మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీ తెగలపై జరిగే అకృత్యాల సంఖ్య అధికం కావటంతో, సామాజిక కార్యకర్తలకు వాటి గురించి తెలుసుకోవటం ఎంతో కష్టం గా ఉంటుందంటారు, జాగృత్ ఆదివాసీ దళిత్ సంఘటన్ (JADS) నేత మాధురీ కృష్ణస్వామి. “వీటిలో అత్యంత హేయమైనవి పాలక భారతీయ జనతా పార్టీ నేతల ఆధీనంలోని ప్రాంతాలలోనే జరిగాయనేది గమనార్హం,” అంటారామె.
ఈ ఏడాది జూలైలో సిద్ధి జిల్లాలో ఒక జుగుప్సాకరమైన - తాగిన మైకంలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి, ఒక ఆదివాసీపై మూత్ర విసర్జన చేస్తున్న - వీడియో వైరల్ అయింది. సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో కనిపించగానే, బిజెపి కార్యకర్త అయిన శుక్లాను అరెస్ట్ చేశారు.
అయితే, ఇటువంటి సంఘటనలలో వీడియోలు లేకపోతే, సంఘటన పట్ల ప్రజల వ్యతిరేకత బలంగా లేక చట్టం అంత వేగంగా పని చేయదు. “ఆదివాసీలు తరచూ నిర్వాసితులు కావటమో లేదా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు సంచరిస్తూనో ఉంటారు. స్థానబలం లేక వారు తరచు మోసాలకు గురవుతుంటారు. పైగా చట్టాలు కూడా శక్తివంతులు, ఆధిపత్య వర్గాలు అమానవీయంగా మారడానికి, వీరిపై దాడి చేయడానికి అనుమతిస్తాయి. “ అంటారు మాధురి.
నెమావర్‌లో భారతి కుటుంబ సభ్యుల ఊచకోతకు కారణం, సురేంద్రకు భారతి చెల్లెలు రూపాలీతో ఉన్న అనుబంధమే కారణమన్న ఆరోపణలున్నాయి.
కొంతకాలంగా వారిద్దరూ కలుసుకుంటున్నారు, అయితే సురేంద్ర తనకు మరొక మహిళతో నిశ్చితార్థం ఏర్పాటయిందని చెప్పడంతో ఆ బంధం ఆకస్మికంగా ముగిసింది. దీనితో రూపాలీ నివ్వెరపోయింది. "రూపాలీకి 18 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసుకుంటానని అతను మాట ఇచ్చాడు. కానీ నిజానికి అతను ఆమెతో శారీరక సంబంధాన్నే కోరుకున్నాడు. ఆమెనలా వాడుకుని, మరో మహిళను పెళ్లాడదామని నిర్ణయించుకున్నాడు," అంటుంది భారతి.
మండిపడిన రూపాలీ అతని నిజ స్వరూపాన్ని సామాజిక మాధ్యమాలలో బైట పెడతానని సురేంద్రను బెదిరించింది. ఒక సాయంకాలం తన పొలంలో మాట్లాడుకుందాం రమ్మని సురేంద్ర రూపాలీకి కబురు పంపాడు. రూపాలీకి తోడుగా వచ్చిన పవన్‌ను సురేంద్ర స్నేహితుడు కొంత దూరంలోనే ఆపేశాడు. తన పొలంలోని ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న సురేంద్ర, రూపాలీ రాగానే ఆమెపై ఇనుప కడ్డీతో దాడిచేసి, అక్కడికక్కడే చంపేశాడు.
తర్వాత సురేంద్ర రూపాలీ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందనీ, ఆమెను ఆసుపత్రికి తీసికెళ్ళాలనీ పవన్‌కి కబురంపాడు. ఇంటివద్ద ఉన్న రూపాలీ తల్లినీ, చెల్లినీ పిల్చుకురమ్మని అతను పవన్‌తో చెప్పాడు. నిజానికి సురేంద్ర తాను రూపాలీని కలవాలని కబురు పంపిన విషయం తెలిసిన కుటుంబంలోని అందరినీ చంపాలనుకున్నాడు. అలాగే ఒకరి తర్వాత ఒకరిని అందరినీ హతమార్చి తన పొలంలో పాతిపెట్టాడు. "ఒక కుటుంబం మొత్తాన్ని ఈ విధంగా చంపడానికి అసలు అదొక కారణమా?" ఆక్రోశించింది భారతి.