నేను తర్పా ను ఊదినపుడు మా వర్లీ ప్రజల శరీరాన్ని గాలి ఆవహిస్తుంది (పూనుతుంది). ఒక గంటపాటు వారి శరీరం గాలికి ఊగే చెట్టులాగా ఊగిపోతుంది.
నేను వాదనం చేసేటప్పుడు సవరీ దేవినీ ఆమె సహచరులనూ పిలుస్తాను. నా పిలుపుకు స్పందించినవారే నా ప్రజలను ఆవహిస్తారు.
ఇదంతా విశ్వాసానికి సంబంధించినది. 'మానల్ త్యాచా దేవ్, నాహి త్యాచా నాహి ,' [నమ్మేవారికి దేవుడున్నాడు, నాస్తికుడికి ఉండడు].
నా ముత్తాత నవ్‌ష్యా, తర్పా ను ఊదేవాడు.
ఆయన కొడుకు ఢాక్‌ల్యా. ఆయనా ఊదేవాడు.
ఢాక్‌ల్యా కొడుకు లడ్‌క్యా. ఆయన కూడా ఊదాడు.
లడ్‌క్యా నా తండ్రి.
అప్పుడు ఆంగ్లేయుల పాలన ఉండేది. మనకింకా స్వాతంత్ర్యం రాలేదు. మా వాళ్వండేలో ‘గొప్ప’వాళ్ళ (అగ్ర కులాలవారు) పిల్లల కోసం మాత్రమే ఒక బడి ఉండేది. పేదవాళ్ళకు బడి లేదు. అప్పుడు నాకు 10-12 ఏళ్ళుండేవి. నేను పశువులను మేపేవాడ్ని. నా తల్లిదండ్రులు 'గాయిమాగే గేలా తార్ రోటీ మిలాల. చాలెట్ గేలా తార్ ఉపాశీ రహాల [నేను పశువులను కాస్తే నాకు తినటానికి దొరుకుతుంది. బడికి వెళ్తే ఆకలితో ఉండాల్సొస్తుంది’] అనుకునేవారు. మా అమ్మ ఏడుగురు పిల్లలను సాకాలి.
మా నాన్న అనేవాడు, 'పశువులు మేసేటప్పుడు నువ్వు చేయటానికి పనేమీ ఉండదు. నువ్వు తర్పా నెందుకు వాయించకూడదు? అది నీ శరీరానికి (ఆరోగ్యానికి కూడా) మంచి చేస్తుంది, నిన్ను వినోదపరుస్తుంది కూడా.' ఆ శబ్దానికి పశువులకు దగ్గరగా ఎలాంటి పురుగులూ రావు.
నేను అడవుల్లో ఉన్నప్పుడు, గడ్డి భూముల్లో ఉన్నప్పుడూ తర్పా ను ఊదటాన్ని మొదలుపెట్టాను. 'రోజంతా ధిండ్యా కొడుకు క్యావ్ క్యావ్ అంటూ గోల గోల చేస్తూనే ఉంటాడు,' అని జనం ఫిర్యాదులు చేసేవారు. 'నేను బతికి ఉన్నంత వరకే మీకోసం తర్పా ను చేయగలను. నేను వెళ్ళిపోయాక ఎవరు చేస్తారు?' ఆ విధంగా నేను కళను నేర్చుకున్నాను.
తర్పా ను చేయడానికి మూడు వస్తువులు కావాలి. శబ్దం (ప్రతిధ్వనించే కొమ్ము ధ్వని) చేసేందుకు మాడ్ (తాటి చెట్టు) ఆకులు. రెండు బంబూ (పేము) ముక్కలు- ఒకటి ఆడ, మరోటి మగ. మగ పేము ముక్కకు తట్టడానికీ, లయ పోకుండా ఉంచటానికీ మరో చిన్న ముక్క ఉంటుంది. మూడవది దుధి (సొరకాయ), ఛాతీలోంచి గాలి ఊదటానికి. నేను గాలి ఊదే రంధ్రంలోకి గాలిని ఊదినపుడు ఈ ఆడా మగా కలిసి అత్యంత ఆకర్షణీయమైన శబ్దాన్ని సృష్టిస్తాయి.
