నిర్మానుష్య పీఠభూమి మీద ఉన్న ఓ దర్గా , మళగావ్‌వాసులకు చాలా కాలంగా  ఉపయోగపడుతోంది. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో శతాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రార్థనాస్థలం, ఎప్పుడూ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉంది.

స్కూల్ పిల్లలు దర్గా కు ఆనుకుని ఉన్న చెట్టు కింద తమ హోమ్‌వర్క్ చేసుకుంటారు. యువతీ యువకులు, మండు వేసవిలో చల్లని గాలి వచ్చే దాని ప్రవేశద్వారం వద్ద సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతారు. పోలీసులు కావాలనుకునే ఔత్సాహికులు దాని చుట్టూ ఉన్న బహిరంగ ప్రదేశంలో కఠినమైన దేహదారుఢ్య శిక్షణను పొందుతుంటారు.

గ్రామంలో 15 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతు 76 ఏళ్ళ వినాయక్ జాదవ్, "మా తాతయ్యకు కూడా దాని [ దర్గా ] గురించి కథలు తెలుసు," అంటారు. “ఇక ఇదెంత పురాతనమైనదో ఊహించండి. దాన్ని హిందువులు, ముస్లిములు కలిసి నిర్వహించారు. ఇది శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది.’’

కానీ సెప్టెంబరు 2023లో పరిస్థితులు మారిపోయాయి. ఎంతోమందికి ఆరాధనీయమైన ఈ మళగావ్‌ ప్రార్థనాస్థలం కొత్త అర్థాన్ని సంతరించుకుంది- ఆ దర్గా ను ఆక్రమించుకున్న స్థలంలో కట్టారని కొంతమంది యువకుల బృందం పేర్కొంది. వాళ్ళ గుంపు చిన్నదే కానీ నోళ్ళు పెద్దవి. వాళ్ళకు హిందుత్వ గ్రూపుల వత్తాసు ఉంది.

మళగావ్‌లో నివాసముండే 20-25 సంవత్సరాల మధ్య వయసున్న ఈ హిందూ యువకులు ఆ "అక్రమ ఆక్రమణను" తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పరిపాలనా విభాగానికి ఒక లేఖ రాశారు. అప్పటికే వారిలో కొందరు పక్కనే ఉన్న నీళ్ళ ట్యాంకును ధ్వంసం చేశారు. "ముస్లిములు దాని చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించాలనుకుంటున్నారు," అని వాళ్ళు తమ లేఖలో ఆరోపించారు. "ఈ ప్రార్థనాస్థలాన్ని గ్రామ పంచాయితీ అభీష్టానికి వ్యతిరేకంగా నిర్మించారు."

PHOTO • Parth M.N.

మళగావ్‌లోని దర్గాలో తన స్నేహితులతో వినాయక్ జాదవ్ (గాంధీ టోపీ ధరించిన వ్యక్తి). మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో ఉన్న ఈ ప్రార్థనాస్థలం కొన్ని శతాబ్దాలుగా ఉంది

అయితే, ఈ ప్రార్థనాస్థలాన్ని పడగొట్టాలని పిలుపునివ్వడంతో, గ్రామస్తులు న్యాయం కోసం ముందుకు వచ్చారు. "1918 నాటి మ్యాప్‌లలో కూడా ఈ దర్గా ప్రస్తావన ఉంది" అని జాదవ్, బాగా వెలిసిపోయివున్న కాగితాన్ని జాగ్రత్తగా విప్పారు. “స్వాతంత్ర్యానికి ముందు నుంచి గ్రామంలో చాలా మతపరమైన ప్రదేశాలున్నాయి. వాటన్నింటినీ పరిరక్షించాలని మేం కోరుతున్నాం. మా పిల్లలు ప్రశాంత వాతావరణంలో పెరగాలని మేం కోరుకుంటున్నాం.’’

ఆయన ఇంకా ఇలా అన్నారు: “ ధర్మా-ధర్మామధ్యే భాండణ్ లావూన్ ఆపణ్ పుఢే నాహీ, మాగే జాణార్ [మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం మనల్ని వెనక్కి మాత్రమే తీసుకువెళుతుంది],”

దర్గా ను కూల్చేయాలని హిందుత్వ సభ్యులు పిలుపునివ్వడంతో, మళగావ్‌లోని రెండు వర్గాలకు చెందిన పెద్దలు కలిసి, దానికి వ్యతిరేకంగా ఒక లేఖ రాశారు. ఈ డిమాండ్ మెజారిటీ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించదని లేఖ స్పష్టంగా పేర్కొంది. కులమతాలకు అతీతంగా రెండు వందలమంది ముస్లిములు, హిందువులు కలిసి దానిపై సంతకాలు చేశారు. అలా వాళ్ళు ప్రస్తుతానికి ఆ దర్గాను కాపాడుకోగలిగారు.

కష్టపడి సాధించుకున్న ఆ శాంతిని కాపాడుకోవడమే ఇప్పుడున్న పెద్ద సవాలు.

*****

మళగావ్ గ్రామం, గ్రామాన్ని విభజించాలనుకుంటున్న వారికి వ్యతిరేకంగా నిలబడి, ముస్లిమ్ సముదాయానికి చెందిన ఒక స్మారక చిహ్నాన్ని రక్షించుకోవడానికి ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది.

గత ఏడాదిన్నర కాలంగా, మహారాష్ట్రలోని ముస్లిముల ప్రార్థనాస్థలాలు చాలా ఎక్కువగా దాడికి గురవుతున్నాయి, వాటి మీద దాడి చేసేవాళ్ళు తరచుగా  తప్పించుకుంటున్నారు కూడా. పోలీసులు పట్టనట్టుగా ఉండిపోవటం, దేశంలోని మెజారిటీ వర్గాలు నిశ్శబ్దంగా ఉండడమే దీనికి కారణం.

2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు, భారతదేశంలోని ఈ అత్యంత ధనిక రాష్ట్రాన్ని ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా మూడు రాజకీయ పార్టీల కూటమి (శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పాలించింది.

అయితే, జూన్ 2022లో, మహారాష్ట్రలో అధికార మార్పిడి జరిగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) 40 మంది శివసేన శాసనసభ్యులను తన వైపు తిప్పుకుని, కూటమిని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి, రాడికల్ హిందూ బృందాలన్నీ కలిసి రాష్ట్రవ్యాప్తంగా డజన్ల కొద్దీ ర్యాలీలలో ప్రసంగించాయి. ముస్లిములను నిర్మూలించాలని, వాళ్లను ఆర్థికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఇది రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే దుర్మార్గమైన ప్రయత్నం. ముస్లిముల మతప్రదేశాలపై దాడులు కూడా దానిలో భాగమే.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: దర్గాకు ఆనుకుని ఉన్న ఈ చెట్టు కింద పాఠశాల విద్యార్థులు హోమ్‌వర్క్ చేసుకుంటారు. యువతీ యువకులు సివిల్ సర్వీస్ పోటీపరీక్షలకు సిద్ధమవుతారు. కుడి: తన స్కూటీపై దర్గాకు వెళుతున్న జాదవ్. 'మా గ్రామంలో స్వాతంత్య్రానికి పూర్వం ఎన్నో మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. మేం వాటన్నింటినీ కాపాడుకోవాలనుకుంటున్నాం,' అని ఆయన చెప్పారు

సాతారాలో ఉండే సామాజిక కార్యకర్త మినాజ్ సయ్యద్ మాట్లాడుతూ, ఇలా మతాల మధ్య చీలికలు తెచ్చే ప్రణాళిక చాలా సంవత్సరాలుగా జరుగుతోందని, అయితే అది 2022 నుంచి తీవ్రమైందనీ అన్నారు. “హిందువులు, ముస్లిములు కలిసి సంరక్షించుకునే దర్గాలు , లేదా సమాధిరాళ్ళ వంటి స్మారక చిహ్నాలపై గ్రామాలలో దాడులు జరుగుతున్నాయి,” అని అతను చెప్పారు. "భిన్నరకాల సంస్కృతుల మధ్య చిచ్చు పెట్టడమే వీళ్ళ లక్ష్యం."

ఫిబ్రవరి 2023లో, కొల్హాపూర్‌లోని విశాల్‌గడ్ పట్టణంలో ఉన్న హజ్రత్ పీర్ మాలిక్ రెహాన్ షా దర్గా పై రాడికల్ హిందువుల బృందం రాకెట్‌ను ప్రయోగించింది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.

సెప్టెంబరు 2023లో, వాట్సాప్‌లో వైరల్‌గా మారిన స్క్రీన్‌షాట్‌లకు (అయితే అవి నిజమని నిరూపణ కాలేదు) ప్రతీకారంగా సాతారాలోని పుసేసావళి గ్రామంలోని మసీదుపై బీజేపీకి చెందిన విక్రమ్ పావస్కర్ నేతృత్వంలోని హిందూ ఏక్తా అనే రాడికల్ బృందం సభ్యులు దాడి చేసారు. మసీదులో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకుంటున్న 10-12 మంది ముస్లిములపై రాతి పలకలతో, కర్రలతో, ఇనుప రాడ్‌లతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు గాయాలతో మరణించారు. చదవండి: పుసేసావళిలో జీవితాలను నాశనం చేస్తోన్న ఘోరమైన పుకార్లు , ప్రచారం

డిసెంబరు 2023లో, మత సామరస్యాన్ని నెలకొల్పడానికి కృషి చేసే సలోఖా సంపర్క్ గట్, ఒక్క సాతారా జిల్లాలోనే ముస్లిముల ప్రార్థనా స్థలాలపై జరిగిన 13 దాడులను పేర్కొంటూ ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించింది. ఆ దాడులలో ఒక సమాధిని ధ్వంసం చేయడం నుంచి మసీదు పైన కాషాయ జెండాను ఎగరేయడం వరకు ఉన్నాయి. ఈ దాడులు మత కలహాలు మరింత పెరగనున్నాయని నిరూపిస్తున్నాయి.

కేవలం ఒక్క 2022 లోనే మహారాష్ట్రలో 8,218 కంటే ఎక్కువ అల్లర్లు జరిగాయనీ, వీటి కారణంగా 9,500 మంది పౌరులు ప్రభావితమయ్యారనీ ఆ చిన్న పుస్తకంలో ఉంది. అంటే ఆ ఒక్క ఏడాదిలోనే ప్రతిరోజూ సగటున 23 అల్లర్లు జరిగాయి.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: సలోఖా సంపర్క్ గట్ ప్రచురించిన చిన్న పుస్తకంలో కేవలం ఒక్క సాతారా జిల్లాలోనే ముస్లిముల ప్రార్థనా స్థలాలపై 13 దాడులు జరిగినట్లు నమోదైంది. కేవలం ఒక్క 2022 లోనే మహారాష్ట్రలో 8,218 కంటే ఎక్కువ అల్లర్లు జరిగాయనీ, వీటి కారణంగా 9,500 మంది పౌరులు ప్రభావితమయ్యారనీ ఆ చిన్న పుస్తకంలో ఉంది. కుడి: మళగావ్‌లో హిందూ-ముస్లిములు కలిసి నిర్వహించే ఈ దర్గా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోంది

జూన్ 2023లో ఒక రోజు ఉదయం 53 ఏళ్ళ షంసుద్దీన్ సయ్యద్, సాతారా జిల్లాలోని కోండ్వే గ్రామంలోని మసీదు దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆయన గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం ఆగింది. అక్కడ వంపు తిరిగిన మినార్‌పై నల్ల రంగులో ‘ జై శ్రీరామ్ అని రాసిన కాషాయ జెండా రెపరెపలాడుతూ, సయ్యద్‌ను భయాందోళనలకు గురిచేసింది. అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పరిస్థితిని వారి అదుపులోకి తీసుకోమని అడిగారు. అయితే ఇరుకైన సందులో నిలబడి, జెండాను దించడాన్ని పోలీసులు గమనిస్తూనే ఉన్నా, సంభవించే శాంతిభద్రతల సంక్షోభం గురించి ఆయన భయపడ్డారు.

"ఒక ముస్లిమ్ యువకుడు రెండు రోజుల క్రితం టిప్పు సుల్తాన్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేశాడు," అని మసీదు ట్రస్టీలలో ఒకరయిన సయ్యద్ వివరించారు. "18వ శతాబ్దపు ముస్లిమ్ పాలకుని కీర్తించడం హిందుత్వ గ్రూపులకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు గ్రామ మసీదును అపవిత్రం చేసి, దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు."

20 ఏళ్ళ సొహైల్ పఠాన్, ఈ టిప్పు సుల్తాన్ స్టేటస్ వెనుక ఉన్న యువకుడు. దానిని అప్‌లోడ్ చేసినందుకు అతను వెంటనే విచారం వ్యక్తం చేశాడు: "నేను అలా చేయకుండా ఉండాల్సింది," అన్నాడతను. "నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశాను."

అతను పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఒక రాడికల్ హిందువుల గుంపు వెలుతురు సరిగా లేని అతని ఒంటిగది గుడిసె దగ్గరకు వచ్చి, అతని ముఖం మీద కొట్టింది. "మేం ప్రతీకారం తీర్చుకోలేదు, ఎందుకంటే అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది," అని సొహైల్ చెప్పాడు. “కానీ అది కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ. ముస్లిములపై దాడి చేయడానికి వాళ్ళకు ఒక సాకు కావాలంతే.’’

సొహైల్‌ను కొట్టిన అదే రాత్రి పోలీసులు జోక్యం చేసుకొని తిరిగి సొహైల్ పైనే కేసు పెట్టారు. దాంతో అతను ఆ రాత్రి పోలీసు స్టేషన్‌లో గడపాల్సి వచ్చింది, ఆ కేసు ఇప్పుడు జిల్లా కోర్టులో కొనసాగుతోంది. అతను మతపరమైన శత్రుత్వాన్ని వ్యాప్తి చేశాడని కోర్టులో అతనిపై ఆరోపించారు. అతన్ని కొట్టిన వ్యక్తులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

సొహైల్ తల్లి, 46 ఏళ్ళ షహనాజ్, తమ కుటుంబం తరతరాలుగా సాతారాలో నివసిస్తోందని, అయితే తమ సోషల్ మీడియా కార్యకలాపాలపై ఈ రకమైన వ్యతిరేకత లేదా నిఘా ఇంతకుముందు ఎప్పుడూ లేవని చెప్పారు. "మేం లౌకిక రాజ్యాంగాన్ని విశ్వసించేవాళ్ళం కావడం వల్ల విభజన సమయంలో నా తల్లిదండ్రులు, తాతలు భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు," అని ఆమె చెప్పారు. “ఇది నా భూమి, ఇది నా గ్రామం, ఇది నా ఇల్లు. కానీ నా పిల్లలు పని కోసం బయటకు వెళ్ళినప్పుడు నాకు భయంగా ఉంటోంది.’’

PHOTO • Parth M.N.

సతారాలోని కోండ్వే గ్రామానికి చెందిన సొహైల్ పఠాన్. సొహైల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో టిప్పు సుల్తాన్ గురించి స్టేటస్ అప్‌లోడ్ చేయడంతో అతని గ్రామంలోని మసీదును ధ్వంసం చేసి, అతని ఇంటి వద్దనే అతనిపై దాడి చేశారు

సొహైల్ గ్యారేజీలో పని చేస్తే, అతని సోదరుడు 24 ఏళ్ళ అఫ్తాబ్ వెల్డర్‌గా పని చేస్తాడు. కుటుంబంలో వాళ్ళిద్దరు మాత్రమే సంపాదించే సభ్యులు. వాళ్ళ సంపాదన నెలకు సుమారు రూ. 15,000. సొహైల్‌పై ఉన్న పనికిమాలిన కేసు వల్ల బెయిల్, లాయర్ ఫీజులతో వాళ్ళు రెండు నెలల ఆదాయాన్ని కోల్పోయారు. "మేం ఎలా బతుకుతున్నామో మీరు చూడొచ్చు," అని షహనాజ్ తన చిన్న ఇంటిని చూపిస్తూ చెప్పారు. అక్కడ అఫ్తాబ్ వెల్డింగ్ మెషిన్, రంగు వెలిసిపోతోన్న గోడకు ఆనించి ఉంది. "కోర్టు కేసుకు డబ్బు ఖర్చు పెట్టే స్తోమత కూడా మాకు లేదు. గ్రామంలోని శాంతి కమిటీ రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబరచడం మాత్రమే మాకు జరిగిన మంచి సంగతి.’’

2014లో శాంతి కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి విషయాలలో ఆ కమిటీ జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి అని కోండ్వేలోని శాంతి కమిటీ సీనియర్ సభ్యుడు, రైతు అయిన 71 ఏళ్ళ మధుకర్ నింబాళ్కర్ చెప్పారు. “మేం కాషాయ జెండాను ఎగరేసిన మసీదులోనే సమావేశం నిర్వహించాం," అని ఆయన చెప్పారు. "పరిస్థితిని మరింత దిగజార్చకూడదని రెండు వర్గాలు నిర్ణయించాయి."

ఈ సమావేశం ఒక కారణం వల్ల మసీదులో జరిగిందని నింబాళ్కర్ చెప్పారు. "దాని ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని చాలా కాలంగా హిందూ వివాహాలకు ఉపయోగించుకుంటున్నాం," అని ఆయన వివరించారు. "ఇన్ని సంవత్సరాలు మేమంతా ఎలా కలిసి జీవించామో ప్రజలకు గుర్తు చేయడమే దాని వెనుక ఉన్న ఆలోచన."

*****

జనవరి 22, 2024న అయోధ్యలో రామ్ లల్లా ఆలయాన్ని ప్రారంభించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని ఆలయ నిర్మాణానికి అప్పగించాలని 2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఆదేశించింది. నాలుగు దశాబ్దాల క్రితం విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలోని రాడికల్ హిందూ గుంపులు కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న స్థలంలోనే ఇప్పుడు దీనిని నిర్మించారు.

అప్పటి నుంచి, బాబ్రీ మసీదు విధ్వంసం భారతదేశంలో మతపరమైన విభజనకు ఒక ముఖ్య కారణంగా మారింది.

బాబ్రీ మసీదు కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తించినా, ఆలయ నిర్మాణానికి అదే భూమిని మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు నేరస్థులను ప్రోత్సహించి, వారికి ధైర్యాన్ని ఇచ్చాయి. మీడియా దృష్టికి రాని మారుమూల గ్రామాల్లోని ముస్లిముల ప్రార్థనా స్థలాల వెంటపడే రాడికల్ గ్రూపులకు ఈ నిర్ణయం మరింత బలాన్ని ఇచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

2023లో ఒక గుంపు దాడి చేసి గాయపరచిన తన కొడుకు ఫోటోను పట్టుకుని ఉన్న నసీమ్. నసీమ్ తన కుటుంబంతో కలిసి నివసించే వర్ధన్‌గడ్‌ మతసామరస్యానికి చాలా ప్రసిద్ధి చెందింది

1947లో స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మతపరమైన స్థలాలకు సంబంధించిన యథాతథ స్థితిని అన్ని వర్గాలూ ఆమోదించాయని మినాజ్ సయ్యద్ చెప్పారు. "సుప్రీమ్ కోర్టు తీర్పు దానిని తిరగరాసింది," అని అతను చెప్పారు. "అయితే అది బాబ్రీ దగ్గరే ఆగలేదు. హిందూ గ్రూపులు ఇప్పుడు ఇతర మసీదుల వెంటపడ్డాయి."

అతని గ్రామం, జిల్లా, రాష్ట్రంలోని పరిస్థితులు దిగజారుతుంటే, సాతారాలోని వర్ధన్‌గడ్ గ్రామంలో టైలర్ అయిన 69 ఏళ్ళ హుస్సేన్ శికల్‌గార్, తనకు తరాల విభజన స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. "యువతరాన్ని మొత్తంగా బ్రెయిన్ వాష్ చేసేశారు," అని ఆయన అన్నారు. “నా వయసులో ఉన్నవారు పాతకాలంలోని రోజులను తలచుకుని బాధపడుతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన విభజనను నేను చూశాను. ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. నేను 1992లో ఈ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికయ్యాను. కానీ ఈరోజు నేనొక ద్వితీయ శ్రేణి పౌరుడినని నాకు అనిపిస్తోంది.’’

శికల్‌గార్ మాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఆయన గ్రామం ఎన్నో ఏళ్ళుగా మతసామరస్యానికి పేరెన్నికగన్నది. వర్ధన్‌గడ్ కోట కొండల దిగువన ఉన్న ఈ గ్రామం మహారాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఒక పుణ్యక్షేత్రం. గ్రామంలో కొండలతో కూడిన అటవీ భూభాగంలో ఒకదానికొకటి దగ్గరగా ఉన్న ఐదు సమాధులు, దేవాలయాలున్న ప్రదేశాన్ని అనేకమంది హిందువులు, ముస్లిములు దర్శించుకుని, పక్కపక్కనే ప్రార్థనలు చేస్తారు. జూలై 2023 వరకు రెండు వర్గాలు కలిసే ఆ మొత్తం ప్రదేశం నిర్వహణను చూసుకునేవి.

2023 జూన్‌లో "గుర్తు తెలీని వ్యక్తులు" పీర్ ద-ఉల్ మాలిక్‌కు చెందిన సమాధి రాయిని ధ్వంసం చేసిన తర్వాత వర్ధన్‌గడ్ నాలుగు స్మారక చిహ్నాలకు నిలయంగా మిగిలింది. ఇక్కడ ముస్లిములు క్రమం తప్పకుండా ప్రార్థనలు చేసేవాళ్ళు. ఆ మరుసటి నెలలో, అటవీ శాఖ దాన్ని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ ఆ సమాధి ఫలకాన్ని పూర్తిగా చదును చేసింది. ఆ అయిదింటిలో కేవలం తమ సమాధి రాయే ఎందుకు అక్రమమైపోయిందోనని ముస్లిములు ఆశ్చర్యపోతున్నారు.

PHOTO • Courtesy: Residents of Vardhangad

ధ్వంసం కావడానికి ముందు వర్ధన్‌గడ్‌లోని సమాధి ఫలకం. తమ స్మారక చిహ్నాలను మాత్రమే దురాక్రమణగా పేర్కొంటూ వాటిని ధ్వంసం చేయడాన్ని గ్రామంలోని ముస్లిములు ప్రశ్నిస్తున్నారు

"ఇది గ్రామంలోని ముస్లిములను రెచ్చగొట్టే ప్రయత్నం," అని వర్ధన్‌గడ్‌ నివాసి, విద్యార్థి అయిన 21 ఏళ్ళ మొహమ్మద్ సాద్ అన్నాడు. "ఇదే సమయంలో ఒక సోషల్ మీడియా పోస్ట్‌ కారణంగా నన్ను లక్ష్యంగా చేసుకున్నారు."

పుణేకు కొంత దూరంలో నివసిస్తున్న సాద్ బంధువు ఒకరు - 17వ శతాబ్దపు పాలకుడు ఔరంగజేబుకు చెందిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో హిందుత్వ గ్రూపుల సభ్యులు అదే రోజు రాత్రి సాద్ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అతన్ని ఇంటి బయటకు లాగి, “ ఔరంగజేబ్ కి ఔలాద్ [ఔరంగజేబ్ కొడుకు]” అంటూ ఇనుప రాడ్‌లు, హాకీ కర్రలతో అతన్ని కొట్టడం ప్రారంభించారు.

"అది అర్ధరాత్రి సమయం, నేను చచ్చిపోయేవాణ్ని," అని సాద్ గుర్తు చేసుకున్నాడు. “అదృష్టవశాత్తూ అదే సమయంలో ఒక పోలీసు వాహనం అటుగా వెళుతుండటంతో, ఆ గుంపు దాన్ని చూసి పారిపోయింది.’’

సాద్ తలకు గాయాలై, కాలు, చెంప ఎముక విరగడంతో ఆ తర్వాత 15 రోజుల పాటు ఆసుపత్రిలో గడిపాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అతనికి రక్తపు వాంతులయ్యాయి. ఈ రోజుకూ అతనికి ఒంటరిగా ప్రయాణించడం కష్టంగా అనిపిస్తోంది. "నా మీద మళ్ళీ ఎప్పుడైనా దాడి జరగవచ్చని నాకు అనిపిస్తోంది," అంటూ అతను తన భయాన్ని ఒప్పుకున్నాడు. "నేను నా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను."

సాద్ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదువుతున్నాడు. అతను 12వ తరగతి బోర్డు పరీక్షలలో 93 శాతం మార్కులు సాధించిన తెలివైన, నిజాయితీ కలిగిన విద్యార్థి. కానీ గత కొన్ని నెలలుగా అంతా తలకిందులైంది. "నేను ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత, మా చిన్నాన్న గుండెపోటుతో మరణించాడు," అని అతను చెప్పాడు. "ఆయనకు 75 సంవత్సరాలు, కానీ ఆయన ఆరోగ్యంగా ఉండేవాడు. ఆయనకు ఎలాంటి గుండె సమస్యలూ లేవు. ఇది ఖచ్చితంగా ఒత్తిడి వల్ల వచ్చిన గుండెపోటే. నేను ఆయనను మరచిపోలేకపోతున్నాను. ”

ఈ సంఘటన జరిగినప్పటి నుంచి, ముస్లిములు హిందువులతో కలవకుండా వాళ్ళలో వాళ్ళు మాత్రమే కలుసుకుంటున్నారు. దీంతో గ్రామ ముఖచిత్రమే మారిపోయింది. పాత స్నేహాలు దెబ్బతిన్నాయి; స్నేహసంబంధాలు దూరమయ్యాయి.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: ‘ఇది గ్రామంలోని ముస్లిములను రెచ్చగొట్టే ప్రయత్నం’ అని వర్ధన్‌గడ్‌కు చెందిన విద్యార్థి, మొహమ్మద్ సాద్ చెప్పాడు. కుడి: వర్ధన్‌గడ్‌కు చెందిన టైలర్ హుస్సేన్ శికల్‌గార్, 'నేను నా జీవితమంతా గ్రామస్తులందరికీ బట్టలు కుట్టాను. గత రెండేళ్ళుగా, నా హిందూ కస్టమర్‌లు నా దగ్గరకు రావడం లేదు. దీనికి కారణం ద్వేషమా లేక తోటివారి ఒత్తిడా అన్నది నాకు ఖచ్చితంగా తెలీదు,’ అన్నారు

ఇది కేవలం ఈ రెండు విషయాల గురించి మాత్రమే కాదని శికల్‌గార్ చెప్పారు. రోజువారీ విషయాల్లోనూ ఈ పరాయితనం స్పష్టంగా కనిపిస్తోంది.

"నేను టైలర్‌ను," అని ఆయన అన్నారు. “నా జీవితమంతా ఊరి మొత్తానికి బట్టలు కుట్టాను. కానీ గత రెండేళ్ళుగా, నా హిందూ కస్టమర్‌ల సంఖ్య తగ్గిపోయింది. దీనికి కారణం ద్వేషమా లేక తోటివారి ఒత్తిడా అనేది నాకు ఖచ్చితంగా తెలీదు.’’

గ్రామంలో భాష కూడా మారిపోయిందని ఆయన తెలిపారు. "నేనెప్పుడూ ' లాండ్యా ' అనే పదాన్ని విన్నట్లు నాకు గుర్తు లేదు," అని ఆయన ముస్లిములను ఉద్దేశించి ఉపయోగించే దూషణను ప్రస్తావిస్తూ చెప్పారు. “కానీ ఈ రోజుల్లో ఆ పదాన్ని చాలాసార్లు వింటున్నా. హిందువులు, ముస్లిములు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం మానేశారు.’’

పశ్చిమ మహారాష్ట్రలోని, సాతారా ప్రాంతంలో ఉన్న వర్ధన్‌గడ్ గ్రామంలో మాత్రమే ఇలా జరగడం లేదు. మతపరమైన ఉద్రిక్తతలు గ్రామాలను విభజించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పండుగలు, వివాహ వేడుకల రూపురేఖలను మార్చేశాయి.

వర్ధన్‌గడ్‌లో గణేశ్ ఉత్సవాలను నిర్వహించడంలో తాను ముందుండేవాడినని, సూఫీ ప్రవక్త మొహినుద్దీన్ చిశ్తీ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించే వార్షిక ఉర్సులో చాలామంది హిందువులు పాల్గొనేవారని శికల్‌గార్ చెప్పారు. ఊరిలో జరిగే పెళ్ళిళ్ళలోనూ అందరూ పాల్గొనేవారు. "అదంతా ఇప్పుడు కనిపించడంలేదు," అని ఆయన వాపోయారు. “రామనవమి సందర్భంగా ఒక మసీదు మీదుగా వెళుతున్నప్పుడు, మా సంస్కృతిని గౌరవిస్తూ సంగీతాన్ని ఆపేసేవాళ్ళు. ఇప్పుడు పెద్ద శబ్దంతో మమ్మల్ని భంగపర్చడం అలవాటుగా మారిపోయింది.’’

అయినా, రెండు వర్గాలలోని చాలామంది ఇప్పటికీ అంతా అయిపోలేదని, పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే గుంపులు మెజారిటీ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించవని వాళ్ళు నమ్ముతారు. "వాళ్ళు గట్టిగా అరవొచ్చు. వాళ్ళకు ప్రభుత్వ మద్దతు ఉండొచ్చు, అందుకనే వాళ్ళు చాలామంది ఉన్నట్లు అనిపిస్తుంది" అని మళగావ్‌కు చెందిన జాదవ్ చెప్పారు. “చాలా మంది ప్రజలు వివాదాలు లేకుండా తమ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు, అందుకే హిందువులు మాట్లాడటానికి భయపడుతున్నారు. అది మారాలి,” అన్నారాయన.

మళగావ్‌లో జరిగింది మొత్తం మహారాష్ట్రకు కాకపోయినా సాతారాలోని మిగిలిన ప్రాంతాలకు ఒక నమూనాచిత్రంగా మారాలని జాదవ్ నమ్ముతారు. " దర్గా ను రక్షించడానికి హిందువులు అడుగుపెట్టిన క్షణమే, రాడికల్ శక్తులు వెనక్కి తగ్గాయి," అని ఆయన నొక్కిచెప్పారు. “మత సామరస్యాన్ని కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది, కేవలం ముస్లిముల మీద మాత్రమే కాదు. మన మౌనం సంఘ వ్యతిరేక శక్తులను బలపరుస్తుంది.’’

అనువాదం: రవి కృష్ణ

Parth M.N.

ਪਾਰਥ ਐੱਮ.ਐੱਨ. 2017 ਤੋਂ ਪਾਰੀ ਦੇ ਫੈਲੋ ਹਨ ਅਤੇ ਵੱਖੋ-ਵੱਖ ਨਿਊਜ਼ ਵੈੱਬਸਾਈਟਾਂ ਨੂੰ ਰਿਪੋਰਟਿੰਗ ਕਰਨ ਵਾਲੇ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਕ੍ਰਿਕੇਟ ਅਤੇ ਘੁੰਮਣਾ-ਫਿਰਨਾ ਚੰਗਾ ਲੱਗਦਾ ਹੈ।

Other stories by Parth M.N.
Editor : Priti David

ਪ੍ਰੀਤੀ ਡੇਵਿਡ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਇੰਡੀਆ ਦੇ ਇਕ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਪਾਰੀ ਵਿਖੇ ਐਜੁਕੇਸ਼ਨ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪੇਂਡੂ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਕਲਾਸਰੂਮ ਅਤੇ ਪਾਠਕ੍ਰਮ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਸਿੱਖਿਅਕਾਂ ਨਾਲ ਅਤੇ ਸਮਕਾਲੀ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਦਸਤਾਵੇਜਾ ਦੇ ਰੂਪ ’ਚ ਦਰਸਾਉਣ ਲਈ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਕੰਮ ਕਰਦੀ ਹਨ ।

Other stories by Priti David
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna