ఒక వ్యక్తి తన ఏడేళ్ళ కుమార్తెతో కలిసి పంఢర్‌పూర్ వైపు కాలినడకన ప్రయాణిస్తున్నాడు. వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వార్కరీలు విఠల్ స్వామి ఆలయాన్ని సందర్శించే పండుగ, ఆషాఢీ వారీ వార్షిక తీర్థయాత్రకు వెళ్తున్నారు. దారిలో లాతూర్‌లోని మ్హైస్గావ్ అనే గ్రామంలో విడిది చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సాయంత్రం అవుతుండగా, గాలి అంతా కీర్తనల శబ్దాలతో నిండిపోయింది. ఆ చిన్న అమ్మాయి, ఖంజిరి (కంజీరా) చేసే మంద్రమైన గలగలల శబ్దాన్ని విని, తననూ అక్కడికి తీసుకెళ్ళమని తండ్రిని పోరుపెట్టడం ప్రారంభించింది.
కానీ ఆమె తండ్రికి అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. "ఇక్కడి జనం మనలాంటి మహార్, మాంగ్‌లను తాకరు," అని అతను వివరించే ప్రయత్నం చేశాడు. "వాళ్ళు మనల్ని హీనంగా చూస్తారు. మనల్ని లోనికి రానివ్వరు." కానీ ఆమె వినలేదు. చివరకు, దూరంగా నిలబడి వినాలనే షరతుతో ఆమె తండ్రి ఆమె కోరికకు అంగీకరించాడు. సంగీత వాయిద్యాల శబ్దాల ఆధారంగా వాళ్ళు పండాల్‌ను చేరుకున్నారు. వారిద్దరూ ఒక కీర్తనను పాడుతూ ఖంజిరిని వాయిస్తోన్న మహారాజ్‌ను పరవశిస్తూ చూస్తూ నిలబడ్డారు. ఇంతలో, భావావేశాన్ని ఆపుకోలేని ఆ చిన్నారి వేదిక మీదికి వెళ్ళాలనుకుంది. ఆమె హఠాత్తుగా పరుగు తీసి, వేదిక దగ్గరకు వెళ్లింది.
"నేనొక భారుడ్ను [సామాజిక జ్ఞానాన్ని కలిగించటం కోసం వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ ఉపయోగించుకునే ఒక రకమైన పురాతన కవిత్వం] పాడాలనుకుంటున్నాను," వేదికపై ప్రదర్శన ఇస్తున్న సాధువుకు చెప్పిందామె. ప్రేక్షకులు నోరు తెరచుకుని చూస్తుండిపోయారు. కానీ మహారాజ్ మాత్రం ఆమె పాడేందుకు అవకాశమిచ్చారు. ఆ తర్వాతి కొన్ని నిముషాలు ఆ చిన్నారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. లయ కోసం ఒక లోహపు కుండపై దరువు వేస్తూ, అదే మహారాజ్ రాసి, బాణీ కట్టిన పాటను ఆమె పాడింది.
माझा रहाट गं साजनी
गावू चौघी जनी
माझ्या रहाटाचा कणा
मला चौघी जनी सुना
ఓ ప్రియా, నాతో కలిసి పాడు
మనం నలుగురం కలిసి పాడుదాం
నా ఆత్మ నివాస స్థలాన్ని
మీ నలుగురి కోసం పాడనివ్వండి
ఆ బాల గాయని పాటకు ముగ్ధుడైన సాధువు, “నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. నువ్వు నీ సంగీతంతో ఈ ప్రపంచాన్ని వెలిగిస్తావు,” అంటూ తన ఖంజిరిని ఆమెకు బహుమతిగా ఇచ్చారు.