తర్పా ఒక కుటుంబంలాంటిది. అందులో ఆడా మగా ఉంటాయి. నేను కొంచం గాలిని ఊదగానే, ఆ రెండూ కలిసి వచ్చే శబ్దం అద్భుతంగా ఉంటుంది. రాయిలాగా, దానికి జీవం ఉండదు. కానీ నా ఊపిరితో అది జీవం పోసుకొని ఒక సంగీత స్వరాన్ని పలికిస్తుంది. దీనికి ఛాతీ నిండా గాలి ఉండాలి. వాయిద్యంలోకి గాలిని ఊదాలి, అలాగే నీ శరీరం ఊపిరి తీసుకునేందుకు తగినంత గాలి ఉండేలా చూసుకోవాలి.
దేవుడిచ్చిన జ్ఞానంతోనే మనం అటువంటి ఒక వాయిద్యాన్ని తయారుచేయగలం. అది దేవునికే చెందినది.
మా నాన్న అనేవాడు, 'పశువులు మేసేటప్పుడు నువ్వు చేయటానికి పనేమీ ఉండదు. నువ్వు తర్పా నెందుకు వాయించకూడదు? అది నీ శరీరానికి (ఆరోగ్యానికి కూడా) మంచి చేస్తుంది, నిన్ను వినోదపరుస్తుంది కూడా'
*****
నా తల్లిదండ్రులు, వృద్ధులు మనకు ఎన్నో కథలు చెప్పేవారు. ఇప్పుడు వాటిని చెప్తే, జనం నన్ను ఎగతాళి చేస్తారు. కానీ ఇవి మన పూర్వీకులు మనకు చెప్పిన మాటలు.
బ్రహ్మాండం (విశ్వం)ని సృష్టించిన తర్వాత దేవుళ్ళు వెళ్ళిపోయారు. అయితే వర్లీలు ఎక్కడినుండి వచ్చారు?
కంద్‌రామ్ దెహ్‌ల్యా నుంచి.
దేవుళ్ళు కంద్‌రామ్ దెహ్‌ల్యా కోసం వాళ్ళమ్మ దగ్గర కొంచం పెరుగును ఉంచారు. అతను పెరుగునూ తిన్నాడు, బర్రెనూ తిన్నాడు. అతని తల్లికి కోపం వచ్చి అతన్ని ఇంట్లోంచి తరిమేసింది.
మొట్టమొదటి వర్లీ, కంద్‌రామ్ దెహ్‌ల్యా ఎలా ఇక్కడికి వచ్చాడో మన పూర్వీకులు మనకు చెప్పారు.
కంద్‌రామ్ దెహ్‌ల్యాలహూన్
పళ్సొండ్యాలా పర్సంగ్ ఝాల
నటవచొండీలా నటల
ఖర్వండ్యాలా ఖర ఝాలా
శిణ్గార్‌పాడ్యాలా శిణ్గారల
అడ్‌ఖడ్‌కాలా ఆడ్ ఝాల
కాటా ఖోచాయ్ కాసట్వాడీ ఝాల
కసెలీలా యేఉన్ హసల
ఆన్ వాళ్వాఁడ్యాలా యేఉన్ బసల.
గొర్యాలా జాన్ ఖర జాల
గొర్యాలా రహలా గోంద్యా
చాంద్యా ఆల, గంభీర్‌గడా ఆల
Kandram Dehlyalahun
Palsondyala parsang jhala
Natavchondila Natala
Kharvandyala khara jhala
Shingarpadyala shingarala
Aadkhadakala aad jhala
Kata khochay Kasatwadi jhala
Kaselila yeun hasala
Aan Walwandyala yeun basala.
Goryala jaan khara jaala
Goryala rahala Gondya
Chandya aala, Gambhirgada aala
*ఈ పద్యం పాల్ఘర్ జిల్లాలోని జవహర్ బ్లాక్‌లో ఉన్న గ్రామాల, కుగ్రామాల పేర్లను ఉపయోగించి ఆడిన ప్రాసతో కూడిన పదాల ఆట.
వర్లీలలాగే అనేక సముదాయాలు ఇక్కడ నివసించాయి. రాజ్‌కోలి, కొకణా, కత్‌కరీ, ఠకర్, మహార్, చాంభార్... నేను మహరాజా (జవహార్ రాజు) దర్బార్ లో పనిచేసిన గుర్తుంది. రాజు తన దర్బార్ లో భోజనం చేసే జనం అందరితో పాటే తాను కూడా కర్వళ్ ఆకులలో తినేవాడు. నేనక్కడ పనిచేసేవాడ్ని, తినేసిన ఆకుల్ని ఎత్తేవాడ్ని. అన్ని సముదాయాలూ ఒక్కచోటకు చేరి ఒకే బంతిలో తినేవారు. ఎవరూ ఎవరినీ ఎవరికన్నా కూడా తక్కువవారిగా చూసేవారు కాదు. ఈ విధానాన్ని నేనిక్కడే నేర్చుకున్నాను, కత్కరీల, ముసల్మానుల చేతి నీటిని తాగడాన్ని మొదలుపెట్టాను. వర్లీలు తాకిన నీటిని రాజ్‌కొలీలు తీసుకోరు. మావాళ్ళు కత్కరీ, చంభార్, ధొర్ కొలీలు తాకిన నీటిని తాగరు. ఇప్పటికీ అంతే. అయితే నేనెప్పుడూ అటువంటి వివక్షను నమ్మలేదు.
చూడు, హిర్వా దేవుడి నీ తర్పా నూ పూజించేవారెవరైనా వర్లీ ఆదివాసీయే
పండుగలను మేమంతా కలిసే జరుపుకుంటాం. కొత్త పంట వచ్చినపుడు మేం దాన్ని కుటుంబంతోనూ ఇరుగుపొరుగులతోనూ పంచుకుంటాం; అంతకంటే ముందు మా గ్రామ దేవత అయిన గాఁవ్‌దేవి కి సమర్పిస్తాం. మొదటి నైవేద్యాన్ని ఆమెకు సమర్పించిన తర్వాత మాత్రమే మేం తింటాం. మీకిది అంధా-శ్రద్ధ (గుడ్డి నమ్మకం)గా అనిపించవచ్చు. కానీ అలా ఏం కాదు. అది మా శ్రద్ధ , మా నమ్మకం.
కొత్త పంటతో మేం మా స్థానిక దేవత అయిన గాఁవ్‌దేవి గుడికి వెళ్తాం. మేమెందుకు ఒక గుడి కట్టి ఆమెను ఇక్కడకు తెచ్చాం? మా పిల్లలనూ, బంధువులనూ, పశువులనూ, శ్రమనూ ఆరోగ్యానందాలతో ఉండేలా చూడాలి. మా పొలాలూ తోటలూ వర్ధిల్లేలా చూడాలి. ఉద్యోగాలు చేసేవారు, అందులో విజయం సాధించేలా చూడాలి. మా కుటుంబాలకూ, మా జీవితాలకూ మంచి రోజులు రావాలి,' అని మేమామెను పూజిస్తాం. మా ఆదివాసులం ఆమె గుడికి వెళ్ళి మా దేవతను పూజిస్తాం, ఆమె పేరు తీసి మా కోరికలను చెప్పుకుంటాం.
మా జీవితాల్లో తర్పా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
వాఘ్‌బరస్ నాడు మేం సవరి దేవి పండుగను జరుపుకుంటాం. రాముడికి ఎంగిలి చేసిన ఫలాలను అందించిన శబరిగా మీకు ఆమె తెలుసు. మాకు వేరే కథ ఉంది. సవరి దేవి అడవిలో రాముడి కోసం ఎదురుచూస్తుంటుంది. అతనక్కడికి సీతతో వస్తాడు. సవరి అతన్ని కలిసి, అనంతకాలంగా రాముడిని చూడటానికే తాను ఎదురుచూస్తూ ఉన్నానని, ఇప్పుడు చూసేసింది కాబట్టి ఇంక తనకు జీవించాల్సిన అవసరం లేదని రాముడితో చెప్తుంది. ఆమె తన జీవ్‌డా (గుండె)ను తీసి రాముని చేతిలో పెట్టి, ఇంకెన్నడూ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతుంది.
