"మేం కొన్ని తరాలుగా రెండే పనులు చేస్తున్నాం - పడవ నడపటం, చేపలు పట్టటం. ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ పరిస్థితులను చూసినప్పుడు, నా పిల్లలు ఈ పనుల్లోనే కొనసాగాల్సి వస్తుందని నాకనిపిస్తోంది," అంటారు విక్రమాదిత్య నిషాద్. ఆయన గత 20 ఏళ్ళుగా వారణాసికి వచ్చే తీర్థయాత్రికులను, పర్యాటకులను గంగానది ఒక ఘాట్ (ఒడ్డు) నుంచి మరోదానికి తన పడవపై తిప్పుతుంటారు.

వెయ్యి కిలోమీటర్ల మేర గంగానది ప్రవహించే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ళలో నిరుద్యోగం 50 శాతం దగ్గర నిలిచిపోయిందని ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 తెలియజేసింది.

“మోదీ జీ ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ విరాసత్ హై వికాస్ [వారసత్వ సంపదే అభివృద్ధి]’ కోసం ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆ విరాసత్ [వారసత్వ సంపద] ఎవరి కోసం ఉందో చెప్పండి? మా కాశీ [వారణాసి] ప్రజల కోసమా లేక బయటివాళ్ళ కోసమా?” అని అడిగారతను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుండి మూడవసారి ఎన్నికయ్యారు, అతని ప్రచారం చేదు రుచిని మిగిల్చిందని అంటోన్న నిషాద్, "ఆ అభివృద్ధి ఏదో మనం తప్పక చూడాలి," అన్నారు.

చూడండి: వారణాసికి చెందిన పడవ మనిషి

'దయచేసి ఆ విరాసత్ [వారసత్వ సంపద] ఎవరి కోసం ఉందో నాకు చెప్పండి? మా కాశీ [వారణాసి] ప్రజల కోసమా, లేక బయటివాళ్ళ కోసమా?' అంటారు పడవ నడిపే విక్రమాదిత్య నిషాద్

జనవరి 2023లో మోదీ ప్రారంభించిన నదీ విహారయాత్రలు తనవంటి పడవ నడిపేవారి పనిని దోచుకున్నాయని నిషాద్ అన్నారు. "అభివృద్ధి పేరుతో అతను [మోదీ] స్థానికుల అభివృద్ధినీ, వారసత్వ సంపదనూ ఎత్తుకుపోయి బయటివాళ్ళకు ఇచ్చేశాడు." ఆయన పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వచ్చిన స్థానికేతరుల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఒక సగటు శ్రామికుడు నెలకు రూ. 10,000 కంటే కొంచం ఎక్కువగా సంపాదించగలుగుతున్నాడు. ఇది దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోని కార్మికుని సంపాదన కన్నా కూడా చాలా తక్కువ.

హిందువులు పవిత్రజలాలుగా భావించే నది నీటిలో కాలుష్యం శిఖర స్థాయికి చేరుకోవటం, ఈ 40 ఏళ్ళ పడవ నడిపే మనిషిని బాధించే మరో అంశం. "గంగానది నీరు ఇప్పుడు చాలా శుభ్రంగా ఉన్నాయని వాళ్ళంటున్నారు. ఇంతకు ముందు మనం ఒక నాణేన్ని నదిలోకి జారవిడిస్తే, నీటి పారదర్శకత వలన దాన్ని సులభంగా బయటకు తీయగలిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా నదిలోకి జారిపడి మునిగిపోతే కూడా వారిని కనుక్కోవడానికి రోజులు పడుతోంది," అని ఆయన పేర్కొన్నారు.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ: నది ఒడ్డున లంగరు వేసివున్న మోదీ ప్రారంభించిన విహార నౌకలలో ఒకటైన అలకనంద. కుడి: నదికి నివేదనలు చేస్తోన్న హిందూ భక్తులు

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

హిందువులు నదిని పవిత్రమైనదిగా భావిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాలుగా కాలుష్య స్థాయిలు బాగా పెరిగిపోయాయి. అస్సీ ఘాట్ వద్ద గంగ (కుడి)లోకి పారుతోన్న మురుగునీరు

కాలుష్యాన్ని తగ్గించి, పరిరక్షణను పెంచి, గంగను పునరుజ్జీవింపచేయటానికి రూ. 20,000 కోట్ల బడ్జెట్ వ్యయంతో 2014 జూన్‌లో నమామి గంగే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, రిషికేశ్ వద్ద దాని మూలానికి సమీపంలోను, వారణాసికి వందల కిలోమీటర్ల ఎగువన నీటి నాణ్యత సూచిక (WQI) చాలా తక్కువగా ఉందని 2017లో ఒక పత్రం పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రచురించిన నీటి నాణ్యత సూచిక గణాంకాలు దీనిని 'ఆందోళనకరం'గా పేర్కొన్నాయి

"ఆ విహార నౌక ఏ విధంగా 'వారణాసి వారసత్వ సంపద' కాగలదు? మా పడవలే వారసత్వ సంపదకు ముఖాలు, వారణాసికి గుర్తింపు," ప్రయాణీకుల కోసం ఎదురుచూస్తూ తన పడవలో కూర్చొని ఉన్న నిషాద్ PARIతో చెప్పారు. "అతడు ఎన్నో పురాతన మందిరాలను కూలగొట్టి విశ్వనాథ్ మందిర్ కారిడార్‌ను తయారుచేశాడు. గతంలో యాత్రికులు వారణాసిని సందర్శించినప్పుడు, 'బాబా విశ్వనాథ్' వద్దకు వెళ్ళాలని చెప్పేవారు. ఇప్పుడు వారు 'కారిడార్'కి వెళ్ళాలని అంటున్నారు," అని నిషాద్ తన వంటి నివాసితులపైకి బలవంతంగా రుద్దిన సాంస్కృతిక మార్పుల పట్ల స్పష్టమైన అసంతృప్తితో చెప్పారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jigyasa Mishra

ਜਗਿਆਸਾ ਮਿਸ਼ਰਾ ਉੱਤਰ ਪ੍ਰਦੇਸ਼ ਦੇ ਚਿਤਰਾਕੂਟ ਅਧਾਰਤ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ।

Other stories by Jigyasa Mishra
Editor : PARI Desk

ਪਾਰੀ ਡੈਸਕ ਸਾਡੇ (ਪਾਰੀ ਦੇ) ਸੰਪਾਦਕੀ ਕੰਮ ਦਾ ਧੁਰਾ ਹੈ। ਸਾਡੀ ਟੀਮ ਦੇਸ਼ ਭਰ ਵਿੱਚ ਸਥਿਤ ਪੱਤਰਕਾਰਾਂ, ਖ਼ੋਜਕਰਤਾਵਾਂ, ਫ਼ੋਟੋਗ੍ਰਾਫਰਾਂ, ਫ਼ਿਲਮ ਨਿਰਮਾਤਾਵਾਂ ਅਤੇ ਅਨੁਵਾਦਕਾਂ ਨਾਲ਼ ਮਿਲ਼ ਕੇ ਕੰਮ ਕਰਦੀ ਹੈ। ਡੈਸਕ ਪਾਰੀ ਦੁਆਰਾ ਪ੍ਰਕਾਸ਼ਤ ਟੈਕਸਟ, ਵੀਡੀਓ, ਆਡੀਓ ਅਤੇ ਖ਼ੋਜ ਰਿਪੋਰਟਾਂ ਦੇ ਉਤਪਾਦਨ ਅਤੇ ਪ੍ਰਕਾਸ਼ਨ ਦਾ ਸਮਰਥਨ ਵੀ ਕਰਦੀ ਹੈ ਤੇ ਅਤੇ ਪ੍ਰਬੰਧਨ ਵੀ।

Other stories by PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli