"సురూ సురూ మే ఏక్ నంగ్ బనానే మే ఆధీ కలక్ లగతీ థీ మేరీ [మొదట్లో ఒక జల్లెడ తయారుచేయడానికి నాకు అరగంట సమయం పట్టేది]." జల్లెడ తయారీ గురించి మాట్లాడుతున్నప్పుడు తన వేలికొనలపై ఉన్న కోతలను బొటనవేలుతో నొక్కుకుంటూ అన్నారు మొహమ్మద్ భాయ్. ఇప్పటికీ పని చేస్తున్నప్పుడు ఆయన తన వేళ్ళను కోసుకోవచ్చు, కానీ అనుభవంతో అతని పని సులభం అయింది. గుజరాత్‌లోని ముస్లిమ్‌లు తరచుగా మాట్లాడినట్లే గుజరాతీ పదాలను ఉదారంగా వాడుతూ మాట్లాడే ఒక విధమైన హిందీలో అయన కూడా మాట్లాడుతారు. “ఏక్ మహినా తక్లిఫ్ పడీ మేరే కో. అబ్ ఏక్ నంగ్ పాంచ్ మినిట్ మే బన్ జాతా హై [ఒక నెల పాటు నాకు ఇబ్బందిగా ఉండింది, కానీ ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఒక జల్లెడ తయారవుతుంది]," అని అతను నవ్వుతూ చెప్పారు.
మేం అహ్మదాబాద్‌లోని కుత్బీ బిల్డింగ్‌లోని ఒక 10 X 10 సైజు గదిలో కూర్చునివున్నాం. అది 43 ఏళ్ళ మొహమ్మద్ చర్నావాలా, 76 ఏళ్ళ అతని అమ్మీ (తల్లి) రుకయ్యా మౌఝుసైనీ నివాసముండే ఇల్లు. అహ్మదాబాద్‌లోని కాలుపుర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న దావుదీ వోరా రోజా అనే చాల్‌లోని శ్రామిక తరగతి ముస్లిమ్‌లు నివసించే ఈ రెండు అంతస్తుల భవనంలోని 24 ఇళ్ళలో వారిది కూడా ఒకటి. ఆధునికంగా కనిపించే రైల్వే స్టేషన్‌కి అవతలి వైపుకు వెళ్తే మీరు పాత నగరంలో అడుగుపెట్టినట్లే.
సందుగొందుల గుండా దారిచేసుకుంటూ వెళుతూ ఉంటే మీకు ఆహారం, తగాదాలు, గొడవలు, అప్పుడప్పుడు గాలిలోంచి తేలివచ్చే తిట్లూ దూషణలూ కనబడుతూ వినపడుతూ ఉంటాయి. మీరొక గజిబిజిగా అల్లుకున్న రోడ్ల సాలెగూడును చేరుకుంటారు - ఒకటి ఐమూలగా, ఒకటి కుడి వైపుకు, మరొకటి ఎడమ వైపుకు తిరిగి మూసుకుపోయిన వీధి చివరకు చేరుకుంటుంది. ఇంకోటి వంకరటింకరగా మెలికలు తిరుగుతూ, ఆపై తిన్నగా ఉంటూ, తిరిగి ఒకదానిలో మరొకటి కలిసిపోతుంటుంది. వీటిలో ఏదో ఒక దారి మిమ్మల్ని మొత్తం 110 కుటుంబాలు నివసించే దావూదీ వోరా రోజాలోని వోరా ట్రస్ట్‌కు చెందిన కుత్బీ భవనానికి చేరుస్తుంది.
మొహమ్మద్ భాయ్ ఇక్కడ నుండి తన చెక్క బండిని నెట్టుకుంటూ వారంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నగరంలో దాదాపు 30 కిలోమీటర్ల దూరం నడుస్తూ తిరుగుతారు. అతను ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతారు. "అతను తన తండ్రి తిరిగిన చోటుకల్లా తిరుగుతాడు!" భర్తను గుర్తు చేసుకున్న రుకయ్యా చున్నీతో ముఖం తుడుచుకుంటూ చెప్పారు. "అతను నదిని దాటి, సబర్మతి అవతలి వైపు వెళ్ళి రాత్రి 9 లేదా 10 గంటలకు ఆలస్యంగా తిరిగి వచ్చేవాడు." అబ్బా (తండ్రి) మౌఝుసైనీ 2023 ఫిబ్రవరిలో మరణించారు. అప్పుడు ఆయన వయసు 79 సంవత్సరాలు.