ఆమె ప్రేమనూ అంకితభావాన్నీ పండుగ చేసేందుకు మేం తర్పా ని కొండలకూ అడవులకూ తీసుకుపోతాం. అక్కడ, అడవిలో అనేకమంది దేవతలుంటారు. తంగ్డా సవరి, గోహ్రా సవరి, పోప్తా సవరి, తుంబా సవరి, ఘుంగా సవరి . వీరంతా సవరి దేవి స్నేహితులు. వారు ప్రకృతి దేవతలు. వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళున్నారు. మేం వాళ్ళను ఆరాధించటం మొదలుపెట్టాం. నేను తర్పా ను ఊది, వారిని పండుగకు ఆహ్వానిస్తాను. మనం ఎవరినైనా పేరుతో పిలిచినట్టే, ఒక్కో సవరి ని ఒక్కో బాణీతో పిలుస్తాను. ప్రతి సవరికీ బాణీ మారుతుంటుంది.
*****
అది 2022. నందుర్‌బార్, ధుళే, బడోదా... ఈ ప్రాంతాలన్నిటి నుంచి వచ్చిన ఆదివాసులతో కలిసి నేను వేదికపై ఉన్నాను. నా ముందు కూర్చొని వున్నవాళ్ళు నన్ను ఆదివాసీనని నిరూపించుకోమని అడిగారు.
ఈ భూమిపైకి మొదటిసారి అడుగుపెట్టి, ఈ మట్టిని పరీక్షించినవారే ఆదివాసీ అనీ, ఆ మానవుడే నా పూర్వీకుడని నేను వారితో చెప్పాను. మన ఊపిరితో మనం సృష్టించే శబ్దమే మన సంస్కృతి అని నేను వాళ్ళతో చెప్పాను. మన చేతులతో ఆడిన ఆటనే మీరు చిత్తరువులో చూస్తారు. బొమ్మవేయటం తర్వాత వచ్చింది. ఊపిరి, సంగీతం శాశ్వతమైనవి. విశ్వం ఉనికిలో ఉన్నప్పటినుండి శబ్దాలు ఉన్నాయి.
ఈ తర్పా ఒక జంటకు ప్రతినిధి అని చెప్తూ నేను ముగించాను. పురుషుడు స్త్రీకి అండగా ఉంటాడు, స్త్రీ పురుషునికి అండగా ఉంటుంది. తర్పా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. ఒక ఊపిరి వారిని ఒకటిగా చేసి అత్యంత అద్భుతమైన శబ్దాన్ని సృష్టిస్తుంది.
నా జవాబు నాకు మొదటి స్థానాన్ని ఇచ్చింది. నేను నా రాష్ట్రానికి మొదటి ర్యాంక్ తెచ్చిపెట్టాను!
చేతులు ముకుళించి, నేను నా తర్పా తో ఇలా చెప్పేవాడ్ని, 'ప్రియ దేవుడా, నేను నీకు సేవ చేస్తాను, నిన్ను ఆరాధిస్తాను. ప్రతిగా నువ్వు కూడా నా బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. నాకు ఎగరాలని ఉంది. నన్ను విమానంలో ప్రవేశపెట్టు.' నమ్మండీ నమ్మకపోండీ, నా తర్పా నన్ను విమానంలో తీసుకువెళ్ళింది. భిక్‌ల్యా లడ్‌క్యా ధిందా విమాన ప్రయాణం చేశాడు. నేను ఎన్నో ప్రదేశాలను సందర్శించాను. అళంది, జెజురి, బారామతి, సన్య (శని) శింగణాపూర్... నేను చాలా దూరాలు ప్రయాణించాను. ఈ ప్రాంతం నుంచి ఎవరూ ‘గోమా’ (గోవా) రాజధాని పంజిమ్‌కు వెళ్ళలేదు. కానీ నేను వెళ్ళాను. అక్కడి నుంచి నాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది.
నాకు పంచుకోవాల్సిన అనేక విషయాలున్నాయి కానీ నేను చెప్పబోవటంలేదు. నా వయసు 89 ఏళ్ళు, నా దగ్గర అనేక కథలున్నాయి. కానీ నేనెప్పటికీ వాటిని చెప్పను. వాటిని నా హృదయంలోనే దాచిపెట్టుకున్నాను. అనేక మంది రిపోర్టర్లు, పాత్రికేయులు వచ్చి నా కథను రాసుకుంటారు. వాళ్ళు పుస్తకాలను ప్రచురించి, వాళ్ళే నన్ను ప్రసిద్ధుడిని చేసినట్టుగా ప్రపంచానికి చెప్తారు. అనేకమంది సంగీతకారులు వచ్చి నా సంగీతాన్ని దొంగిలించే ప్రయత్నం చేశారు. అందుకే నేను అందరినీ కలవను. నన్ను కలిసినందుకు మీరు అదృష్టవంతులు.
నాకు సంగీత నాటక అకాడెమీ అవార్డు వచ్చింది. ఆ ఉత్సవం దిల్లీలో జరిగింది. ఆ అవార్డును అందుకున్నప్పుడు నా కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్ళు కారాయి. మా నాన్న నన్నెప్పుడూ బడికి పంపించలేదు. ఆ చదువుతో నాకు ఉద్యోగం రావచ్చు, రాకపోనూవచ్చు అని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన ‘ఈ వాయిద్యమే మన దైవం’ అని నాతో చెప్పాడు. నిజంగానే అది ఒక దేవత. అదే నాకు అన్నీ ఇచ్చింది. నాకు మానవత్వాన్ని బోధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు నా పేరు తెలుసు. నా తర్పా ఒక సంచి కవరు మీద (తపాలా బిళ్ళ) ముద్రించబడింది. నా పేరుతో మీ ఫోన్‌లో ఒక బటన్ నొక్కితే, మీకు నా వీడియో కనిపిస్తుంది... ఇంతకన్నా నీకు ఏం కావాలి? బావిలో ఉన్న కప్పకు, ఆ గొయ్యికి అవతల ఏముందో తెలియదు. కానీ నేనా గోతి నుండి బయటకు వచ్చాను... నేను ప్రపంచాన్ని చూశాను.
ఈనాటి యువత తర్పా బాణీలకు డాన్సులు చేయరు. వాళ్ళు డి.జె. తెచ్చుకుంటారు. తెచ్చుకోనివ్వండి. కానీ నాకో సంగతి చెప్పండి: మనకు మన పొలాల నుండి పంట వచ్చినప్పుడు, గాఁవ్‌దేవి కి మన కొత్త ధాన్యాన్ని నైవేద్యంగా తీసుకెళ్ళినప్పుడు, ఆమె పేరు తీసి ఆమెను వేడుకుంటున్నప్పుడు, మనం డి.జె.ని ఆడిస్తామా? అలాంటి సందర్భాలలో కేవలం తర్పా తప్ప మరీమీ ఉండదు.
ఈ కథనాన్ని నమోదు చేయడంలో సహాయం చేసినందుకు ఆరోహణ్ (AROEHAN)కు చెందిన మాధురి మకానేకు PARI ధన్యవాదాలు తెలియజేస్తోంది.
ఇంటర్వ్యూ, ప్రతిలేఖనం, ఆంగ్లానువాదం: మేధా కాళే
ఫోటోలు, వీడియో:
సిద్ధితా సోనావనే
ఈ కథనం PARI అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్‌లో ఒక భాగం. ఈ ప్రాజెక్ట్ దేశంలోని హానికి లోనవుతూ, అంతరించిపోతున్న భాషలను డాక్యుమెంట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది .
భారతదేశంలో గుజరాత్, డామన్ & డయ్యూ. దాద్రా & నాగర్‌హవేలీ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలలో నివసించే వార్లీ లేదా వర్లీ ఆదివాసులు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష, వర్లీ. భారతదేశంలో హానికి లోనవుతున్న భాషలలో ఒకటిగా వర్లీని యునెస్కో వారి ఆట్లస్ ఆఫ్ లాంగ్వేజెస్ జాబితా చేసింది.
మహారాష్ట్రలో మాట్లాడే వర్లీ భాషను డాక్యుమెంట్ చేయడం మా లక్ష్యం.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి