"ఎథే రోటీ కట్ మిల్దీ హై, చిట్టా సరే ఆమ్ మిల్దా హై [ఇక్కడ ఆహారానికి కొరత కానీ, హెరాయిన్‌కి మాత్రం కొదవ లేదు]."

హర్‌వంశ్ కౌర్ ఒక్కగానొక్క కొడుకు మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. "మేం అతనిని ఆపడానికి ప్రయత్నిస్తాం. అయినా అతను మాతో పోట్లాడి, డబ్బు మొత్తం తీసుకుపోయి మాదకద్రవ్యాల మీద ఖర్చు చేస్తాడు," అని నిస్సహాయురాలైన ఆ తల్లి తెలిపారు. ఇటీవలే ఆమె కొడుకు (25) తండ్రి కూడా అయ్యాడు. తమ గ్రామంలో చిట్టా (హెరాయిన్) ఇంజెక్షన్లు, క్యాప్సూల్స్ రూపంలోని సైకోట్రోపిక్ పదార్థాలు సులభంగా లభిస్తాయని ఆమె చెప్పారు.

“ప్రభుత్వం తల్చుకుంటే, ఈ మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపగలదు. లేకుంటే, మా పిల్లలు చాలా మంది చనిపోతారు." హర్‌వంశ్ కౌర్ రావుకే కలాఁ గ్రామంలోని ఒక బంగాళదుంపలను నిల్వచేసే యూనిట్‌లో పనిచేసే రోజువారీ కూలీ. ఆమె ప్యాక్ చేసే ప్రతి సంచికి రూ. 15 లభిస్తుంది. ఆమె రోజుకు దాదాపు 12 సంచులు ప్యాక్ చేసి, సుమారు రూ. 180 సంపాదిస్తారు. ఆమె భర్త, 45 ఏళ్ళ సుఖ్‌దేవ్ సింగ్, వాళ్ళ గ్రామమైన నంగల్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిహాల్ సింగ్ వాలాలోని ఒక గిడ్డంగిలో రోజువారీ కూలీగా పనిచేస్తారు. గోధుమలు లేదా బియ్యం బస్తాలను ప్యాక్ చేసే పని దొరికినప్పుడు ఆయన రోజుకు రూ. 300 సంపాదిస్తారు. వాళ్ళిద్దరి సంపాదనపైనే కుటుంబమంతా ఆధారపడింది..

అసలు విషయానికి వస్తే, పంజాబ్‌లోని మోగా జిల్లాలోని ఈ గ్రామంలో ఆమె పొరుగున ఉండే కిరణ్ కౌర్, "మా గ్రామం నుంచి మాదకద్రవ్యాలను నిర్మూలిస్తామని వాగ్దానం చేసేవాళ్ళకే మా ఓటు వేస్తాం," అని చెప్పింది.

ఆమె భర్త కూడా మాదకద్రవ్యాలకు అలవాటు పడినందువల్లే కిరణ్ ఈ మాటలను అనగలిగింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన కిరణ్‌కు మూడేళ్ళ కుమార్తె, ఆరు నెలల కొడుకు ఉన్నారు. “ఒక మామూలు కూలీ అయిన నా భర్త గత మూడేళ్ళుగా మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. సంపాదించినదంతా మాదకద్రవ్యాలకే ఖర్చు పెడతాడు." అని కిరణ్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఎనిమిది మంది సభ్యులు నివాసముండే తమ ఇంటి గోడలకు ఉన్న పెద్ద పెద్ద పగుళ్ళను చూస్తూ, “గదులు బాగుచేయించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?” అంటుందామె.

PHOTO • Sanskriti Talwar

పంజాబ్‌లోని మోగా జిల్లా, నంగల్ గ్రామానికి చెందిన హర్‌వంశ్ కౌర్, ఆమె భర్త సుఖ్‌దేవ్ సింగ్ తమ ఒక్కగానొక్క కొడుకును మాదకద్రవ్యాల అలవాటు నుంచి తప్పించడానికి చాలా కష్టపడుతున్నారు

ఫరీద్‌కోట్ పార్లమెంటరీ నియోజకవర్గం కిందకు వచ్చే మోగా జిల్లాలోని నంగల్ గ్రామంలో జూన్ 1న పోలింగ్ జరగనుంది.

ఆరు నెలల క్రితం నంగల్‌లో 24 ఏళ్ళ ఓ యువకుడు మాదకద్రవ్యాలను ఎక్కువగా సేవించటం కారణంగా మరణించాడు. ఆ యువకుడు మృత్యువాత పడిన సంఘటన గ్రామస్తుల జ్ఞాపకాల్లో ఇప్పటికీ మెదులుతోంది. "ఇక్కడ బేరోజ్‌గారీ [నిరుద్యోగం] చాలా ఉంది, చాలామంది యువకులు పనిలేకుండా కూర్చుని, చెడు సావాసాలు అలవర్చుకుంటారు," అని నంగల్ గ్రామంలో 2008 నుంచి ఆశా (ASHA: అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్)గా పనిచేస్తున్న పరమ్‌జీత్ కౌర్ చెప్పారు.

"ఈ [మాదకద్రవ్యాల] పరిస్థితిని ప్రభుత్వం మాత్రమే నియంత్రించగలదు," అని ఆమె అన్నారు. 2022లో పంజాబ్‌లో 144 మంది (అందరూ మగవాళ్ళే) మాదకద్రవ్యాలను ఎక్కువగా సేవించడం కారణంగా మరణించారు (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో).

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో పంజాబ్‌ను మాదకద్రవ్య రహితంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగస్టు 15, 2023న పటియాలాలో చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, రాష్ట్రంలో ఏడాదిలోగా మాదకద్రవ్యాలు లేకుండా చేస్తామని ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ శాఖ ద్వారా కొన్ని మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం, తరలింపును నియంత్రిస్తున్నాయి . అయితే మాదకద్రవ్యాల అమ్మకాలు, వ్యాపారం అనేది పక్కాగా నిర్వహిస్తున్న మాఫియా అని స్థానికులు చెబుతున్నారు. నంగల్‌లోని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యుడు బూటా నంగల్ మాట్లాడుతూ, "మోగా, లుథియానా, బర్నాలా, ఇతర ప్రాంతాలతో సంబంధాలు ఉన్న బయటి వ్యక్తులు ఈ మాదకద్రవ్యాలను మా గ్రామంలోకి తీసుకొస్తున్నారు," అన్నారు.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం, తరలింపును నియంత్రిస్తున్నాయి. కానీ మాదకద్రవ్యాల అమ్మకాలు, వ్యాపారం అనేది పక్కాగా నిర్వహిస్తున్న మాఫియా అని స్థానికులు చెబుతున్నారు. తన కుటుంబంతో (ఎడమ) మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యుడు బూటా నంగల్ (నీలం రంగు కుర్తా). అమన్‌దీప్ కౌర్, కిరణ్ కౌర్‌లు నివసించే నంగల్ గ్రామం (కుడి)

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం , 1985 ప్రకారం, భారతదేశంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటిని కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. "కానీ దబావ్ [ఒత్తిడి] కారణంగా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు," అని కమిటీ మరో సభ్యుడు సుఖ్‌చైన్ సింగ్ తెలిపారు. "ఎమ్మెల్యే [శాసన సభ్యుడు] కావాలనుకుంటే మా గ్రామంలోకి మాదకద్రవ్యాలు రాకుండా ఆపవచ్చు," అని ఆయన చెప్పారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ సర్పంచ్, లఖ్‌వీర్ సింగ్ కూడా ఆయన మాటలతో ఏకీభవించారు. “ పీఛే తో సర్కార్ రోకే తే రుకూగా [ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే అది ఆగిపోతుంది],” అని ఆయన అన్నారు.

కానీ రాజకీయ నాయకులు ఈ సమస్యను పరిష్కరించడం లేదని నంగల్ నివాసి కమల్‌జీత్ కౌర్ అన్నారు. ఫరీద్‌కోట్‌ ఆప్ (AAP) అభ్యర్థి కరమ్‌జీత్ అన్‌మోల్ తన ర్యాలీలో మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి మాట్లాడలేదని ఆమె చెప్పారు. "మహిళా ఓటర్లకు ప్రయోజనాలను వాగ్దానం చేస్తూ అతను ఓటు వేయమని అడిగాడు," అని దళిత మజహబీ సిక్కు సముదాయానికి చెందిన ఆ 40 ఏళ్ళ మహిళ చెప్పారు. "దురదృష్టవశాత్తు, [రాజకీయ] పార్టీలు ఏవీ దాని గురించి మాట్లాడలేదు," మే నెలలో తమ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు వెళుతూ ఆమె ఈ మాటలు అన్నారు.

*****

భర్త మాదకద్రవ్యాల వ్యసనం వదిలేయకపోవడంతో కుటుంబ నిర్వహణ భారం అంతా భూయజమానుల పొలాలలో కూలీగా పనిచేసే కిరణ్‌పై పడింది. 23 ఏళ్ళ ఆ యువతి చివరిసారిగా ఫిబ్రవరి 2024లో బంగాళాదుంపలను ఏరే పని చేసి కూలీ సంపాదించింది. ఆ పని చేసే సమయంలో ఆమె తన బిడ్డను పొలంలోని ఒక చెట్టు నీడలో, ప్లాస్టిక్ గోతాం మీద పడుకోబెట్టింది. దాదాపు 20 రోజులకు ఆ పని పూర్తయింది. చివరకు ఆమెకు ఇస్తామన్న రోజు కూలీ రూ. 400కు బదులుగా, రోజుకు రూ. 300 వంతున లెక్క కట్టి ఇచ్చారు.

ఆమె స్నేహితురాలు, పొరుగున ఉండే అమన్‌దీప్ కౌర్ కూడా ఆమెతో పాటు పని చేస్తుంది. [ఉన్నత కులాల] రైతులు తమను నిరసన కార్యక్రమాలకు తీసుకువెళతారు కానీ, తమలాంటి వ్యవసాయ కూలీలకు సరైన వేతనం ఇవ్వరని ఆమె పేర్కొంది. “మా కోసం ఎవరు నిలబడతారు? ఎవరూ నిలబడరు. మేం షెడ్యూల్డ్ కులానికి చెందినవాళ్ళం కాబట్టి వాళ్ళు మమ్మల్ని తమ వెనుక ఉండమంటారు, అదీగాక మేం అందరికంటే ఎక్కువగా శ్రమపడి పనిచేస్తాం," అని అమన్‌దీప్ చెప్పింది..

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ఉద్యోగం వెతుక్కుంటూ బ్రిటన్‌కు వెళుతోన్న సరబ్‌జీత్ కౌర్‌ను చూసేందుకు వస్తున్న బంధువుల కోసం వంట చేస్తున్న అమన్‌దీప్ కౌర్, కిరణ్ కౌర్ (గులాబీ రంగు దుస్తులు). స్వగ్రామం నంగల్‌లో కిరణ్ అత్తగారు బల్‌జీత్ కౌర్ (పసుపు రంగు దుస్తులు)

కిరణ్, అమన్‌దీప్ లాంటి దళితులు పంజాబ్ జనాభాలో 31.94 శాతం మంది ఉన్నారు - దేశంలోని ఏ రాష్ట్రంలో కంటే కూడా ఇదే అత్యధిక సంఖ్య (జనగణన 2011). రోజువారీ కూలీని కనీసం రూ.700 - రూ.1,000కి పెంచాలనేది నిరసన వేదిక వద్ద ఉన్న దళిత కూలీల ప్రధాన డిమాండ్.

మహిళా వ్యవసాయ కూలీలకు పని అవకాశం జూన్‌లో ఖరీఫ్ సీజన్‌లో ప్రారంభం అవుతుందని అమన్‌దీప్ చెప్పింది. వరి నాట్లు వేయడానికి వారిని ఎకరాకు రూ. 4,000 ఇచ్చేట్టుగా పనిలోకి తీసుకుకుంటారు. ఈ లెక్కన పనిచేసే ప్రతి కూలీకి, రోజుకు రూ. 400 లభిస్తుంది. "ఆ తర్వాత, శీతాకాలం మొత్తం మాకు పనులు ఉండవు," అందామె.

వాళ్ళకున్న మరో ప్రత్యామ్నాయం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA). ఈ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పనిని హామీ ఇస్తుంది. అయితే, తమ గ్రామంలో ఈ పథకం కింద తమకు 10 రోజుల కంటే ఎక్కువ రోజులు పని లభించదని కిరణ్ అత్తగారు, 50 ఏళ్ళ బల్‌జీత్ కౌర్ చెప్పారు.

రోజువారీ ఖర్చుల కోసం, అగ్రకులాలకు చెందినవారి కుటుంబంలో రోజుకు రూ. 200 లెక్కన బల్‌జీత్ పని చేస్తారు. ప్లాస్టిక్‌ కాగితంతో అట్ట వేసే ప్రతి పాఠ్యపుస్తకానికి రూ. 20 చొప్పున అమన్‌దీప్‌ సంపాదిస్తారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నెలకు రూ. 1,000 అదనపు ఆదాయం నిజంగా తమకు సహాయపడేదని మహిళలు అంటున్నారు. "మేం కష్టపడి ఆ పత్రాలను పూర్తి చేయడానికి రూ. 200 చెల్లించాం, కానీ ఏ ప్రయోజనం లేదు,” అని బల్‌జీత్ కౌర్ చెప్పారు.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

మోగా జిల్లా నంగల్ గ్రామంలో బల్‌జీత్, కిరణ్ల ఇల్లు. 'పంజాబ్‌లో ఉద్యోగాలు లేనందున మా సమయాన్ని వృథా చేసుకోవడంలో అర్థం లేదు. ఇక్కడ కేవలం మాదకద్రవ్యాల దుర్వినియోగం [నషే] మాత్రమే ఉంది,' అంటోంది, ఉద్యోగం కోసం బ్రిటన్ వెళ్తోన్న సరబ్‌జీత్ కౌర్

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న బల్‌జీత్ తన చిన్న కూతురు 24 ఏళ్ళ సరబ్‌జీత్ కౌర్‌ను ఉద్యోగం వెతుక్కోవడం కోసం బ్రిటన్‌కు పంపేందుకు సిద్ధమయ్యారు. ఆ కలను నిజమ చేసుకోవడం కోసం ఆ కుటుంబం తమ కారును, మోటారు సైకిల్‌ను అమ్మడమే కాకుండా రూ. 13 లక్షలు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుగా తీసుకున్నారు.

సరబ్‌జీత్ రెండేళ్ళ క్రితం బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్‌తో పట్టా తీసుకున్నారు, కానీ అప్పటి నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నారు. “పంజాబ్‌లో ఉద్యోగాలు లేనందున సమయాన్ని వృథా చేసుకోదల్చుకోలేదు. ఇక్కడ పని లేదు, మాదకద్రవ్యాల [ నషే ] వాడకమే ఉంది,” అని చెప్పిందామె.

24 ఏళ్ళ ఆ యువతి ఉద్యోగం వచ్చే వరకు స్నేహితులతో కలిసి ఉంటుంది: “విదేశాలకు వెళ్లాలనేది నా చిన్ననాటి కల. ఇప్పుడు ఆ కల ఒక అవసరంగా మారింది." వీళ్ళ కుటుంబం చుట్టుపక్కల గ్రామాలకు రోజుకు రెండుసార్లు పాలను సరఫరా చేసి రోజుకు సుమారు రూ. 1,000 సంపాదిస్తుంది. దానితోనే తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంతో పాటు ఇంటి ఖర్చులను కూదా గడుపుకోవాలి..

“తల్లిదండ్రులంగా, ఆమెకు పెళ్ళి చేశాకే మేం ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించాలి, కానీ ఇప్పుడు మేం ఆమెను విదేశాలకు పంపుతున్నాం. కనీసం ఆమె ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది,” అని బల్‌జీత్ కౌర్ చెప్పారు.

అనువాదం: రవి కృష్ణ

Sanskriti Talwar

ਸੰਸਕ੍ਰਿਤੀ ਤਲਵਾਰ, ਨਵੀਂ ਦਿੱਲੀ ਅਧਾਰਤ ਇੱਕ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ ਅਤੇ ਸਾਲ 2023 ਦੀ ਪਾਰੀ ਐੱਮਐੱਮਐੱਫ ਫੈਲੋ ਵੀ ਹਨ।

Other stories by Sanskriti Talwar
Editor : Priti David

ਪ੍ਰੀਤੀ ਡੇਵਿਡ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਇੰਡੀਆ ਦੇ ਇਕ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਪਾਰੀ ਵਿਖੇ ਐਜੁਕੇਸ਼ਨ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪੇਂਡੂ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਕਲਾਸਰੂਮ ਅਤੇ ਪਾਠਕ੍ਰਮ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਸਿੱਖਿਅਕਾਂ ਨਾਲ ਅਤੇ ਸਮਕਾਲੀ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਦਸਤਾਵੇਜਾ ਦੇ ਰੂਪ ’ਚ ਦਰਸਾਉਣ ਲਈ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਕੰਮ ਕਰਦੀ ਹਨ ।

Other stories by Priti David
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna