శీతాకాలపు పంటలు కోసే సమయం దగ్గరపడినందున, కృష్ణ అంబుల్‌కర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు ఇంటింటికీ వెళ్ళి ఆస్తి పన్ను, నీటి పన్నుల వసూలీ ని ప్రారంభిస్తారు.
"ఇక్కడి రైతులు ఎంత పేదవాళ్ళంటే, 65 శాతం లక్ష్యాన్ని సాధించటమే ఇక్కడ చాలా గొప్ప," అంటారు ఝమ్‌కోలీ పంచాయతీకి చెందిన ఈ ఒకే ఒక ఉద్యోగి.
ఝమ్‌కోలీ నాగపూర్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నివసించే మానా, గోవారీ (షెడ్యూల్డ్ తెగలు) సముదాయాలవారు ఎక్కువగా మెట్ట పొలాలను సాగుచేసే సన్నకారు, చిన్న రైతులు. ఈ రైతులు పత్తి, సోయాచిక్కుళ్ళు, తూర్ (కందులు) పండిస్తారు. తమ పొలంలో బావి లేదా బోర్‌వెల్ ఉంటే గోధుమలు కూడా పండిస్తారు. నలభై ఏళ్ళ వయసున్న కృష్ణ ఈ గ్రామంలో ఉన్న ఏకైక ఒబిసి - న్హావీ (మంగలి) కులానికి చెందినవారు.
ఈ ఏడాది వ్యవసాయాన్ని కేంద్రంగా ఉంచుతూ బడ్జెట్‌ను రూపొందించినట్లు కొత్త దిల్లీ చేస్తోన్న బూటకపు వాదనలు, మధ్యతరగతివారికి ఇచ్చిన పన్ను మినహాయింపుపై మితిమీరిన ఉత్సాహం చెలరేగుతోన్నన్నప్పటికీ, అంబుల్‌కర్ పంచాయతీ పన్నుల వసూలు గురించిన ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధర మందగించడంపై ఆ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
కృష్ణ ఆందోళనను సులభంగా అర్థంచేసుకోవచ్చు: పన్నుల వసూలులో అతను విఫలమైతే, పచాయితీ పన్నుల రాబడి రూ. 5.5 లక్షల నుంచి అతనికి రావలసిన జీతం రూ. 11,500 అతనికి రాదు.
![](/media/images/02a-IMG20250203102238-JH-Our_budgets_are_t.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG20250203131606-JH-Our_budgets_are_t.max-1400x1120.jpg)
ఎడమ: ఝమ్‌కోలీ గ్రామ పంచాయతీ ఏకైక ఉద్యోగి కృష్ణ అంబుల్‌కర్. పన్ను రాబడి నుంచే తన సొంత జీతం వస్తుండటంతో ఆయన పంచాయతీ పన్నుల వసూళ్ళ గురించి ఆందోళన చెందుతున్నారు. కుడి: ద్రవ్యోల్బణం, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఝమ్‌కోలీ సర్పంచ్ శారద రౌత్ చెప్పారు
“వ్యవసాయంలో మా పెట్టుబడి ఖర్చులు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరిగాయి; మహాగాయి [ద్రవ్యోల్బణం] మా పొదుపులను తినేస్తోంది," అని గోవారీ సముదాయానికి చెందిన గ్రామ సర్పంచ్ శారద రౌత్ చెప్పారు. 45 ఏళ్ళ వయసున్న ఆమె, కుటుంబానికి చెందిన రెండు ఎకరాల భూమిని సాగు చేయడంతో పాటు స్వయంగా వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తున్నారు.
పంటల ధరలు నిలిచిపోయాయి, లేదా పడిపోయాయి: సోయాచిక్కుళ్ళ కనీస మద్దతు ధర క్వింటాల్ ఒక్కింటికి రూ. 4,850 కంటే దాదాపు 25 శాతం తక్కువకు అమ్ముడవుతోంది; పత్తి ధర ఏళ్ళ తరబడి క్వింటాల్ రూ. 7,000 దగ్గరే నిలిచిపొయింది. తూర్ (కందులు) క్వింటాల్ ధర రూ. 7-7,500 మధ్యనే ఊగిసలాడుతోంది. ఇది కనీస మద్దతు ధర తక్కువ పరిమితితో సమానంగా ఉంది.
ఏ ఒక్క కుటుంబం కూడా తమ అన్ని వనరుల నుండి వచ్చేది కలుపుకుని ఏడాదికి ఒక లక్ష రూపాయలకు మించి సంపాదించడం లేదని సర్పంచ్ చెబుతున్నారు. యాదృచ్ఛికంగా, కనీస పన్ను శ్రేణిలో ఉన్నవారు ఆదా చేసుకోగలిగే మొత్తం ఇది అని ఇటీవలి కేంద్ర బడ్జెట్ పేర్కొంది.
"ప్రభుత్వ బడ్జెట్ గురించి మాకేమీ తెలియదు," అంటోన్న శారద, "కానీ మా బడ్జెట్లు మునిగిపోతున్నాయని మాత్రం మాకు తెలుసు," అని ఎత్తిపొడుపుగా అన్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి