోనే.
"ఇరులర్లు కాకుండా మా కుటుంబ సభ్యులు, స్నేహితులు మొత్తం పదిమంది మొదటి నుండి నిప్పుల గుండం మీద నడుస్తున్నారు," స్నేహితులు పళని అని పిలిచే 57 ఏళ్ళ టి.ఎన్. కృష్ణన్ చెప్పారు. ఆ వ్యవసాయ భూమి యజమానులలో ఈయన కూడా ఒకరు. ఓం శక్తిని పూజించడం మొదలుపెట్టిన తర్వాతే తమకు పిల్లలు పుట్టారని పళని కుటుంబం నమ్ముతోంది.
ఇరులర్ల నిరాడంబరమైన గుడిసె గుడి స్థానంలో చిన్న పక్కా భవనాన్ని ఏర్పాటు చేసి ఆ దేవతకు పళని కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. వారు ఇరులర్ల మట్టి అమ్మన్ స్థానంలో రాతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠాపించారు.
*****
బంగళామేడులోని ఇరులర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆడి తీమిది కి సంబంధించిన సన్నాహాలు పండుగ రోజుకు కొన్ని రోజుల ముందునుంచే ప్రారంభమవుతాయి. నిప్పులగుండం మీద నడవాలని మొక్కుకున్నవారు తమ మణికట్టు చుట్టూ కాప్పు లేదా పవిత్రమైన తాయెత్తును ధరించి, పండుగ రోజు వరకు కఠినమైన రోజువారీ వ్యక్తిగత నియమావళిని ఆచరిస్తారు.
"ఒకసారి కాప్పు వేసుకున్నాక, తలస్నానం చేసి రోజుకు రెండుసార్లు ఆలయాన్ని సందర్శిస్తాం. పసుపు బట్టలు వేసుకుంటాం, మాంసం తినకుండా, ఊరు విడిచి వెళ్ళకుండా ఉంటాం," అని బంగళామేడులో ఒక చిన్న దుకాణం నడుపుతోన్న ఎస్. సుమతి చెప్పారు. కొంతమంది ఈ నియమావళిని ఒక వారం పాటు, మరికొందరు ఇంకా ఎక్కువ కాలం పాటిస్తారు. “ఎన్ని రోజులు దీక్షలో ఉండగలిగితే అన్ని రోజులే. ఒక్కసారి కాప్పు వేసుకుంటే మేం ఊరు విడిచి వెళ్ళలేం," అన్నారు మణిగండన్.
స్వచ్ఛంద సంస్థ ఎయిడ్ ఇండియాతో సన్నిహితంగా కొన్నేళ్ళు పనిచేసిన డాక్టర్ ఎమ్. దామోదరన్, ఈ ఆచారాలు సంస్కృతుల మధ్య ఆలోచనలు లేదా ఆచరణల వ్యాప్తిని సూచిస్తాయని వివరించారు. “మొక్కులు తీర్చడం, ఉపవాసం ఉండడం, ఒక నిర్దిష్ట రంగు దుస్తులు ధరించడం, సామాజిక వేడుకలను నిర్వహించడం వంటి కొన్ని విధానాలు అనేక [ఇరులర్-కాని] ఇతర సమాజాల్లో కూడా పెద్ద ఎత్తున సామాన్య ప్రజల సమ్మతిని సాధించుకున్నాయి. ఈ సంస్కృతి ఇరులర్ సముదాయపు విభాగాల్లోకి కూడా ప్రవేశించింది,” అని ఆయన చెప్పారు. "అయితే అన్ని ఇరులర్ పల్లెలు ఈ ఆచారాలను అనుసరించవు."
బంగళామేడులో ఇరులర్లు వేడుకలలో చేయవలసిన ఆచారాల కోసం, అలంకారాల కోసం తమ కొద్దిపాటి సంపాదన నుంచే విరాళాలను పోగుచేసి, ఆ రోజు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. పండుగ రోజు ఉదయం, ఆలయానికి వెళ్ళే మార్గంలో ఉండే చెట్లకు తాజా వేపాకుల తోరణాలను కడతారు. స్పీకర్ల నుండి బిగ్గరగా భక్తి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అల్లిన కొబ్బరి మట్టలు, పొడవైన అరటి ఆకులు ఆలయ ప్రవేశద్వారాన్ని అలంకరిస్తాయి.
కాప్పు ధరించిన వారు పసుపురంగు బట్టలు ధరించి పూజల కోసం గుడికి చేరుకుంటారు. ఆ రోజు వేడుకలు అరుళ్‌వాక్కు లేదా దివ్య వాక్కుతో ప్రారంభమవుతాయి. దీనిని అమ్మన్ ఒక మాధ్యమం ద్వారా తమకు చెబుతుందని వారు నమ్ముతారు. " అమ్మన్ ఎవరికైనా పూనినప్పుడు, ఆమె వారి ద్వారా మాట్లాడుతుంది," అని మణిగండన్ చెప్పారు. “నమ్మనివారు గుడిలో కేవలం ఒక రాయిని చూస్తారు. మాకు విగ్రహం నిజమైనది, జీవం ఉన్నది. ఆమె మాకు అమ్మ లాంటిది. మేం ఆమెతో మా స్వంతమనిషితో మాట్లాడినట్టు మాట్లాడతాం. ఆ తల్లి మా సమస్యలను అర్థం చేసుకుంటుంది, సలహా ఇస్తుంది.”
మణిగండన్ సోదరి కన్నియమ్మ ప్రతి సంవత్సరం అరుళ్‌వాక్కు ను చెబుతారు. కోడి, మేకల బలి రక్తంతో కలిపిన బియ్యాన్ని ఆలయం చుట్టూ, గ్రామ సరిహద్దుల చుట్టూ ఆమె చల్లుతారు. స్వచ్ఛంద సేవకులు బియ్యం, రాగులతో చేసిన కూళు లేదా గంజిని వండి, మొత్తం సముదాయానికి పంచుతారు. సాయంత్రం దేవతను ఊరేగింపుకు సిద్ధం చేసేందుకు, మధ్యాహ్నం పూలతోనూ అరటి బోదెతోనూ పెద్ద పూల దండ, తోరా ను కడతారు.
మట్టి గుడిసె స్థానంలో పక్కా గుడి రావడంతో కొన్నేళ్ళుగా పండుగ చేసే స్థాయి పెరిగింది. పళని సొంత ఊరైన గుడిగుంట గ్రామంతో సహా పొరుగు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో జనం ఇప్పుడు బంగళామేడులో నిప్పులగుండం తొక్కే వేడుకను చూసేందుకు తరలివస్తున్నారు. "పండుగ ఎన్నడూ ఆగిపోలేదు, రెండు సంవత్సరాల కోవిడ్ సమయంలో కూడా తక్కువమంది ప్రజలే ఉన్నప్పటికీ ఈ వేడుకలను ఆపలేదు," అని మణిగండన్ చెప్పారు. కోవిడ్‌కు ముందు సంవత్సరమైన 2019లో, ఈ ఉత్సవానికి దాదాపు 800 మంది సందర్శకులు వచ్చారు.
ఇటీవలి సంవత్సరాలలో పళని కుటుంబం సందర్శకులందరికీ ఉచిత ఆహారం లేదా అన్నదానం చేస్తూవస్తున్నది. "2019లో మేం బిర్యానీ తయారు చేయడానికి అవసరమైన కేవలం 140 కిలోల చికెన్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశాం," అని పళని చెప్పారు. ఇప్పుడు సందర్శకుల సంఖ్య కోవిడ్ ముందరి రోజుల్లో ఉన్నట్టుగా పెరిగింది. "ప్రతి ఒక్కరూ విషయాన్ని వదిలేశారు," అన్నారాయన. పెరిగిపోయిన ఖర్చుల కోసం, పళని తన స్నేహితుల నుండి డబ్బు సేకరిస్తారు.
“మేం గుడి కోసం భవనం నిర్మించినప్పటి నుండి, రద్దీ పెరిగింది. ఇరులర్లు దీన్ని నిర్వహించలేరు, అవునా?” అని అతను గుడిని తన గ్రామం పేరు మీద ‘గుడిగుంట ఓం శక్తి దేవాలయం’గా ప్రస్తావిస్తూ అన్నారు..
*****
“కొత్త గుడిని కట్టినప్పుడు, మా మట్టి విగ్రహం స్థానంలో రాతితో తయారుచేసిన విగ్రహాన్ని ఉంచారు; ఇలా చేయటం ద్వారానే గుడి పవిత్రం అవుతుందని వారు చెప్పారు," అని మణిగండన్ చెప్పారు. "మేం దాని పక్కన మా మట్టి విగ్రహాన్ని కూడా ఉంచాం, మనల్ని కాపాడేది ఈ మట్టే కాబట్టి."
"వారు ఒక అయ్యర్‌ను [బ్రాహ్మణ పూజారి] పిలిచారు, అతను మేం సమర్పించిన పచ్చి బియ్యాన్నీ, వేపాకులనూ తీసేశాడు," అని అతను చెప్పారు. "ఇతని పద్ధతి మా పద్దతులకు భిన్నంగా ఉంది," అని ఆయన కొద్దిగా ఇబ్బందిపడుతూ చెప్పారు.
"సాధారణంగా కన్నియమ్మ వంటి దేవతలకు పూజలు చేయడంలో విస్తృతమైన, నిర్దిష్టమైన ఆచారాలను పాటించరు, మొత్తం సమాజం కూడా ఇందులో పాల్గొనదు" అని ఆంత్రోపాలజీలో ఉన్నత డిగ్రీని కలిగి ఉన్న డాక్టర్ దామోదరన్ చెప్పారు. “ఆచారాలకు ప్రాధాన్యం ఇవ్వడం, వాటిని చేసే నిర్దిష్ట పద్ధతులు, ఆపైన [తరచుగా బ్రాహ్మణ] పూజారి ద్వారా వాటిని ధృవీకరించడం ఒక విధిగా మారింది. ఇది చేసే విధానాన్ని ప్రామాణీకరించడం ద్వారా విభిన్న సంస్కృతులలో జరిగే ప్రత్యేకమైన పూజా పద్దతులను తుడిచివేస్తుంది.”
బంగళామేడు తీమిది వేడుకలు ప్రతి సంవత్సరం ఆర్భాటంగా జరుగుతుండడంతో, పండుగ నిర్వహణ నెమ్మదిగా తమ చేతుల్లో నుండి జారిపోతున్నదని మణిగండన్, అతని కుటుంబం భావిస్తున్నారు.
“ఇంతకుముందు మా నాన్న మోయి [పండుగ భోజనం ఆస్వాదించిన తర్వాత అతిథులు ఇచ్చే బహుమతి డబ్బు]తో అన్ని ఆహార ఖర్చులను నిర్వహించేవాడు. ఇప్పుడు ‘మణి, మీరు కాప్పు ఆచారాలపై దృష్టి పెట్టండి,' అని చెప్తూ అన్ని ఖర్చులు వారే [పళని కుటుంబం] చూసుకుంటున్నారు," అని మణిగండన్ చెప్పారు. అతని కుటుంబం అప్పుడప్పుడు పళని పొలాల్లోనే పని చేస్తుంటుంది.
ఈ వేడుకల గురించి రాసిన ప్రతులలో(flier) మరణించిన గోపాల్ వాళిమురై (వారసత్వం)ని అంగీకరిస్తూ రాసిన ఒక్క వాక్యం మినహాయించి ఇరులర్ల గురించి ప్రస్తావన లేదు. “మా నాన్న పేరును చేర్చాలని మేము పట్టుబట్టవలసి వచ్చింది. అందులో ఎవరి పేరు కనిపించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు," అని మణిగండన్ చెప్పారు.
తీమిది నాడు, నిప్పులగుండం తొక్కే భక్తులు దానిని తమ భక్తికి పరీక్షగా భావించి భయాందోళనలను పక్కనపెట్టి సిద్ధమవుతారు. వీరు స్నానం చేసి పసుపు రంగు బట్టలుధరించి, మెడలో పూల దండలు, పూలతో అలంకరించిన జుట్టుతో, శరీరమంతా గంధం పూసుకుని, పవిత్రమైన వేప మండలను చేతిలో పట్టుకునివుంటారు. “ఆ రోజున మా అమ్మన్ మాతో ఉన్నట్లే. అందుకే మగవాళ్ళు కూడా పూలు పెట్టుకుంటారు," అంటారు కన్నియమ్మ.
మొక్కు చెల్లించేవారు నిప్పుల గుండాన్ని తొక్కుతున్నప్పుడు, వారి భావోద్వేగాలు ముందు ప్రశాంతతతో మొదలై తర్వాత ఉన్మాదం వరకు పెరుగుతాయి. కొంతమంది సందర్శకులు వారిని ఉత్సాహపరుస్తారు, మరికొందరు ప్రార్థిస్తారు. ఈ దృశ్యాన్ని చాలామంది తమ మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరించి భద్రపరుస్తారు.
ఒకప్పుడు నిరాడంబరంగా ఉన్న ఇరులర్ మందిరానికి కొత్త పేరు, కొత్త విగ్రహం, కొత్త గుడి, పండుగ నిర్వహణ విధానాలలో మార్పు ఉన్నప్పటికీ మణిగండన్, అతని కుటుంబం తమ తండ్రి తమ అమ్మన్ కు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే వుంటారు, తమ ప్రాణాలను కాపాడినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూనే వుంటారు. తీమిది సమయంలో వారు వారి చింతలన్నీ మర్చిపోయి వ్యవహరిస్తారు.
గమనిక: ఈ కథనంలో ప్రచురించిన ఛాయాచిత్రాలన్నీ 2019లో తీమిది వేడుకలను చూసేందుకు ఈ రిపోర్టర్ బంగళామేడును సందర్శించినప్పుడు తీసినవి.
అనువాదం: పద్మావతి నీలంరాజు